మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/జమదగ్ని మహర్షి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to searchమహర్షుల చరిత్రలు

జమదగ్ని మహర్షి

జమదగ్ని జవనవృత్తాంతము

తొల్లి భృగువంశసంజాతుఁడగు ఋచీకమహర్షి కుశిక వంశోద్భవుఁడగు గాధిరాజుకూఁతురు సత్యవతి యనునామెను వివాహమాడఁ గోరి తనకోరికను గాధికిఁ దెలిపెను. గాధి యాతఁడు తన కూఁతునకు దగినవరుఁ డగునో కాదో యని సంశయించి తెల్లని దేహము నల్లనిచెవులు గల వేయిగుఱ్ఱములను దనకూఁతున కుంకువగా నొసఁగినచో సత్యవతినిచ్చి పెండ్లి చేయుదు నని సమాధానము చెప్పెను. ఋచీకమహర్షి యిది యెంతపని యని బయలుదేఱి వెడలి వరుణదేవుని బ్రార్థించి యాతనిచే నట్టి యశ్వములను బడసి తీసికొనిపచ్చి గాధి కిచ్చెను. గాధిరాజు ఋచీకుని శక్తి సామర్థ్యములకు మెచ్చుకొని యాతనికి దనకూఁతురగు సత్యవతినిచ్చి మహా వైభవముతో వివాహముచేసి యల్లునిఁ గూఁతును వారి యాశ్రమమునకుఁ బంపివేసెను. సత్యవతి భర్తయే దైవమనియుఁ దనయదృష్టముచే నుత్తమబ్రాహ్మణుఁడు తనకు భర్తయాయెననియు నెంచి యాతని కనేకవిధములఁ బరిచర్య చేయుచుండెను. ఒకనాఁడు ఋచీకమహర్షి యామెసేవకు సంతసించి యొక కోరిక గోరుకొనుమనెను. సత్యవతి పుత్త్రహీను లగు తనతలిదండ్రులకొక కొమరుని, దనకొక పుత్త్రుని నిమ్మని భర్తను బ్రార్థించెను. ఋచీకమహర్షి యట్లేయని రాజబ్రహ్మ మంత్రములచే రెండుచరువులను వేల్చి యారెంటిని భార్య కిచ్చి “సాధ్వీ! క్షత్త్రియాజేయుఁడు క్షత్త్రియసూదనుఁడు నగు క్షత్త్రియోత్తముఁడు మొదటిచరువు నుపయోగించినవారికిఁ గల్గును. కాన, దానిని మీయమ్మ కిమ్ము. ఈ రెండవచరువు నీ వుపయోగింపుము. దానివలననీకుఁ దపోధృతిశమములచే నుత్కృష్టుఁడగు బ్రాహ్మణుఁడు జన్మించు" నని చెప్పి నదీస్నానమునకుఁ బోయెను.

ఇంతలో సుతాజామాతలం జూడఁ దలఁపు కలిగి గాధి భార్యాసమేతుఁడై ఋచీకుని యాశ్రమమునకు వచ్చెను. సత్యవతి యానంద పరవశతఁ తల్లిదండ్రులు రాఁగానే తల్లికాచరు వృత్తాంతమును దెల్పి దైవోపహతయై తానుపయోగింప వలసినది తల్లికిచ్చి తల్లికీయ వలసినది తాను గ్రహించెను. ఇంతలో ఋచీకమహర్షి వచ్చి యత్త మామలఁ దివ్యభోదమున జూచి మాతాసుత లొనరించిపననిఁ దెలిసికొని సత్యవతిని జూచి " నీకు క్షత్త్రియాంతకుఁడు మహాక్రూరుఁడగు కొడుకు పుట్టును. మీయమ్మకు బ్రహ్మభూతుఁడు తపోధనుఁడు నగు కొడుకు పుట్టు" నని చెప్పెను. సత్యవతి భయవడి యదేమని యడగఁగా ఋచీకుఁడు " నేను నీకుత్తమ బ్రాహ్మణుఁడు పుట్టునట్లు మీతల్లికుత్తమ క్షత్త్రియుఁ డుదయించునట్లు మంత్రములఁ జదివి వేల్చి యాచరువులు జేసితిని నీవుపయోగింప వలసినది మీ జననియు నామెయుపయోగింప వలసినది. నీవు నుపయోగించితిరి. కావున నట్లు వ్యత్యాసము కలుగు" నని చెప్పెను. సత్యవతి భయపడి క్రూరుఁడగు కొడుకును గనఁజాలను రక్షింపు మని వేఁడుకొనఁగా ఋచీకుఁడామెను గరుణించి యా విశేష మామె కుదయించు పుత్త్రునకుఁ గాక పౌత్త్రునకుఁ గల్గుననియెను. అంత గాలక్రమమున సత్యవతి గర్భమున జమదగ్ని మహర్షియు నామె మాత్రుగర్భమున విశ్వామిత్రుఁడును జన్మిఁంచిరి.[1]

