మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/చ్యవన మహర్షి
మహర్షుల చరిత్రలు
చ్యవన మహర్షి
భృగుమహర్షి కిఁ బులోమ యసునొక భార్యయుండెను. ఆమె తన శుశ్రూషచేఁ బతి మనస్సును హరించెను. ఒకనాఁడు భృగుమహర్షి యామె కోరిక యడిగెను. పులోమ భర్తకు భక్తిపూర్వకముగా వందనము చేసి "మహాత్మా! మీ సేవాభాగ్యముకన్న నాకుఁ గావలసిన దేదియును లేదు. ఐనను, వంశోద్దారకుఁడు బ్రహ్మర్షి వరేణ్యుఁడు నగు నొకపుత్త్రుని దయచేయుఁ" డని వినయ విధేయతలతోఁ గోరుకొనెను. భృగుమహర్షి యంగీకరించి యామెకు గర్భము నిలిపి యామె కోరికపై నగ్నిహోత్రము సిద్ధము చేయుట, హోమద్రవ్యము లందిచ్చుట మున్నగుపను లామెచేఁ జేయించుకొనుచుండెను.
చ్యవనుఁడు జన్మించి పులోముని భస్మము చేయుట
ఒకనాఁడు యథాపూర్వకముగా నగ్ని హోత్రమును సిద్ధము చేయు మని చెప్పి భృగుమహర్షి స్నానమునకై నదికేఁగెను. పులోమ యగ్ని రగిల్చి జాజ్వల్యమానముగా వెలిఁగించెను. పులోముఁ డను రాక్షసుఁ డొకఁడు చిరకాలమునుండి పులోమను బ్రేమించి యామెను వివాహ మాడుదునని చెప్పుచుండెను. కాని, యామె తలిదండ్రు లామె నాతని కీయక భృగుమహర్షి కిచ్చి వివాహము చేసిరి. నాఁటి నుండియు నవకాశము లభించినపు డీమె నపహరింప నా రాక్షసుఁడు వేచి యుండెను. నాఁ డాతఁడు భృగుమహర్షి లేకుండుటఁ జూచి యామె యున్న యగ్ని గృహమును ప్రవేశించెను. ఆమె పులోమ యగునా కాదా యను సంశయముతో సగ్నిహోత్రు నామె యెవరని యడిగెను. అగ్నిదేవుఁడు విప్రశాపమునకు ససత్యదోషమునకు వెఱచియు విప్రశాపముఁ గ్రమ్మఱించుకొనవచ్చిన వచ్చుఁ గాని యసత్యదోషము తీర్పరాని దని నిశ్చయించుకొని యామె భృగుపత్ని యని చెప్పెను. పులోముఁడు వెంటనే వరాహరూపము ధరించి యామె నెత్తుకొని పాఱిపోఁ జొచ్చెను. అపుడామె గర్భము చ్యుతము కాఁగా నొక యర్భకుఁడు బయట పడెను. మాతృగర్భచ్యుతుఁడగుట నాతనికి 'చ్యవనుఁ' డను పేరు కలిగెను. ఆ బాలుని తీవ్ర తేజము చూచినమాత్రముననే పులోముఁడు భస్మీ భూతుఁడై పోయెను.
