Jump to content

మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/మార్కసు క్రాసస్సు

వికీసోర్స్ నుండి

'మార్కసు క్రాసస్సు'

'క్రాసస్సు' రోముపట్టణములో నివసించుచుండెను. అతని తండ్రి, గుణదోషవివేచకుఁడు (Censor) గ నుండెను. వీ,రన్నదమ్ములు మువ్వురు. అందులో నితఁడు కడపటివాఁడు. అన్నదమ్ము లందఱు తండ్రికాలములో వివాహమాడిరి. వా రందఱు తండ్రితోఁ గలిసి భోజనముఁ జేయుచుండిరి. పెద్దన్నగారు కాలముచేసినపిదప నతని కుటుంబమును 'క్రాసస్సు' సంరక్షణ చేయుచుండెను. అతఁడు జితేంద్రియుఁడైనను నొక సతీమణి (Vestal Virgin) యొక్క గృహమును తక్కువవెలకు పుచ్చుకొనఁ దలఁచి యామెతో సరససల్లాపము లాడుచుండెనని నొక వదంతి కలిగెనుగాని, నది నిజమైనది కాదు. అతఁడు మంచిగుణములు కలవాఁడైనను, దురాశాపరుఁడని యెంచి, న్యాయాధికారు లతనిని శిక్షచేయక విడిచిరి. సతీమణి స్వగృహము నతని కమ్మివేసెను.

ఈ దురాశచేత నతని గుణములు వన్నె కెక్క లేదు. మొద టతని యాస్తి 300 టాలెంట్లు (1 టాలెంటు = 193 కాసులు). రాజకీయవ్యవహారములలో నున్నపుడు విశేషముగ ధనార్జన నతఁడు చేసెను. అందులో, యుద్ధములలో కొల్ల పెట్టి తెచ్చినది. కొంత, గృహములు కాలిపోవుచున్నపుడు పైని పారవేసిన వస్తువులను దొంగిలించి తెచ్చిన సొమ్ము కొంతకలదు. ఈవిధమున నతఁడు 7,100 టాలంటులు గణించెను,

రోముపట్టణములోని గృహములు సాధారణముగ నిప్పుముట్టుకొని తగులఁబడుచుండెను. గృహములన్నియు కలిసి. యుండుటచేత శీఘ్రముగ నవి యంటుకొనినందున వాని నార్పుట కవకాశము లేకపోయెను. అందుచేత నతఁడు కమ్మరులు లేపకారులను సుమారు 500 మందిని జాగ్రతచేసెను.. నిప్పంటుకొనిన గృహములను వాని సమీపమున నున్న వానిని నతఁడు గొనుచున్నందున పట్టణములో చాల భాగ మతనిదియై యుండెను. అయిన నతఁ డొక గృహములో వాసము చేయుచు మిగిలినవానిని కట్టించలేదు. ఆ నివాసమైనను, విరివిగ నున్నది కాదు.

అతనికి వెండిగనులు మెండుగ గలవు. వాని రాఁబడి విశేషముగ నుండెను. వానియొద్దనున్న బానిస లనేక వ్యాపారములను నేర్చినవారు. వైటికులును (Diamond Cutters} వర్థకులు (Carpenters), రుక్మకారకులు (Geldsmiths), ముండులు (Barbers), రజకులు (Washermen), మాంసికులు (Meet Sellers), భారవాహకులు మొదలగువా రతనియొద్ద పనిఁజేయుచుండిరి. వీరిమూలమున వచ్చుచున్న సత్త మధికముగ నుండెను, లేఖకులుకూడ నతనియొద్ద నుండిరి. ఎవ రెవరి కెటు లటుల పనుల నిర్మించి వారి వారిచేత నతఁడు పనులను జేయించెను. అభ్యాగతుల నెన్న డతఁడు పొమ్మనలేదు. పటాటోపము లేక స్నేహితులకు విందు లతఁ డప్పుడప్పుడు చేసెను. వారికి వడ్డి లేకుండ ఋణముల నిచ్చుచుండెను గాని వా రేరోజున సొమ్మునిచ్చి వేసెదమని చెప్పిరో యారోజున నతఁడు ఖచితముగ సొమ్ముఁ బుచ్చుకొనుచుండెను. వ్యవహారములో మిక్కిలి నిష్కర్షగ నతఁడు మాటలాడును. కుచ్ఛితవ్యాపారము లేమియు నతనిలో లేవు.