జమదగ్ని రేణుకను వివాహమగుట

ఇట్లు జన్మించిన జమదగ్ని యుత్తమగుణసంపన్నుఁడై రేణువు కూఁతు రగు రేణుకను వివాహమాడి - గార్హస్థ్యమును నడుపు చుండెను. ఈతఁడు తన తపోమాహాత్మ్యమున ఒక హోమధేనువును సంపాదించెను. ఆ ధేనువు వలసినపుడెల్ల నెందఱకైన నేమైన సమకూర్పఁగల సామర్థ్యము కలది. ఆ కామధేనువు కారణముగ నే కొఱంతయు లేక జమదగ్ని రేణుకాదేవితో సమస్తభోగము లనుభవించుచున్నను మహాతపస్సంపన్నుఁడై యుండెను.

జమదగ్ని సూర్యుని శపించుట

జమదగ్ని రేణుక పతిభక్తికి మెచ్చి యామెతో నర్మదాతీర మందలిది, నిర్జనము, ఫలపుష్పయుక్తము. శారికాశుకపికమయూర నినాదయుక్తము. సుగంధివాయుసురభీకృతము నగు వనమున కేఁగి యందు విహరించెను. పిదప, అపుడే వికసించిన పుష్పములఁ దల్పములుగ నేర్పఱిచికొని చందన చర్చిత గాత్రులై యా దంపతులు నఖక్షత చుంబనాదు లారంభించి క్రమక్రమముగా మన్మథక్రీడ లారంభించిరి.

ఆ సమయమున సూర్యుఁడు వారి కడకు విప్రరూపమున విచ్చేసి "ఓయీ! జమదగ్నీ ! నీవు బ్రహ్మ మనుమఁడవు, వేదకర్తవు, మహా తపశ్శాలివి. అట్టి నీ విట్లు పట్టపగలు సురత క్రీడకుం జొచ్చుట ధర్మమా?' యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః' యన్న నానుడిని బట్టి పెక్కురు నిన్ననుసరింతురు. తాపసశేఖరుఁడ వగు నీవే యిట్లు ధర్మమును నిరాకరించిన వేదధర్మములు హీనత నందవా? నేను గర్మసాక్షి నగుటచే నీ కిటు చెప్పవచ్చితి" నని పల్కెను.

అది విని జమదగ్ని సురతవిముఖుఁడై నిలువ నగ్న యగు రేణుక వెంటనే సూక్ష్మవ్యస్త్రము ధరించి సిగ్గుపడి నిలిచెను. అంత జమదగ్ని సూర్యునితో "ఓయీ! నీవు పండితాహంకారమున నాకుఁ జెప్ప వచ్చితివి. భృగుశిష్యుఁడను, చతుర్వేద ధర్మాధర్మము లెఱుంగని వాఁడనా ? అజ్ఞాని స్వకర్మచే నెల్లప్పుడు జడిభూతుఁ డగును. నిజ్జాని సర్వభక్షకుండగు నగ్నివలె మహాతేజస్వియై కర్మదోషములఁ గాంచఁడు. నీవు కర్మ సాక్షి నని ఫలప్రదాత నని శాస్తనని గర్వించి నన్నాక్షేపింప వచ్చితివి. తపోధనవిరాజితులము, జ్ఞానమూర్తులము నగు మాకు నారాయణుఁడు సంరక్షకుఁడు, మా భావము లాతఁ డెఱుఁగును. మేమాతని నెఱుఁగుదుము. మ మ్మొరులు బోధింప శిక్షింప సమర్థులు కారు. నీవే కాదు బ్రహ్మ రుద్రయమాదులైన మమ్ము శిక్షింపలేరు. అట్టి మాకు నీవు రతి భంగ మొనరించితివి కాన, నా శాపమున రాహుగ్రస్తుఁడవై పాపదృశ్యుఁడవు హతతేజుఁడవు నగుదువు" అని శపించెను.