పులోమ సంతసమున నాబాలు నెత్తుకొని గృహమున కరుదెంచెను. అంతలో భృగుమహర్షి స్నానాదికము నొనర్చి యింటికి వచ్చెను. పులోమ జరిగిన యుదంతమంతయుఁ జెప్పి పతికి బాలునిఁ జూపెను. భృగుమహర్షి యంతఁ దన భార్య నా రక్కసునికిఁ జూపిన యగ్నిపైఁ గోపించి యతిక్రూరుఁడు సర్వభక్షకుఁడగుఁ గాక యని యాతనిని శపించెను. అగ్నిహోత్రుఁ డిది విని కోపించి తన తేజోమూర్తి నుపసంహరించు కొనఁగా బ్రహ్మాదులు భృగుశాప మమోఘమనియు నైన నగ్ని సర్వభక్షకుఁడైనను శుచులలో నత్యంతశుచి, పాత్రులయందుఁ బరమ పాత్రుఁడు బూజ్యులలోఁ బరమ పూజ్యుఁడు వేద చోదిత విధానముల విప్రసహాయుఁడై భువనముల నడపునని వరము లనుగ్రహించి యగ్నికోపముఁబాపి శాంతింపఁజేసిరి.[1]
చ్యవనుని తపోనిరతి
ఈ విధముగా జన్మించిన చ్యవనుఁడు పులోమా మాతృస్తన్యములఁ బెరిఁగి పెద్దవాఁ డగుచుండెను. భృగుమహర్షి తనయునకుపనయ నాదిక మొనర్చి బ్రాహ్మణ ప్రధాన వృత్తియు, జీవిత పరమావధిని సిద్ధింపఁ జేయునదియు నగు తపోవనమునకుఁ గుమారుని మనసు గొలిపి విడిచిపుచ్చెను. చ్యవనుఁడు తల్లి దండ్రులకుఁ గృత ప్రణాముఁడై బయలుదేఱి వైదూర్య పర్వతప్రాంతమున కరిగి యొక సరోవరము పొంత మహాతపోనిష్ఠాగరిష్ఠుఁడై యుండెను. అతఁ డట్లు తపోవృత్తి నుండఁగఁ గొన్ని వేల సంవత్సరములు గడచెను. ఆతఁడును వృద్ధుఁడయ్యెను. దేహమును మఱచి పరమేశ్వరునిపై మనసు లగ్నముచేసి దివ్యానందము నాతఁ డనుభవించుచుండఁగా నాతని దేహము పుట్టలు పెట్టెను. లతాగుల్మము లాపుట్టలపై మొలిచి యల్లుకొనుచుండెను. ఐన, నా చ్యవనునకు దేహస్మృతి లేకుండెను.
చ్యవనుఁడు సుకన్యను వివాహమాడుట
ఇట్లుండఁగా సంయాతి యను నొక రాజు చతుస్సహస్ర దేవీ నివహముతోడను సుకన్య యను కూఁతు తోడను సై న్యసమేతుఁడై యా సరోవరమున జలక్రీడార్ధమై వచ్చి యుండెను. అతనికుమారి చక్కనిచుక్క యగు సుకన్య యువతీజనపరివృతయై యందుఁ దిరుగుచుఁ బుట్టలువోసిన చ్యవనుని కడకు వచ్చెను. ఆ పుట్టలోనుండి చ్యవనుని నేత్రములు ఖద్యోతద్యుతులవలె మెఱయుచుండుటఁ గాంచి సుకన్య యా నేత్రములఁ బొడిచెను. చ్యవనుఁ డిది యెఱిఁగి సంయాతి సైన్యమునకు మూత్రపురీషనిరోధము గావించెను. సంయాతి దానికి కారణ మరయలేక వెఱఁగుపడెను. ఇంతలో సుకన్య తండ్రి కడకు వచ్చి తానొక పుట్టలో రెండు మిడుఁగురులను జూచి పొడిచిన సంగతి చెప్పెను. సంయాతి యట కరిగి యందుఁ దపఃక్లేశత్వగస్థీభూత శరీరుఁడు నతి వృద్ధుఁడు నగు చ్యవనుని జూచి యాతని పాదములపైఁబడి శరణుజొచ్చి తన కూఁతు నపరాధము మన్నింపుమని వేఁడుకొనెను. చ్యవనమహర్షి భవితవ్యము నెఱిఁగి సుకన్యను దనకిచ్చి వివాహము చేసినచో క్షమింతు ననెను. సంయాతి యంగీకరించి కూఁతు నడుగఁగా సుకన్య “తండ్రీ ! ఇంత కన్న నాకుఁ గావలయున దేమున్నది! పరమ తపోధనుఁడగు బహ్మర్షిని భర్తగాఁ బడయు మహాభాగ్యమున మన వంశమును బరమ పవిత్ర మొనరింపఁ గల్గితినేని నాపుట్టువు చరితార్థమగుఁగదా! కావునఁ దప్పక మీరట్లొనర్పుఁ" డని సమ్మతించెను. అందుల కెంతయు నానందించి యచ్చటనే యా బ్రహ్మర్షికిఁ దనకూఁతు నిచ్చి పరిణయముచేసి సైన్య సురోధముఁ బాపికొని సుకన్యనట విడిచి సంయాతి తన సగరమునకుఁ బోయెను.
