మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/దధీచి మహర్షి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మహర్షుల చరిత్రలు

దధీచి మహర్షి

దధీచి జనవము

చ్యవనమహర్షి యాశ్వినుల నెపమున సుకన్యా పాతివ్రత్య ప్రభావముచే నవయౌవనుఁడు త్రిలోక సుందరుఁడునై సుకన్యను బిలిచి “సాధ్వీ ! నీవు చేసిన త్యాగ మనంతము. ఏలన, సుకుమార గాత్రివై హంసతూలికాతల్పమునఁ బరుఁడు రాజపుత్రి వగు నీవు తుచ్ఛ కామమున నీసడించి యంధుడను వృద్దునునై ననన్ను వివాహ మాడితివి మహాపతివ్రతవై నాకు యౌవనము సుందరాకారము గడించితివి. కావున, నీకు మహాత్యాగి పరమతపోధనుఁడు నగు కుమారుఁ డుదయించు" నని చెప్పి యామెతో రమించెను. అంత, సుకన్య గర్భముఁ దాల్చి యుక్తకాలమున నొక శుభ ముహూర్తమున సుపుత్త్రుని గనెను. ఆతఁడే దధీచిమహర్షి .

దధీచికి సారస్వతుఁడు జనించినవిషయము.

దధీచి బాల్యమునుండియు మహాతపస్సు చేయుచుండెను, ఆతఁడు చిరకాలము, సరస్వతీ నదీతీరమున నాశ్రమము నిర్మించుకొని యందుండెను. దధీచి తపశ్శక్తిచే నాతని దేహమెల్ల దివ్యతేజో గోశముగాఁ బ్రకాశించుచుండెను. సరస్వతీ నది యాతనిఁ జూచి సమ్మోహిత యగుచుండెడిది. ఇట్లుండఁగా దధీచిమహర్షి తపోగ్ని చే నెల్లలోకములు తల్లడిల్లుచుండెను. అందుచే నింద్రుఁ డాలోచించి యలంబుస యను నొక యప్సరసను దపోవిఘ్నమునకై యాతని కడకుఁ బంపెను. దధీచి మహర్షి సరస్వతీనదిలో స్నానముచేసి నీటిలో నిలిచి జపము చేసికొనుచుండఁగా నలంబుస యట కేఁగి తన నృత్యగీతాలాపములచే దధీచిదృష్టిఁ జూఱకొనెను. దధీచి కామమోహితుఁడు కాఁగానే యాతనివీర్యము స్ఖలితమై నదిలోఁబడెను. సరస్వతీనది సంతసముతో స్త్రీరూపధారిణియై యా వీర్యమును దనగర్భమున ధరించి గర్భవతి యయ్యెను. దధీచి యంత నిశ్చలుఁడై తనయాశ్రమమునకుఁ బోయెను. కాలక్రమమున సరస్వతి పుత్త్రునిఁగని యాతని దధీచికడకుఁ గొనిపోయి జరిగిన యుదంతమును జెప్పెను. దధీచి దివ్యదృష్టినిజూచి యది సత్య మగుట యెఱిఁగి కుమారుని ముద్దాడి యాతనికి 'సారస్వతుఁ" డను పేరిడెను. సరస్వతి పుత్త్రునిఁ గైకొమ్మని యాతని బ్రార్థించెను. దధీచి "సరస్వతీ! నేను తపోవ్రతుఁడను. కావున, వీనిని నీవే పెంచుచుండుము. ఈతఁడు మహాశక్తిసంపన్నుఁడై ముందు రాఁబోవు మహాక్షామములలో నిజశక్తిచే మహర్షుల రక్షింపఁగలఁ" డని యామెకే యప్పగించెను. ఆమె తన పవిత్రజలములచే నాతనిఁ బెంచి విడిచెను. ఆతఁడు తపోధనుఁడై తండ్రి చెప్పినట్లు మహాక్షామ కాలమున మహర్షుల నాహ్వనించి. వారందఱకు షడ్రసోపేతముగా భోజనము పెట్టుచు క్షామ నివారణము గావించెను.

