మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/కపిల మహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

కపిల మహర్షి

తొల్లి కర్దమప్రజాపతి కృతయుగమున విశ్వసృష్టికై బ్రహ్మచే నియోగింపఁబడి సరస్వతీనదీతీరమున కేఁగి పదివేల దివ్యసంవత్సరములు తపముచేసెను. ఆతఁ డొకనాఁడు జపసమాధి నేకాగ్రచిత్తుఁడై విష్ణుమూర్తిని ధ్యానింపఁగా నాతఁడు ప్రత్యక్షమై దేవహూతివలనఁ దొమ్మండ్రు కూఁతులును దన యంశముచే నొక కుమారుఁడును నాతనికి జన్మించునని వరమిచ్చి యంతర్హితుఁ డయ్యెను. తరువాతఁ గొంత కాలమునకే దేవహూతికిఁ గర్దమునివలనఁ గళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు. గతి. క్రియ, ఖ్యాతి. అరుంధతి, శాంతి యను తొమ్మండ్రు కూఁతుం డుద్భవించిరి. పిమ్మటఁ గర్దముఁడు సన్న్యసింప నెంచఁగా దేవహూతి యాతని పదములకు మ్రొక్కి "దేవా! కూఁతుండ్రకు యుక్తకాలమున వివాహముచేసి యాపై నాకు జ్ఞానోపదేశము చేయఁగల సుకుమారుని దయచేయుఁడు నేను తరించిన పిమ్మటఁగాని తాము సన్న్యసింప వల" దని వేదనా భరమునఁ బలికెను. కర్దముఁ డామె గర్భమున నచిరకాలముననే జనార్దనుఁడు సుతుఁడై పుట్టును గాన నాతని పాదపద్మములు పూజించుచుండు మనియు నా కుమారుఁడే యామె శంకాగ్రంథి విచ్ఛేదము చేయుననియుఁ జెప్పి గృహముననే యుండెను.

కపిలుని జననము

దేవహూతి భర్తవాక్యానుసార మట్లు భగవంతునిఁ బ్రార్థించుచుండఁగాఁ గొంతకాలమునకుఁ గార్దమ మైనతేజమున విష్ణుమూర్తి దేవహూతిగర్భమును బ్రవేశించి కాలక్రమమున దనుజారి శమీతరుకోటరమున వైశ్వానరుఁ డావిర్భవించినట్లామె గర్భమున గుమారుఁడై జన్మించెను; అప్పు డాకసమున దేవతూర్యఘోషములు తుముల, మయ్యెను. దేవతా బృందములు మందారవృష్టిఁ గురుసిరి; గంధర్వ కిన్నర గానములు నప్పరోవనితల యాటపాటలు నొప్పెను. పిమ్మట నారాయణుని దర్శించుకొఱకు మరీచిప్రముఖమునిగణసేవితుఁడై చతుర్ముఖుఁడు వచ్చి కపిలుని దర్శించి దేవహూతీ కర్దముల కాతని నెఱిఁగించి మరీచిని దిగవిడిచి సనకసనందన నారదులతో నంతర్హితుఁ డయ్యెను.