సుకన్య తనకు ఋషిశ్రేష్ఠుఁ డగు చ్యవనుని సేవాభాగ్యము లభించినదని మహోత్సాహముతోఁ బరిచర్య చేయుచుండెను. తాను యువతి యయ్యు సుకన్య వయోవృద్ధుఁడు జీర్లాంగుఁడు నైనను నిజ భర్తయే పరమదైవమని యాతని నారాధించుచుండెను. ఆమె భర్త యనుగ్రహమున నాత్మానందమును గుర్తెఱిఁగి తుచ్చదేహ వాంచోపహత గాక పరమ పవిత్రజీవితమును గడుపుచుండెను.
చ్యవనుండు నవయౌవనుఁ డగుట
ఇట్లుండఁగా నొకనాఁడాశ్వినేయు లీమె సౌందర్యమును విని యచ్చెరువంది చ్యవనాశ్రమమునకు వచ్చి యొంటరిగ నున్న సుకన్యఁ జూచి యామె నామధేయాదుల నడిగి పలుకరించిరి. సుకన్య తాను సంయాతి కూఁతుర ననియు చ్యవనమహర్షి భార్య ననియుఁ జెప్పెను. అంత వారు కాంతా! త్రిలోకసుందర మగు నీశరీరము నట్టిముసలి వగ్గున కిచ్చుటచే నీకుఁ గొమభోగానందము సంభవించుచున్న దా" ? ఇఁక'నై నను నీ సౌందర్యము నడవిని గాచిన వెన్నెల కానీయకుము. పరమ సుందరు నొకనిఁ గోరుకొమ్ము. మేము తీసికొనివత్తు మనిరి. అంత సుకన్య “మహాత్ములారా! మీకు నాపై నింత యాదరమేల కలిగినదో యెఱుఁగను. పరమపాపనమగు నాపతి పాదసేవ కితోధికమగు భక్తి శ్రద్ద లొసంగ మీరు సమర్థులేని య ట్లొసంగుఁడు. లేని నాఁడు మీదారిని మీరు పొం" డని బదులు చెప్పి నాథునికడ కేఁగి యావిషయమును దెల్పెను. ఆతఁడు వారు చెప్పినట్లే చేయు మని యాదేశించెను. భర్త యానతి యందలి యంతరార్థమును గ్రహించి వెంటనే యాశ్వినులకడ కరుదెంచి యామె తనకు నవయౌవను నొకనిఁ దెండని కోరుకొనెను. వారు బ్రహ్మానందము నంది సమీపమునఁ గల కొలనులో దిగుసరికి నవయౌవనులైరి. చ్యవనుఁ డది చూచి తాను నందు దిగి నవయౌవనుఁడై వారితో పాటు సుకన్యకడ కరుదెంచెను. మహాపాతివ్రత్య ముట్టిపడ సమానరూప వయోవిలాసముల నొప్పు నామువ్వురిలో నామె చ్యవనునే వరించెను అశ్విను లానందించి యామె పవిత్రపాతివ్రత్యము నభినందించి యామెను బరీక్షించుటకే యట్లోనర్చితి మనిచెప్పిరి.[2]
చ్యవనుఁ డాశ్వినులను సోమపీథులఁ జేయుట
చ్యవనుఁడు తన కశ్వనీ పుత్త్రుల మూలమున నూత్న యౌవనము లభించినకారణమున వారికిఁ దాను బత్యుపకారము చేయ నెంచెను. అంతవఱ కశ్వినీ కుమారులకు సోమపానము చేయనర్హత లేదు. ఆకారణమున నాశ్వినీ దేవతలను సోమపీథులఁ జేసెద నని ప్రతిజ్ఞ చేసి చ్యవనుఁడు "వారిని బంపివేసెను. చ్యవనుఁడు తన నూత్న యౌవనమును జూచి యానందించుటకు సపరివారముగా వచ్చియున్న సంయాతని గాంచి యాతని యభ్యున్నతి కొకక్రతువును దా నాతనిచేఁ జేయించుటకు నిశ్చయించెను. సంయాతి వల్లె యని నగరమున కరిగి యజ్ఞ సంభారములను సమకూర్చెను. చ్యవనమహర్షి సుకన్యాసహితుఁడై శ్వశురగృహమున కేఁగెను. అంత సుముహూర్తముస విద్యుక్తముగ సంయాతి చ్యవనుని యార్త్విజ్యమున యజ్ఞ మారంభించెను. ఇంద్రాది దేవతలు హవిర్భాగమున కాహూతులై మఖమునకు వచ్చి యుండిరి. చ్యవనమహర్షి తాను గావించియున్న వాగ్దానము ననుసరించి యాశ్వినులకు సోమ మీయఁబోఁగానే యింద్రుఁడు కోపించి యాశ్వినేయులు బృందారకులు కాని కారణమున వారికి సోమ మీయవలదని నివారించెను. చ్యవనమహర్షి యాతనిమాటలు పాటి సేయక యాశ్వినేయులను సోమపీథులఁ జేసెను.