దధీచి కింద్రుఁడు నేర్పిన శాస్త్రముల వృత్తాంతము

ఒకప్పు డింద్రుఁడు దధీచికడకు వచ్చి “ఋషిసత్తమా! నీవు మహాత్ముఁడవు. కావున, నీకు మహోత్తమశాస్త్రముల నుప దేశింతు" నని చెప్పి యాతనికి కొన్ని శాస్త్రము లుపదేశించెను. ఇంద్రుఁ డంతర్హితుఁ డగుచు "నీవు వీని నెవ్వరికైన నుపదేశించినచో నానాఁడే నీశిరము ఖండింతు" నని చెప్పెను. దధీచి యా శాస్త్రములను గ్రహించియుండెను. అశ్వినీ దేవత లీవిషయము విని యొకనాఁడు దధీచికడకు వచ్చి “మునికులతిలకా.! తొల్లి మీ తండ్రియగు చ్యవన మహర్షికి నవయౌవన మొసంగిన యాశ్వినేయులము మేము. నీ వింద్రునివలన నెఱిఁగిన శాస్త్రములను మాకిచ్చుచో మేము నీ కుపకృతి చేయఁగలము. కావున, నా శాస్త్రములను మాకు బోధింపు" మని వేఁడుకొనిరి. దధీచి తనకుఁ గల శాపవృత్తాంత మెఱిఁగించి తాను బోధింపఁజాల ననెను. అశ్వినులు “నీకెట్టి యుపద్రవము వచ్చినను నిన్నుఁ గాపాడు బాధ్యత మాది. మేము దేవహితార్థ మయియే ని న్నర్ధించుచున్నా" మని బతిమాలిరి. దధీచి యంగీకరింపఁగా వారొక యశ్వశిరమును గొనివచ్చి దధీచి తలఁదీసి యా యశ్వశిరము నదికి దానివలన శాస్త్రములు గ్రహించి యాతని పూర్వశిరమును భద్రపఱచి యుండిరి. ఇంద్రుఁడు దధీచి చేసిన పనికి వగచి వెంటనే సాయుధుఁడై వచ్చి దధీచి శిరస్సు నఱికి వెడలిపోయెను. వెనువెంటనే యాశ్వినీ దేవతలును వచ్చి దధీచి పూర్వశిరమును దధీచి కదికి యాతనిఁ బునరుజ్జీవితుఁ జేసి వెడలిపోయిరి.

దధీచి క్షుపుల పరస్పరవైరము

ఈప్రకారము పునర్జన్ముఁడైన దధీచిమహర్షి యొకనాఁడాతని బాల్యహితుఁ డైన క్షువుఁ డను రాజుచే నాహూతుఁడై యాతనియింటి కేఁగెను. క్షువుఁ డాతని నుచితరీతిని గౌరవించి మన్నించెను. కాని, కొంతసేపటికి వారొక వివాదమునకు దిగిరి. బ్రాహ్మణాధిక్యమును దధీచి నిరూపింపఁ దొడఁగెను. క్షత్త్రియాధిక్యము క్షుపుఁడు నిరూపింప మొదలిడెను. తుదకు వారివాదము తేలక శ్రుతిమించి రాగమునఁబడి యొకరి నొకరు నిందించుకొనఁ జొచ్చిరి. దధీచి కోపియై క్షుపునిఁ బొడిచెను క్షుపుఁ డొక మహాయుగమును బ్రయోగించి దధీచి శరీరమును ముక్కముక్కలుగాఁ జేసెను. అంత దధీచి మరణించెను. దధీచి భార్గవవంశజుఁ డగుటచే శుక్రాచార్యుఁడు జాలిగొని యచటికి వచ్చి దధీచి దేహశకలము లన్నిటిఁ జేర్చి తన సంజీవనీ మంత్రప్రభావమున నాతనిని క్షణములో బ్రతికించెను. దధీచి నిద్రనుండి లేచినట్లు లేచి భార్గవునకు వందన సహస్రము లాచరించెను. శుక్రుఁడు దధీచి, గౌఁగిలించుకొని"వత్సా! నీవు సర్వశక్తి సంపన్నుఁడ వగుదువు సదాశివునిఁగూర్చి తపము చేయు" మని దీవించి యంతర్హితుఁడయ్యెను.