సూర్యుఁ డది విని "అయ్యా ! మనము పరస్పరము పూజ్యులము. ఐనను. నీవు నన్ను శపించితివి నే నూరకున్నచో లోకులు నన్నశక్తుఁ డని నిస్తేజుఁ డని నిందింతురు. కావున ఒక క్షత్త్రియునిచే నీకుఁ బరాభవము, ఆతని యాయుధముచే మరణము గల్గఁగల"దని ప్రతిశాపమిచ్చెను.

అపుడు జమదగ్ని మరలఁ గోపించి నీవు శివునిచే జితుండవగుదు వని మరల శపించెను. ఈ సంగతి కశ్యపునివల్ల నెఱంగి బ్రహ్మ యాతనితోఁ గూడ క్షణములో సూర్య జమదగ్నులకడ కరుదెంచి వారిని శాంతపఱిచి సూర్యునితో "ఓయీ! నీవు ఒకానొక దినమునందాకాశమున మేఘచ్ఛన్నుఁడవై వెంటనే ముక్తుఁడవయ్యెదవు. మేఘాతిశయ కాలమునఁగాని వర్షంబునంగాని రాహుగ్రస్తుఁడ వయ్యెదవు. ఐనను, కొందఱి కదృశ్యుఁడవు. కొందఱికిఁ బూర్ణదృశ్యు డవుఁ నగుదువు నిన్నుఁజూచి సమస్కరించి సర్వజనులు పాపహీను లగుదురు. జన్మసప్తాష్టమ, చతుర్థ దశమస్థానంబులందు, జన్మ ఋషనిధనములందును నీవును జంద్రుఁడు సదృశ్యులయ్యెదరు. అస్తకాల, ఘనాచ్ఛన్న కాల మధ్యాహ్న కాలములందు, జలములందు అర్దోదిత కాలములందు నీవు ఉపదృశ్యుఁడ నగుదువు. భార్యాదుఃఖనిమిత్తమునఁ గారణభూతయైన భార్యచేతను శ్వశుర స్యాలకులచేతను హతతేజుఁడ వగుదువు. మాలి సుమాలి యుద్ధమున శివుఁడు నిన్ను జయించును " అని చెప్పి జమదగ్నిం జూచి “మహాశయా | పరాజయలజ్జితుఁడైన సూర్యునింతతో విడువుము నీ తేజమున క్షణమాత్రములో జగమంతయు భస్మీభూతము కాఁగల దనుట నిజము నీవును సూర్యుఁడును బరస్పరపాల్యులు, పూజ్యులును, నీవు కార్తవీర్యున చేఁ బరాభవము, ఓటమి, మరణము నందుదువు. ఐనను విష్ణుమూర్తి నీకు సుతుఁడై జన్మించి ముయ్యేడుమాఱులు శోధించి జగమంతయు నిఃక్షత్త్రము గావించుచు, నీ మరణము లోకకల్యాణ బీజమే కాఁగల"దని చెప్పి యదృశ్యుఁడయ్యెను. జమదగ్నియు సూర్యుఁడును బరస్పరమభినందించుకొని పురాకృత కర్మముల నివారింప సమర్థుఁడెవ్వఁ డనుకొని నిజ గృహముల కరిగిరి.[2]

రేణుకాదేవి భర్తకుఁ బరమభక్తితో సేవచేయుచు నాతని కటాక్షమునఁ గ్రమముగా నైదుగురు కుమారులంగనెను. వారు వరుసగా రుమణ్వతుఁడు, సుసేషణుఁడు, వసువు, విశ్వావసువు, పరశురాముఁడు నను నామములఁ దాల్చిరి. పరశురాముఁడు విష్ణునవతారమై జన్మించెను. ఇట్లు జనించిన పుత్త్రులం బెంచుకొనుచు భర్త శుశ్రూష యేమఱక రేణుకాదేవి చరించుచుండెను.

