మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/కశ్యప మహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

కశ్యప మహర్షి

మరీచిమహర్షి బ్రహ్మాదులతోఁ గూడి దేవహూతీకర్దములకు జనించిన విష్ణుమూర్తి యగు కపిలమహర్షినిఁ జూడవచ్చెను. అప్పుడు కర్దమప్రజాపతి మరీచిమహర్షిని దన యింట నుంచుకొని తన కూఁతుండ్రలో నొకతె యగు కళనిచ్చి వివాహము చేసెను. అట్లు వివాహితుఁడై మరీచిమహర్షి భార్యాసహితుఁడై తపోవనమున కేగి సుఖముండెను.

అంతఁ గొంత కాలమునకుఁ గళకు మరీచిమహర్షి దయచే గర్భము సంభవింపఁ గాలక్రమమున నామె మగశిశువును గనెను. మరీచిమహర్షి కుమారుఁడు ప్రజాపతి యగు ననియు నాతనిని జాగ్రత్తగాఁ గాపాడు మనియు భార్యకుఁ జెప్పి యాతనికిఁ గశ్యప నామమొసఁగి యుక్తకాలమున నుపనయనాది సంస్కారము లొనర్చి తపోవనమున కేఁగెను.

కశ్యపమహర్షి సంతానము

కశ్యపుఁడు తరువాతఁ బెరిఁగి పెద్దవాఁడయ్యెను. బ్రహ్మ నియోగింప దక్షప్రజాపతి తనకుఁ గల్గిన పుత్తికలలో నదితి, దితి. దనువు, కాల, అవాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రథ, క్రర, వినత, కద్రువ లను వారిని గశ్యపుని కిచ్చి వివాహము చేసెను. కశ్యపమహర్షి తన భార్యలందఱకు సంసార సౌఖ్యము నొసఁగి పుత్త్రుల నిచ్చెద నని వచించెను. కొంతకాలమునకుఁ గశ్యపమహర్షి కృపచే నదితి ధాత, మిత్త్రుఁడు, అర్యముఁడు, శుక్రుఁడు, వరుణుఁడు. అంశుఁడు, భగుఁడు, వివస్వంతుఁడు, పూషుఁడు, సవితృఁడు, త్వష్ట, విష్ణుఁడు నను ద్యాదశాదిత్యులను గనెను. కశ్యపునివలన దితికి హిరణ్యాక్షుఁడు హిరణ్యకశిపుఁడు జన్మించిరి. దనువునకు విప్రచిత్తిశంబరాదిచానవులు నలువం డ్రుదయించిరి. కాల యనుదానికి వినాశన క్రోధాదు లెనమండ్రుగురు పుట్టిరి. అనాయు వనునామెకు బలవీరాదులు నలుగురు పుట్టిరి. సింహికకు రాహువు కలిగెను. ముని యను భార్య భీమ సేనోగ్ర సేనాధు లను గంధర్వులఁ గనెను. కపిలకమృతము, గోగణము. బ్రాహ్మణులు, ఘృతాచీమేనకాదు లగు నప్సరసలుఁ బుట్టరి, క్రోధ యను నామెకుఁ గ్రోధపశగణములు జనించెను. ప్రథ యను నామెకు సిద్ధాదులును, క్రూరకు సుచంద్ర చంద్రహంత్రాదులును బుట్టిరి.[1]

