మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/దుర్వాసో మహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

దుర్వాసో మహర్షి[1]

దుర్వాసుని జననప్రకారము

దుర్వాసుఁ డత్రిమహర్షి నిరుపమాన తపఃఫలము, త్రిమూర్తు లనసూయ కొసంగిన వరప్రసాదము. ఈతఁడు శివాంశ సంజాతుఁడు. హైహయుఁ డను రాజొకఁడు దుష్టుఁడై అనసూయకు గర్భనిరోధము కావించెను. ఇది యెఱంగి యా రాజును నిర్దగ్ధుం జేయఁ దలఁచి దుఃఖము, కోపముఁ దాల్చి గర్భావాసమున నేడుదినములుండి దుర్వాసుఁ డను నామమున రుద్రుఁడు తమోగుణోద్రిక్తుఁడై యవతరించెను. వెంటనే యాతని తేజోంశమున హైహయుఁడు భస్మమయ్యెను. నయనుఁడై వారి యాశీర్వచనము లంది యేకాకియై మహోగ్ర తప మొనరింపఁ జొచ్చెను. ఆతని బ్రహ్మచర్య దీక్షకును దపోనిరతికిని ముల్లోకము లచ్చెరువందెను. ఏ తత్పలితముగా నాతఁ డేలోకమునఁ గావలసిన నాలోకమునఁ దలఁచిన మాత్రముననే తిరుగఁ గల సామర్ధ్యము సంపాదించెను. అతని దివ్యతేజముఁ గాంచి సురయక్షకిన్న రాదులు జోహారు లొనర్చుచుండిరి. ఈరీతి ననంతశక్తి సంపన్నుఁడై దుర్వాసుఁడు నిజతపోగరిమఁ ద్రిలోకములఁ జరించుచుండెను. పిదప, నీతఁడు తలిదండ్రులను సర్వసంగములను విడిచి, “ఉన్మత్తము" అను. మత్తమవ్రత మవలంబించి తిరుగుచుండెను.

దుర్వాసుఁ డింద్రుని శపించుట

ఒకనాఁడు దుర్వాసుఁడు విష్ణుమూర్తిని దర్శించి యాతని యాశీస్సుల నంది యాతఁ డాదరపూర్వకముగా నిచ్చిన పారిజాత ప్రసూనమును, మార్గమధ్యమున వింజ్యాధర కాంతలు సభక్తికముగా నిచ్చినపుష్పమాలికలును నిజహస్తమున సుంచుకొని తిరిగి వచ్చు చుండెను. దేవేంద్రుఁడై రావతము నెక్కి నందనోద్యానవిహారా నంతరము తిరిగి వచ్చుచు నాతని కెదురయ్యెను. దుర్వాసో మహర్షిని గన్నంతనే యింద్రుఁడు పలుకరించి నమస్కార మొనరించెను. దుర్వాసుఁడు తనచేత నున్న పుష్పమాలికల నాతనికి బహుకరించెను. ఇంద్రుఁడు వానిని గైకొనియుఁ గొంతనిర్లక్ష్యముగా నై రావతము శిరముపై నా దండల నుంచెను. ఐరావతము - తన తొండముతో నా మాలికలు లాగి చించి పాఱవైచను. దుర్వాసుఁడది చూచి యింద్రు నుద్దేశించి "ఓరీ ! దుర్మదాంధా ! పరమపవిత్రమును విష్ణు ప్రసాదము నగు మాలికను నీకు బహూకరింప నింతనిర్లక్ష్యముతోఁ గైకొందువా? మదోన్మత్తుఁడవై యొడ లెఱుంగని నిన్నూరక పోనిత్తునా ! నీ యైశ్వర్య మంతయు గంగపా లగుఁ గాక ! నీ యైరావతము శిరము ఖండింపఁబడుఁ గాక !" యని శపించెను. దేవేంద్రుఁడు వెంటనే దుర్వాసుని పాదములఁ బడి కరుణింప వేఁడుకొనెను. దుర్వాసుఁడు కరుణించి శ్రీహరిని బూజించినచోఁ దిరిగి స్వసంపద నందఁగలవని పలికి వెడలిపోయెను. ఈ శాపమూలముననే యమృతాదు లెల్ల సముద్రము పాలాయెను; ఐరావతము శిరము నఱుకఁబడి వినాయకుని కదుకఁబడెను.[2]