కపిలమహర్షి తండ్రికిఁ గర్తవ్యము బోధించుట

పిమ్మటఁ గర్దమ ప్రజాపతియుఁ దన దుహితల వివాహ మాడుటకు మహర్షులఁ బిలువఁ బంచి వారు వచ్చిన వెంట నే మరీచికిఁ గళను, అత్రిమహర్షికి కనసూయను, అంగీరసునకు శ్రద్ధను, పులస్త్యునకు హవిర్భువును, పులహునకు గతిని, క్రతువునకుఁ గ్రియను, భృగువునకు ఖ్యాతిని, వసిష్ఠుని కరుంధతిని, అధర్వునకు శాంతిని నిచ్చి నిజకులాచారానుసారముగా మహావైభవముతో నుద్వాహము లొనర్చి యల్లుండ్రను గూఁతుండ్రనాశీర్వదించి సంభావనా సంభావితులఁజేసి వారివారి గృహముల కంపివేసెను. తరువాత గుమారుఁడగు కపిలమహర్షి నేకాంతమునకుఁ దీసికొనిపోయి వందనమాచరించి “మహాత్మా! పరమేశ్వరుఁడ వగు నీవు నీమాటలు తప్పకుండ నాగృహమునఁ బుట్టితివి. సంసార చక్రపరిభ్రామ్యమాణుల మగుచు గ్రామ్యుల మగు మా వర్తనములు గణింపక యనుగ్రహించి నాకు ముద మొదవించితివి. దాన నేను ఋణత్రయములనుండి తొలఁగితిని. ఇఁక యోగసమాధి నిరతి నీ పాదారవిందములు డెందమునఁజేర్చి శోకములఁ వాసి యేకాంతస్థలమున సంచరించెద" నని పలికెను. అంతఁ గపిలమహర్షి “వరమునీంద్రా! నిర్హేతుక దయాగుణమున నా వాక్యముల ననుసరించి నీయింటఁబుట్టితిని. నేను నన్మునివేషము ధరించుట నాకొఱకుఁ గాదు. మహాత్ములైన మునులకుఁ దత్త్వబోధము చేయుటకే యని తెలిసికొనుము. సన్న్యస్త సకల కర్ముండవై నన్నే భక్తితో భజింపుము. మోక్షము నొందెద" వని కర్తవ్యము బోధించెను. అంతఁ గర్దముఁడు నాతని కధికభక్తి ననేక వందనములు చేసి మునిగణసేవిత మగు వనమున నిస్సంగుఁడై , యాత్మైక శరణతత్పరుఁడై పరబ్రహ్మమును జిత్తముల నిలిపి సమత్వ శాంత శేముషీగరిష్ఠుఁడై, ధీరుఁడై నిఖిలప్రపంచము వాసుదేవమయముగానెంచి భక్తిభావమున భాగవతగతిం జెందెను. ఇటఁ గపిలమహర్షి బిందుసరమునఁ దీవ్ర తపోనియతి నుండెను.

కపిలమహర్షి దేవహూతికి మోక్షమొసఁగుట

అంత దేవహూతియుఁ గొమరుని దర్శించి యాతని శరణంబువేఁడి రక్షింపుమని యాశ్రయించెను. కపిలమహర్షి యాత్మ నలరి దేవహూతికి జీవునిచిత్తము సంసారమునఁ దగులుకొని త్రిగుణాసక్తమగుననియు, నదియే నారాయణా సక్తమైనచో మోక్షకారణమగు ననియుఁ జెప్పెను. పిమ్మట నాతఁ డామెకు సాంఖ్య యోగమును, భక్తియోగమును బోధించెను. తరువాత దేవహూతి కపిలోక్తమార్గముస గురుయోగశక్తిచే నంబరమున కెగసి వాసుదేవ చరణాంబురుహన్యస్త చిత్తయై శ్రీహరియందుఁ గలిసెను. ఆమె మోక్షమున కేఁగిన క్షేత్రము "సిద్దిపద" మని ప్రసిద్ధికెక్కెను. అంతఁ గపిలమహర్షియు సిద్ధచారణాదులు గొలువ సముద్రునిచేఁ బూజాదులందెను. ఆతఁ డనంతరము సాంఖ్యాచార్యా భిష్ఠుతమగు యోగము నవలంబించి శాంతి సమాహితుఁడై పిత్రాశ్రమమును వీడి యుదగ్భాగమున కేగెను.[1]