కశ్యపప్రజాపతికిఁ గద్రూవినతలవలని సంతతి

తరువాతఁ గొంతకాలమునకుఁ గద్రూవినతలు కుమారులఁ గాంచు నుద్దేశముతోఁ గశ్యపమహర్షి కడ కేఁగి యనేక సహస్రవర్షము లాతని నారాధించిరి. కశ్యపు డంత వారీ సేవ కానందించి వరములు వేఁడుకొనుఁ డనెను. అందుఁ గద్రువ వేయిమందిని వినత యా వేయిమందికంటె బలాధికులైన యిద్దఱు పుత్త్రులను గోరుకొనెను. కశ్యపమహర్షి యట్లే యని వారి కోర్కెఁ దీర్చుట కుగ్రతపము చేసెను. తరువాత గశ్యపుఁ డింద్రాది దేవతలను వాల ఖిల్యాది ఋషిగణములను దనకు సహాయులఁ జేసికొని పుత్త్రకామేష్టి యొనరించెను. ఆయజ్ఞమున నంగుష్ఠమాత్ర దేహులు ననవరతోపవాసకృశీభూత గాత్రులు నగు వాలఖిల్యాదులఁ జూచి యింద్రుఁడు నవ్వెను. అంత వా రాతనిపైఁ గోపించి యింద్రునికంటెను నూఱురెట్లు బలవంతుఁడగు పుత్త్రుఁడు కశ్యవున కుదయించి రెండవ యింద్రుఁ డగుఁ గాక యని మహామంత్రములతో వేల్వఁ దొడగిరి. ఇంద్రుఁడు భయ కంపితుఁడై కశ్యపుని శరణు వేఁడెను. కశ్యపమహర్షి లోకసంరక్ష ణార్థమై వాలఖిల్యాది మహర్షులఁ బ్రార్థించి భువనప్రవృత్తికి విపరీతము కాకుండునట్లు తన కుదయించుసుతుఁడు పక్షికులమున కింద్రుఁ డగు నటుటు వారందఱ నొడంబఱిచెను. పిమ్మటఁ గశ్యపుఁడు కద్రూవినతలకుఁ గోర్కిసిద్ధింపఁ జేసి గర్భముల సంరక్షించుకొనుఁ డని చెప్పి పంపివేసెను. కొంత కాలమునకు వారిగర్భములందండము లుదయించెను. వాని నెల్ల ఘృతకుండములఁ బెట్టి యిరువురు రక్షించుచుండిరి. నూఱేండ్లకుఁ గద్రూగర్భాండములు క్రమముగాఁ జిట్లి యందు శేషుఁడు, వాసుకి, తక్షకుఁడు, కర్కోటకుఁడు, ధనంజయుఁడు, కాళియుఁడు మున్నగు వేయిమంది నాగముఖ్యు లుదయించిరి. వినత తన గర్బాండములనుండి పుత్త్రులు కలుగ లేదని విచారించి యొకయండమును బ్రద్దలుకొట్టిన నందుండి యనూరుఁడు జన్మించి యకాలమున నండము జిట్లించుటచేఁ దా నంగహీనుఁడ నై తినని తల్లిని నిందించి రెండవ యండమునైనను జాగ్రత్తగాఁ గాపాడుకొనుమని తల్లికిఁ జెప్పి తాను సూర్యసారథి యయ్యెను. తరువాతఁ జిర కాలమునకు రెండవ యండమునుండి గరుత్మంతుఁ డుదయించెను.

కశ్యపుఁడు గరుత్మంతు నాశీర్వదించుట

గరుత్మంతుఁ డుదయించి మాతృ దాస్యవిమోచనమునకై యమృతముఁ దెచ్చుటకుఁ దల్లి యనుమతి కోరి యామె చెప్పిన చొప్పున సముద్రమునందలి నిషాదుల భక్షించిన నాఁకలి తీఱక తండ్రియగు కశ్యపమహర్షికడ కేఁగి యాహారమడిగెను. కశ్యపుఁడు కుమారుని ధైర్యమునకు మెచ్చుకొని విభావసుఁడు సుప్రతీకుఁ డను బ్రాహ్మణులు కలహించి కూర్మ గజ రూపులై పోరుచున్నారనియు వారిని భక్షింపుమనియుఁ జెప్పెను. గరుత్మంతుఁడు తండ్రి పంపున నలంబతీర్థమున కరిగి రౌహణ మను వృక్షముపై వ్రాల దానిశాఖ విఱిగి పోయెను. దాని నంటి తవముచేయు వాలఖిల్యులకు బాధ కలుగకుండ నాకోమ్మను గ్రిందబడకుండ నోటఁ గఱచుకొని గజకచ్ఛపములఁ జేతుల నిఱికించుకొని గంధమాదన పర్వతమునఁ దపముచేయు తండ్రికడ కేఁగి మ్రొక్కెను. కశ్యపుఁ డది గ్రహించి యా వాలఖిల్యుల నందుండి మఱియొక చోటికిఁ బొండని వేఁడు కొనెను. వా రా శాఖను విడిచి హిమగిరి కరిగిరి. కశ్యవుఁ డా శాఖను నిష్పురుష నగమున విడువు మన గరుడుఁ డతివేగమున నట్లుచేసి హిమగిరిపై దిగి గజగచ్చపముల భక్షించి మహాబల సంపన్నుఁడై యమృతము గొనివచ్చి మాతృశాప విమోచనముఁ గావించెను.[2]