అన్ని విద్యలలో నతఁడు ముఖ్యముగ వక్తృత్వము నభ్యసించెను. గొప్పవక్త కాకపోయినను సభాకంప మతనికి లేదు. శిశిరో, పాంపేయి, సీజేరు; వీరు ప్రతివాదిపక్షమునఁ బ్రసంగించుట కిష్టపడనపుడు, క్రాససు లేచి వానిపక్షమున మాటలాడుచుండెను. ప్రసిద్ధికెక్కిన న్యాయవాదుల చేత విడువఁబడిన ప్రతివాదులను చేరఁదీసి వారిపక్షము నితఁ డవలంబించెను. అందుచేతఁ బ్రజ లితనిని నుతించిరి. రోమనులలో నెట్టి యధముఁడైనను వాని కితఁడు వందనముచేసి వానివలనఁ. బ్రతివందనములను గైకొనుచుండెను.

ఇతఁడు దేశచరిత్రలను, మహాపురుషులచరిత్రలను బాగుగఁ జదివెను. మహామహోపాధ్యాయుఁడైన 'ఆరిస్టాటి' లుపన్యసించిన తత్త్వజ్ఞానమునం దితని కభిలాష మెండుగనుండి, దాని ననుసరించెను.

ఆ రోజులలో 'మేరియస్సు' 'సిన్నా' యను నిరువురు రోమనులు సెనేటుసభలోఁ గక్ష వహించినందున, వారిమూల మునఁ బ్రజలకు రాజ్యమునకుఁగూడ కొంత వేడి కలిగెను. కొందఱు మహా కులీనులను పట్టి కట్టి తెచ్చి వారికి మరణ దండన విధించిరి. అటుల దుర్మరణము నొందినవారలలో క్రాససు యొక్క తండ్రి, జ్యేష్ఠభ్రాత లిరువురుండిరి. ఈ భయముచేత క్రాసస్సు స్పానియాదేశమున కిరువురు స్నేహితులు నిరువది పరివారకులతో కలిసి ప్రచ్ఛన్న వేషముతో లేచిపోయెను. అక్కడనుగూడఁ బ్రజ లట్టుడికనట్టుడుకుచుండిరి. దానినిఁ జూచి, యతఁ డొంటరిగ సముద్రతీరముననున్న నొక కొండబిలములోఁ బ్రవేశించి, యక్కడ కాలమును గడుపుచుండెను. భోజనపదార్థముల నతని స్నేహితుఁడైన 'విచియస్సు' స్వపరిచారకుని చేతికిచ్చి ప్రచ్ఛన్నముగ బిలద్వారమున నుంపించుచుండెను. వానిని నతఁడు స్వీకరించి పొట్టపోసికొనుచుండెను. ఒంటరిగా కాలము గడుపుట కష్టమని గ్రహించి స్నేహితుఁ డిరువురు కన్యల నతనియొద్దకుఁ బంపించెను. వారితో నతఁడు కాలయాపనచేసి, యెనిమిదిమాసము లందులో నుండి 'సిన్నా' మరణము నొందెనను వార్త విని బయటకు వచ్చి చేరెను.

అజ్ఞాతవాసానంతరమున నతఁడు 2,500 ల కాల్బలమును బోగుచేసి, వానితోఁగూడివెళ్లి, రోమనునాయకుఁ డైన సిల్లాతో సంగమించెను. వీరిరువురు కలిసి యుద్ధమును జేయుచుండిరి. 'క్రాసస్సె' శూరుఁడు కాకపోయినను పట్టుదలతో శత్రువుల నెదిరించి వారినిఁ దరుముచుండెను. దురాశ చేత చేయరానిపనుల నతఁడు చేయుటచేత నతనిని ప్రజలు దూషించిరి. ఇతనికంటె చిన్నవాఁడైన పాంపేయుని వారు డయతోఁ జూచుచుండిరి. సిల్లాకూడ నతనినిఁ బ్రేమతోఁ జూచుచుండెను. అందుచేత కాసస్సుకు శిరోభారముగ నుండెను. ఒక రోజున 'గురుఁడు పాంపేయి' వచ్చుచున్నాఁడని కొందఱతనితోఁ జెప్పిరి. అప్పుడతఁడు, "వాని గురుత్వ మెంత" యని వారి నడిగెను.

