మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/నిసియస్సు

వికీసోర్స్ నుండి

నిసియస్సు

'నిసియస్సు' 'థ్యూసిడైడీసు' వీ రిరువురు తమ కాలములో ప్రజలను పుత్రవాత్సల్యముతోఁ జూచుచుండి రని మహా మహోపాధ్యాయుఁడైన 'ఆరిస్టాటులు' ప్రకటన చేసెను. 'థ్యూసిడైడీసు' పెద్దవాఁడు. 'పెరికిలీస'నువాఁడు ప్రజలపక్షము మాటలాడును; మొదటివాఁడు ధనికులపక్షము నవలంబించి యతనిని యెదిరించుచుండెను. 'నిసియస్సు' మిక్కిలి చిన్నవాఁడు. పెరికిలీసు కాలములో నితఁ డతనితోఁ గలిసి పని చేయుటయు, స్వతంత్రముగ పనిచేయుటయు కలదు. యుద్ధములలోకూడ నితఁడు చతురుఁడై యుండెను. పెరికిలీసు కాలాంతరగతుఁడైనపిదప, నితఁడు వ్యవహారస్థుఁడై , పనులను ప్రజల కింపగునటుల నెరవేర్చుచుండెను. ప్రజ లతనిని నమ్మిరి.. వారిచేత నతఁడు సన్మానింపఁబడెను. వారిని నొప్పించుట కతఁడు భయపడినందున, వా రతనిని ప్రేమించుచుండిరి. స్వభావము చేతఁ గొంత సభాకంపముఁ గలవాఁడైనను, యుద్ధములలో నతఁడు జయమును బొందుటచేత నతనిని వారు మన్నించిరి.

ప్రభు మంత్రోత్సాహశక్తులు గలిగి పెరికిలీసు రాజ్య సూత్రములను ధరించి ధర్మబుద్ధితో నడిచెను. ఈ రెండు గుణము లతనికి లేకపోయినను ధనము విశేషముగ కలవాఁడైనందున, గరిడీసంబరములచేతను, మల్లయుద్దములచేతను, నాటకముల చేతను . ప్రజల నతఁడు రంజింపచేసెను. అతఁడు పురజనులకు కూర్చిన బహుమానములలో నేకశివాప్రతిమ నేఁటివఱకు గానఁబడుచున్నది.

'డీలాస'ను నొక ద్వీపములో 'అపాలో' యను పేరుగల సూర్యదేవతాలయ మొకటి కలదు. అక్కడ ప్రతిసంవత్సర మొక మహోత్సవము జరుగుచుండును. అక్కడకు దేశదేశములనుండి మనుజులు వెళ్లుటకలదు. ఒక సంవత్సరము 'ఆథెన్సు' పట్టణమునుండి కానుకలను బలులను బట్టుకొని గాయకులతో నుత్సవమునకు వెళ్లుటకు ప్రజలు నిసియస్సును నియోగించిరి. అతఁ డక్కడకుఁ బోయి వానిని సమర్పించి యక్కడ ౙరిగిన వినోదములలో గొంతకాలము గడిపెను. అయిదువేల రూప్యముల కొక భూమిని కొని దాని నతఁడు భోగరాగాదులకు దేవున కిచ్చెను.

అతఁ డటుల చేయుట డాంబికమునకుఁ గాదు. నిజమైన భక్తికలవాఁడు. దేవతిర్యఙ్మనుజులనిన నతనికి భయము. ప్రతి దినమున నతఁడు హోమముచేయుట కలదు. అతనికి వెండిగని కలదు. అందులో ననేక పనులను జేయుచుండిరి. అతనికి విశేషముగ భృత్యవర్గము కలదు. రాబడి మెండుగ నుండెను. సత్పాత్రులను జూచి యతఁడు దానము చేయుచుండెను. భయశీలుఁడుగాన నతనిని నెరిపించి దుర్మార్గులు ధనమును స్వీకరించుచుండిరి.