చ్యవనుఁ డింద్రునకు గర్వభంగము చేయుట
అంతఁ దనమాట నిర్లక్ష్యమగుటఁ గాంచి యింద్రుఁ డలిగి వజ్రాయుధ మెత్తి చ్యవనునిపై వేయఁబూనెను. చ్యవనుఁ డింద్రుని హస్తమెత్తినది యెత్తినట్లే యుండఁ జేసి యాతనిని వజ్రాయుధముతో పాటు రూపఱఁ జేయ నగ్నియందు వేల్వఁగా నందుండి యపారఘోరబలుఁడు మహాజీవుఁడు నయి మదుఁడను రాక్షసుఁడు భీకరాకారుఁడై యుద్భవించెను. అతనిచేతులు పదివేల యోజనముల పొడువుండెను. అంతకుఁ దగిన నాలుగుదంష్ట్రలును సూర్య చంద్రులఁ బోలు కన్నులును గాలాగ్ని వంటి నోరును భూమ్యాకాశముల నంటు శరీరమును గలిగి యొక్కసారిగా నోరుదెఱచి నాలుకతో బెదవులు నాఁకుకొనుచు మహానాదముతో నింద్రుని మింగవచ్చు నారాక్షసునిఁ జూచి యింద్రుఁడు భయకంపితుఁడై తన తప్పిదముమ క్షమింపుమని నాఁటినుండియు నాశ్వినీ దేవతలు సోమపీథులే యగుదురని పలికి చ్యవనుని పాదములపైఁ బడెను. చ్యవనమహర్షి యాతని కభయమిచ్చి యా రాక్షసుని నివారించెను. మదుఁడు చ్యవనునకు సమస్కరించి తన కాశ్రయమును జూపుమని వేఁడుకొని నాఁటినుండి యాతని మద్యస్త్రీ మృగయాక్షముల నాశ్రయింపుమని చ్యవనుఁ డాదేశించుట తోడనే యారాక్షసుఁ డంతర్థానమాయెను. ఇంద్రుఁడును బ్రతుకు జీవుఁడా యని స్వర్గమనుఁ డయ్యెను. ఈ ప్రకారము తనకృతజ్ఞతను వెలిపుచ్చుకొన్న చ్యవను ననేకవిధముల నభినందించి యాశ్విన్యాది దేవతలు హవిర్బాగసంతృప్తిఁ దమలోకమునఁ కేఁగిరి. చ్యవనమహర్షి తన తపఃప్రభావమును వెల్లడి చేసిన కారణమున నా పర్వతము 'ఆర్చీకపర్వత' మను పేరఁ బరిగి ప్రసిద్ధిగాంచెను.[3] మఱియొకప్పు డింద్రుఁడు గర్వియై కోపించి చ్యవనునిపై నొకపర్వతమును విసరెను. చ్యవనమహర్షి వెంటనే తన కమండ లూదకము మంత్రించి చల్లఁగానే యాపర్వత మెదురు తిరిగి యింద్రునిపైనే పడెను. ఆ కారణమున వెంటనే యింద్రుఁడు మూర్ఛవోయెను. చ్యవనమహర్షి కరుణించి యాతని కేబాధ లేకుండఁ జేసి మూర్ఛనుండి మేల్కొలిపెను. ఇంద్రుఁడు సిగ్గుపడి వెడలిపోయెను. ఆహా! చ్యవనుఁ డెంతదయాశాలియో కదా! అపకారి కుపకారర మొనరించి తన యభేదభావము 'నాతఁడు చాటింనాఁడు. ఇదే మన ఋషులలో మనము గ్రహింపవలసిన రహస్యము. వా రాత్మజ్ఞులు. అహంకార మమకారరహితులు. కాని, యెదుటివారియందలి రజస్తమోగుణముల ప్రకోపము నణచుటకుఁ గ్రోధము నటించి శాపాయుధమున నెదుటివారిఁ జక్కఁజేసి వెంటనే తమయాయుధ ముపసంహరించుకొను మహాశక్తిసంపన్నులు వారు వారికిని మనకును బోలికయే లేదు.
