Jump to content

మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/జూలియసు సీజరు

వికీసోర్స్ నుండి

జూలియసు సీౙరు

సీజేరు సామంతుల కుటుంబములో క్రీ. పూ. 102 సంవత్సరమునఁ బుట్టెను. ఇతఁడు 'పాంపేయి' 'శిశిరోల' కంటె నాలుగు సంవత్సరములు చిన్నవాఁడు. 'కాన్సల్ ' అను పేరుగల యక్షదర్శకుని యుద్యోగముఁ దన తండ్రి చేయకయే మృతినొందెను. క్రీ. పూ. 90 సం॥ రములో నితని పినతండ్రి యా యుద్యోగమును చేసెను. ఇతని పితృష్వసయైన 'జూలియా'ను 'మేరియసు' వివాహమాడెను. సీజేరు మొదటినుండియుఁ బ్రజలపక్షమున మాటలాడుచుండెను. అందుచేత నతఁడు శత్రువుల బారినుండి తప్పించుకొని దేశాంతరగతుఁడయ్యెను. సాహసిక నావికులు కొంద ఱతనిని చెఱపట్టి విడుదల సొమ్ము పుచ్చుకొని యతనిని విడచిరి. పిదప సీజేరు కొన్ని యుద్ధనావలను జతపఱచి యా సాహసిక నావికుల నోడించి, వారి నావలను, నియామకునిఁ బట్టుకొని వారికి మరణదండన వేయించెను.

ఈలోపున నతని శత్రువు లుచ్చపదచ్యుతులైరి. అతఁడు రోముపట్టణమును జేరెను. అతని మిత్రుల కమందానందము కలిగెను. క్రీ. పూ. 68 సం||రమున నతఁడు 'స్పాని యా' దేశములో వికర్మకుఁడుగ నియోగింపఁబడి, యచటి పనుల బాగుగ నిర్వర్తించెను. క్రీ. పూ. 67 సం॥రమున సర్వాధికారియను పేరున నతఁడు కార్యములను వ్యవహరించుచుండెను. ఇంతలో ముఖ్యపురోహితుఁడు కాలము చేసి సందున, సీౙ రాపనిలోఁ బ్రవేశించెను. అతఁడు పురోహితుఁ డగుటవలన ప్రజలను దుర్వ్యాపారములలో నడువనీయఁ డని వారు భయ సంభ్రమములఁ జోందిరి. ఇతని సమకాలికులలో ముఖ్యులు 'పాంపేయి' 'శిశిరో' యనువారు. ఇతఁడు మహాయోధ. ఆనేక యుధ్ధములను చేసి జయముఁ బొందెను. ఫ్రెంచి, జెర్మను, స్పానియా, ఇంగ్లాండు, ఉత్తరాఫ్రికా దేశములను ధ్వంసము చేసి, వానినుండి కప్పముల నతఁడు పుచ్చుకొనుచుండెను. కొల్లపెట్టిన ధనము నతఁడు కొనక దానిని నిలవచేసి శూరులకు బహుమానముగ నిచ్చుచుండెను.

ఉచ్చపదవాంఛాందోళిత మానసుఁడై , రాత్రింబవళ్లు పాటుపడి, పిపాసాది బాధల కోర్చి సున్నితమైన శరీరము కలవాఁడై, యతఁడు శ్రమపడెను. సాధారణముగ తలనొప్పిచేత నతఁడు బాధపడుచుండెను. అప్పుడప్పుడతనికి మూర్ఛవచ్చుటకూడఁ గలదు. ఇట్టి సంకటము లతనిని వ్యసన పెట్టుచున్నను, దుర్వ్యాపారములులేక యుక్తాహారవిహారములలో నతఁడు కాలముఁ గడిపెను. అన్ని కాలములలోను యుద్ధమునకు వెళ్లినపుడు పల్లకిలోగాని రథముపైనిగాని యతఁడు శయనించుచుండెను. పగటివేళల దుర్గములను పట్టణములను శిబిరముల నతఁడు పరీక్షించుచు హర్కారాలు సరిగ నారి పనిని చేయుచున్నదియు లేనిదియుఁ జూచుచుండెను. అతఁడు నడుచుచున్నపుడు తాకీదులను వ్రాయుట కొకలేకరియు నంగరక్షకుఁ డొకఁడును నతని వెంబడి పోవుచుందురు.