భూమి కాశ్యపి యనఁబరగిన విధము

పూర్వము పరశురాముఁ డిఱువదియొక్కమాఱు నేల నిఃక్షత్త్రము గావించి యా పాపవిముక్తికై యశ్వమేధయాగమును జేసి యది పరిపూర్తి యైనంతనే కశ్యప మహర్షి ని బిలిచి భూమియంతయుఁ దక్షిణగా నిచ్చివేసెను. కశ్యపమహర్షి లోకసంరక్షణార్ధ మది గ్రహించి రాజవంశమునకు నిశ్శేషత్వము కలుగకుండుటకై పరశురాముని దక్షిణాబ్ది పారదేశమునకుఁ బొమ్మనెను. పరశురాముఁడు శూర్పాకార ప్రదేశము సముద్రుఁడు నిజహారమున కీయ నందుఁ దపోనియతినుండెను, కశ్యపమహర్షి భూమినంతను భూసురుల కిచ్చి తపోవనమున కేఁగెను. నాఁటినుండి భూదేవి 'కాశ్యపి ' యని పిలువఁబడుచున్నది,

గంగ కాశ్యపి యనఁబరగిన విధము

తొల్లి యొకప్పుడు కశ్యపప్రజాపతి మహర్షులను దర్శింప నైమిశారణ్యమున కేఁ గెను, అపు డందలి ఋషులు బహు భక్తి సత్కృతులతో నాతనిని బూజించిరి. కశ్యపుఁడు వారి యోగక్షేమము లడిగి యాదిరించిన సమయమున వారు “తాపసేంద్రా! మాకు సర్వకాలసర్వావస్థలయందును స్నానపానాదుల కనుకూల మగు నది యొకటి కావలయును. నీవు సర్వలోక సంరక్షణసమర్ధుఁడవు. నీ పేర విలసిల్లునట్లు గంగానదిని భూమిపైఁ బ్రవహింపఁ జేసి లోకక్షేమముఁ జేకూర్చి మాకోరిక తీర్పు" మని ప్రార్థించిరి.

కశ్యపుఁడు వారికోరికఁ దీర్ప నెంచి వెంటనే అర్బుథాద్రి కేఁగి యందు ఘోరనిష్ఠతోఁ బరమశివుని గుఱించి చిరకాలము మహాతపస్సు చేసెను. అంత శివుఁడు కనికరించి ప్రత్యక్షమై వరము కోరుకొనుమని కశ్యపునితో ననెను. కశ్యపుఁడు గంగను భూలోకమునఁ బ్రవహింపఁ జేయుమని కోరెను. శివుఁడట్లేయని తన జడనుండి గంగానది నొకపాయగా విడిచెను. కశ్యపుఁ డట్లు కృతార్థుఁడై పరమ శివుని భజించి గంగతో నైమిశారణ్యమునకుఁజని ఋషుల నానందింపఁ జేసెను. వారు బ్రహ్మానందపడి కశ్యపు నభినందించి ఆ గంగా వాహినికి 'కాశ్యపి' యను పే రొసంగిరి. ఈ 'కాశ్యపి' యే కృతయుగమున 'కృతవతి' యనియు, త్రేతాయుగమున 'గిరికర్ణిక' యనియు, ద్వాపరయుగమున 'చంధన' యనియు, కలియుగమున ' 'సాభ్రమతి' యనియు జగద్విశ్రుతినిఁ గాంచెను.

సాభ్రమతీనది సకల పాపసంహారిణి. ఈ నదీ-తీరమున యవక్రీతరైభ్య భృగ్వంగిరో దత్తాత్రేయ విశ్వామిత్ర భరద్వాజాది మహర్షులు తపోనిష్ఠులై నిత్యనివాసముండిరి. నీలకంఠ, నందహ్రద, రుద్రహ్రద, రుద్రమహాలయ తీర్థములును, మందాకినీ, అచ్ఛోద సాభ్రమతి యందు గూఢముగాఁ బ్రవహించును. ఈ సాభ్రమతీ నదీమతల్లి వలననే బ్రహ్మచారి, వికీర్ణ. శేత, గణాగ్ని హిరణ్యా సంగమాప్సరస స్తీర్థములును ; కపితీర్థ, మంకితీర్థ, పిప్పలాద, నింబార్కా ది మహాతీర్థము లనంత మేర్పడెను.