'ఆథెన్సు' పట్టణములో నతఁడు 'ఆర్కను' అను పేరున నొక న్యాయాధికారిగ నియోగింపఁబడెను. ముఖీశాల కందఱికంటె ముందుగ నతఁడు బోవును. అక్కడనుండి లేఖకులు వెళ్లినపైని అతఁడు వచ్చును. పురవాసులతోఁ గలిసి మెలిసి తిరుగుట కతఁడు భయపడుచుండెను. వారిని తన గృహమునకు భోజనమునకు బిలచుటగాని వారి గృహములకు నతఁడు వెళ్లుటగాని లేదు. ఇతరు లతని దర్శనమునకు వచ్చిన భయము చేత వారికి దర్శన మియ్యక వారిని బంపివేయుచుండెను. సెలవుదినములలోఁ గవాటములు వేసి స్వగృహములో నతఁడు మెసలుచుండెను. వేయేల? నిసియస్సుయొక్క జీవితకాల మంతయు జాగరూకతతోఁ గడుపఁబడెను. అతఁడు యజమాని యైనను బ్రజలవిషయమై పాటుపడెను. వాచాలత్వము సామర్థ్యము గలవారిచేతఁ బ్రజలు పనులను చేయించుకొనినను వారి నీర్ష్యతోఁ జూచుట కలదని యతని యభిప్రాయము. అందుచేత నేపనికైన సతఁడుఁ బూనుకొన లేదు. ముందు వెనుక లాలోచించి పూనుకొనినపని నతఁడు సొంతముచేసి జయమును బొందుచుండెను. ప్రజల కీర్ష్య కలుగునను భయముచేత కొంచెము తన ప్రతాపమువలన కలిగినను జయ మదృ ష్టముచేత కలిగెనని యతఁడు చెప్పుచుండెను. ఆకాలములో 'ఆథీనియనులు' విశేషముగ బాధలు పడుచున్నను వానిని పరుల దోషములవలన సంభవించె నని వారు పలుకుచుండిరి గాని 'నిసియస్సు'వలన సంప్రాప్తమయ్యె నని వారు చెప్పుట లేదు.

ఈకాలములో నాథెన్సు పట్టణములో నొకవక్త బయలుదేరెను. అతని పేరు 'ఆల్సిబియాడీసు'. ఇతరులవలె నతఁడు దుర్మార్గుఁడు కాకపోయినను నతని గుణములు విపరీతముగ నుండెను. దుర్మార్గులను వెడలఁగొట్టి పట్టణమునకు స్వాస్థ్యమును నిసియస్సు తెచ్చుసరికి 'ఆల్సిబియాడీసు'వలన నది తగ్గిపోయి మరల దౌర్జన్యములు బయలు దేరెను.

ఈలోపున స్పార్టనులకు 'అథీనియను'లకు యుద్ధము పొసగినను నిసియసు రెండుకక్షలవారికి సంధిచేయుటకు యత్నించెను. పెద్దలంద ఱందుకు సంతసించిరి. ఒక సంవత్సరము వఱకు వారు యుద్ధము మానిరి. కుక్కుట ధ్వని విని వా రుదయమున లేచుచుండిరి. రణభేరీ మ్రోగుట లేదు. అట్టి సమయమున స్పార్టనుల రాయబారులుగూడ వచ్చిరి. సంధిమాటలు సభామండపమున జరుగుచుండెను. ఆల్సిబియాడీసుయొక్క. ప్రేరణచేత సంధిమాటలు పొసఁగలేదు. పడుచువారు యుద్ధమునకు వృద్ధులు సంధికి యిట్లు నిరుతెగలుగ అథీనియనులు విడిరి. మాటలు పొసఁగనందున రాయబారులు లేచిపోయిరి. అథీనియనులకు కోప ముద్రేకించెను. నిసియస్సు, ఆల్సిబియాడీసు, మఱియొకనిని వీరి మువ్వురిలో నొకనిని దేశోచ్చాటన చేయుటకు వారు యత్నించిరి. అంతలో వీరిరువురు కలిసి స్నేహము చేసికొని మూఁడవవానిని దేశోచ్చాటనఁ జేయించిరి. వీరుభయులు సంధిఁ జేసికొనుటఁ జూచి ప్రజలు మిగుల సంతసించిరి.