అతనికి బాగుగ స్వారిచేయు శక్తికలదు. గుఱ్ఱము పరుగిడుచున్నపు డతఁడు కళ్లెములను వదలి, చేతులు ముడుచుకొని కూర్చుండును, స్వారి చేయునపు డతఁ డిరువురు లేకరులు వ్రాయఁదగిన యంశములను వారికిఁ జెప్పుచుండెను. పని మిక్కుటమగుటచేత ముఖస్థముగ ప్రసంగించుట కవకాశము లేనందున స్నేహితుల కతఁ డుత్తరములమూలమున ప్రశంసాంశములను వ్రాసి పంపును.

క్రమముగ ఫ్రాడ్వివాకుఁడుగను (Proctor) యక్షదర్శకుఁడుగను (Consul) రాజకార్యములలో నతఁడు మెసలెను. ప్రభు మంత్రోత్సాహ శక్తులుకలిగి, శత్రువుల కలంఘనీయుఁడై వారి నతఁడు భంగపఱచెను. దైవముకూడ నతని కనుకూలుఁడయ్యెను. 'శిశిరో' దుర్మరణము నొందెను. 'పాంపేయి' యుద్దములోఁ బరాభవమునొంది జీర్ణించెను. క్రీ. పూ. 45 సం!!రము అంతమగు సరికి మార్గము నిష్కళంకమైనందున, రాజ్యంగముల నన్నిటిని స్వాధీనము చేసికొని ప్రజారంజకుఁడై యతఁడు కాలోచితముగ రాజ్యతంత్రములలో మార్పులను చేసెను. చాలరోజులు రోముపట్టణములో నివసించుట చేత రాజ్యతంత్రములలోని దోషముల నతఁడు బాగుగ గుఱ్తెఱిఁగి వానిని శుభ్రపఱచుట కుద్యుక్తుఁడయ్యెను. అతిసూక్ష్మబుద్ధిఁ గలవాఁడై, యే యంశమునైన సులభముగ గ్రహించి యుచితముగ విచారించును. నిరంకుశ ప్రభుత్వముకలవాఁడగుట చేత నతఁడు లోపములను సవరించి న్యాయచట్టములను సుళువుగ మార్చుటకు సమర్థుఁడయ్యెను.

యుద్ధములు విశేషముగ జరిగినందునను, శూరులకుబహుమానము లిచ్చుటచేతను, వృత్తి భోగులకు వార్షికము లిచ్చుట వలనను, బొక్కసములోని ధనము తగ్గెను. రు. 3,20,000 లు పరదేశీయులు వృత్తిభోగులుగ వార్షికములను పుచ్చు. కొనుచున్నందున, వారి పట్టీని పరీక్షించి యుద్ధములలో మరణమునొందినవారిని మినహాయించి వారి సంఖ్య నతఁడు తగ్గించెను. తిరుగుబాటుచేయక లోఁబడిన వారినందఱి నతఁడు రక్షించెను. మొండితేరి మౌర్ఖ్యముగ మెడ్డొడ్డినవారి సతఁడు దండించెను. పట్టణమునకుఁ గావలసిన నీటిసదుపాయము నతఁడు చేయించెను, రాజమార్గములను వేయించి, కాలువలు త్రవ్వించి రోము మహారాజ్యము నాపనము (Survey) చేయించి, దాని పరిమితఁ దెలిసికొనుట కతఁ డొక పటమును వ్రాయిం పించెను. ప్రాచీ నాధునిక న్యాయచట్టముల నతఁడు సమన్వయింపఁ జేసి చేర్చెను. ప్రజారాజ్యము నేక రాజ్యాధిపత్యముగ మార్చుటకుఁ దగిన సన్నాహము చేసెను. సర్వాధికారియై పేరునకుమాత్రము ' సెనేటు' సభవారిని మంత్రాలోచనలకుఁ బిలుచుచు, సమకట్టిన పనుల నెదురులేక యతఁడు సాగించెను. యుద్ధములలోఁ బ్రజలు విశేషముగ మరణమునొంది. నందుస ప్రజాసంఖ్య దేశములో తగ్గిపోయెను. వివాహము లేక స్త్రీ పురుషులు విచ్చలవిడిగా సంచరించుచుండిరి. అందు చేత వివాహములు చేసికొని కుటుంబములను పోషించు గృహస్థులకు విశేషముగ మన్ననలు కలుగున ట్లతఁడు తీర్మానించెను. 'చంద్రికాసన్నిభస్ఫటికసంఘటితకుడ్యంబులును, కవాట గేహళీవిటంకవాతాయనంబులును, వివిధవిచిత్ర విమానంబులును, నిరంతరసురభికుసుమఫలభరితపాదపమహోద్యానంబులును' కలిగి రోముపట్టణ మతనికాలములోఁ బ్రకాశించెను.

