Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సొంతం చేసుకోవాలనే తత్వం

వికీసోర్స్ నుండి

56. సొంతం చేసుకోవాలనే తత్వం

ఆయన భార్యని తన వెంట తీసుకువచ్చాడు. అది వారిద్దరికీ సంబంధించిన సమస్య కాబట్టి తీసుకు వచ్చానన్నాడాయన. ఆవిడ కళ్లు కళగా ఉన్నాయి. ఆవిడ పొట్టిగా చురుకుగా ఉంది. వాళ్లు ఎంతో మామూలుగా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఆయన ఇంగ్లీషులో బాగానే మాట్లాడుతున్నాడు. ఆవిడ అర్థం చేసుకోగలదంతే. చిన్న చిన్న ప్రశ్నలు అడగగలదు. కొంచెం కష్టమనిపించినప్పుడు ఆవిడ భర్తకేసి తిరుగుతుంది. ఆయన తమ భాషలో అర్థం చెబుతున్నాడు. తమ వివాహం అయి పాతికేళ్లకు పైగా అయిందని చెప్పాడాయన. బోలెడు మంది పిల్లలున్నారట, వాళ్ల కున్న సమస్య ఆ పిల్లలు కాదు. తమ ఇద్దరి మధ్యా ఉన్న తగువేనట. ఆయనకి ఉద్యోగం ఉందనీ, ఏదో తగు మాత్రం వస్తుందనీ చెప్పి, ఈ ప్రపంచంలో బ్రతకటం ఎంత కష్టమో, ముఖ్యంగా సంసారం నడపటం ఎంత కష్టమో చెప్పుకొచ్చాడు. దానికి తను విసుక్కోవటం లేదుట, కాని ఉన్న సంగతది అన్నాడు. భర్తగా తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నానన్నాడు. అధమం, అలా చేస్తున్నాననే అనుకుంటున్నాడు. అది ఎల్లప్పుడూ అంత సులభమనిపించలేదుట.

అసలు సంగతికి రావటానికి కష్టంగా ఉంది వాళ్లకి. ఎంతో సేపు ఏవేవో మాట్లాడారు - వాళ్ల పిల్లల చదువులూ, కూతుళ్ల పెళ్ళిళ్లూ, శుభకార్యాలకి అయిన వృథా ఖర్చులూ, కుటుంబంలో ఆ మధ్య ఎవరో పోవటం, ఇలా ఎంతో మామూలుగా, హడావిడి లేనట్లుగా ఉన్నారు - ఎందుకంటే, వినేవాళ్లూ, విని అర్థం చేసుకునే వాళ్లూ ఎవరైనా ఉంటే, వాళ్లతో చెప్పుకోవటానికి బావుంటుంది.

ఎదుటి వారి బాధల్ని శ్రద్ధగా వినేదెవరు? మన సమస్యలే మనకి ఎన్నో ఉండగా, ఇక ఇతరులవి కూడా వినటానికి మనకి తీరిక ఎక్కడ? ఎదుటి వారు మీ మాటలు వినాలనుకుంటే డబ్బులైనా ఇవ్వాలి, పూజ అయినా చేయించాలి. వారి నమ్మకమైనా స్వీకరించాలి. వినటమే ఉద్యోగమైన వాళ్లైతే వింటారు కాని, అందులో శాశ్వతమైన విముక్తి ఉండదు. మన మీద ఉన్న భారాన్ని స్వేచ్ఛగా, అనాలోచితంగా తొలగించుకోవాలనుకుంటాం - మళ్లీ తరవాత విచారించేందుకు ఆస్కారం లేకుండా. మీరు మనస్సు విప్పి చెప్పినది, అంటే పరిశుద్ధం కావటం వినేవారి మీద ఆధారపడి ఉండదు. హృదయాన్ని విప్పి చూపాలని కోరేవారిలోనే ఉంటుంది. తమ హృదయాన్ని విప్పి చూపటం ముఖ్యం - ఎవరో ఒకరు, ఏ ముష్టివాడో దొరుకుతాడు, వారి ముందు అంతా వెళ్లబోసుకోవటానికి. ఆత్మ పరిశీలన చేసుకునే వారు ఎన్నటికీ హృదయాన్ని విప్పి చూపలేరు. అది నాలుగు వైపులనుంచీ మూసేసి, నిస్పృహ కలిగించి, పూర్తిగా నిరుపయోగంగా ఉంటుంది. తెరవటమంటే వినటం - మిమ్మల్ని మీరే కాదు, మీపైన ఉన్న ప్రతి ప్రభావాన్నీ, మీలో కలిగే ప్రతి సంచలనాన్నీ వినాలి. మీరు విన్న దాన్ని గురించి మీరు ఇదమిద్ధంగా ఏదైన చెయ్యటానికి అవకాశం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కాని, తెరిచి ఉన్నదనే యథార్థమే దాని చర్య అది తీసుకుంటుంది. ఆ విధంగా వినటం వల్ల మీ హృదయం పరిశుద్ధమవుతుంది; మనస్సుకి సంబంధించినవన్నీ ప్రక్షాళితమవుతాయి. మనస్సుతో వినటం అంటే కబుర్లు చెప్పుకోవటం. అందులో మీకు గాని, ఎవరికి గాని విముక్తి ఉండదు. అది బాధని ఇంకా కొనసాగిస్తుంది. అది తెలివి తక్కువతనం.

తాపీగా తాము చెప్పదలుచుకున్న విషయానికి వస్తున్నారు.