అతఁ డాత్మస్తుతి పరాయణుఁడు. ముఖస్తుతుల కతఁ డితరులకంటె నెక్కుడుగ నభినందించుచుండెను. శూరత్వములో పాంపేయితో సమానుఁడు కాకపోయినను, వ్యవహారములలో నతనిని మించెను. ధనముఁగలిగి పరులకు ఋణముల నిచ్చుచు ప్రతివాదులపక్షమున మాటలాడుటచేత నతని మాటలను ప్రజలు విని యతఁ డనుగ్రహించిన పురుషులనె వారు పెద్దయుద్యోగములలో నియమించుచుండిరి. పరదేశములలోనుండి పోరాడుచున్నప్పుడు పాంపేయిని ప్రేమించుచున్నను గ్రామములోనున్నపు డతనిని నిరాకరించి యతనికి వ్యతిరేకముగ క్రాసస్సు బోధించినప్రకారము కార్యములను వారు నిర్వర్తించుచుండిరి. సాధారణముగ పాంపేయి నలుగురిలో మెసలక కార్యార్థియై వచ్చినవారిని తిరస్కరించి సాటోపముతో నుండెను. క్రాసస్సు యెప్పు డందఱితోను కలిసి మెలిసి తిరుగుచు ప్రతివాని కార్యముల శక్తికొలఁది జేయు చుండెను. అందుచేత క్రాసస్సును బ్రజలు ప్రేమించిరి. ఐనను వీరిరువురు మహా ప్రౌఢులు. ప్రబోధనశక్తిగలవారు. వారి ముఖవర్చస్సు ప్రజల నాకర్షించెను.

ఈ కాలములో రోములో నధికారులు మూడు కక్షలుగ నుండిరి. శాంతముగ వ్యవహారములను నడుపుట కిష్టముఁ గల వా రందఱకు పాంపేయుఁడు నాయకుఁడు. విచారించక ధారాళముగ కార్యములను నెరవేర్చుటకు సమకట్టినవారికి సీౙరు నాయకుఁడు. ఏపక్షము నొందక ముభావముగ నున్నవారిలో ప్రధానుఁడు క్రాసస్సు. అతఁడు కాలోచితముగ పక్షములను మార్చుచు స్వలాభమున కతఁ డేయెండ కా గొడుగును పట్టుచుండెను.

ఈలోపున దేశములోని మల్లులంద ఱేకీభవించి పితూరి చేసిరి. . వారిని దండించుటకు 'క్రాసస్సు' సేనాధిపత్యమును బుచ్చుకొని దండుతో వెడలెను. వారి నతఁడు దరిమి జయమును బొందుకాలములో 'పాంపేయి' వచ్చి పరారియైనవారిని బొడిచి చంపెను. కష్టపడినవాఁడు క్రాసస్సు; వీరకిరీటమును బొందినవాఁడు పాంపేయుఁడు. కొంతకాలమునకు పాంపేయునకు అక్షదర్శకోద్యోగము (Consulship) లభించెను. క్రాసస్సునం దభిమానముచేత నతఁ డితని కా యుద్యోగము మఱియొకటి సమకూర్చెను. కాని కొన్ని రోజులకు వారిరువురు కలహించిరి. పనులలో కూడు నని యొకఁడు కూడ దని మఱియొకఁడు; ఇటుల వీరిరువురు గ్రుద్దులాడిరి. అంతలో వారి యుద్యోగకాల మంతరించెను.

ఇంతలో ప్రజారాజ్యమును ధ్వంసము చేయుటకు 'కటలీను' పేరుగలవాఁ డొకకుట్రను పన్నెను. అందులో 'క్రాసస్స' 'సీౙరు' కలిసియుండిరని వదంతి పుట్టెను. 'వక్తశిశిరో' సభలో క్రాసస్సు కుట్రకారుఁ డని ప్రసంగించెను: వీరిరువురకు మనస్పర్ధలు రగిలెను. క్రాసస్సు నిర్దోషి యని వెల్లడి యయ్యెను. శిశిరోను జంపుట కతఁ డద్యుక్తుఁ డయ్యెను. కాని యతని కుమారుఁ డతని నాటంకపఱచెను.

