మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/స్వాభిమానం

వికీసోర్స్ నుండి

57. స్వాభిమానం

ఆవిడ ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చింది. చిత్తశుద్ధితో వచ్చారు. తెలివితేటలతో వచ్చే ఒక దర్పంతో ఉన్నారు వాళ్లందరూ. ఒకాయన చెప్పినది తొందరగా గ్రహించగలడు. ఇంకొకాయన తన తొందరలో అసహనంగా ఉంటాడు. మూడో ఆయన ఆత్రుతగా ఉన్నాడు గాని, ఆ ఆత్రుతని నిలుపుకోలేక పోతున్నాడు. వారు ముగ్గురూ కలిస్తే బాగానే ఉంది. ముగ్గురూ తమ స్నేహితురాలి సమస్యలో భాగం పంచుకుంటున్నారు. ఎవ్వరూ సలహా ఇవ్వలేదు. విలువైన అభిప్రాయాలు వెలిబుచ్చలేదు. సంప్రదాయం ప్రకారం గాని, నలుగురూ చెప్పిన ప్రకారంగాని, వ్యక్తిగతంగా తోచినట్లుగాని, ఆవిడ ఏది మంచిదనుకుంటే అది చెయ్యటంలో ఆవిడకి సహాయం చెయ్యాలని ముగ్గురూ కోరుతున్నారు. వచ్చిన కష్టమేమిటంటే, ఏది సరియైన పని? ఆవిడకే నిశ్చయంగా తెలియదు. ఆవిడకి ఇబ్బందిగానూ, కంగారుగానూ ఉంది. కాని తక్షణం ఏదో చర్య తీసుకోవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఏదో నిర్ణయానికి రావాలి. ఆవిడ దాన్ని ఇంకా ముందుకి నెట్టటానికింక కుదరదు. ఒక ప్రత్యేక సంబంధం నుంచి విముక్తి పొందాలన్నది సమస్య. విముక్తి పొందాలనే ఉందావిడకి. ఆవిడ దాన్ని అనేకసార్లు పదేపదే చెప్పింది.

గదిలో నిశ్శబ్దంగా ఉంది. ఆ మానసిక ఆందోళన తగ్గింది. ఏవిధమైన ఫలితం ఆశించకుండా సరియైన పని ఏమిటన్నది నిర్ణయించకుండా సమస్యని పరిశీలించటానికి వాళ్లంతా ఆత్రుత పడుతున్నారు. సమస్యని బయట పెట్టగానే సరియైన పని ఏమిటో సంపూర్ణంగా దానంతటదే తేలుతుంది. సమస్యలో ఉన్నదంతా ఆవిష్కరించటం ముఖ్యం, అంతేకాని, ఆఖరున వచ్చే ఫలితం కాదు. ఏ సమాధానం వచ్చినా అది మరో నిర్ణయం, మరో అభిప్రాయం, మరో చిన్న సలహా అవుతుందేగాని సమస్యని ఏవిధంగానూ పరిష్కరించలేదు. అసలు సమస్యనే అర్థం చేసుకోవాలి. అంతేగాని, ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, దానికోసం ఏం చెయ్యాలి అన్నది కాదు. సమస్యని సరియైన విధంగా సమీపించటం ముఖ్యం. ఎందువల్లనంటే సమస్యలోనే సరియైన చర్య ఇమిడి ఉంటుంది. నదిలో నీళ్లు నాట్యం చేస్తున్నాయి - సూర్యుడు వాటిమీద వెలుగు బాటని వేశాడని. తెల్లని తెరచాప కట్టిన పడవ ఒకటి ఆ త్రోవన వెళ్లింది. కాని ఆ నాట్యానికి ఆటంకం కలగలేదు. పరిపూర్ణ ఆనందంతో చేసే నాట్యం అది. చెట్ల నిండా ఉన్నాయి పక్షులు - అరుస్తూ, ముక్కుల్తో ఈకలు సవరించుకుంటూ, ఎగురుతూ, మళ్లీ వెనక్కి వస్తూ. ఎన్నో కోతులు లేత ఆకుల్ని తెంపి నోటినిండా కుక్కుకుంటున్నాయి. వాటి బరువుకి లేత కొమ్మలు పొడుగ్గా వంపులు తిరుగుతున్నాయి. అయినా వాటిని ఎంతో తేలిగ్గా పట్టుకుని ఉన్నాయి భయపడకుండా. ఎంతో సునాయాసంగా ఒక కొమ్మ మీంచి మరో కొమ్మ మీదికి జరుగుతున్నాయి. గెంతుతున్నా ప్రవహిస్తున్నట్లుంది - ఎగరటమూ మళ్లీ దిగటమూ ఒక చలనంలా ఉంది. తోకలు వ్రేలాడేసుకుని కూర్చుని ఆకుల్ని అందుకుంటున్నాయి. అవి బాగా పైకి ఉన్నాయి. క్రింద వెడుతున్న మనుషుల్ని పట్టించుకోవటం లేదు. చీకటి పడుతూంటే వందలకొద్దీ చిలకలు ఆకుల గుబురుల్లో రాత్రికి తలదాచుకోవటానికి వస్తున్నాయి. అవి వస్తూనే చెట్ల ఆకుల్లో మాయమై పోతున్నాయి. పాడ్యమి చంద్రుడు కొద్దిగా కనిపిస్తున్నాడు. దూరంగా రైలు కూత పెట్టింది - నది వంపు తిరిగిన చోట వంతెనమీంచి దాటిపోతూ. ఈ నది పవిత్రమైనది. ఎంతో దూరాల నుంచి వస్తారు జనం అందులో స్నానం చెయ్యటానికి, తమ పాపాలు అందులో కొట్టుకు పోవచ్చునని. ప్రతి నదీ అందంగానూ పవిత్రంగానూ ఉంటుంది. ఈ నది అందమంతా దాని వెడల్పాటి పెద్ద వంపూ, లోతుగా పారే నీటిలో మధ్యమధ్య ఇసుక తిన్నెలూ, ప్రతిరోజూ నది మీద ఇటూ అటూ పోయే తెల్లని తెరచాపలున్న పడవలూ

