మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/భయం

వికీసోర్స్ నుండి

58. భయం

ఆవిడ ఎంతో దూరం ప్రయాణం చేసింది. ప్రపంచంలో సగం భాగం దాటి వచ్చింది. ఎంతో జాగ్రత్త పడుతున్నట్లూ, రక్షించుకుంటూ ముందుకి సాగుతున్నట్లుగా ఉందావిడ. కొద్దిగా తెరుచుకుని, కాస్త లోతుగా తరచి చూచినట్లనిపిస్తే చాలు మూసుకుపోతోంది. ఆవిడ భీరువు కాదు. తన అంతరంగిక స్థితిని బయటపెట్టటం ఆవిడ కిష్టం లేదు. వ్యక్తం కాకపోయినా. అయినా, ఆవిడ తన గురించీ, తన సమస్యల గురించీ మాట్లాడాలని కోరుకుంటోంది. అసలు అంతదూరం నుంచి వచ్చింది కూడా అందుకే. ఏం మాట్లాడాలో స్పష్టంగా తెలియక ముడుచుకుపోతోంది. మళ్లీ తన గురించి చెప్పుకోవాలని ఆత్రుత. మనస్తత్వశాస్త్రం గురించి చాలా పుస్తకాలు చదివిందట. అయితే, ఎవరిచేతా విశ్లేషణ చేయించుకోలేదుట. తన్ను తాను విశ్లేషణ చేసుకోవటం బాగా చాతనవునుట. అసలు చిన్నప్పటి నుంచీ తన ఆలోచనలనూ, అనుభూతులనూ విశ్లేషణ చేసుకోవటం తనకు అలవాటేనని చెప్పిందావిడ.

మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవాలని పట్టుదల ఎందుకు మీకు? "నాకు తెలియదు. కాని, నాకు గుర్తు తెలిసినప్పటి నుంచీ ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను."

మీనుంచి మిమ్మిల్ని రక్షించుకోవటానికీ, మీ భావావేశాలు పొంగి పోకుండా ఉండటానికీ, దానివల్ల బాధలు లేకుండా ఉండటానికీ విశ్లేషణ ఒక మార్గమా?

"నాకు బాగా నిశ్చయంగా తెలుసును.అందుకే నేను విశ్లేషణ చేసుకుంటాను. నిత్యం ప్రశ్నించుకుంటూ ఉంటాను. నా విషయంలో గాని, ఇతర విషయాల్లోగాని నా చుట్టూ కనిపించేటటువంటి గందరగోళంలో ఇరుక్కోవటం నాకిష్టం లేదు. అదంతా భయంకరమైనది. దానికి దూరంగా ఉండాలని నా కోరిక. నన్ను నేను సంరక్షించుకోవటానికీ, సంఘం, సంసారం, అనే కల్లోలంలో చిక్కుకోకుండా ఉండటానికీ విశ్లేషణను ఒక సాధనంగా ఉపయోగించుకున్నానని నేనిప్పుడు గ్రహిస్తున్నాను."

చిక్కుకోకుండా తప్పించుకోగలిగారా?

"నిశ్చయంగా తెలియదు. కొన్ని దిశల్లో విజయవంతమయాను. మరికొన్నిటిలో కాలేదనుకుంటాను. ఇదంతా చెబుతూంటే నేనెంత అద్భుతమైన పని చేశానో తెలుస్తోంది. దీన్ని నేనెప్పుడూ ఇంత స్పష్టంగా గ్రహించలేదు."

మిమ్మల్ని మీరు అంత తెలివిగా ఎందుకు కాపాడుకుంటున్నారు? దేన్ని గురించి? మీ చుట్టూ ఉన్న గందరగోళం అన్నారు. మిమ్మల్ని మీరి కాపాడుకోవలసినది ఏముంది ఆ గందరగోళంలో? అది గందరగోళమని మీరు స్పష్టంగా తెలుసుకున్నప్పుడు దాన్నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన అవసరం ఉండదు. భయం ఉన్నప్పుడే ఎవరైనా తన్ను తాను రక్షించుకోవటం జరుగుతుంది, - అవగాహన ఉన్నప్పుడు కాదు. మీకు దేనివల్ల భయం?

"నేను భయపడుతున్నాననుకోను. బ్రతుకు బాధల్లో చిక్కుకోవటం నాకిష్టం లేదంతే. నాకు ఉద్యోగం ఉంది నాకు ఆధారంగా. కాని, తక్కిన బంధనాల నుంచి స్వేచ్ఛగా ఉండాలనుకున్నాను. ఉన్నాననే అనుకుంటున్నాను."