సీజేరు చేసిన మహత్కార్యములలో పంచాంగ (Calender) సంస్కరణ మెక్కుడుగ భావించవలెను. రోమనుల సంవత్సరము చాంద్రమానము ప్రకారము 355 రోజులు కలది. దీనిని సూర్యమానముతో సరిఁజేర్చుటకు ప్రతి మూఁడవ సంవత్సరములో నొక యధిక మాసమును నారు వేసికొనుచుండిరి. ఇటులఁ జేయుచుండినను, సూర్య చంద్రమానములు సరిపడనందున నతఁ డలగ్జాండ్రియా పట్టణములోని ప్రసిద్ధ జ్యోతిశ్శాస్త్రజ్ఞుఁడగు 'సొసీజనూస'ను వానిని పిలిపించి వానిచేత పతకశుద్ధిని జేయించెను. సంవత్సరమునకు 355 రోజులని గణించుటకు. బదులుగ, నాఁటినుండి 365 కోజులు గలదిగ వాడుక కలిగెను. సూర్యమానము ప్రకారము 356 రోజులు గణించవలెను. అందుచేత నాలుగు సంవత్సరముల కొకపర్యాయము ఫిబ్రవరి నెలలో నొక రోజును కలుపు వాడుక నేఁటివఱకుఁ గలదు.

ఈ పనులలో నుండుటచేత నతఁ డొకరి దర్శనము చేయుటగాని యితరు లతని దర్శించుటగాని జరుగుట లేదు. అంతలోనే ప్రజ లసంతుష్ఠినిఁ జెంది, యతనిని నిర్లక్ష్యమునఁ జూడ నారంభించిరి.. ధనికులు సహిత మతనిపేరు చెప్పిన మండిపడుచుండిరి. ఇందుకు తోడుగ నతఁడు రాజని పిలిపించుకొనుట కిచ్చకల దని యొక వదంతికలిగెను. ప్రజా రాజ్యసంబంధనాణెములమీఁద నతని శిరోముద్ర వేసి వ్యావర్తములోనికిఁ దెచ్చిరి. 'సెనేటు' సభవా రతని యంగ రక్షణకు బాధ్యతను వహించిరి. అతని రాకపోకల సమయమున రాజలాంఛనములు జరుగుచుండెను. ఇన్ని మర్యాదలు పొందుచున్న నతఁడు వ్యసనగ్రస్తుఁడయ్యెను. పట్టాభిషేకమును పొంది. కిరీటమును ధరింపవలె నని యతఁడు కోరుచుండెను. రాజలాంఛనములను జూపుటకుఁ బ్రజ లిష్టపడిరి కాని ఆతఁడు రాజచిహ్నముల ధరించుటకు వా రిష్టపడలేదు. అందువలన, 'బ్రూటసు' అనువాఁడు నడుముకట్టి యితరుల సహాయముచేత నొక కుట్రను పన్నెను. . ఈలోపుగ సీౙరునకుఁ గొన్ని దుస్వప్నములు వచ్చెను; వినికిడివలన జరుగుచున్న కుట్ర సంగతి యతనికిఁ దెలిసెను. ఎంతవారికైననుఁ గొల మవిలంఘ నీయము!