చ్యవనుఁడు సుకన్యకుఁ బుత్త్రుల ననుగ్రహించుట
నవయౌవనుఁడై న చ్యవనుఁడు సుకన్యాపాతివ్రత్యమునకు సంతసించి యామెకు సకలభోగముల నొసఁగి యానందింపఁ జేయనెంచెను. ఒకనాఁడు సుకన్యను బిలిచి “సాధ్వీ ! నేను ముసలివాఁడ వని రోయక దేహ సౌఖ్యముల నిన్నుఁ దేల్పకున్నను నీవు నాయం దతి విధేయురాలవై యుంటివి. కావున యౌవనము నీకొఱకే ధరించితిని. నీ త్యాగశీలమునకు మెఱుఁగు పెట్టఁ గల్గు నొక్క సుపుత్రునిఁ దత్తుల్యకీర్తిప్రదులగు నిరువురు కుమారులను నీ కనుగ్రహింతు" నని చ్యవనుఁడు సుకన్యను గారవించెను, “మీ కటాక్షమునకు మించి నాకేమి కావలయు " నని యామె యాతనితో స్త్రీసౌఖ్యము సనుభవించెను. కాలక్రమమున నా మెకు దధీచి. ప్రమతి, ఆ పవానుఁడను కుమారులు జన్మించిరి. మహాతపస్సంపన్ను లగు మహర్షులు తుచ్ఛ కామముతోఁగాక సత్పుత్త్రజనకు లగుట కేకదా నిజపత్నీ సమాగమము నభిలషించుట ! అట్టిసంగమమున మహాత్ములు కాక యన్యు లుదయింపరుగదా!
చ్యవనుఁడు నహుషు ననుగ్రహించుట
చిరకాలము గృహస్థధర్మములు నడపి చ్యవనమహర్షి యొకప్పుడు భాగీరథీయము నాసంగమమున సుస్థిరుఁడై యధిక నిష్ఠతో నుదకవాసమహావ్రత మారంభించి నీటిలో నుండి తపము చేయుచుండెను. అందలి మత్స్యము లాతనిచుట్టును దిరుగుచుండఁగా నాతనికి వానిపై గృపయుఁ బ్రేమమును జనించెను ఆప్రకార మాతఁడందుఁ బండ్రెండు సంవత్సరము లుండెను. ఆతఁడు సకల భూతములందును బరమశుభమగు విశ్వాసము గలిగి శుచియై దేవతా పురస్సరముగాఁ దపము చేయుచుండ, నాజలము లాతనికిఁ బ్రదక్షిణ మొనర్చి భక్తిమెయి నే కీడు నొనర్పకుండెను. ఇట్లుండ వొకనాఁడు జాలరులు వలలతో నందలి చేఁపలను బట్టుచు నా మహర్షిని బట్టి గట్టునకు లాగిరి. ఆతనిఁ గాంచిన వెంటనే వారు భయకంపితులై తమతప్పు క్షమింపు మనిరి. చ్యవనమహర్షి యించుకేని గోపపడక “మీ కులవృత్తి మీరు చేయుటలో దోషము లేదు. నన్ను నీమత్స్యములతో పాటు విక్రయించుకొనుఁ" డన వారు పరుగునఁ బోయి తమ రాజగు నహుషునితో నీ విషయ మెల్ల వినిపించిరి. నహుషుఁ డాక్చర్య భక్తిసంభరితుఁడై వచ్చి యా మహర్షికి మ్రొక్కి క్షమింప వేడుకొనెను. చ్యవనుఁడు వారు చేసిన దోష మేమియును లేదనియుఁ దనకు వెల నిర్ణయించి యా జాలరుల కిమ్మనియుఁ గోరెను, సహుషుఁడు నూఱుమాడలీయ నియమించెను. అర్దరాజ్య మిచ్చెద ననెను. రాజ్యమంతయు నిచ్చెద ననెను ఏమనినను దనకుఁ దగిన వెల కాదని చ్యవనుఁ డనెను. ఇంతలోఁ గవిజాతుఁడను ముని వచ్చి గోబ్రాహ్మణులు సమాను లగుట నొక గోవు నిమ్మనెను. సహుషుఁ డట్లేయని చ్యవనునకుఁ దెలుప నాతఁ డానందించి గోప్రభావము: నాతని కుపన్యసించెను. ఒక గోవును దీసికొని వచ్చి సహుషుఁడు జాలరుల కీయ వారు దానిని చ్యవన మహర్షి కే యిచ్చి తమ్ముఁ గృతార్థులఁ జేయుమని కోరుకొనిరి. చ్యవను డంగీకరించి యా చేఁపలకు నా జాలరులకును స్వర్లోకము కలుగునట్లు వరమిచ్చెను. వెంటనే వారు దివ్య విమానారూఢులై స్వర్గమున కేఁగిరి. నహుషునిఁ జూచి యాతనికి ధర్మపరత్వము నింద్రపదవి కలుగునట్లు చ్యవనమహర్షి యాశీర్వదించి వెడలిపోయెను. చ్యవనమహర్షి యాళీర్వచనముననే సహుషుఁ డొకసారి యింద్రుఁడయ్యెను.