పరశురాముని పితృభక్తి

ఒకనాఁడు రేణుకాదేవి జలమునకై యేటికిఁ బోయెను. అందుఁ జిత్రరథుఁ డను రాజు భార్యాసహితుఁడై జలక్రీడా పరవశుఁడై యుండెను. వారినిఁ జూచుసరికి రేణుకాదేవి విధివశమున వారి క్రీడలపైఁ గోరిక జనింపఁగ నట నిలిచి వారి యానందమును గాంచు చుండెను. ఆ కారణమున నామె మహోత్తమ పాతివ్రత్యమున కించుకదోషము గలుగ నామే హస్తమందలి ఘటము క్రిందపడి చిన్నాభిన్న మయ్యెను. ఎప్పుడైన జలభాండ మట్లు పగులుచో నామె మహత్త్వమున యిసుక తీసి తలపోయఁగనే భాండ మేర్పడెడిది. నాఁ డామె పూర్వవిధముననే యిసుక తీసి కుండ కావలయునని కోరఁగా నట్లు సంభవింపదయ్యెను. రేణుక మహాపతివ్రత గానఁ దన తప్పిదమును వెంటనే గ్రహించి యాదోషమున కానదిలోఁ బడి మరణింప నెంచెను. కాని, పతికి జరిగినవిషయము నివేదించి యాతని యాజ్ఞాబద్ధురాలగుటయే ! శ్రేష్ఠమని యెంచి భాండరహితయై యింటి కేతెంచెను.

జమదగ్ని భార్యచేత భాండము లేకపోవుటకుఁ గారణమేమని చూడఁగా దివ్యదృష్టి, కెల్లవిషయము గోచరించెను. చిత్రరథుని మక్కువఁ దగిలిన తన భార్య యాంతరంగికమున కసహ్యించుకొని యాదోషమున కామెకు మరణదండనమే శిక్షయని యతఁడు నిశ్చయించుకొనెను. రేణుకాదేవి సమీపింపఁగానే జమదగ్ని కొడుకులఁ గ్రమముగాఁ బిలిచి తల్లిని జంపివేయుఁ డని యాజ్ఞాపించెను. ఆహా ! జమదగ్ని సౌశీల్యాదర్శము! అన్యపురుషు ననురక్తిఁ గాంచిన నది వ్యభిచారమే యౌననిగదా పరమసాధ్వి యగు భార్య శిరము ఖండింపఁ జేయుట? అతఁడుకదా మహర్షి! పుత్త్రులలో మొదటి నల్గురు నాపని చేయలేమని చెప్పి వేసిరి. పరశురాముని బిల్చి జమదగ్ని తల్లిని, నన్న లను జంపుమని యాజ్ఞాపింపఁగా వెంటనే యాతఁడు తన పరశువుతో దల్లి, సోదరుల తలలను ఖండించెను. జమదగ్ని యాతని పితృభక్తికి సంతసించి యొకవరము వేఁడుకొను మనెను. వెంటనే పరశురాముఁడు చనిపోయిన తన తల్లిని సోదరులను బ్రదికింపు మని తండ్రిని గోరుకొనెను. జమదగ్ని పరశురాముని మాతృప్రేమమునకును భ్రాతృవాత్సల్యమునకును మెచ్చుకొని యట్లే చేసెను.

జమదగ్ని కార్తవీర్యునిఁ జంపిన పరశురాముని శిక్షించుట

పూర్వము హైహయాధీశ్వరుఁ డగు కార్తవీర్యార్జునుఁడు దత్తాత్రేయు నారాధనముచేసి యతనివలన శత్రుజయమును, వేయి చేతులను, అణిమాదిసిద్ధులను, యశము, బలము, యోగీశ్వరత్వము, తేజము చెడని యింద్రియములను బడసి వెలుఁగొందెను. దిగ్విజయ యాత్రకై వచ్చిన రావణాసురు నీతఁ డవమానించెను, పిమ్మటఁ గార్తవీర్యార్జునుఁడు దైవయోగమున వేఁటకై యడవిలో సంచరించుచు జమదగ్నిమహర్షి యాశ్రమముచేరి యాతనిని దర్శించెను. జమదగ్ని మహర్షి రాజును భృత్యులును డస్సియుండుటఁ గాంచి వారిని బూజించి తన హోమధేనువును రప్పించి యిష్టాన్నములు గురియించి వారి నారగింపుఁ డని కోరెను. కార్తవీర్యార్జునుఁడు బ్రహ్మానందముతో షడ్రసోపేతముగా విందుఁ గుడిచి యా గోవుపైఁ గోర్కి, కలుగఁగా సపరివారముగాఁ దనపురమున కేఁగెను.