కశ్యపమహర్షి తప మొనరించిన యా ప్రదేశము 'కాశ్యపతీర్థ' మనఁ బరగెను. అం దాతఁడు నిర్మించిన కుండమునకు 'కాశ్యపకుండ' మను పేరువచ్చెను. అందాతఁడు కుశేశ్వరుని సంస్థాపించెను. మఱియు ఆ పరిసరముల నొక నగర మాతఁడు నిర్మించెను. అది 'కాశ్యప' యను పేరఁగాశీక్షేత్రమున కెనయై విలసిల్లెను. కశ్యపసంబంధమైన యే క్షేత్రమున నే తీర్థమున జనుఁడు స్నానమాచరించినను, దర్శించినను. సకల పాపక్షయ మంది యాతఁడు ముక్తినందును.[3]

కశ్యపుఁడు భూమిని రాజులకుఁ బంచి యిచ్చుట

కొంతకాలమునకు భూమిపై ధర్మము నశించి యధర్మము పెరుఁగఁ జొచ్చెను. బ్రాహ్మణులు యజ్ఞయాగములు మాని యకృత్యములకుఁ జొచ్చిరి. ఈ మహాదోషములచే భూమి పాతాళమునకుఁ బోవుచుండఁగాఁ గశ్యపమహర్షి తనతొడఁ గ్రుచ్చి దాపుచేసి యెత్తఁగా భూదేవి మరలఁ బూర్వరూపమున నుండెను. అంతఁ గాశ్యపి కశ్యపమహర్షికి నమస్కరించి యుత్తమక్షత్రియులు దండనీతిచే ధర్మమును రక్షించి తన్ను సురక్షితఁ జేయున ట్లనుగ్రహింపఁ గోరెను. అపుడు కశ్యపుఁడు .పరశురామునిచే జావని రాజు లెవ రనెను. భూదేవి సంతసించి హైహయులు కొందఱు పౌరవంశజుఁడగు విదూరథుని కొడుకును ఋక్షపర్వతమున ఋక్షములు రక్షించుటయు, సౌదాసుని వంశమువాఁ డొకఁడు పరాశరమహర్షి "యజ్ఞమున శూద్రకర్మలు చేయుచు బ్రదికి యుండుటయు, శిబి మనమఁడు గోపతియను వానిని వనమున గోవులు రక్షించుటయుఁ, బ్రతర్దన పుత్త్రుఁడు వత్సరాజు నట్లే జీవించియుండుటయుఁ జెప్పి వారిని బిలిపించి యధిపతులఁ జేయు మని ప్రార్థించెను. కశ్యపమహర్షి యానందించి యా రాజసుతుల నందఱఁ బిలిపింప వారెల్లరు విచ్చేసి కశ్యపునకు నమస్కరించి నిలిచిరి. కశ్యపుఁడు వారందఱుకు భూమిని విభజించి యొసఁగి పరిపాలింపుఁ డని యభిషేక మాచరించి పంపెను. క్రమముగా నా నృపులవంశములం దనేకులు పుట్టి ధరణిభారము వహించిరి. 