కపిలమహర్షి వేదప్రామాణ్యబుద్ధి

ఒకప్పుడు కపిలమహర్షి యుత్తమాకృతి యగు గోవునుజూచి వేదస్వరూపమని పలికియు నిర్లక్ష్యముగ నుండెను. కొంత దూరమున నున్న సూర్యరశ్మి యను సంయమి కపిలుసకు వేదములయం దేభావమున్నదో యెఱుఁగఁ గోరి సూక్ష్మరూపమున నా గోవును బ్రవేశించి “మహర్షి వర్యా! వేదములు దాంభికత్వాపాదకము లని యతులు పల్కుదురు. నీవు నా యభిప్రాయముతో నుంటివా?" యని యడిగెను. అందులకుఁ గపిలమహర్షి వేదములయందు నా కాదరానాదర భావములు లేవు. కాని, సంసారు లెల్లరకు వేదవిహితాచారము వలయును. పాణి యువస్థము నుదరము వాణి యనునవి మూయరాని వాకిళ్ళు. వానిని మూయఁగల్గిన బుథునకుఁ దపోదానవ్రతాదులు గాని వేదప్రామాణ్యముకాని కావలసిన పనిలే " దని చెప్పెను. అంత స్యూమరశ్మి సంతసమున గోగర్భమునుండి బయటపడి కపిలునకు నమ స్కరించి 'సత్య మెఱుఁగఁగోరి యట్లు గోగర్భమునఁ జొచ్చి ప్రశ్నించితిని. మన్నించి వేదప్రామాణ్యమును గుఱించి నా మనశ్శాంతి కొఱకింకను జెప్పు' మని వేఁడుకొనెను. అంతఁ గపిలమహర్షి వాని భావమెఱిఁగి " వేదములే లోకమునకుఁ బ్రమాణములు. శబ్దబ్రహ్మ్మ పరబ్రహ్మలలో శబ్దబ్రహ్మము మూలమునఁ బరబ్రహ్మము గ్రహింప వచ్చును. బ్రాహ్మణు లుత్తములై వేదచోదితకర్మములం జేయుచు శాశ్వతపదము నందవచ్చును. వేదతాత్పర్యమరసి వేదితవ్య మెఱుఁగువారలే వేదజ్ఞులు. ఇట్లు కానివారు వేదపాఠకులు ; సర్వము వేద పరినిష్ఠితము. కావున, నేను వేదమానిత బ్రాహ్మణులకు సమస్క రింతు" నని పలికెను. ఈ మాటలు విని స్యూమరశ్మి యానందించి వెడలిపోయెను.[2]

కపిలమహర్షి పుండరీకు ననుగ్రహించుట

తొల్లి పుండరీకుఁ డను మహారాజు మృగయా వినోదార్ధము సపరివారుఁడై వనముఁ జొచ్చి యథేచ్చము మృగముల వేఁటాడి దప్పిగొని కపిల మహర్షి యాశ్రమ ప్రాంతమునఁగల సరోవరమునందు చల్లనివి, తియ్యనివి. స్వచ్ఛమైనవి యగు నీళ్ళు త్రాగి యట నొక లేడి యా ప్రాంతమునఁ బరుగిడుట చూచి యారాజు దాన పై నొక బాణమును విడిచెను. ఆ బాణము తగిలి యా లేడి కపిలముని యాశ్రమము కడకు వచ్చి పడి మరణించెను. అది చూచి కపిలుఁడు తన యాశ్రమమున నిట్టిహింస కావించిన మూర్ఖుఁ డెవఁ డని లేచి యటఁ దిరిగి యొక చెట్టునీడను విల్లమ్ములతోనున్న రాజును జూచెను.

కపిలునిగాంచి పుండరీకుండు గడగడ వణఁకుచు లేచివచ్చి భక్తితో నమస్కరించి కులగోత్రములు చెప్పుకొని తన తప్పిదమును మన్నింపుమని కోరెను. అంత నా మహర్షి యాతనితో నిట్లనెను. "ఓయీ! క్షణభంగుర మగు జీవితము గల మానవుఁడు పశువుకన్న బుద్ధిబలమున మిన్న యయ్యు , ఏపాపమెఱుఁగని, నోరులేని. సాధుజంతువులఁ జంపుటవలన మహాపాపము గడించును. నీ విట్లు దారుణకర్మ మొనరించుటకుఁ గారణమేమి ! రక్తమాంసాది మయ మగు నీ దేహముపై నీకెట్టి మమత కలదో ఆ లేడికి దాని దేహముపై నట్టి మమత యుండదా? తుచ్ఛమగు నీ విలాసమునకై పసికందు, పుణ్యజీవి, యగు నీ లేడి నిండు ప్రాణములను బలిగొంటివే? ని న్నిప్పు డేమిచేసినను దప్పులే" దని యాతని నెంతయు నిందించి వైరాగ్య ముపదేశించెను.