దధీచి క్షుపుని విష్ణుని నిందించి గెల్చుట

దధీచి యటనుండి లేచిపోయి యాశ్రమమున కేఁగి పరమశివుని గుఱించి తపముచేయ మొదలిడెను. నిరాహారుఁడై నిర్జితేంద్రియుఁడై దధీచి మహర్షి తపస్సు చేయుచుండఁగా ముల్లోకములు గగ్గోలు పడుచుండెను. ఈశ్వరుఁడు నతనితపోన వధ్యతకు మెచ్చి ప్రత్యక్ష మై దధీచికి స్వచ్ఛంద మరణము. వజ్రమయశరీరము లోకత్రయ విజయశక్తి నిచ్చి యదృశ్యమయ్యెను. దధీచి మహావరసంపన్నుఁడై యుండియు క్షుపుఁడు తనకుఁ జేసియున్న యవమానము బ్రాహ్మణ నింద మఱవఁజాలక యాతని గృహమున కేఁగి క్షుపు నొక తన్నుఁ దన్నెను. క్షుపుఁడు మహాకోపముతో దధీచి నెన్ని యో విధముల హింసింపఁ జూచి బహుశస్త్రాస్త్రములఁ బ్రయోగించిన నవి విఫలమయ్యెను. అంత దధీచి " ఓరీ! క్షత్త్రియాధముఁడ వగు నీ వెక్కడ? బ్రాహ్మణశ్రేష్ఠుఁడ నగు నే నెక్కడ ? బ్రాహ్మణుఁడధికుఁ డగునో కాదో తెలిసినదా? నీవు కాదు. నీ దేవుఁడగు విష్ణువుకూడ నా కాలి గోటికి సరికాఁడు గ్రహింపు" మని గర్వించి పల్కెను. క్షుపుఁడు చేయునదిలేక , విష్ణుమూర్తిని గుఱించి తపస్సు చేయఁగా నాతఁడు ప్రత్యక్షమయ్యెను. క్షుపుఁడు తనకు దధీచివలనఁ గల్గిన యవమానమును దధీచి విష్ణుని లెక్క సేయక పోవుటయుఁ దెల్పి రక్షింపుమని కోరెను. అంత విష్ణుమూర్తి క్షుపుని వెంటఁగొని దధీచికడ కేఁగి 'ఓరీ ! శివ గర్వితుఁడవైతివా? నేనును శివుఁడును నొక్కటిగాదా!' యని యడిగెను. దధీచి "నీ వేడ? శివుఁ డేడ? శివభక్తుఁడనగు నా గోటికైనను నీవు చాలవు. ఇఁక శివునితోడి సామ్యమెందుల" కని పరిహాసము చేసెను. విష్ణుమూర్తి దధీచి శిరముఁ దుంపఁ జక్రమును బంపెను. దధీచి తన తపశ్శక్తిచేఁ జక్రమును నివారించుకొనెను. విష్ణుమూర్తి మాయ వన్నెను. దధీచి మాయను ఛేదించెను. అంత విష్ణుమూర్తి "వత్సా! దధీచీ! నీభక్తి తాత్పర్యము బరీక్షింప నిటు వచ్చితిని. నిజముగా మా భక్తశ్రేష్ఠుఁడ వగు నీవంటివాని కాలి గోరితో నైనఁ బోలఁగలవాఁ డెవఁడు? నీవు దేవహితార్థివై జీవింపు" మని పలికి క్షుపునితో నాతని శరణు చొచ్చుటకంటె నుపాయాంతరము లేదని యంతర్హతుఁ డయ్యెను క్షుపుఁడు ధధీచి పాదములపైఁ బడి "మహాత్మా! నీశక్తి యెఱుఁగక నీ కెగ్గు చేసితివి. నా తప్పు సైరింపు" మని పరిపరివిధములఁ బ్రార్ధించెను. దధీచి శాంతుఁడై "మిత్రమా! నీ మీఁద నా కావంతయుఁ గోపములేదు. బాహ్మణక్రోధము నీటిపై గీఁత క్షణికములు కదా! నీవు యథాపూర్వము నా ప్రియమిత్రుఁడవై యుండు" మని యనుగ్రహించి యాతనిఁ బంపివేసెను.