కశ్యపుఁ డదితివలన వామనునిఁ గనుట

తొల్లియొకసారి బలిచక్రవర్తి భృగ్వాది బ్రహ్మవాదుల నర్చించి యనంత బలోపేతుఁడై స్వర్లోక మాక్రమించెను. ఇంద్రాది దేవతలెల్లరుఁ గామరూపముల ధరించి తమతమ తోఁచినచోట్ల కేఁగిరి. బలి యైశ్వర్య విభవుఁడై యుండ భృగ్వాదు లతనిచే శతాశ్వ మేధములు చేయించిరి. ఇట్లుండఁగా, నదితి తన బిడ్డలపాటు సవతి బిడ్డల యైశ్వర్యము నరసి చింతాక్రాంతయై యుండఁగా నొకనాఁడు కశ్యపమహర్షి -భార్యపాలి కేతెంచి యోగక్షేమ మడిగెను. అదితి తన బిడ్డల దుస్థ్సితిని దితి బిడ్డల ప్రాబల్యమును జెప్పి తనబిడ్డల సంరక్షింపుమని భర్తను వేఁడుకొనెను. కశ్యపమహర్షి భావికాలగతు లూహించి నారాయణుని బ్రార్థింపు మని తనసతి కుపదేశించెను. ఏవ్రతముచే నారాయణు నుపాసింతునని యామె యడుగఁ గశ్యపుఁడు 'వయోభక్షణ' మను వ్రతమామె కుపదేశించి తత్కాల మంత్రములఁ జెప్పెను. అదితి యట్లు చేయఁగా నారాయణదేవుఁడు ప్రత్యక్షమై తా నామెకుఁ గుమారుఁ డై పుట్టి యభీప్సితముఁ దీర్తుననియుఁ బుత్త్రోత్పత్తికి భర్తను సేవింపు మనియుఁ జెప్పి యంతర్హితుఁడయ్యెను. అదితియు నానందముతో భర్తకు శుశ్రూష చేయుచుండఁగా నొకనాఁడు కశ్యపుఁ డామేతో భోగించి యచ్యుతువంశ మాత్మ నొలయ దాని నదితి గర్భమునఁ జేర్చెను, అంత నదితి గర్భవతియై కాలక్రమమున నారాయణుఁ గనెను. శంఖచక్రగదాధరుఁడు కౌస్తుభాభరణుఁడునైన హరి తన గర్భమున నెట్లుండెనని యదితి వెఱఁగుపడఁగాఁ గశ్యపుఁ డాతని ననేక విధముల స్తుతించెను. అంతఁ నారాయణుఁడు రూపాంతకమును గ్రహించి వామనుఁడై కశ్యపునింటఁ బెరుఁగఁజొచ్చెను.

కశ్యపమహర్షి మహర్షులఁ బురస్కరించుకొని యుక్త కాలమున వామనున కుపనయనము చేయ, సవిత సావిత్రి నుపదేశించెను ; బృహస్పతి యజ్ఞోపవీత మొసఁగెను. కశ్యపుఁడు మౌంజి నిచ్చెను; అదితి కౌపీన మిచ్చెను. బ్రహ్మ కమండలువును, సరస్వతి యక్షమాలికయు సప్తర్షులుఁ గుశ పవిత్రములు నిచ్చిరి. ఈ ప్రకారము వామనుఁడు వడుగై తల్లి దండ్రుల యాజ్ఞఁ గైకొని బలిచక్రవర్తికడ కేగి మూఁడడుగుల దానము రూపమున నాతనిఁ బాతాళమున కనిపి స్వర్లోక రాజ్యమును నిజసోదరుల కొసఁగి మాతృకాంక్షను దీర్చెను.[4]

కశ్యపుఁడే వసుదేవుఁడు దశరథుఁడు, నగుట

ఒకమాఱు కశ్యపుఁడు కద్రువకోరికఁ దీర్పనెంచి యామెచే ననేక వత్సరములు శుశ్రూషఁ గొని తత్పలితముగా నామెతోఁ గ్రీడించుచుండెను. ఆ సమయముననే యీవిషయ మెఱుఁగని యదితియు భర్తతోడి సంభోగమపేక్షించి నూతన వస్త్రాభరణయై యలంకరించుకొని కశ్యపమహర్షి యాశ్రమమున కేఁగెను. కద్రూ సహితుఁడైన పతిఁ గాంచి యదితి మాత్సర్యసహితయై తన ప్రయత్నమువిఫలమగుటకుఁ జింతించెను. తాను వాంఛించిన సౌఖ్యమున కడ్డువచ్చిన కద్రూ కశ్యపులపైఁ గోపించి వారిని నరులై జన్మింపుఁడని యదితి శపించెను. ఆ కారణమునఁ దరువాతఁ గశ్యపుఁడు వసుదేవుఁడు గను, గద్రువ దేవకి గను జన్మించిరి. కశ్యపుఁడు ప్రతి జన్మమందును దనకేవిష్ణుమూర్తి కుమారుఁడుగా నవతరింపఁ గోరుకొనెను. విష్ణుమూర్తి యాతని కోరిక నంగీకరించి యదితి కశ్యపులకు వామనమూర్తియై జన్మించెను. వసుదేవరూపమున నున్న కశ్యపునికే దేవకి యందుఁ గృష్ణుఁడై జన్మించెను. కశ్యపుఁడే దశరథుండై కౌసల్య యందు శ్రీరామచంద్రునిఁ గాంచెను. ఈ విధముగాఁ గశ్యపుని కోరిక ఫలించెను.[5]