"ఆ బంధం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను" అందావిడ.

స్వేచ్ఛగా ఉండాలని కోరటంలో మీ ఉద్దేశం ఏమిటి? "నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుతున్నాను" అనగానే మీరు స్వేచ్ఛగా లేరనే అర్థమవుతుంది. ఏవిధంగా మీరు స్వేఛ్చగా లేరు?

"శారీరకంగా స్వేచ్ఛగానే ఉన్నాను. రావటానికీ, పోవటానికీ స్వేచ్ఛ ఉంది, నేను ఇప్పుడు భార్యని కాదు కాబట్టి. కాని నాకు సంపూర్ణ స్వేచ్ఛ కావాలి. ఆ వ్యక్తితో ఏవిధమైన సంబంధమూ ఇష్టం లేదు నాకు."

ఏ విధంగా ఆ వ్యక్తితో సంబంధం ఉంది మీకు? శారీరకంగా ఇప్పటికే స్వేచ్ఛగా ఉన్నట్లయితే? మీకూ ఆయనకీ ఇంకే విధమైన సంబంధమైనా ఉందా?

"నాకు తెలియదు. ఆయనంటే నాకు చాలా ద్వేషం. ఆయనకి సంబంధించిన దాంతో నాకు ఏవిధమైన ప్రమేయమూ ఉండటం ఇష్టంలేదు."

మీకు స్వేచ్ఛ కావాలి. కాని ఆయన మీద మీకు ద్వేషం ఉందా? అయితే ఆయన నుంచి మీరు స్వేచ్ఛగా లేరన్న మాట. ఆయన మీద ఎందుకు ద్వేషం?

"ఆయన ఎటువంటాయనో ఈ మధ్యనే కనుక్కున్నాను - ఆయనకున్న అల్పబుద్ధి, ప్రేమ అనేది నిజంగా లేకపోవటం, ఆయనకున్న స్వార్థం. ఆయన గురించి ఎంత ఘోరమైన విషయం తెలుసుకున్నావో మీకు చెప్పలేను. ఆయన గురించి అసూయ పడేదాన్ననీ, ఆయన్ని ఆరాధించే దాన్ననీ, ఆయనకి లొంగాననీ తలుచుకుంటే! ఆయన ఆదర్శవంతమైన భర్త అనీ, ప్రేమగా దయగా ఉంటారనీ అనుకునేదాన్ని. అలాంటిది, ఆయనలో మూర్ఖత్వం, కపటత్వం ఉన్నవని తెలుసుకోగానే ఆయన మీద ద్వేషం ఏర్పడింది. ఆయనతో నాకసలు సంబంధం అనేది ఉండేదనుకుంటేనే నేను అపరిశుభ్రం అయినట్లుగా అనిపిస్తోంది. ఆయన్నుంచి పూర్తిగా స్వేచ్ఛగా ఉండాలని కోరుతున్నాను."