ఈ రీతిగాఁ దపోనవద్యుఁడై వరశక్తిసంపన్నుఁ డయ్యు దధీచి మహర్షి శిష్యప్రశిష్యులఁ జేర్చికొని ధర్మసంరక్షనార్థము 'గభస్తిని ' యను నామాంతరము గల 'సువర్చ' యను కన్యను బరిగ్రహించి గృహస్థజీవనమును మహాదర్శముగాఁ గడపుచుండెను. సువర్చ మహాసాధ్వియై పతిపదపద్మ సేవ తక్క నన్య మెఱుఁగకుండెను. దధీచి కనతికాలముననే కోటానఁగోట్లు ఋషులు శిష్యప్రశిష్యులై రి.

ఇట్లుండ నొకనాఁడు దక్షప్రజాపతి యజ్ఞము చేయఁదలఁచి దధీచి మహర్షిని ......................................... ....................................................................... మంపెను. దధీచి యానందించి శిష్యప్రశిష్యుఁడై దక్షాధ్వరమునకు బయలుదేఱి వెళ్ళెను. దక్షుఁడు శివభక్తాగ్ర గణ్యుఁడగు దధీచియుఁ దన యజ్ఞమునకు వచ్చుట తనకు వెఱచియే యని యానందించి యాతని కుపచారములు సల్పి "మిత్రమా! శివుఁడును శివానుచరులును రాకుండఁజేసి నేను యజ్ఞము చేయ నిశ్చయించితిని. జగద్రోహి యగు శివుని బిలువకుండుట నీకును సంతోష మైనచో నిటనుండి యజ్ఞము నిర్వర్తింపు” మని పల్కెను. దధీచి తోకద్రొక్కిన త్రాఁచువలె లేచి వసిష్ఠవామదేవవ్యాసనారదాదిమహర్షు లెల్లరు రాకుండుట కదియే కారణ మని యెఱిఁగి "ఓ దక్షప్రజాపతీ! నీకీ దుర్బుద్దీ యేల పుట్టినది? విశ్వేశ్వరుఁడు, దేవాదిదేవుఁడునగు శివుఁడు లేనిదే యజ్ఞ మెట్లు జరుగును? జరిగినను నీకు ఆభించు ఫలిత మేముండు?" నని శివు ననేకవిధములఁ బ్రస్తుతింప మొదలిడెను. దక్షుఁడు శివుఁడు శ్మశానవాసి, దిగంబరుఁడు, గజచర్మధరుఁడు, బిచ్చగాఁడు, శశశృంగుఁడు నని యనేకవిధముల దూషించెను. దధీచి సభాసదు లెల్లరు వినుచుండఁగా మహాప్రశాంతుఁడై వానికన్నిటికిని సముచితముగా బదులుచెప్పి పరమశివుని ప్రఖ్యాతిని బలువిధముల విస్తరించి చెప్పెను. ఎన్ని చెప్పినను దక్షుఁడు లెక్కచేయక "ఆ నిర్బాగ్యుని నుతించువార లొక్క నిమేష మైన నిటనిల్వ రా"దని యాజ్ఞాపించి దధీచి నవమానించెను. దధీచి శిష్యసహితుఁడై లేచి "ఓ దక్షనామక మూర్ఖాగ్రేసరా ! నే నెన్ని చెప్పినను వినక సదాశివుని దూషించితివి. కావున, నీ యజ్ఞ మశుభప్రతిపాదక మగుఁగాక ! నీవును దగిన ప్రాయశ్చిత్తము నందుదువు గాక ! వివేకవిహీనుఁడవై నీవు చేయ జన్నమునకు వచ్చిన యీ దేవఋషిగణ మెల్ల వినాశము నందుఁ గాక ! యని శపించి యజ్ఞ వాటమునుండి వెడలిపోయెను. ఈతని శాపప్రకార మచిరకాలముననే వీరభద్రునిచే దక్షాధ్వర ధ్వంసము సదస్యవినాశనము కలిగెను.