పరదేశీయుల ప్రోత్సాహముచేత అధీనియనులు సిసిలీ ద్వీపముపైకి దండెత్తపోవఁ దలఁచిరి. కూడదని నిసియస్సు, సోక్రెటీసు మొదలగువారు: కూడునని ఆల్సిబియాడీసు మొదలగు పడుచువారు; సపక్ష పరపక్షముగ సభలో వాదించిరి. సభవారు దండెత్తి వెళ్లుటకు యత్నించి 'నిసియస్సును' 'ఆల్సిబియాడీసు'ను సేనానాయకులుగ నియమించి దళము లాయత్త పఱచిరి. వా రా ద్వీపమునకు తర్లి వెళ్లిరి. అక్కడనుండి ఆల్సిబియాడీసు విమర్శనకు మరలినందున సేనాధిపత్యము నిసియస్సు కిచ్చిరి. అతఁడు యుధ్ధము సాంతముచేసి దుర్గములను బట్టుకొని ద్వీపములో ముఖ్యపట్టణమైన 'సిరాక్యూసు'ను ముట్టడించి దాని లొంగదీసెను. ఆ పట్టణము లోఁబడిన పిదప దాని చుట్టు పరిఘల నెత్తించి దుర్గముల కట్టి యగడ్త నతఁడు త్రవ్వించుచుండెను. మూత్రకృచ్ఛరోగముతో నతఁడు బాధ పడుచుండియు స్వల్పకాలములో నిన్ని కార్యములు చేసినందు కతనిని స్వదేశీయులు శ్లాఘించిరి. ఇంతలో సిరాక్యూజ నగరవాసులకు కొందఱు సహాయులైనందున వారు తిరుగంబడి నిసియస్సును రణములో నోడించిరి. నౌకాహవములోకూడ నతఁడు పరాభవము నొందెను. వారు తరుముకొని వచ్చుటచేత నతఁడు పట్టణములోఁ బ్రవేశించెను. అతఁడు కట్టించుచున్న పరిఘలమూలమున బయట కతనికిగాని నతని సైనికులకుగాని రా వీలులేక పోయెను. రేవుపట్టణమును వారు పట్టుకొనినందున వీ రా మార్గముననైనఁ బారిపోలేకపోయిరి. ఈ దురవస్థను అధీనియనులు విని మఱి కొంత సైన్యమును జేర్చి 'డెమాస్తనీసు'ను సేనానిగఁ జేసిపంపిరి. వారు వచ్చి నిసియస్సు చేసిన సలహా ప్రకారము నడవక వెంటనే యుద్ధమునకుఁ గడచిరి. ఈ యుద్ధములో రెండువేల ఆథీనియనులు వీరస్వర్గమును బొందిరి. 'డెమాస్తనీసు'యొక్క తొందరపాటుచేత నీ యపజయము అధీనియనులకుఁ గలిగెను. సైనికులు నిరుత్సాహులైరి. వారు ఘాపితులై కృశించిరి. వారికి సహాయ మిచ్చుటకు స్వదేశము నుండి సైన్యము వచ్చు విధము గనఁబడదు.