మీరు ఆయన్నుంచి శారీరకంగా స్వేచ్ఛగా అయి ఉండవచ్చు. కాని మీకు ఆయనపైన ద్వేషం ఉన్నంతకాలం మీకు ఆయన నుంచి స్వేచ్ఛ లభించదు. మీరు ఆయన్ని ద్వేషిస్తే ఆయనతో బంధింపబడే ఉంటారు. మీకు ఆయనంటే తలవంపులుగా ఉన్నట్లయితే ఆయన క్రింద మీరింకా బానిసగానే ఉంటారు. మీకు ఆయనమీద కోపమా, లేక మీమీదేనా? ఆయన ఉన్నట్లు ఆయన ఉన్నారు. దానికి ఆయనమీద కోపం దేనికి? మీ కోపం నిజంగా ఆయన మీదేనా, లేక ఉన్న స్థితిని చూసిన మీదట దానితో మీకు సంపర్కం ఉన్నందుకు మీరంటే మీకు తలవంపులుగా ఉందా? మీ ద్వేషం నిజానికి, ఆయన మీద కాదు, మీ విచక్షణా జ్ఞానం మీద, మీ చర్యల మీదనే మీకు కోపం. మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడుతున్నారు. ఇది గ్రహించటం ఇష్టంలేక ఆయన ఉన్నస్థితికి ఆయన్ని నిందిస్తున్నారు. మీకు ఆయన మీద ఉన్న కోపం మీ ప్రణయారాధన నుంచి తప్పించుకునే మార్గం మాత్రమే అని మీరు గ్రహించినప్పుడు ఆయన ప్రసక్తే ఉండదు. ఆయన్ని గురించి మీరు సిగ్గుపడటం లేదు. ఆయనతో సంపర్కం పెట్టుకున్నందుకు మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడుతున్నారు. మీ మీదే మీకు కోపం, ఆయన మీద కాదు.

"అవును, అది నిజమే."

ఇది మీరు నిజంగా గ్రహించినట్లయితే, దాన్ని యథార్థంగా అనుభవం పొందినట్లయితే, మీరు ఆయన నుంచి స్వేచ్ఛగా ఉంటారు. ఆయనంటే మీకు శత్రుత్వం ఉండదు. ప్రేమ బంధించినట్లుగానే ద్వేషంకూడా బంధిస్తుంది.

"అయితే, నా సిగ్గు నుంచి, నా తెలివి తక్కువతనం నుంచీ నేను స్వేచ్ఛగా ఉండటం ఎలా? ఆయన ఉన్న విధంగా ఆయన ఉన్నారనీ, ఆయన్ని నిందించకూడదని గ్రహించాను స్పష్టంగానే. కాని నా తలవంపుల నుంచీ, నాలో పెరిగి పెద్దదై బ్రద్ధలయే స్థితికి వచ్చిన నా కోపం నుంచీ స్వేచ్ఛగా ఉండటం ఎలా? గతాన్ని తుడిచి పెట్టెయ్యటం ఎలా?"

గతాన్ని ఎందుకు తుడిచి పెట్టెయ్యాలనుకుంటున్నారో అది ఎక్కువ ముఖ్యం - ఎలా తుడిచిపెట్టెయ్యాలన్న దాని కన్న సమస్యని ఏ ఉద్దేశంతో సమీపిస్తున్నారో అది ఎక్కువ ముఖ్యం - దాని గురించి ఏంచెయ్యాలనుకుంటున్నారో అనే దాని కన్న. ఆ సంబంధాన్ని గురించి జ్ఞాపకాన్ని ఎందుకు తుడిచి పెట్టెయ్యాలనుకుంటున్నారు?

"ఆ గడిచిన సంవత్సరాల జ్ఞాపకం నాకిష్టం లేదు. వాటివల్ల నా నోట్లో చేదు మాత్రమే మిగిలింది. అది తగినంత కారణం కాదంటారా?"

అంతగా కాదు, అవునా? ఈ గత జ్ఞాపకాలను ఎందుకు తుడిచి పెట్టెయ్యాలనుకుంటున్నారు? నిజానికి అవి మీనోట చేదు మిగిల్చాయన్నందుకు కాదు. ఏదో విధంగా అ గతాన్ని తుడిచి పెట్టెయ్యగలిగినా మీకుతలవంపులు కలిగే మరోచర్యలో ఇరుక్కోవచ్చు. సంతోషం కలిగించని జ్ఞాపకాలను తుడిచి పెట్టేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అవుతుందా?