పుండరీకుఁడా మహామహుని మాటలు శూలములవలెఁ గ్రుచ్చుకొనఁగా సిగ్గుపడి పశ్చాత్తాపమంది. తానుజేసిన దోషమున కామహర్షి యెదుటనే ప్రాణత్యాగము చేసికొనఁ దలఁచి వాడియగు కత్తి నొరనుండి తీసి తన శిరముఁ ద్రుంచుకొనఁ బోవుసంతఁ గపిలుఁడు కనికరించి యాతని నాత్మహత్యనుండి కాపాడెను. పుండరీకుఁడు కపిలుని పాదములపైఁ బడి జ్ఞానభిక్షఁ బెట్టుమని ప్రార్థించెను.

అంతఁ గపిలమహర్షి యాతని కిట్లు బోధించెను. “రాజా! మోక్ష మపేక్షించు మానవుఁడు పూర్వదానఫలమునఁ గలిగిన సంప దలు క్షణికములనియు, పరహింసా వ్యాపారములు పాపహేతువులనియు, నెఱిఁగి భయపడుచు గురుపాదము లాశ్రయించి తత్వ మెఱిఁగి దృఢనిశ్చయుఁడై మెలఁగ వలయును. అట్లు మెలఁగువారు మూఁడు రకములు ; అంకురితులు, పుష్పితులు, ఫలితులు, మోక్ష ధర్మాపేక్షగలవా రంకురితులు ; తదాచార నిరతులు పుష్పితులు ; జీవన్ముక్తులు ఫలితులు. వీరు గురుబోధితజ్ఞానమున మోక్షమందుదురు." ఇట్లు బోధించి కపిలుఁ డాతనిని వీడ్కొలిపి నిజాశ్రమమునకు విచ్చేసెను.

తదనంతరము పుండరీకుఁడు సర్వసంపదలను రోసి వైరాగ్య యుతుఁడై కపిలమహర్షి యాశ్రమమునకు విచ్చేసి తన్ను శిష్యునిగా ననుగ్రహించి తపముచేయ ననుమతింపు మని యాతనిఁ గోరెను. కపిలుఁ డాతనిఁ గన్నెత్తిచూడక నోటఁ బలుకక తృణీకరించెను. కాని, పుఁడరీకుఁడు పదమూడు దినము లటనే జలాంజలిత్రయ పానమాత్రముసఁ గదలక మెదలక కపిలునే ధ్యానించుచు నుండెను. పదునాలవ దినమునఁ గపిలుఁడు శిష్య సహితుఁడై సంధ్యాద్యనుష్ఠానములఁ దీర్చి యాతనిఁ బలుకరించి యాతని మనస్సు రాజ్య సతీ పుత్రాదులపై మరలింప యత్నించెను. కాని పుండరీకుఁడు నిజమగు విరాగమున నుండుటచేఁ జలింపఁడాయెను. కపిలుఁ డపుడు సంతసించి యాతనికి గర్మ భక్తి వైరాగ్య జ్ఞాన యోగములు బోధించి

"పరాయ సరరూపాయ
           పరమాత్మన్ పరాత్మనే
 నమః పరమ తత్త్వాయ
           పరానందాయ ధీనుహి"

అను మహామంత్రము నుపదేశించి యనుగ్రహించెను.

పుండరీకుఁ డట్లు కపిలమహర్షినే గురువుగా భావించి యాతని యుపదేశామృతమునఁ బునీతుఁడు శ్రద్ధా భయభక్తి యుక్తుఁడై చిర - కాల మా మంత్రమును జపించి విష్ణుదేవుని బ్రత్యక్షము చేసికొని యాతని కటాక్షమున మోక్షమునందెను [3]