అప్పుడు అథీనియనులు నావల నెక్కి స్వదేశోన్ముఖులైరి. శత్రువులు పరస్పరముగ నున్నట్లుండి, వారు బయలుదేరి నావలను గడుపుచుండ మిడుతల దండువలె యుద్ధనావలతో నాక్రమించి ఘోరముగ సముద్రముమీఁదఁ బోరాడిరి. అథీనియనుల యుధ్ధనావలు భారము కలవియగుటచేత భారము లేని శత్రువుల నావలవలె సుళువుగ సంచరించుటకు సమర్థత లేకపోయి వేగముగఁ బట్టుపడెను. రాళ్లను రువ్వి శత్రువులు వీరి నావలను గొన్నిటిని ముంచివేసిరి. పట్టుపడిన నావలలోని వారు ఖైదలయిరి. అందులో నిసియస్సు యొక్క శ్రమలు చెప్ప లేము. అతఁడు వృద్ధు, రోగి, భోగి; అతని సలహాకు విరుద్దముగ నీ యుద్ధము జరిగెను. దాని ఫలితము నతఁ డనుభవింపవలసివచ్చెను. డెమాస్తనీసు (వక్త డెమాస్తనీసుకాఁ డితఁడు), ఫరాభవమును బొందలేక పొడుచుకొని చచ్చెను. శత్రువులు కనికరము చూపక వీరిని నఱకుచుండిరి. దీని కంతము కనఁబడ లేదు. శత్రు సేనాధిపతియైన 'గిలిప్ససు'ను కలిసికొని, దయాదాక్షిణ్యమును జూపుటకుఁ గాల మిదియే. మేము ధూసాయితులమైతిమి. మమ్ము కరుణించి మీరు మా కభయ మియ్యవలె"నని 'నిసియస్సు' ప్రార్థించెను. అప్పుడు యుద్ధముఁ జాలించవలసిన దని 'గిలిప్పసు' ఉత్తరువు చేసెను. అప్పుడు ' సిరాక్యూజ'నులు సభఁజేసి హతశేషులైన ఆథీనియనులను గనులలోఁ బనిఁ జేయుటకును వారి సేనాధిపతులఁ జంపించి వేయనలసినదనియు తీరుమానముఁ జేసిరి. ఆప్రకారముగ 'నిసియస్సు'ను రాళ్లతోఁ గొట్టి వారు చంపివేసిరి. గనులలో పనికిఁబోయిన 'అథీనియనులు' క్షుత్పిపాసాది బాధలచేత శ్రమపడి మడిసిరి. మఱికొందఱు బానిసలుగ శత్రువులచేత నమ్మఁబడిరి. ఒకఁడు 'ఆథెన్సు' పట్టణమునకుఁ బోయి క్షౌరముఁ జేయించుకొనుచు మంగలివానితో నీదుర్వార్తను జెప్పెను. పట్టణములో నా సంగతి తెలియనందున క్షౌరకుఁడు వెంటనే పట్టణములోనికిఁ బోయి యధికారులతో నీ సంగతిఁ జెప్పెను. వా రా వార్తను విశ్వసించక చెప్పినవానిని బట్టి తెప్పించి రూఢిగ తెలియని యీ దుర్వార్త నతఁడుఁ జెప్పినందు కతనిని శిక్షించిరి. ఇంతలో నిజము తెలిసెను. నాగరికులందఱు దుఃఖాక్రాంతులైరి. నిసియసు మొదలగు సేనాధిపతుల దుర్మరణమునకు వారు విలపించిరి. ప్రతి గృహములోను రోదనశబ్దము తప్ప మఱియొకటి వినఁబడదు. దుర్వార్తాశ్రవణముచేత నా దినము వారికి దుర్దినమయ్యెను. పడుచువారి ఆలోచనలను గ్రహించి, వృద్దుల దూరాలోచనలను నిగ్రహించినందున వారి కీ దురవస్థ సంప్రాప్తమై కొన్నితరములవఱకు 'అథీనియనులు' శిరస్సు నెత్తుకొని తిరుగలేదు. ఈ సంగతులు క్రీ. పూ. సం|| 413 రములో జరిగెను.

'నిసియస్సు' దూరదర్శియైనను, ప్రాక్తకాలజ్ఞుఁడు కానందున, నీ పరాభవము సమకూడెను. అందులో, సేనాధిపతి సంప్రాప్తకాలమునకుఁ దగినటులఁ బన్నాగములఁ బన్నుటకుఁ దగిన కుశాగ్రబుద్దిఁ గలిగియుండవలెను. అతఁడు నిసియసు వలె దీర్ఘాలోచనపరుఁడైన, శత్రువులు ,సమయము వేచియుందురు గనుక నతనిని పరిభవించుదురు, వారికి సమయ మతఁ డియ్యకూడదు. కేవలము దూరదర్శియైగాని, కేవలము ప్రాప్తకాలజ్ఞుఁడై గాని యతఁ డుండఁగూడదు. అందుచేత సైన్యాధిపత్యమునందఱు పుచ్చుకొనరు. స్వసైన్యరక్షణఁ జేయుచు, శత్రుసైన్య గతులు గుఱ్తెఱిఁగియుండవలెను. ఏ సమయమున నైన నతఁ డేమరిపాటుగ నుండినను సైన్యములు నశించుటయె గాక స్వదేశమున కపకీర్తి వచ్చును.