మీకు భయం లేనట్లయితే ఆ బంధనాలను ప్రతిఘటించటం దేనికి? దేనితోనైనా ఎలా వ్యవహరించాలో తెలియనప్పుడే ప్రతిఘటన ఉంటుంది. మోటారు ఎలా పని చేస్తుందో మీకు తెలిస్తే మీరు స్వేచ్ఛగా ఉంటారు. ఏదైనా చెడిపోతే దాన్ని బాగుచేసుకోగలరు. మనకి అర్థంకాని దాన్నే ప్రతిఘటిస్తూ ఉంటాం. గందరగోళాన్నీ, పాపాన్నీ, దుఃఖాన్నీ ప్రతిఘటిస్తాం - దాని నిర్మాణం తెలియనప్పుడు, అదెలా రూపొందిందో తెలియనప్పుడు. గందరగోళం నిర్మాణం ఎలాంటిదో, ఎలా ఏర్పడిందో మీరు తెలుసుకోలేదు కాబట్టి మీరు ప్రతిఘటిస్తున్నారు. మీరు దాన్ని ఎందుకు తెలుసుకోలేదు?

"నేనెప్పుడూ ఆవిధంగా ఆలోచించలేదు."

గందరగోళం నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం మీకు ఉన్నప్పుడే అది పనిచేసే పద్ధతిని మీరు తెలుసుకోగలుగుతారు. ఇద్దరి మనుషుల మధ్య సంపర్కం ఉన్నప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకరి నొకరు ప్రతిఘటిస్తూంటే అవగాహన కలగదు. భయం లేనప్పుడే సంపర్కంగాని సంబంధం గాని ఉంటుంది.

"మీ ఉద్దేశం గ్రహించాను."

అయితే మీరు దేన్నుంచి భయపడుతున్నారు?

"భయం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో?"

భయం సంబంధంలోనే ఉంటుంది. భయం దానంతట అది విడిగా ఉండదు. నిష్కారణమైన భయం అంటూ ఏదీ ఉండదు. తెలిసిన దాన్ని గురించో, తెలియని దాన్ని గురించో, ఒకరు చేసిన దాన్ని గురించో, చెయ్యబోయే దాన్ని గురించో భయం ఉంటుంది. గతం గురించిగాని, భవిష్యత్తు గురించి గాని భయం ఉంటుంది. తాము ఉన్న స్థితికీ, ఉండదలుచుకున్న స్థితికీ మధ్యనున్న సంబంధం భయాన్ని కల్పిస్తుంది. తాము ఉన్న యథార్థస్థితిని బహుమాన రూపంలోగాని, శిక్షరూపంలో గాని అనువదించి చెబితే భయం పుడుతుంది. బాధ, సంతోషం - వీటి మధ్య నున్న వ్యత్యాసం వల్ల భయం ఉంటుంది. పరస్పర వ్యతిరేకమైన వాటి మధ్య సంఘర్షణలో భయం ఉంటుంది. విజయాన్ని ఆరాధిస్తే, అపజయం అంటే భయం వేస్తుంది. ఏదో అవాలనే పోరాటంలో జరిగే మానసిక ప్రక్రియ భయం మంచిగా అవటంలో పాపభీతి ఉంటుంది. సంపూర్ణంగా అవటంలో ఒంటరితనం అంటే భయం ఉంటుంది. గొప్పగా అవటంలో చిన్నతనం గురించి భయం ఉంటుంది. పోల్చటం, అవగాహన కాదు. తెలిసిన దానివల్ల తెలియనిదంటే ఉండే భయం వల్ల చేసే పని అది. రక్షణ కోసం వెతకటంలోని అనిశ్చితస్థితి భయం.

ఏదో అవాలనే ప్రయత్నంతోనే భయం ఆరంభమవుతుంది - ఉన్నదాన్ని గురించీ, లేనిదాని గురించీ, మనస్సు అనే అనుభవశేషం ఇంతకు ముందెరుగని, పేరుపెట్టని సమస్య ఏదో ఎదురవుతుందనే భయంతో ఉంటుందెప్పుడూ. మనస్సు అనే పేరు, మాట, జ్ఞాపకం తెలిసిన జాగాలోనే పనిచెయ్యగలదు. తెలియని దాన్ని, అంటే క్షణక్షణానికీ ఎదురయే సమస్యని ప్రతిఘటించటమో, మనస్సు తనకి తెలిసిన మాటల్లోకి అనువదించటమో, జరుగుతుంది. ఈ ప్రతిఘటించటం, లేదా సమస్యని అనువదించటం - ఇదే భయం. ఎందువల్లనంటే, మనస్సు తెలియని దానితో సంపర్కం కలిగించుకోలేదు. తెలిసిన దానికి తెలియని దానితో సంపర్కం ఉండదు. తెలిసినది అంతమొందాలి తెలియనిది ఉండాలంటే.

మనస్సే భయాన్ని పుట్టిస్తుంది. అది భయాన్ని విశ్లేషించి, దాన్నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. దానికి కారణాన్ని వెతికినట్లయితే, మనస్సు మరింత వేరుపడి, భయాన్ని అధికం చేస్తుంది. మీరు గందరగోళాన్ని ప్రతిఘటించటం వల్ల భయం ఎక్కువవుతుంది. దానివల్ల స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడుతుంది. సంపర్కంలో స్వేచ్ఛ ఉంది - భయంలో కాదు.