మహాపురుషుల జీవితములు/హరిశ్చంద్ర ముకర్జి

వికీసోర్స్ నుండి

హరిశ్చంద్ర ముకర్జి

ఇతని ప్రతిమ మాకు దొరికినదిగాదు. ఈయన బంగాళాదేశపు కులీన బ్రాహ్మణుఁడు. తండ్రియగు రామధనముకర్జీ మిక్కిలి బీదవాఁడు. వీరిద్ద రన్న దమ్ములు. ఈయన యన్నగారిపేరు హరెన్ చంద్ర ముకర్జీ.

హరిశ్చంద్రముకర్జీ 1824 వ సంవత్సరమున కలకత్తాకుసమీపముననున్న భవానీపురమున బుట్టెను. ఆతఁ డయిదేండ్ల వయసుగల వాఁడయినప్పుడు తన యూరిబడిలో స్వభాష కొంతవఱకుఁ జదువుకొని యేడవయేట నింగ్లీషు నారంభించ బీదవాడగుటచే జీతము లేకుండ నొక పాఠశాలలోఁ జేరి పదునాలుగు వత్సరములు వచ్చు వఱకు నచ్చట విద్య నభ్యసించెను. ఆతని కుటుంబము మిక్కిలి దారిద్ర్యముచే బాధపడుచుండుటచే నతఁడు చదువుమాని యేమైన సంపాదించి సంసారము వహింపవలసినవాఁ డయ్యెను. అందుచే హరిశ్చంద్రముకర్జీ జనుల కర్జీలు వుత్తరములు బాకీజాబితాలు వ్రాసి కుటుంబమును బోషింపఁజొచ్చెను. అట్టి పనులవలన సొమ్ము సరిగా రాకపోవుటచే నతని బీదతనము తగ్గ లేదు సరికదా యొకసారి ఆ పూటకుఁగూడ బియ్యపుగింజలు లేక యింటిలోనున్న రాగిబిందె తాకట్టు వేసికోదలఁచుకొన్నంత దురవస్థ పట్టెను. అంతలో నొక జమీందారుని యేజంటువచ్చి వానిచే నొకయర్జీ వ్రాయించుకొని రెండురూపాయలిచ్చి బింది తాకట్టు అవసరము లేకుండఁ జేసి వాని గౌరవమునుఁ గాపాడెను. కుటుంబ మేవిధముచేతను గడచెడువిధము గనఁబడక పోవుటచే హరిశ్చంద్రముకర్జీ యొకరివద్ద పది రూపాయలు జీతముగల గుమాస్తాగా కుదిరెను. ఆతఁ డాయుద్యోగమునైన పది కాలములపాటుంచుకొనక యజమానునితో వివాదపడి కొద్దికాలము లోనే యాపని మానుకొనెను. అది మానుకొనిన కొన్నాళ్ళకు మిలిటరీ ఆడిటరుగారి కచేరీలో ననగా సేనల కర్చులు వ్రాయునట్టి కచేరిలో నెల కిరువదియైదు రూపాయలు జీతముగల యుద్యోగమతనికి దొరికెను. ఆ యుద్యోగమునం దాయన నిరుపమానమైన బుద్ధుకుశలతను శ్రద్ధను పైయధికారులయెడ వినయమునుఁ జూపుటచే నతని తెలివి తేటలు గ్రహించి వానికి గ్రమక్రమముగా నధికారులు నాలుగువందల రూపాయలవఱకు జీతము వృద్ధి చేసిరి.

ఉద్యోగములోఁ బ్రవేశించినను ముకర్జీ సాయంకాలములందును మఱియు తీరికయైనపుడెల్లను భాషాభివృద్ధికొఱకై యింగ్లీషు గ్రంథములను వార్తాపత్రికలను విసువులేక చదువుచువచ్చెను. గొప్పవారి యుపన్యాసములు వినుటయందు మిక్కిలి యాసక్తిగలవాఁడగుటచే నతఁడు భవానిపురమునుండి నాలుగుమైళ్ళునడచి కలకత్తాకు వచ్చి డాక్టరు డఫ్‌దొరగారి యుపన్యాసములువినిపోవుచుండువాఁడు. కలకత్తాలోనున్న పుస్తకభాండార సమాజమందు తానునొకసభ్యుడుగాఁజేరి యందున్న పుస్తకములన్నియుఁ జదివెను. ఆయుద్యోగములో ప్రవేశింపకమునుపే యతఁడు కొన్ని వార్తాపత్రికలకుఁగొన్ని వృత్తాంతములనువ్రాసి పంపుచువచ్చెను. 1853 వ సంవత్సరమున కలకత్తానగరవాసులు ఈస్టిండియాకంపెనీవారికి మహజరొకటిపంపఁ దలఁచి దాని నింగ్లీషుభాషలో మృదుశైలితో వ్రాయఁగలవాఁడు హరిశ్చంద్రముకర్జీ యొక్కడేయని యతనినాపనియందు నియోగించిరి. దీనింబట్టి వాని కింగ్లీషుభాషయం దెంతపాండిత్యముగలదో మనము తెలిసికొనవచ్చును.