చ్యవనమహర్షి కుశిక భూపతిని బరీక్షించుట
సురలు మునులు సురశ్రేష్ఠునిఁ గొలిచి యుండఁగాఁ బ్రసంగవశమున నొకనాఁడు భృగుకుశిక వంశములకు బహ్మక్షత్త్రములు తడఁబడి సంకరము వాటిల్లునని బ్రహ్మపలికెను. ఇది చ్యవసమహర్షి వినెను. నాఁటినుండి కుశికవంశము నంతరింపఁ జేసినచో సాంకర్యము కలుగదని యాతఁ డెంచుచుండెను. కుశికకులమున కుత్పాత మాపాదింపఁగోరి చ్యవనుఁడొకపర్యాయము కుశికభూపాలుఁడగు కుశినాభునికడ కేఁ గెను. ఆతఁ డీతని నత్యంతము గౌరవించెను. బంధుమిత్త్రపరివారముతోఁ గుశినాభుఁ డీతనికి సేవచేయ మొదలిడెను. చ్యవనుడభ్యంతరమందిరమున హంసతూలికా తల్పమునఁ బరుండి భార్యాభర్తల నిరువురను బాదము లొత్తుఁ డనెను కుశికుఁడు సభార్యుఁడై సేవచేయుచుండఁగా నిరువదియొక్క దినములు చ్యవనుఁడు కదలకుండ నిద్రించెను. కుశికభూపాలుఁడు నాతనిని విడువక సేవించుచునే యుండెను ఇరువదిరెండవ నాఁడు లేచి యెటకో పోవుచుండెను. రాజు భార్యయు వాని సనుసరింపఁ గొంత దూర మేఁగి యాతఁ డదృశ్యుఁడయ్యెను. భార్యాభర్త లిరువురును విచారముతో ఇంటికి వచ్చి చ్యవనుఁడు వేఱొక తల్పమున నుండుటఁ జూచి సంతసముతో భక్తిభరితులై మరల నాతని పాదము లొత్తు చుండిరి. అతఁడును మఱి యిరువదొక్క దినము లట్లే కడపెను. పిమ్మట నాఁడు తైలాభ్యంగము కావలె నని చ్యవనుఁడనిన రాజు తై లాభ్యంగము చేయించుచుండ నాతఁ డంతర్హితుఁడై యపరాహ్ణము దాఁటిన పిదప వచ్చి స్నానము చేసెను, కుశినాభుఁడు భార్యయుఁ జలింపక వివిధాన్న పానములు ఘటించి భోజనమునకు రమ్మనఁగాఁ దిరిగి యాతఁ డంతర్హితుఁడయ్యెను. రాజును భార్యయు భుజింప నొల్లక యాతనికొఱ కెదురుచూచుచుండ మఱునాఁ డుదయ మాతఁడు వచ్చి కుశినాభునితో "నీవును నీభార్యయు నే నెక్కిన రథమును లాగుఁ" డనెను. వా రంగీకరించి యట్లు చేయఁగా రక్తములు కాఱునట్లు వారి నాతఁడు బాధించెను. ఐనను, వారు చలింపలేదు. చ్యవనుఁడు దయతో వారిని స్పృశించినంతనే వారి కాయాసము పోయెను; నవయౌవనము కలిగెను. చ్యవనుఁడు వారినింటికిఁ బోయి మఱునాడు తాను గంగాతీరమునఁ జేయు యజ్ఞమునకు రండని పిలిచి పంపి వేసెను.