పూర్వ మొకప్పుడు కశ్యపుఁడు సముద్రుని హోమధేనువుల నాతనియనుమతి నింటికిఁ దోలుకొనిపోయి చిరకాల మా గోక్షీరముల ననుభవించెను. తరువాత నొకనాఁడు సముద్రుఁడు వచ్చి యా హోమధేనువుల నిచ్చివేయుమని కశ్యపునిఁగోరెను. కశ్యపుఁ డిచ్చివేయ నెంచినను నాతవి భార్యలగు నదితియుఁ గపిలయు నీయ నంగీకరింపని కారణమున మరల వెనుదీసెను. సముద్రుఁడు బ్రహ్మతోఁ జెప్పుకొన్నను బ్రయోజనము లేకపోఁగాఁ కశ్యపుఁడు భూమిపై గోపాలకుఁడై పుట్టుఁగాక యని యాతఁడు శపించెను. ఆ శాపముచేతనే కశ్యపుఁడు వసుదేవుఁడై పుట్టి కంసుని గోగణమున కధిపతి యయ్యెను.

కశ్యపునివలన దితికి మరుద్గణము పుట్టుట

ఇంద్రుఁడు బలవంతుఁడై దితికుమారులను బాధించుచుండఁగా నొకనాఁడు దితి భర్తను జేరి విచారముతోఁ దన కింద్రునంతబలము కలయొక కుమారు నిమ్మని కోరుకొని యనేక వర్షము లతనికి శుశ్రూష చేసెను. కశ్యపమహర్షి యామె కోరిక చెల్లించెను. దితి గర్భవతియై యుండఁగా నింద్రుఁడీవిషయ మెఱిఁగి తనసేవ నంగీకరింపుమని దితిని గోరఁగా నామె యానందించి యంగీకరించెను ఒకనాఁ డామె యశుచియై శయనించియుండఁగా నింద్రుఁడామె గర్భమును బ్రవేశించి గర్భస్థశిశువు నేడు ఖండములుగాఁ జేసెను. అంత నా ఖండము లేడు నేడుగురు శిశువులై విలపించుచుండఁగా నొక్కక్కని నేడేసి ఖండములుగా మరల నింద్రుఁడు ఖండించెను. . ఈలోపున దితి మేల్కొని యీవిషయ మెఱిఁగి వా రతనికి శత్రులు గాక మిత్రులే యగుదురని యింద్రుని రక్షింప వేఁడెను. ఇంద్రుఁడు వారి ననుగ్రహించి వెడలిపోయెను. ఇట్లు వారు నలువది తొమ్మండ్రుగురును బుట్టి 'మరుద్గణ' మనుపేర విలసిల్లిరి.

కశ్యపుని జ్ఞానబోధ

కశ్యపుని భార్యలలో దితిదనువు లొకప్పుడు తమ పుత్త్రులు దేవతల చేతిలో మృతి చెందిరని మిక్కిలి దుఃఖంపఁ దొడఁగిరీ. అపుడు కశ్యపుఁ డట కరుదెంచి వారి కిట్లు బోధించెను. “కాంతలారా! పురాకృత కర్మఫల మనుభవింపక తప్పదు. మీ పుత్త్రులు శమదమ దయాధర్మనిరతులు కారు. అందుచే వారు నశించిరి. మీరు వారికై నగవవలదు. ఏలన దుఃఖము, సత్యధర్మములను నశింపఁజేయును. ధర్మక్షయము వలనఁ బుణ్యక్షయ మగును. పుణ్యక్షీణతయే సర్వదుఃఖములకుఁ గారణము. అందుచేతనే మహాఋషులు సంసారము బహుళదుఃఖమునకుఁ దా వని దానిని రోసి దానివలన దుఃఖము తమకిఁకఁ గలుగకుండుటకై ఘోరతప మొనరింతురు.