1854 వ సంవత్సరమున కలకత్తానివాసులగు శ్రీనాథగోషు గిరీశచంద్రగోషు ఖెట్న చంద్రగోషు నను ముగ్గు రన్నదమ్ములు, హిందూపేట్రియేటనుపత్రికనుఁ బ్రకటింపఁబూనిరి. హరిశ్చంద్రముకర్జీ యాపత్రికకు వృత్తాంతములు వ్రాయుచు దానిపైమిక్కిలి యభిమానము గలవాఁడయ్యెను. కొంతకాలముగడచునప్పటికి పత్రికాస్థాపకులగు నన్నదమ్ములకుఁ బత్రికపై నభిమానముతగ్గుటయు ముకర్జీకి హెచ్చుటయు సంభవింపగా నెట్ట కేలకు ముకర్జీయొక్కడే దానింబ్రకటించుభారమునుఁ బూనెను. అదివఱకా పత్రికముద్రింపబడుముద్రా యంత్రము మఱియొకరికి విక్రయింపఁబడుటచే నతఁడు పత్రికనిమిత్తము మఱియొక యచ్చుకూటమునుఁ గొని తనయన్నగారినే పత్రికకు ముద్రాశాలకు గార్య నిర్వాహకుఁడుగా నేర్పరచి యసాధారణ ప్రజ్ఞతో దానిని నడపఁజొచ్చెను.

1856 వ సంవత్సర ప్రాతమున స్త్రీపునర్వివాహ విషయములతో బంగాళాదేశమంతయు నట్టుడికినట్లుడుక జొచ్చెను. హరిశ్చంద్రముకర్జీ ఈశ్వరచంద్ర విద్యాసాగరుని పక్షముబూని సంఘ సంస్కారము మంచిదేయని పత్రికమూలమున వాదించి సంస్కర్తలకుఁదగిన సాయము చేసెను. అప్పటి గవర్నరుజనరలుగారగు డల్‌హవుసీప్రభువుగారు హిందూదేశమునందలి పెక్కుభాగములను గలుపుకొని కంపెనీవారి యేలుబడిక్రిందకుఁ దీసికొనివచ్చెను.

తరతరములనుండి యేలుచున్న రాజులను రాజ్యభ్రష్టులుగాఁ జేయుట యన్యాయమని హరిశ్చంద్రముకర్జీ పలుమారు నిర్భయముగ వాదించెను. డల్‌హవుసీ ప్రభువుగారి తరువాత గవర్నరుజనరలుగా వచ్చిన కానింగుప్రభువుగారి కాలమున సిపాయిపితూరీరాఁగాముకర్జీ చాల పాటుపడి సిపాయీలకు దొరతనమువారికి మనస్పర్థలుదొలఁగించి సంధిచేసెను. ఆంగ్లేయపత్రికాధిపతులగు దొరలు కొందఱు సిపాయిపితూరి సంబంధముగల స్వదేశస్థుల భూములు మొఖాసాలు నగ్రహారములు దీసికొని గవర్నమెంటువారు దొరలకిచ్చుటబాగుండుననివ్రాసిరి. అట్లుచేయుట ధర్మవిరుద్ధమనియు ప్రజలకోపమునణచుటకు మారు మరింత హెచ్చించుననియు దనపత్రికలోవ్రాసి ముకర్జీదొరతనమువారు మానునట్లుచేసెను. బంగాళాదేశమునకుఁగొందఱు దొరలు వచ్చి నీలిమందు తోటలు వేయించి దానివలన చాలాలాభముతీయుచు రహితుల కేమియు లాభము మిగులనీయక వారిని మిక్కిలిబాధపెట్టఁజొచ్చిరి. అప్పుడు రహితులందఱు భూస్వాములమీఁద కట్టుగట్టి నేలదున్నక నీలిమందుపండింపక తిరుగుబాటు చేసిరి. అప్పుడు భూస్వామిలారహితులను కోర్టులోదింపి మరింత పీడింపసాగిరి. ఆసమయమున హరిశ్చంద్రముకర్జీ యా నిరుపేద రహితులపక్షముఁబూని వ్యాజ్యములకై వారు వచ్చినప్పుడు వారి కన్నముపెట్టి బట్టలిచ్చి యర్జీలు వ్రాసిపెట్టి ప్లీడర్లను గుదిర్చి యెన్ని విధములనో వారి నాదరించెను. నీలితోటల యజమానులు వ్యాజ్యములలో నోడిపోయినందున ముకర్జీపయి కడుపులో నక్కసు నిలిపి వానిపైఁ గొన్ని నేరములను మోపి వ్యాజ్యములను దెచ్చిరి. అవి తీర్పుగాకమునుపే 1869 వ సంవత్సరమున హరిశ్చంద్రముకర్జీ యకాలమరణము నొందెను. అతనిమీఁది వ్యాజ్యము లతని మరణానంతరమున వానికి వ్యతిరేకముగా తీర్పుచేయఁ బడుటచే నీలితోటల యజమానులు వాని యిల్లు వాకిలి నమ్మించి సొమ్ముగ్రహించిరి. హరిశ్చంద్రముకర్జీ పత్రికాధిపతులగు హిందువులలో మొట్టమొదటివాఁడని చెప్పవచ్చును. బ్రతికినది స్వల్పకాల మయినను జీవితమంతయు నతఁడు పరోపకారార్థమై గడపిన పుణ్య పురుషుఁడు.