కపిలమహర్షి సగరపుత్త్రుల భస్మముచేయుట

మఱియొకప్పుడు సగరచక్రవర్తి విష్ణుప్రీతికొఱకై యనేకాశ్వ మేధయాగములఁ జేసి తృప్తిగనక మఱియొక మఖమును జేయ హయమును విడిచెను. అసూయాగ్రస్తుఁడై యింద్రుఁ డాగుఱ్ఱమును నాగలోకమునకుఁ దీసికొనిపోయి యట నొకచోఁ దపోనియతి నున్న కపిలమహర్షి యాశ్రమ సామీప్యమునఁ గట్టివైచి వెడలిపోయెను. యాగాశ్వ సంర కషణమునకై సగరుఁడు నిజపుత్త్రులఁ బంపెను. వారు చని యేడుదీవులు వెదకి యశ్వముఁ గానక భూమిఁ ద్రవ్వి పాతాళ లోకమున కేఁగిరి. అందుఁ దిరిగి వారు కపిలమహర్షి యాశ్రమ ప్రాంగణమున నున్న యశ్వముఁ జూచి యాతఁడే దానిని హరించి యుండె నని భావించి యాతనిఁ జంప నేఁగిరి. కపిలమహర్షి కనుదెఱచి చూచెను. వెంటనే సగరపుత్త్రు లరువది వేల మందియు భస్మీ భూతులై పోయిరి. తరువాత సగరుఁడు మనుమఁడగు నంశుమంతుని బంప నాతఁడు పాతాళమున కేఁగి యందుఁ గపిలాశ్రమ సామీప్యమున భస్మరాసుల పొంతనున్న యశ్వమును జూచి కపిలమహర్షికిఁ బ్రణమిల్లి యనేక విధములఁ బ్రార్థించెను. కపిలుఁడు “బుద్ధిమంతుఁడా! గుఱ్ఱమును దోలుకొనిపోయి మీ తాత జన్నముఁ బూర్తిసేయింపుము. వెఱ్ఱులై నీతండ్రు లిట భస్మమైరి. గంగాజలములు వీరిపైఁ బ్రవహించిన వీరికి ముక్తికల్లు"నని యనుగ్రహించెను. అంశుమంతుఁడు కపిలు ననుగ్రహమునకుఁ బాత్రుఁడై తండ్రుల దుఃస్థితికి విచారించి యాగాశ్వమును గొనిపోయి తాత యశ్వమేధమును బూర్తి చేయించెను. తుదకు భగీరథుఁడు గంగా జలమును బాఱింపఁ జేసి సగరపుత్త్రులకుఁ బుణ్యలోకము లొసఁగెను.[4] పూర్వ మొకప్పు డశ్వశిరుఁ డను మహారా జనేక యాగములఁ జేసి యనేక విధముల బ్రాహ్మణులను సత్కరించుచుండెను. కపిలమహర్షి యశ్వశిరుని యోగ్యత యెఱిఁగి యాతనిఁ గటాక్షించు నుద్దేశముతో నొకమాఱు. జైగీషవ్యుఁ డను ముని వెంటరాఁగా నశ్వశిరుని గృహమున కేఁగెను. నాఁ డశ్వశిరుఁడు యజ్ఞదీక్షితుఁడై బ్రాహ్మణుల కనేకభూరి దక్షిణ లిచ్చి సమ్మానించెను. ఆతఁడు కపిల జైగీషవ్యుల నెంతయు నాదరించి పలువిధములఁ బూజించెను. తరువాత నశ్వశిరుఁడు కపిలమహర్షికి మ్రొక్కి “మహాత్మా! మీరాకచే