కాని, యా ధేనువుపైఁ గల మక్కువచే దానిని కొని తెండని కార్తవీర్యుఁడు తన బటులను బంపెను. వారు జమదగ్నితో యుద్ధమునకు సిద్ధపడిరి. జమదగ్ని సురభితో నీవిషయముఁ దెలిపెను. వెంటనే యామె రోమకూపములనుండి మహావీరులగు సైనికులు, నుత్తమ రథాశ్వములు వెలువడఁగా వానితో జమదగ్ని కార్తవీర్యుని సేనలతోఁ బోరెను. కార్తవీర్యుని సైనికులు హతమారఁగా నా సంగతిఁ దెలిసికొని కార్తవీర్యార్జునుఁడు ససై న్యుఁడై వచ్చి స్వయముగా జమదగ్నితోఁ బోరెను. కార్తవీర్యార్జునుండు రెండు మూఁడుపర్యాయము లోడిపోయి జమదగ్నికిఁ జిక్కి యాతనిచే బుద్దులు గఱపఁ బడియుఁ బాటింపక తిరిగి యాతనిపై యుద్ధమునకువచ్చి తిరిగి యోడిపోయెను. ఈ ప్రకార మిరువది పర్యాయము లోడిపోయి యిరువది యొకటవ మాఱు సురభివాక్యమును విస్మరించిన జమదగ్నిని సంహరించి సురభిని వెదకఁగా నా కామధేను వాతనికి లభింపక యింద్రునికడకుఁ బోయి సురక్షితముగా నుండెను. కార్తవీర్యార్జునుఁడు రిక్తహస్తములతో నింటికిఁ బోయెను. రేణుకాదేవి భర్తతో సహగమనము చేయనుండ నాకాశవాణి వలదని వారించెను. ఇంతలో భృగుమహర్షి వచ్చి జమదగ్నిని బ్రతికించెను.

తరువాతఁ బరశురాముఁడు వచ్చి జరిగినసంగతిఁ దెలిసికొని యింటఁ దిని యింటివాసములు లెక్క పెట్టినట్లున్నదని కోపించి కార్తవీర్యు నవమానింపఁ దండ్రియనుమతిఁ గొని కుశారకవచకోదండ కాండుఁడై మాహిష్మతీపురమున కేఁగెను. అందుఁ గార్తవీర్యార్జునుఁడు నాతని సంహరింపుఁ డని దండనాయకులఁ బదియేడక్షౌహిణులఁ బంపెను. పరశురాముఁ డొక్కక్షణమున వారి నందఱు రూపుమాపెను. కార్తవీర్యార్జునుఁడు యుద్ధమునకు రాఁగా నాతని వేయి చేతులను ద్రుంచి తనగండ్రగొడ్డలిచే నాతనిశిరముఁ దునిమెను పిమ్మట నాశ్రమమున కేఁగి యాతఁడు తండ్రికి జరిగిన వృత్తాంతముఁ జెప్పెను. జమదగ్ని మహర్షి రాజెంత దుష్టుఁడైన నాతనిఁ జంపుట దోషమనియుఁ దద్దోషపరిహారమున కొకయేఁడు తీర్థయాత్ర గావింపు మనియుఁ బుత్త్రుని శాసించెను. పరుశురాముఁ డట్లే యని తీర్థయాత్రకై బయలు వెడలిపోయెను. ఆహా! తన కుమారుఁడు విష్ణుస్వరూపుఁ డని యెఱిఁగియుఁ గార్తవీర్యుడుఁ దనకుఁ బరమవిరోధియై యున్నను, నాతనిఁ జంపిన కారణమున ధర్మసంహితబుద్ధితోఁ బుత్త్రుని శిక్షింప వెనుకంజవేయని జమదగ్ని మహర్షి నెంతకొనియాడినను దనివి తీరదు కదా!

కార్తవీర్యార్జునుని కొడుకులు కొంతకాలమునకు దమ తండ్రిని జంపుటకుఁ గారకుఁడు జమదగ్నియే యని యొక్కసారి జమదగ్ని హోమగృహముఁ జేరి యాతనిఁ బట్టి చంపిరి. రేణుకాదేవి యాతనిపైఁ బడి "పరశురామా! వచ్చి తండ్రిని రక్షింపుము, రక్షింపు" మని యిరువదియొక్కసారి కేకవేసెను. అంతలోఁ దీర్ధయాత్రనుండి పరశురాముఁడు వచ్చి తండ్రి మరణమునకు విచారించెను. పిమ్మటఁ దల్లి యిరువదియొక్క మాఱులు పిలిచినది. కావున నిరువదియొక్క మాఱు కార్తవీర్యులనే కాక క్షత్రియుల నెల్లరను సంహరించి వారి రక్త ప్రవాహమునఁ దండ్రికిఁ దర్పణము లిత్తునని పరశురాముఁడు సోదరుల నూఱడించి బయలుదేఱి వెడలి యిఱువదియొక్కమాఱు వెదకి వెదకి రాజులఁ జంపెను. ఈ లోపున రేణుకాదేవి భర్తకై ప్రాణములఁ బాసెను. పరశురాముఁడు తాను జేసిన ప్రతిజ్ఞను బాలించి క్షత్రియ రక్తముతోఁ దండ్రికిఁ దర్పణము విడిచిపెట్టెను. ఉత్తమోత్తముఁడు పితౄణవిమోచకుఁడు నగు పరశురామునివంటి పుత్త్రరత్నమును గాంచిన యా మహర్షి సత్తముని యదృష్టవిశేష మెంతటిదో కదా ![3]