దధీచి దేవతల యస్త్రశస్త్రములఁ మ్రింగుట

ఒకప్పుడు రాక్షసులు విజృంభించి దేవతలపై దండెత్తి వారి నోడించి యిఁక నెన్నఁడు వారు తిరిగి తమ కపకృతి యొనరింపఁ జాలకుండుటకు వారివారి యస్త్రశస్త్రములను లాగివైచు కొనుచుండిరి. దేవతలు నుపాయాంతర మాలోచించి దధీచి మహర్షి కడఁ దమ యస్త్రములు దాఁచి యుంచినచోఁ బ్రమాదము తప్పునని యెంచిరి. అంత నింద్రాది దేవతలెల్లరును సస్త్రశస్త్రసమేతులై దధీచి మహర్షి కడ కేఁగి యాతని పాదముల పైఁ బడి తమ దురవస్థఁ దెలిపికొని తమ యస్త్రములను దాఁచి పెట్టుమని యర్ణించిరి. దధీచి జాలిగొని యట్లంగీకరించి వారి యస్త్రముల నెల్ల గ్రహించెను! దేవతలును దమ యస్త్రభద్రత కానందించి వెడలిపోయిరి త్వరలో వారికిని రాక్షసుల యుపద్రవము తొలఁగిపోయెను. కాని, వారు భోగలాలసులై దధీచికడకు వచ్చి యస్త్రములను గ్రహింప వాలస్యము చేయుచుండిరి. దధీచి వాని నన్నిటినిఁ జిరకాలము దాఁచియుంచఁ జాలక వానిపై జల మభిమంత్రించి వానినెల్ల నొక్కపరి మ్రింగివేసెను. అతని తపఃప్రభావమున నవియెల్ల జీర్ణమై యాతని రక్తనాళములలో నెముకలలోఁ జేరిపోయెను.

అంతఁ గొంతకాలమునకు దేవతలు వచ్చి దధీచి నస్త్రము లిమ్మని కోరిరి. దధీచి తాను చేసినవని చెప్పి వారి యాలస్యమే దాని కారణ మని పలికెను. దేవతలు భయగ్రస్తులై యెట్లో తమ యాయుధము లిమ్మని కోరిరి. దధీచి యవి జీర్ణములై యెముకలకు వ్యాపించిన వనియు నవసరమైనచోఁ దన్నుఁ జంపి తీసికొండనియు ననెను. దేవతలు నాతనిఁ జంపు శక్తిలేక చంప భయభ్రాంతులై దీనవదనులై యేడ్వఁ జొచ్చిరి. దధీచి వారి నూఱడించి " నేను మీకొఱకే జీవించుచున్నాను. ప్రస్తుతము మీ కాయుధము లవసరము లేదుకదా! మీ కత్యావశ్యక మైననాఁడు రండు. నా దేహము నేనే విడిచివేయుదును. నా యస్థులే శతాధిక బలసంపన్నములగు మీ యాయుధము లగును. విచారము దక్కిపొం" డని పల్కెను. దేవత లాతని జగద్దితమతికి మెచ్చి నమస్కరించి యానందములో వెడలిపోయిరి.

దధీచి దేవకార్యమునకై దేహము త్యజించుట

మఱి యొకప్పుడు వృత్రాసురుఁడు సహచరాసురులతో విజృంభించి దేవతలకు మహాపద సంభవింపఁ జేసెను. ఆతని నెట్లును జయింపశక్తి లేక దేవత లందఱు బ్రహ్మకడ కేఁగి ప్రార్థించిరి. ఆతఁడును దనశక్తిహీనతఁ దెల్సి “ఇఁక మీరు దధీచిని బ్రార్ధించి యాతనియస్థులు గైకొని వాని నాయుధములుగా నుపయోగించినచో మీ రీయసురులఁ జంపఁ గల్గుదురు. అంతకు మించి మార్గాంతరము లేదు. కనుక , పోయి యాతనిఁ బార్డింపుఁ"డని వారిని బంపివేసెను. దేవతలు దధీచి వాగ్దానము జ్ఞప్తికిఁ దెచ్చుకొని యాతనికడ కేఁగి యాతనితోఁ దమ దుస్థ్సితిని దెల్పుకొని సంరక్షింప వేఁడుకొనిరి.