నిత్యుఁడు, నిర్వికారుఁడు, నిర్గుణుఁడు నగు పరమాత్మయందు మాయాశక్తివలనఁ బంచతన్మాత్రలు. పంచభూతములు పుట్టినవి. వానివలన లోకములు, స్థూల శరీరములు మున్నగునవి పుట్టినవి : జ్ఞానేంద్రియ ప్రాణపంచకములు, మనోబుద్ధులు జనించినవి. లింగ సూక్ష్మకారణశరీరములతో నైక్యభ్రాంతి నొంది పరమాత్మ జీవుఁడై కర్మఫలభోక్త యగును. జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థాభిమాని యై జీవుఁడు విశ్వుఁడు, తైజసుఁడు. ప్రాజ్ఞుఁడు నగును. శరీరమునే తానను కొను జీవుఁడు గురూవదిష్ట మహావాక్యముచే అపరోక్ష జ్ఞానమంది పునరావృత్తిరహితమైన మోక్షమందును. ధర్మము, శరీగము. సత్యము, హృదయము, నగు విష్ణుని భజించి తత్కీర్తన స్మరణ పూజావందనములచే జీవుఁడు జీవత్వభావము విడిచి పరమాత్మతాదాత్మ్యము నందఁ గలడు" ఇట్లు బోధించి వారికి జ్ఞాన సుఖ మొసఁగి కశ్యపుఁడు తపమున కేఁగెను.[6]

కశ్యపస్మృతి

కశ్యపస్మృతి లేక కశ్యపధర్మసూత్రము లను పేర నొక ధర్మశాస్త్రము గాననగుచున్నది. అగ్నిసాక్షిగా వివాహమాడక కొని యింట నుంచుకొన్న స్త్రీ భార్యకాఁజాల దని, యామె దేవ పిత్సకార్యములలోఁ బాల్గొన నర్హురాలు కాదని కశ్యపుఁడు చెప్పిన శ్లోకమును బోధాయనుఁడు పేర్కొనెను. విశ్వరూప హరదత్తాదు లెల్లరును గశ్యపస్మృతినుండి యుదాహరించి యున్నారు.

కశ్యప గీత

కశ్యపమహర్షి క్షమాగుణమును బ్రశంసించుచుఁ దెలిపిన వాక్యములకే కశ్యపగీత యని పేరు. దానియందలి ప్రధాన భావమిది. వేదములు, యజ్ఞములు, శౌచము, సత్యము, విద్య, ధర్మము, సచరా చరమయిన జగమంతయు క్షమయందే నిలిచినవి. తపస్స్వాధ్యాయ యజ్ఞకర్తలు, బ్రహ్మవిదులు పడయు పుణ్యగతులు క్షమావంతులు పడయుదురు.[7]


  1. భాగవతము - చతుర్దస్కంధము.
  2. భారతము - అదివర్వము.
  3. పద్మపురాణము - ఉత్తరఖండము.
  4. భాగవతము.
  5. బ్రహ్మవైవర్తపురాణము.
  6. పద్మపురాణము- భూమిఖండము.
  7. కశ్యపగీతా
    క్షమా ధర్మః క్షమా యజ్ఞః క్షమా వేదా క్షమా శ్రుతమ్ !
    య ఏతదేవం జానాతి వసర్వం క్షంతు మర్హతి ? ||
    క్షమా బ్రాహ్మ క్షమా సత్యం క్షమా భూతం చ భావి చ|
    క్షమా తపః క్షమా శౌచం క్షమ యేదం ధృతమ్ జగత్ ||
    అతియజ్ఞవిదాన్ లోకాన్ క్షమిణః ప్రాప్నువంతి చ |
    అతిబ్రహ్మ విధాం లోకా వతి చాపి తపస్వినామ్ ||
    అన్యే వై యజుషాం లోకాః కర్మణామపరే తథా |
    క్షమావంతాం బ్రహ్మ లోకే లోకాః పరమపూజీతాః ||
    క్షమా తేజస్వినాం తేఱః క్షమా బ్రహ్మ కపస్వినామ్ |
    క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞ! తమా శమః ||