కుశికభూపతి యింటి కరిగి విధ్యుక్తముగాఁ గర్మములు నిర్వర్తించి మఱునాఁడు స్నానాదు లోనరించి భక్తిభరిత హృదయముతో భార్యాసమేతుఁడై చ్యవననిర్దిష్ట ప్రదేశమున కరిగెను. అందు మణిమయ దివ్య హర్మ్యములు నిర్మితములై యుండెను. మండపములు, ఆరామములు, పద్మాకరములు, క్రీడాచలములు, సురకిన్నర గంధర్వగణములు గానవచ్చెను. అందొక దివ్యభవనమున భార్యాభర్తలు చ్యవనునిఁ గాంచిరి. వెంటనే యాతఁడు మేడలతో నంతర్థాన మయ్యెను. కొంతసేపటికి వారి నిరువురఁ బిలిచి చ్యవనుఁడు "రాజా! నీ మనస్సు నింద్రియములు నీ కింత స్వాధీనముగ నుండుట స్వల్పవిషయము కాదు. నా కానందమైనది. నాఁడు నీయింటఁ జరియించుచు నా రీతిఁ బ్రవర్తించుటకుఁ గల కారణము నీయందుఁ దప్పువట్టి నీ వంశ క్షయమునకై శపించుటకే. కాని, నీవు నాపరీక్షల కాఁగితివి. మీ యుభయులయందును ధైర్యహాని, కోపము, శోకము మందునకైన లేవు. కావున దయదలఁచి యిట్లు స్వర్గమునే భూమిపైఁ జూపితిని. నీకు మూఁడవ తరమువాఁడు బ్రహ్మ తేజో దీప్తుఁ డయి పుట్టును, నా తనయుని తనయుఁడు ఋచీకుఁడు నీతనయుని గాధి-కూఁతుఁ బరిణయమై జమదగ్ని యనువానిం గని యాతని యఁదు సమస్త ధనుర్వేదమును నిలుపును మహాక్షాత్త్రముతో నాతనికిఁ బుత్త్రుఁడై పరశురాముఁడు జన్మించును. గాధికి బ్రహ్మర్షి యగు విశ్వామిత్రుఁడు జన్మించు" నని చెప్పి చ్యవనమహర్షి వెడలి పోయెను. కుశికభూపతి బ్రహ్మానందము నందెను. చ్యవనమహర్షి చెప్పినట్లే ఋచీకుని మూలమున భార్గవవంశమున జమదగ్నియు నాతనికిఁ బరశురాముఁడును గుశికవంశమున విశ్వామిత్రుఁడును జన్మించిరి.[4]
పా మొకటి చ్యవనుని పాతాళమున కీడ్చుకొనిపోవుట.
తొల్లి యొకప్పుడు చ్యవనుఁడు నర్మదానదిలో స్నానము చేయుచుండఁగా నొక పెద్ద పా మాతనిం బట్టుకొని పాతాళలోకమున కీడ్చుకొని పోవుచుఁడ మౌని పరమేశ్వరుని ధ్యానించెను. దైవకటాక్షము వలన నాతని కేమియు విష భాధ కలుగదాయెను, ఇంతలోఁ బా మాతనిఁ బాతాళమునకుఁ దీసికొనిపోయి నాగకన్యకల నడుమ విడిచెను. ఉరగాంగన లాతనిని భక్తి యుక్తి సేవింపఁ దొడఁగిరి.
అపుడు పాతాళమును బాలించు ప్రహ్లాదుఁ డాతనిం గాంచి నమస్కరించి తనగుట్టుమట్టులఁ దెలిసికొనిరా నీతని నింద్రుఁడు పంపియుండు నని తలంచి తన యనుమానమును వెల్లడించెను. చ్యవనుఁడాతని భావమెఱిఁగి తన కింద్రునితోఁ బని లేదనియుఁ దాను నర్మదా జలముల మునిఁగినపు డొక పెనుబామీడ్చుకొని వచ్చెననియుఁ దెలిపెను. ప్రహ్లాదుఁడు సంతోషించి "ఋషీంద్రా! నీ రాకవలన నేను బవిత్రుఁడనైతిని. నాపై దయయుంచి నీవు తిరుగని తీర్ధములు క్రుంకనినదులు నుండవు కానఁ దీర్థ పరమార్థమును బోధింపు"మని కోరెను.