దుర్వాసుఁడు ధర్ముని శపించుట

తొల్లి దుర్వాసుఁడు సోదరుఁ డగు దత్తాత్రేయునితోఁ గలిసి ధర్మదేవతయొక్క నిజరూపమును జూడఁ దలఁపు కలిగి పెక్కు సంవత్సరములు మహాతపము చేసెను. నిరాహారులై పంచాగ్ని మధ్యమునను, జలమధ్యమునను నిలిచి వారు ఘోరతపము చేసినను, ధర్మ దేవత ప్రత్యక్షము కాఁదయ్యెను. తుదకు విసిగి వేసారి దుర్వాసుఁడు తనకుఁ బ్రత్యక్షముకాని ధర్మునిపై మిగులఁ గోపిఁచి శపింప నుద్యుక్తుఁ డయ్యెను. అంత ధర్మ దేవత బ్రాహ్మణరూపమును ధరించి సపరివారముగా విచ్చేసి యా మహర్షి సత్తముల యెదుట నిలఁబడెను. దుర్వాసుఁ డాతనివంకే చూడక శాపాక్షరములు విడువఁ దలఁచుచుండెను. "ఓయీ! తపస్వులకుఁ గోపము పనికి వచ్చునా? క్రోధాధులకుఁ దపఃఫలము దవ్వగును గదా!" అని ధర్మువు దుర్వాసునితో ననెను. దుర్వాసుఁడు కోపముతో "ఓరీ! ముందు నీ వెవఁడవో చెప్పుము. నీతో వచ్చిన యీ పరివార మెవరో తెల్పుము. పిదప, నాకుఁ గ్రోధము తగునో తగదో నేనే చెప్పెదను" అని పల్కెను. అంత నావిప్రుఁడు "మునీంద్రా ! బ్రహ్మచర్యము, సత్యము, తపము, దానము, దమము, నియతి, శౌచమ, క్షమ, . శాంతి. ప్రజ్ఞ, అహింస, శ్రద్ధ, మేధ ,దయ అను గుణముల పుంస్త్రీరూపములు వీరు. వీరు నా పరివారము నేను ధర్మదేవుఁడను. నీ కోపముఁ బాప వచ్చితి" మని చెప్పెను. దుర్వాసుఁడు శాంతింపక "ఓయీ! పదివేలేండ్లు కడచిన పిదప నిప్పుడు నీ కంటికి మేము కనఁబడితిమా ! ఇప్పుడై నను, నా శాపమునకు నీవు భయపడి వచ్చితివి కాని, నీ యోగ్యతచేఁ గాదు. బ్రాహ్మణక్రోధ మమోఘము. నిన్ను శపింపక మానను. నీవు సుఖ మెఱుఁగని రాజువుగను, దాసీపుత్త్రుఁడవు గను, చండాలుఁడవుగను జన్మింపు" మని మూఁడు శాపము లిచ్చెను.

ధర్మువు చేయునది లేక ఋషిశాప మంది పిదఁ దనయొక యంశమున యుధిష్ఠిరుఁడుగను మఱియొక యంశమున విదురుఁడుగను, వేఱంశమున హరిశ్చంద్రమహారాజు నేడ్పించిన వీర బాహుఁడను చండాలుఁడుగను జన్మించెను. ఆహా! ఎంతటివారికిని గర్మఫల మనుభవింపక తప్పడు గదా![3]

దుర్వాసుఁడు సుప్రతీకు ననుగ్రహించుట

కృతయుగమున సుత్రతీకుఁ డను మహారాజు శుభలక్షణ వతులగు సతు లెందఱనో చెట్టపట్టియు నొక్కపట్టిఁ బడయఁ జాలఁ డయ్యెను. తుద కాతఁడు కుమారు నపేక్షించి దుర్వాసో మహర్షిఁ గూర్చి తపము చేయఁగా నాతఁడు విచ్చేసి “నీకు విద్యుత్ప్రభ యను భార్యయందు సుతుఁ డుదయించు" నని వరమిచ్చి వెడలిపోయెను.

పిదప దుర్వాసుని వరము కతమున సుప్రతీకునకు విద్యుత్ప్రభ యందు దుర్జయుఁడను కుమారుఁడు జన్మించెను. ఆతనికి జాతకర్మాదులు దుర్వాసుఁడే యొనరించెను. పిదప, నాతనికి సర్వశాస్త్రములు నాతఁడే నేర్పెను. దుర్వాసుఁడు పనిబూని యొక యిష్టి వేల్చి యా బాలుని వెంటనే పదునాఱువత్సరముల వానిఁజేసెను. సుప్రతీకుఁడు దుర్వాసుని కెంతయో భక్తిచూప నాతఁడు మెచ్చి సుప్రతీకునికిఁ గాంతిమతి యను నిల్లాలియందింకొక పుత్త్రుఁడు కలుగ వరమిచ్చెను. సుద్యుమ్నుఁ డను కుమారుఁడా మెకుఁ గలిగెను. ఇట్లు దుర్వాసుఁడు సుప్రతీకు ననుగ్రహించెను.[4]