నేను ధన్యుఁడనైతిని. విష్ణుమూర్తి కటాక్షసంపాదనకు నే నేమి చేయవలయునో తెలుపుఁ"డని కోరెను. అంతఁ గపిలమహర్షి "రాజా! నేనే విష్ణుమూర్తిని. నన్నుఁ బూజించిన నీవు కృతార్ధుఁడ వగుదువు. నేనుగాక వే ఱొక విష్ణుమూర్తి కలఁడని యెంచుటకన్న సవివేకము లే" దని పల్కెను. ఆశ్వశిరుఁడామాటల కాశ్చర్యము నంది యాతని యహంభావమున కసహ్యించుకొనెను. కాని, కపిలమహర్షి నేమియు ననఁ జాలక “మహాత్మా ! విష్ణుమూర్తిని నేనెఱుఁగుదును. ఆతఁడు శంఖచక్రగదాపాణి గరుడవాహనుఁడు గదా! నీవే విష్ణుమూర్తివన్న నవి నీకు లేవుగదా" యనెను. ఈమాట లశ్వశిరుని నోటినుండి వెలువడఁగానే కపిలమహర్షి విష్ణుస్వరూపుఁడై శంఖచక్రగదాపాణి యయ్యెను. జైగీషవ్యుఁడును గరుడుఁడై యాతని వాహన మయ్యెను. అంత నశ్వశిరుఁడు తన నేత్రములను నమ్మజాలక యది యంతయు మోసమనియు విష్ణుమూర్తి కమలనాభుఁ డనియు బ్రహ్మ యందుండి జన్మించెననియు నట్లు లే దేమని యడిగెను. వెంటనే కపిలమహర్షి కమలనాభుఁ డయ్యెను. అంత జైగీషవ్యుఁడు బ్రహ్మయై నిలచెను. దిన, నశ్వశిరుఁడు నమ్మఁజూలక యది యంతయు మోసమే యనియుఁ గపిలమహర్షి విష్ణుమూర్తికాఁ డనియు ననెను. వెంటనే కపిలుని మాహాత్మ్యమున సభాసదు లెల్లరంతర్థానమైరి, యజ్ఞశాల దుష్టమృగములతో నిండిపోయెను. అశ్వశిరుఁ డతిభయాకుల చిత్తుఁడై కపిలమహర్షి యే విష్ణుమూర్తి యను పూర్ణవిశ్వాసము కలుగఁగాఁ దిరిగి యాతనిఁ బ్రార్థించెను. వెంటనే కపిలుఁడు ప్రత్యక్షమయ్యెను. సభాసదులు వచ్చిరి. దుష్టమృగము ఆంతర్ధానమయ్యెను. అశ్వశిరుఁడు కపిలమహర్షి పొదములపైఁ బడెను. కపిలమహర్షి యాతనిఁ గటాక్షించి “రాజా! నీవు విష్ణుభక్తుఁడవు, విష్ణునెట్లు వశపఱచుకొనఁగలవని యడిగితివి. బ్రహ్మాది స్తంబపర్యంతము విష్ణుమూర్తి రూపమే యని గ్రహించిన, నాతఁడు నీకు వశుఁ డగును. విష్ణుఁడు సర్వాంతర్యామి సర్వము నని నిరూపించుట కిట్లు చేసితిని. ఇఁకనైన నీ వది గ్రహించి కులోచిత ధర్మములను వేదవిహితాచారములను నెఱవేర్చుచు సుజ్ఞానము నందిన మోక్షము నందఁగలవని బోధించి కపిలమహర్షి జైగీషవ్యునితో వెడలిపోయెను.[5]