"అవుతుందనే అనుకున్నాను. కాకపోతే సమస్య ఏముంటుంది? మీరు దీన్ని మరింత గందరగోళం చెయ్యటం లేదూ? ఇప్పటికే గందరగోళంగా ఉంది, అంటే, నా జీవితం. దానికి ఇంకా కొంత బరువు చేర్చటం దేనికి?"

దానికి కొంత బరువు చేరుస్తున్నామా, లేక, ఉన్న స్థితిని అర్థం చేసుకోవటానికి, దాని నుంచి స్వేచ్ఛ పొందటానికీ ప్రయత్నిస్తున్నామా? దయచేసి మరి కొంత ఓర్పు వహించండి. గతాన్ని తుడిచి పెట్టెయ్యాలన్న తపన దేనివల్ల కలుగుతోంది మీలో? అది సంతోషకరమైనది కాకపోవచ్చు. దాన్ని తుడిచి పెట్టెయ్యటమెందుకు? మీ గురించి మీరే ఏర్పరచుకున్న భావంగాని, మీరు చిత్రించుకున్న చిత్రంగాని ఉంది. ఈ జ్ఞాపకాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల వాటిని వదిలించుకోవాలనుకుంటున్నారు. మీ గురించి మీకు గౌరవభావం ఉంది. లేదా?

"తప్పకుండా ఉంది. లేకపోతే ...."

మనమంతా మనల్ని వివిధ అంతస్తుల్లో పెట్టుకుంటాం. ఆ ఎత్తుల మీంచి నిత్యం క్రిందికి పడిపోతూ ఉంటాం. ఈ పడిపోవటాలవల్లనే మనకి అవమానకరంగా ఉంటుంది. మన అవమానానికీ, మనం పడిపోవటానికీ కారణం స్వాభిమానమే. మనం అర్థం చేసుకోవలసినది ఈ స్వాభిమానాన్నే. అంతేకాని, పడిపోవటాన్ని కాదు. మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్న పీఠమే లేకపోతే దాన్నుంచి పడిపోవటం అనేది ఉండదు. మిమ్మల్ని మీరు ఆత్మగౌరవం, మనిషికి ఉండే హోదా, ఆదర్శం వంటి పీఠం మీద ఎందుకు నిలబెట్టుకున్నారు? దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే గతం వల్ల అవమానం పొందటం ఉండదు. అది పూర్తిగా పోతుంది. మీరు మీ పీఠం లేకుండా ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఆ పీఠం లేనట్లయితే, దాన్నుంచి పైకి గాని, క్రిందికి కాని చూచే ఎత్తే ఉండదు. ఇక, మీరు ఏది గ్రహించకుండా తప్పించుకుంటున్నారో ఆ అసలైన మీ స్థితిని మీరు గ్రహిస్తారు. ఈ ఉన్నస్థితిని, మీరున్న స్థితిని తప్పించుకోవటం మూలాన్నే గందరగోళం, వైరుధ్యం, అవమానం, కోపం, అన్నీ వస్తున్నాయి. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాతో గాని, మరెవరితో గాని చెప్పనక్కరలేదు. కాని, మీరెలా ఉన్నారో మీకై మీరు తెలుసుకుని ఉండాలి - అది సంతోషకరమైనదైనా, సంతోషకరంకానిదైనా, ఎటువంటిదైనా, దానితోనే జీవించండి. దాన్ని సమర్థించటంగాని, ప్రతిఘటించటం గాని చెయ్యకుండా - దానికో పేరు పెట్టకుండా దానితో జీవించండి. పేరు పెట్టటమే దాన్ని ఖండించటమో, దానితో ఐక్యం కావటమో అవుతుంది. భయం లేకుండా దానితో జీవించండి - ఎందువల్లనంటే భయం దేన్నీ తెలుసుకోనివ్వదు. అదేమిటో తెలుసుకోకుండా దానితో జీవించలేరు. తెలుసుకుని ఉండటమంటే ప్రేమించటం. ప్రేమ లేకుండా గతాన్ని తుడిచి పెట్టలేరు. ప్రేమ ఉంటే గతం ఉండదు. ప్రేమే ఉంటుంది, కాలం ఉండదు.