చ్యవనుఁడు ప్రహ్లాదుని కిట్లనెను. “హరిప్రియా! నీవంటి విష్ణుభక్తుఁ డెందును లేఁడు, నీ ప్రశ్నముల కుత్తర మీయకుండు టెట్లు? చెప్పెదను వినుము. చిత్తశుద్ధిలేని తీర్థాటనము వ్యర్థము, మనస్సు నిర్మలము కావలయునే కాని గంగలో మునిఁగినంత మాత్రమున లాభము లేదు. తీర్థవాసము మహాకష్టము. అటఁ జేసిన పాపము లత్యధిక దుఃఖాకరములు. తీర్ధములందుఁ జేసిన పాప మే విధముగను నశింపదు. మఱియు సర్వతీర్థాటనముకంటె భూతదయ, సత్యము, శౌచము, ముఖ్యములు. ఇవి కలవారి పాదముల క్రిందనే సకల తీర్థములు వచ్చి వసించును. ఐనను నైమిశము, చక్రతీర్థము, పుష్కరము ఈమూఁడును సకలలోక శ్రేష్ఠములగు భూలోకతీర్థము"లని తెలిపెను. ప్రహ్లాదుఁడు చ్యవను సతిభక్తి వీడ్కొలిపి తీర్థయాత్రాచరణ శీలియై సపరివారముగ బయలు దేఱెను.[5]
చ్యవనుఁడు లవణాసురవధకుఁ గారకుఁ డగుట
మథుఁ డను రాక్షసుఁడు శివుని మెప్పించి యాతనిచే నజేయమగు శూలమును గ్రహించి యా శూలము తన యనంతరము తన కుమారునకుఁగూడ నుపయోగింపవలెనని కోరుకొనెను. శివుఁ డంగీకరించి యా శూలము చేత నుండఁగ శత్రువు మిమ్ముల జయింపఁజాలఙ డనియును శూలము లేక యాలము చేయుచో నందు మడియవచ్చు సనియును జెప్పి యంతర్హితుఁ డయ్యెను. మథుఁడు కుంభీనసి యను రావణు చెల్లెలిని వివాహమాడెను. ఆమె యందాతనికి లవణుఁడను రాక్షసుఁడుదయించి మథుఁడు చనిపోయిన పిమ్మట నాశూలమును గ్రహించి పూజించుచుండెను. లవణాసురుఁడు పెరిగిపెద్దవాఁడై మహర్షుల కనేకబాధలు కలిగించుచుండెను. ఈ లవణాసురుని జంపించు టెట్లని మరీచి కశ్యప దళాద పులస్త్య ఋచీకాది మహర్షులు వచ్చి చ్యవనమహర్షి నుపాయ మడిగిరి. చ్యవనమహర్షి వా ఱందఱతోఁ గలసి శ్రీరామునికడ కేఁగి లవణాసురుని దారుణవృత్తాంతమును జెప్పఁగా శ్రీరాముఁడు శత్రుఘ్నుని లవణాసురవధకై పంపెను. చ్యవనుఁడు శ్రీరాముని స్తుతించి మహర్షులతోఁ దన యాశ్రమమున కేఁగెను. శత్రుఘ్నుఁడు సేనాసమేతుఁడై బయలుదేఱి పోవుచు వాల్మీకి యాశ్రమమున నొకరేయి గడపి నాఁడే సీతామహాసాధ్వి కుశలవులఁ గన్నదన్న శుభవార్త విని చ్యవనమహర్షి యాశ్రమమునకు వచ్చెను. చ్యవనుఁడు నాతని నాదరించి లవణాసురుఁడు మాంధాతను జంపిన తెఱఁగుఁ జెప్పి శూలము చేతలేని సమయముననే లవణునిఁ జంపుమని శత్రుఘ్నునకు బోధించెను. శత్రుఘ్నుఁడు చ్యవనునిమాట విని లవణాసురుని జంపిన పిదప మునులందఱును బ్రీతులై యథేచ్ఛముగా సంచరింపఁ దొడఁగిరి.[6]
సింహావలోకనము
భృగువంశవరిష్ఠుఁడై చ్యవనమహర్షి మహాతపోనిష్ఠాగరిష్ఠుఁడై యాత్మతపోబలసంపన్నతచే లోక హితార్థియై మన ఋషులలో నగ్రేసరుఁడై చెలువొందెను.