ఒక రోజున 'బ్రూటసు' వచ్చి " ఏలినవారి కోరిక ప్రకారము పెద్ద లందఱు తమరికి పట్టాభిషేకముఁ జేయుటకు సిద్ధముగ నున్నారు. స్వప్నములను శకునములను సరకు సేయక తమరు విజయము చేయవలె"నని సీౙరుతో మనవిచేసేను. వెంటనే యతఁ డున్ముక్తకమును (Toga) ధరించి పల్లకీలో కూర్చొని సభామండపమునకుఁ బోవుచుండ, ప్రజలు గుంపులు గుంపులుగ నతని వెంబడించి పోయిరి. కుట్ర.సంగతి మార్గములో తెలుపుట కతనియొద్దకు కొందఱు వెళ్లఁ దలచినను, జనసమ్మర్దముచేత వారు సమీపింపలేకపోయిరి. సభామండపమునకుఁబోయి యతఁ డున్న తాసనము నధిష్ఠించెను. వెంటనే రాజద్రోహులు గుమిగూడి వారి వారి మిధ్యావిజ్ఞాపనల నొక్కుమ్మడి మనవిచేయసాగరి. ఇది చూచి యతఁ డాసనమునుండి లేవఁబోవ ద్రోహులలో నొకఁ డతని యున్ముక్తకమునుపట్టి దిగలాగెను. ఇతరులు వారి వారి ఛురికములతో నతనిని పొడువసాగిరి. కొంతవఱకు వారి బాఱినుండి తప్పించుకొ నెనుగాని 'బ్రూటసు'ను జూచి యతఁడు కండ్లుమూసికొనెను. ఇతఁడతని పరమమిత్రుఁడు. 'నీవుకూడ వీరలోఁ గలసితివా' యని సీౙరు .బ్రూటసుతోఁ బలికి, యిరువదిమూఁడు గాయములు తగిలినందున, దుర్బలుఁడై పాంపేయి యొక్క శిలాప్రతిమ సమీపమున నేలఁగూలెను. ఆ కాలమున భూమండలములో మహాపురుషుఁడని ప్రసిద్ధికెక్కిన జూలియసు సీౙరు దుర్మరణము నొందెను. లాటిను భాషను స్వచ్చముగ నుచ్చారణఁ జేయుట కతనికి శక్తికలదు. అంత విశేషముగ లేకపోయినను, కొంచె మతఁడు వక్తృత్వము కలవాఁడని చెప్పవచ్చును. సీౙరు భాష్యములను నేఁటివఱకును జదువుట కలదు. దండ నాయకులలో నతఁ డగ్రగణ్యుఁడు. మహా మంత్రులలో నతనికి మించినవారు లేరు. అతఁడు చేయవలసిన పనులలో నపజయము నెన్నఁడుఁ బొందలేదు. డాంబికము, మనోగర్వములు లేనందున నతఁడు మహా పురుషుఁడని చెప్పవచ్చును. అతఁడగ్రామ్యుఁడు, అగ్రీయుఁడు. శరీరము వ్యాధులచేతఁ గృశించినను, నతఁడలంకర్తయైయుండెను. కాలధర్మము ననుసరించి యతఁ డనుకుఁడు, నిశాటుఁడుగ నుండినను పరు లతని నిందించ లేదు. యుద్ధములో ననేకమందినిఁ జంపి కొందఱిని పట్టి కట్టి తెచ్చినను, నా కాలపు బుద్దిమంతులు దాని నొక తప్పిదముగ నెంచలేదు. చేయఁబూనిన కార్యమును చతురోపాయముగ మనశ్శంకలు లేక యతఁడు నిర్వర్తించెను. శత్రువులకు శృంగభంగము చేసి వారికి శిరచ్చేదము చేయక యతఁడు ప్రసాదించెను. వ్యవహారముల పొందికచేతఁ గాలాంతరమున ప్రజారాజ్యము కీలు వదలి, యేకరాజ్యాధిపత్యమునకు సందునిచ్చెను. ఈ తరములోఁ గాకపోయినను, నితని మేనకూఁతురుయొక్క. కుమారుని కాలములో మహారాజ్యధిపత్యము స్థాపింపఁబడెను. సీౙరునకు సంతతి లేనందున మణానంతరమున నతని మేనకూఁతురి కుమారుఁడు 'ఆగస్టసు సీౙరు' రాజ్యమునకు వచ్చి రాజలాంఛనములనె కాక రాజచిహ్నములనుగూడ ధరించి పట్టాభిషిక్తుఁ డయ్యెను.