కపిలుని సాంఖ్యసిద్ధాంతము

కపిలమహర్షి సాంఖ్యయోగమును బోధించిన మహాత్ముఁడు, "విషయములవిధము తెలిసికొని శ్రుతివాక్యములచే వాని తత్త్వమును గ్రహించి దృఢజ్ఞానముచే వానిని విడిచిపెట్టవలయును. ఆయువు క్షణిక మనియు సుఖదుఃఖములు కాలగతి వచ్చు ననియు నెఱుఁగవలెను. కర్మతత్త్వము వేద చోదనముల విధము గ్రహించి సత్త్వరజస్తమోగుణములచే బుద్ధికిఁ గలుగు ప్రవర్తనముల గుర్తెఱుఁగ వలయును. పంచేంద్రియములు గోష్ఠమునందు. నగ్ని వాయువులు బయలను, పావకునందుఁ దోయములును, భూమి తోయములందును, బలము కౌశికునందును, గ్రాంతి యు పేద్రునందును, నర్థమున లోభమును, మనస్సున బుద్దియు, రజస్సునఁ దమస్సును, సత్త్వమున రజస్సును దగులును. సత్త్వమాత్మఁ దగులును. ఆత్ముఁడు నారాయణుఁ డనియు మహేశుఁ డనియు నొప్పుచుండును; ఆత్ముఁడు పరమునఁ దగులును; పరము మోక్షమునఁ దగులును మోక్ష మింక నెందును దగులదు, పదునాఱు వికారములు గల ప్రకృతి యాత్మ కాశ్రయము. ఆత్ముఁడు ప్రకృతివికృత్యతీతుఁడు. ఆత్మునకు రెండు రూపములున్నవి. ఒకటి విషయములందును రెండవది మధ్యస్థభావమునందును బ్రవర్తిల్లును. ప్రాణాపాన వ్యానో దానసమానములను నై దువాయువులు నాతనివి. వీనివిధము నెఱిఁగినఁ గలుగుజ్ఞాన మంతరాత్మునిఁ జూపును. గర్భవాస దుఃఖము, జన్మవ్యధ, బాల్యవిమూఢత్వము, రాగము, క్లేశము, వార్దక్యము, వీని వలనఁ గలుగు కృపణతలు గుర్తెఱిఁగి సంగముఁ బాసి యాత్మునిఁ గని మోక్ష మందఁదగును. దేహగుణాదిదోషముల నెల్లఁ ద్రోచు మార్గములను గ్రహించి యామార్గ పరిచయమున విష్ణుమాయచేఁ దోఁచు విశ్వమంతయు బుద్బుద ప్రాయముగా ఫేన సదృశమై మృద్ఘటములఁబోలి యున్న దని గ్రహించి దానిని లక్ష్య పెట్టక మోక్షమార్గము నరయుటయే సాంఖ్యము. కపిలమహర్షి బోధించిన యీ సాంఖ్యదర్శనము ప్రజాపతిపూజ్యమై, వేదశాస్త్ర పురాణ విదిత పరిజ్ఞానముల కెల్లఁ జేగుగడయై బ్రహ్మభావ భాజనతకు సరిలేని సమ్యగు పాయమై వెలసినది, ఇదియే షడధ్యాయవిలసితమై, త్రివిధ దుఃఖాత్యంత నివృత్త్యత్యంత పురుషార్థాదికనిగదనమై “కపిలస్మృతి" యనఁ బరగుచున్నది.[6]

కపిలుని భక్తియోగము

కపిలమహర్షి మాతృదేవికి భక్తియోగమును బోధించెను. తామస రాజస సాత్విక మను భేదములఁ ద్రివిధముల భక్తియోగము నిట్లు నిరూపించెను. 'నిత్యము హింసాపరుఁడై దంభ మాత్సర్యాదుల కాలవాలమై యొప్పు చున్నను, భేదదర్శియై భగవద్భక్తుఁ డగు వాఁడు తానుస భక్తుఁడు. విషయ సుఖములఁ బ్రవీణుఁడై యైశ్వర్యాదుల ననుభవించుచున్నను భగవద్భక్తి విడువని వాఁడు రాజస భక్తుఁడు. పాప పరిహారమునకై భగవదర్పణ బుద్దితో గర్మములు చేయుచు జన హితకారియై భక్తుఁ డగువాఁడు సాత్త్విక భక్తుఁడు. పరమేశ్వరుని గుణములను వినుటచేఁ గలిగిన భక్తిచే నైన నాతనిపై మనస్సును నిల్పినవాఁడును బరమభక్తుఁ" డని కపిలుఁడు భక్తియోగమును దదనంతఫలమును విశదీకగించెను[7]