దుర్వాసుఁడు తిలోత్తమాసాహసికుల శపించట

దుర్వాసో మహర్షి గంధమాదనపర్వతముపైఁ దపస్సు చేసుకొనుచు నుండెను, ఆ సమయమున బలిచక్రవర్తి కుమారుఁడైన సాహసికుఁడు నప్పరోంగన యగు తిలోత్తమయుఁ బరస్పర వివశులై కాఁజొచ్చెను. వీనివలనఁ దనకు ప్రతభంగము గలుగ దుర్వాసుఁడు మితిమేరలు సమయాసమయములు నెఱుఁగ వలదా యని వారిని మందలించి రాక్షసులై భువి జన్మింపుఁ డని శపించెను. వారు నంత నొడ లెఱిఁగి యాసంయమికి నమస్కరించి ప్రార్థింపఁగా శ్రీకృష్ణునిచేఁ జచ్చినపిదప నాతనికిని, కృష్ణుని కుమారుని తోడిజీవనమున నా మెకును శాపవిమోచన మగు నని పల్కెను. సాహసికుఁ డందులకే గార్ద భాసురుఁ డయ్యెను. తిలోత్తమ బాణుని గృహమున నుషయై జన్మించెను.[5]

దుర్వాసుఁడు వపువను వచ్చరను శపించుట

తొల్లి యింద్రుఁడు నందనోద్యానమున నప్సరసల గానము లాలించువేళ నచటికి నారదుఁడు విచ్చేసెను. అతని సనేకవిధములఁ బూజించి యింద్రుఁడు "మునీంద్రా! ఈ యచ్చరలలో నెవతె యెక్కువయో సెలవిం" డని కోరెను. నారదుఁడు "మంచుకొండ మీదఁ దపముచేయు దుర్వాసు వెవతె చలింపఁ జేయునో యామె యెక్కువ " దని పలికెను. తా మందులకుఁ జాల మని యప్సరస లెల్లరు తలలు వాలించిరి. కాని వపు వను నచ్చర గర్వముతో "మునిరాజా ! నేను దుర్వాసుని వెంటఁ గొనివచ్చెద. అతఁడే యేల? నేను దలఁచు కొన్నచో రుద్రునైనను గామునింటికి ఘట దాసుని జేయుదు" నని చెప్పి దుర్వాసునికడ కరిగెను.

తపస్సున నున్న దుర్వాసుఁ డామె యటఁ బ్రదర్శించిన హావభావవిలాసములకుఁ గనలి పక్షివై పుట్టు మని శపించెను. కడ కాతఁడు కరుణాళువై యామెకు శాపమోక్షము ననుగ్రహించెను. [6]


-

  1. దూర్వాసమహర్షి, దుర్వాసమహర్షి అను రూపములు వాడుకలోఁగలవు. కాని, అవి వ్యాకరణదుష్టములు, దుర్వాసో మహర్షి యన్నదే వ్యాకరణయుక్తము. శ్రీ మార్కండేయపురాణము. కాని

    సీ|| ప్రజలదైత్యులు పురత్రయనాయుకులు జగత్త్రయము నప్రతిమప్రతాపలీల

    బాధింప దివిజాలు ఫాలలోచనుఁగాంచి కావుము కృప దేవ దేవ మమ్ముఁ బశువుల మగువారిఁ బశుపతివైన వీ వనుచు మహాక్రోశమాచరింప నప్పురంబులు మూటినస్త్ర మొక్కట భస్మముగాఁగఁజేసి యమ్మార్గణంబు

    గీ|| నంతమున నిడ పది బాలుఁడైన నీతఁ
         డెవ్వఁ డని చూచి వెఱఁ గంది యెల్ల సురలు
         వినతి సేయ బ్రాహ్మణమూర్తి వెలుగు వవని

  2. "అని విష్ణుపురాణము. తన్నుఁ గుఱించి ఘోరతపము చేయు సుప్రతీకుఁ డను రాజు ననుగ్రహింపఁ దలఁచి దుర్వాసుఁడు విచ్చేయుచుఁడఁగా దారిలో నాధిని వనవిహారము చేయుచు నైరావతము నెక్కితిరుగు నింద్రుఁడు కానవచ్చెను. తన్నుఁ జూచి గౌరవింపక, వాహనమైన దిగక గర్వియై యున్న యింద్రుని జూచి మండిపడి దుర్వాసుఁడు:

    "అనుకంప లేక బ్రాహ్మణుని నమ్మించి గొం
            తుక గోసిపోయిన దోసకారి
     గౌతమఋషి కులాంగన నహల్యా దేవిఁ
            జీకటితప్పు చేసిన దురాత్మ
     పరసతి బిడ్డవి హరికోప హుతవహా
            ర్చులలోనఁ ద్రోచిన క్రూరకర్మ
     సగర క్షమాపాల సస్తతంతు విముక్త
            హరి మ్రుచ్చిలించిన పరమ ధూర్త

      .... దేవరాజ్యాధి పత్య
     మునకుఁ బెడడానే భువిఁగూలు మని శపించె. "

    అని వరాహపురాణమునఁ గలదు,

  3. పద్మపురాణము
  4. భూమిఖండము.
  5. బ్రహ్మపురాణము.
  6. మార్కండేయ పురాణము.