జమదగ్ని పితృదేవతల శాపమున నకులమై పుట్టిన వృత్తాంతము

జమదగ్ని మహర్షి యొకనాడు పితృకార్యార్థియై చాల నియమముతో నూతన కలశమున గోక్షీరమును స్వయముగాఁ బితికి యొకచోటఁ బదిలముగాఁ బెట్టెను. జమదిగ్ని మహాప్రశాంతుఁ డగుట నాతని చిత్తవృత్తి యెఱుఁగఁ దలఁచి , క్రోధాధిదైవము సాకారయై వచ్చి ప్రమాద మనుభ్రమ పుట్టించి యా పాలు పాఱఁ బోసెను. జమదగ్నిమహర్షి కోపింపగ యూరకుండెను. అంతఁ గోధాధిదేవత యాతని యెదుటఁ బ్రత్యక్ మై "మహాత్మా ! భృగువంశము వారు మహాకోపు లని వింటిని. నీయం దది యసత్యమైనది. అది పరీక్షించుటకే యిట్లు చేసితిని క్షమింపు " మని వేఁడుకొనెను. జమదగ్ని శాంతచిత్తముతోఁ బొమ్మనఁగాఁ గ్రోధుఁ డంతర్థానమయ్యెను.

నాఁటిరాత్రి జమదగ్ని పితృదేవత లతనికిఁ బొడసూపి "వత్సా! నీ వెంతదోషము చేసితివి ! నీవు మాపూజ కుత్సహించి తద్వైకల్యము కలిగినను నూరకుంటివి. ఇది శాంతమగునే? సమయా సమయముల నెఱిఁగి చూపినదే శాంతము. వలయునెడఁ గోపించినను నది శాంతసమానమే యగును. ఆసమయమున శాంతము చూపినను దోష మే యగును. కావున నీ వొనరించిన దోషమునకు నీవు ప్రతిఫల మనుభవించి తీరవలెను. కావున, నీవు ముంగివై పుట్టు" మని శపించిరి. జమదగ్ని వారలకు దండప్రణామములు చేసి “మహాత్ము లారా ! తపస్వికి నలుగఁ దగదని యపరాధము చేసినను నలుగనైతిని. నా తప్పు నా కిప్పుడు తెలిసినది, కావున, నన్ను సైచి శాపమోక్షము ననుగ్రహింపుఁ " డని కోరెను. వారు 'నాయనా ! నీమీఁద మాకుఁ గ్రోధము లేదు. ఎంతటి వానికిని గర్మఫలమనుభవింపక తప్పదు కదా! నీకు నంతియే. కావున, నీవు నకులమై పుట్టుట తప్పదు. ఎప్పుడు విదగ్ధవిప్రసమూహ మంగీకరించు నుచిత వాక్యములతో నొక మహాధర్మము కీ డని నీవందువో యానాఁడు నీకు శాపమోచనమై మోక్ష సౌభాగ్యమందఁగల"వని చెప్పి పితృ దేవత లదృశ్యులైరి. ఆ శాపము మూలముననే ముంగియై పుట్టి ధర్మరాజు చేసిన యశ్వమేధయాగ సమయమున సక్తుప్రస్థుని యుదాహరణమున ధర్మజు నశ్వ మేధము నధిక్షేపించి విగతశాపత్వానందమున జమదగ్ని మహర్షి జన్మరాహిత్యము నందఁగనెను.[4]

ఇట్లు జమదగ్ని మహర్షి మహాప్రశాంతుఁడై , అరిషడ్వర్గముల జయించి యాత్మానందసింహాసనాధిష్ఠితుఁ డై వెలసెను.  1. భారతము; విష్ణుపురాణము.
  2. బ్రహ్మవైవర్తపురాణము. ఉపావద్దాప విషయకమగు సూర్య జమదగ్ని సంవాదము భారతానుశాసనిక పర్వమునఁ గలదు.
  3. భారతము - బ్రహ్మపురాణము.
  4. భారతము - ఆశ్వమేధపర్వము.