కపిలమహర్షి రావణునకు విశ్వరూపము చూపుట

కపిలమహర్షి యొకప్పుడు పశ్చిమ సముద్ర తీరమున నొక యరణ్యములోఁ బద్మాసనస్థుఁడై కన్నుఁగవ మూసికొని యాత్మయోగ సుఖ మందుచుండెను. అప్పుడు రావణుఁడు వరగర్వముచే బలవంతుల నందఱను జయించు నుద్దేశముతోఁ దిరుగుచుఁ గపిలమహర్షిని గాంచెను. రావణుని కంటికిఁ గపిలమహర్షి నేత్రాంచలముల నగ్ని శిఖలు, బాహువుల యందు బహుళితాయుధములు, శరీర మందెల్ల మరుద్వసు రుద్ర సంఘములు గాననై దుస్సహముగాఁ గాన వచ్చెను. మఱియుఁ గపిలమహర్షి యురమున లక్ష్మీదేవియు, శల్యముల మరుద్గణములు, కడుపున సముద్రములు, కన్నులలో సూర్య చంద్రులు, ధాత, విధాత, రుద్రాదులు మున్నగువారెల్లరు నాతని శరీరమునఁ గాననైరి. రావణుఁ డిది ఋషులమాయ యని వానిపై ననేక శస్త్రాస్త్రములు ప్రయోగించెను. వెంటనే కపిలమహర్షి "ఓరీ ! చెడుగా ! నన్ను సాధింప వచ్చితివా?" యని పిడికిలిచేఁ బొడిచెను. దానితో రావణుఁడు మూర్ఛపడెను. తోడి దైత్యులాతని నెదిరించిరి. కపిలుఁడు దైత్యుల హుంకరించి గుహాభ్యంతరమున కేఁగెను. రావణుఁడు కొంత సేపటికి మూర్చ దేఱి యాతని సాధింప నెంచి బాణ కృపాణాదులతోఁ గపిలుని గుహఁ బ్రవేశించెను. అందు మహావీరులు దేవసుతులు, సిద్ధులు, శంఖచక్రాదులు ధరించి చతుర్భుజులైన పురుష వరులు గాననైరి. దివ్యసౌరభములు నిండఁగ రమణీయరోచుల నీను రత్నాలంకారముల ధరించిన స్త్రీలు వింజామరలు వీచుచుండఁగాఁ సౌందర్యనిధియైన యొక స్త్రీ పాదములొత్తుచుండఁగా గపిలమహర్షి కనుమోడ్చి నిదురించుచుండెను. రావణుఁడు చెంత కేఁగ నతఁడు లేచెను. రావణుఁడు విస్మితుఁడై, యాతని యపూర్వ చరిత్ర మడిగెను. కపిలమహర్షి రావణుఁడు త్వరలోఁ జంపఁబడనుండు టెఱిఁగించి నోరు తెఱచెను. అందు విశ్వరూపము ప్రత్యక్షమయ్యెను. రావణుఁడు భీతచిత్తుఁడై యాతనికి నమస్కరించి "మహాత్మా ! నీ చేతిలోఁ జనిపోవుటకంటె శుభము వేఱొకటి లేదు. నే నందుకొఱకే నిన్నీ విశ్వమున విసుగు విరామములు లేక వెదకుచున్నా" నని కడుఁగడుఁ బ్రశంసించెను. ఇంతలో గిరితో గుహతోఁ గపిలమహర్షి యంతిర్హితుఁ డయ్యెను. రావణుఁడు పరమవిస్మయచిత్తుఁడై యట నుండి వెడలి పోయెను.[8]

కపిలమహర్షి యవతారముమూలమున లోకము గడించినది కపిలాచార్యుని సాంఖ్యతత్త్వము. భక్తియోగమునకు శ్రుతిస్మృతులకుఁ బ్రమాణ్య మొసఁగి యిది విఖ్యాతి నార్జించినది. సూర్యరశ్మితోఁ బలికిన పలుకులవలనఁ గపిలుని వేదప్రామాణ్య బుద్ధి. మాతృశ్రీ యగు దేవహూతికి బోధించిన భక్తియోగము నిట్లనుటకు సాక్షిభూతములు. కపిలమహర్షి తండ్రితోఁ జెప్పినట్లవతార మెత్తి మునివేషము గైకొనుట ఋషిజనములను దన్మూలమునఁ బ్రజానీకమును దత్త్వబోధామృతముచేఁ బునీతులను జేయుట కే యనుట నిస్సంశయము. ఆ మహర్షి వర్యుని బోధామృతమును దనివితీఱఁ గ్రోలి భక్తుల జరామరత్వముల నంది తమజీవితములను సార్ధక మొనరించుకొందురుగాక !



  1. భారతము - హరివంశము.
  2. భారతము - ఆనుశాసనికపర్వము.
  3. మత్స్యపురాణము
  4. భారతము, భాగవతము - బ్రహ్మాండపురాణము.
  5. వరాహపురాణము.
  6. భారతము - శాంతిపర్వము.
  7. భాగవతము -- తృతీయస్కంధము.
  8. ఉత్తర రామాయణము.