కాలాంతరమున పీౙరు అక్షదర్శకుని (Consul) పనికి నిలఁబడుటకు యత్నించెను. కాని పాంపేయుఁడు క్రాసస్సుల కంతఃకలహము లుండుటచేత ముందుగ వారిని మిత్రులుగ చేయఁజూచెను. వారినిఁ గలిపి వారితో నతఁడుఁ గలిసినందున వారు మువ్వు రజేయులుగ నుండిరి. ఈ మువ్వురి ప్రభుత్వములో పాంపేయునికి గాని క్రాసస్సునకు గాని మేలు లేక పోయెను. సీౙరు వారి సహాయముచేత ప్రజారాజ్యమును మార్చుటకు తగిన ప్రయత్నములను జేయుటకు వీలయ్యెను, వీరు మువ్వు రక్షదర్శకులుగ నుండిరి. సీౙరు పనులను బాగుగ నెరవేర్చుచున్నందున నతనిని సేనాధిపతిగ నియోగించిరి. అధికారమును విశేషముగ నడిపించవలె నని 'సాంపేయు'నికి వాంఛ కలిగెను. దురాశకు తోడు సీౙరువలెఁ గీర్తి ప్రతిష్ఠలను సంపా దించవలె నని క్రాసస్సు కోరి తుద కతఁడు దురవస్థనుఁ బొంది స్వదేశమునకు దుర్దినములను దెచ్చెను. వీరు మువ్వురు కలిసి స్వతంత్రముగ రాజ్యము నేలవలెననికూడఁ బలుకుకొని రోమను రాజ్యమును మూఁడు భాగములుగఁ జేసికొనిరి. సిరియా దేశము క్రాసస్సు వంతుకు వచ్చెను. అతఁ డందులకు సంతసించి యా దేశమునకుఁ బోయి దానినిఁ బరిపాలించెను.

అతఁ డక్కడనుండిన సమయమున 'పార్థుల'నువారితో రోమనులకు జగడము నచ్చెను. అందులో రోమనుల నాయకుఁడు గనుక క్రాసస్సు సైన్యములను వెంటఁ బెట్టుకొని యుద్ధమునకు నడిచెను. మహాఘోరముగ రెండు కక్షలవారు పోరాడిరి. క్రాసస్సు కుమారుఁడు రణములో మరణము నొందెను. క్రాసస్సుయొక్క స్నేహితులు వ్రాలిరి. కాసస్సు కుమారునియొక్క శిరమును బల్లెము కొనకు తగిలించి దానిని పార్థులు తెచ్చి రోమనుల యెదుట నుంచిరి. దానిని జూచి రోమనులు ధైర్యము చెడి వ్యసనపడిరి. "ఈ మహాశూరుఁడు వీరుఁడు కాని క్రాసస్సుయొక్క కుమారుఁడు కాఁ"డని వారితో పార్థులు చెప్పిరి. క్రాసస్సు విచారించి స్వసైన్యము నుత్సహించెనుగాని వారు నిరుత్సాహులైరి. యుద్ధము చాలించి లోఁబడవలసిన దని పార్థులు రోమనులకు చెప్పి వెళ్లిరి. వారు పరారి కాకుండ సైన్యమును నాలుగు వైపులనుంచి శత్రువులా రాత్రి వైజయంతికలలో వెళ్లఁబుచ్చిరి. ఆ రాత్రి రోమనులకుఁ గాల రాత్రివలె నుండెను, క్రాసస్సు వ్యసనముతోఁగూడ చీఁకటి గదిలోఁ బ్రవేశించి విలపించుచుండెను.

అప్పుడు యోధులందఱు సమావేశమై వీరసభ నొకటి చేసి దానిలో పరారియగుటకు సన్నాహముఁ జేయవలసిన దని కూడఁ బలుకుకొని వా రందఱు లేచిపోయిరి. క్రాసస్సు కూడ వారితో కలిసిపోయెను. దుర్బలు లందఱు శిబిరములలో నుండుటచేత మరునాఁడుదయమున నాలుగువేల మందిని శత్రువులు ఖండించిరి. పాఱిపోవుచున్న రోమనులను దారిలో కలిసి పార్థులు వారిని సంహరించిరి. అందులో 'క్రాసస్సు' కూడ నేలఁబడి వీరస్వర్గము నొందెను.

కలిగిన దానితో సంతుష్టినొందక దురాశచేత విశేషముగ ధనము నార్జన చేయవలెనని సమకట్టి పరదేశములకుఁ బోయి శక్తి లేని పనుల నారంభించి క్రాసస్సు తుదకు దుర్మరణము నొందెను. ఈ విషయము క్రీ. పూ. సం|| 80-53 రములలో జరిగెను.