దధీచి తన భౌతిక దేహమును విసర్జించి దేవహితము చేయుటకంటె వలసినది లే దని నిశ్చయించుకొని " దేవతలారా ! మీరు నన్ను వెంటనే చంపి నా యస్థులు కొనిపోవచ్చు" నని యాహ్వానించెను ఇంద్రాదులు భయకంపితులై "మహాత్మా! నిన్నుఁ జంపుశక్తి మాకడ లేదు. బ్రహ్మ హత్యాదోషముమాట యటుండ నిమ్ము. నీకు స్వచ్ఛందమరణ మీశ్వరుఁ డనుగ్రహించియుండుట నొరు లెవ్వరు నిన్ను జంపఁ జాల" రని పల్కిరి దధీచి “ఐనచో యోగాన్నిఁ గల్పించుకొని నేను మరణింతును. మీ కర్తవ్యమును మీరు నిర్వర్తించుకొనుఁ" డని యోగాగ్నిఁ గల్పించుకొని పరబ్రహ్నాను సంధానమున దేహముఁ ద్యజించి పరమశివునిలో నైక్యమయ్యెను. దేవతలు గోగణమును బ్రార్థించి వానిచేఁ బరిశుద్ధము చేయఁబడిన దధీచి యస్థులనే బ్రహ్మ చక్రము, వజ్రాయుధము మున్నగు నాయుధములు చేసికొని యసురులను నిర్జించిరి.[1]

దధీచికిఁ బిప్పలాదుఁ డుద్భవించిన విధము

దధీచి మహర్షి చనిపోవుసరి కాతనిభార్య సువర్చ గర్భవతి యై' యుండెను. భర్తమరణము వినఁగానే యా మహాసాధ్వి సహగమనమునకై చితి నెక్కెను. అంతలో బ్రహ్మాదులు ప్రత్యక్షమై “సాధ్వీ నీ గర్భమున మహాత్ముఁ డగు బాలుఁడున్నాడు కావునఁ బ్రాణత్యాగము చేయకు" మని పల్కిరి సువర్చ "దేవతలారా ! మీ వర్తనము చూడఁ జిత్రముగ నున్నది. నా భర్తను జంపితిరి. సాధ్వినగు నాకు వైధవ్యదుఃఖము నిచ్చుట కిట్లు పన్ను చుంటిరా ? నా భర్తను జంపిన దేవతలు పశువులై ప్రవర్తింతురు గాక " యని శపించి భర్త చితి నెక్కెను. అంతలో నామె గర్భమునుండి యొక బాలుఁడు జాఱి సమీపముననున్న పిప్పలవృక్షము కడఁ బడెను. ఆమే చితిలో భస్మమైపోయెను

అట్లు జనించి పిప్పలవృక్షముక్రిందఁ బెరిఁగిన బాలుఁడే పిప్పలాద మహర్షి , పిప్పలవృక్ష మాతనిపై జాలిగొని చంద్రునర్థించి యమృతముఁ గొనివచ్చి యా బాలునికిఁ బోయఁగా నాతఁ డాఁకలి దప్పు లెఱుఁగక చక్కఁగాఁ బెరిఁ గెను. ఆ కారణముననే యాతనికిఁ బిప్పలుఁ డను పేరు కలిగెను. ఈతఁడు పెరిగి పెద్దవాఁడై తన తండ్రి మరణమునకుఁ గారకులైన దేవతలఁ జంప నెంచి యీశ్వరుని గుఱించి తపస్సు చేసెను. ఆతఁడు ప్రత్యక్షమై దేవతలను జంప సమర్థమగు కృత్యమ బంపెను. దేవతలు శివుని శరణు వేఁడఁగా శివుఁడును బిప్పలాదునిఁ బ్రార్థించి దేవతావధోద్యోగమును విరమింపఁ జేసి యా పిప్పలాదునికిఁ బితృలోకమునఁ దలిదండ్రులను జూడఁ గలుగు వరమిచ్చి యదృశ్యుఁ డయ్యెను. పిప్పలాదుఁ డిట్లు దధీచి మహర్షికిఁ బుట్టి యారీతి మహర్షియై వెలుగొందెను.[2]  1. స్కాందపురాణము, బ్రహ్మపురాణము, శివపురాణము.
  2. స్కాందపురాణము. మాహేశ్వరఖండము, కేదారము.