"మా సమస్య గురించి మాట్లాడాలని వచ్చాం. మేము అసూయా పరులం - నేను కాదు, ఈవిడ. ఇదివరకు ఇప్పుడంత బాహాటంగా అసూయ కనపరచక పోయినా, ఎప్పుడూ సూచనగా తెలుస్తూనే ఉండేది. ఆవిడ అసూయపడే కారణాన్ని నేనెప్పుడూ కలిగించలేదు. కాని ఆవిడకెప్పుడూ ఏదో ఒక కారణం కనిపిస్తూనే ఉంటుంది."

అసూయ పడటానికి ఏదైనా కారణం ఉండాలనుకుంటున్నారా? అసూయకి కారణం ఉంటుందా? కారణం తెలియగానే అసూయ మాయమైపోతుందా? కారణం తెలిసిన తరువాత కూడా అసూయ అలాగే ఉంటుందని మీరు గమనించలేదా? కారణం కోసం వెతకొద్దు మనం. అసూయ అనేదాన్ని అర్థం చేసుకుందాం. మీరన్నట్లు ఏదో ఒక వంక దొరకచ్చు ఈర్ష్య పడటానికి. ఈర్ష్య అనేదాన్ని అర్థం చేసుకోవాలి, అది దేనివల్ల వచ్చిందో కాదు.

"అసూయ నాలో చాలాకాలం నుంచి ఉంది. మాకు వివాహం అయినప్పుడు నా భర్త గురించి నాకు బాగా తెలియదు. అదంతా ఎలా జరుగుతుందో మీకు తెలుసును. అసూయ క్రమంగా వ్యాపించింది వంటింట్లో పొగలా."

పురుషుణ్ణి గాని, స్త్రీని గాని ఆకట్టుకుని ఉంచుకోవటానికి అసూయ ఒక మార్గం కాదా? ఎంత ఎక్కువ అసూయపడితే అంత ఎక్కువగా తన సొంత చేసుకున్న భావన కలుగుతుంది. దేన్నైనా సొంతం చేసుకుంటే ఆనందం కలుగుతుంది. దేన్నైనా, కుక్కనైనా సరే మన ఒక్కరిదే అనుకుంటే ఎంతో హాయిగా సుఖంగా ఉన్నట్లుంటుంది. మన ఒక్కరి సొంతమే అయినప్పుడు ధైర్యం. విశ్వాసం కలుగుతాయి. దేన్నైనా మన సొంతం చేసుకుంటే, మనకి ప్రాముఖ్యం ఏర్పడుతుంది. ఈ ప్రాముఖ్యాన్నే పట్టుకు వ్రేలాడతాం. మనం సొంతం చేసుకున్నది ఒక పెన్సిలు కాదు, ఒక ఇల్లు కాదు, కాని, మనిషి అయినప్పుడు దానివల్ల శక్తి కలిగినట్లూ, వింతగా తృప్తికలిగినట్లూ అనిపిస్తుంది. ఈర్ష్య ఇంకొకరి మూలానకాదు. దాని విలువ మూలాన్నీ, మన ప్రాముఖ్యం మూలాన్నీ ఉంటుంది.

"కాని, నేను ముఖ్యమైన దాన్నికాదు. నేనేమీ కాను, నాకున్నదల్లా నాభర్తే. నా పిల్లలు కూడా లెక్కలోకి రారు."

మనమంతా, పట్టుకు వ్రేలాడేది ఒక్కదాని కోసమే - దాని రూపాలు వేరుకావచ్చు. మీరు మీ భర్తని, మరొకరు వారి పిల్లల్నీ, మరొకరు ఏదో నమ్మకాన్నీ పట్టుకు ప్రాకులాడతారు. ఉద్దేశం అందరిదీ ఒక్కటే. మనం దేనికోసం ప్రాకులాడుతున్నామో అది లేకుంటే మనం తప్పిపోయినట్లు భావిస్తాం. భావించమూ? మనం ఒంటరిగా ఉండాలంటే భయపడతాం. భయమే అసూయ, ద్వేషం, బాధ. అసూయకీ, ద్వేషానికీ అట్టే బేదం లేదు.

"కాని మాకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది."

అలా అయితే మీరు అసూయగా ఎలా ఉండగలరు? మనం ప్రేమించం. అదే దురదృష్టకరమైన విషయం. మీరు మీ భర్తని ఉపయోగించుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నట్లు గానే - మీరు సుఖంగా ఉండటానికీ, మీకో తోడు ఉండటానికీ, ఒంటరిగా ఉన్న భావం లేకుండా ఉండటానికీ. మీ సొంతంది అంటూ ఎక్కువగా లేకపోవచ్చు. కాని మీతో కలిసి ఉండటానికైనా ఎవరో ఒకరున్నారు. ఈ పరస్పర అవసరాన్నే, ఉపయోగాన్నే ప్రేమ అంటున్నాం.

"కాని అది ఘోరం"

అది ఘోరం కాదు. ఎటొచ్చీ మనం దానివైపు ఎప్పుడూ చూడం. దాన్ని ఘోరం అని చెప్పి, దానికో పేరు పెట్టి, వెంటనే చూపు మరోవైపుకి తిప్పుకుంటాం - అదే మీరు చేస్తున్నది.

"నాకు తెలుసు. కాని, నాకు చూడాలని లేదు. నేను ఉన్నట్లుగానే ముందుకూడా ఉండాలనుకుంటున్నాను. - అసూయ పడుతూనైనా సరే. నా జీవితంలో చూడగలిగిందంతకన్న ఏమీలేదు."

ఇంకో దాన్ని దేన్నైనా చూడగలిగితే అప్పుడు మీ భర్త అంటే మీకు ఆపైన అసూయ ఇక ఉండదా? అయితే, అప్పుడు దాన్ని పట్టుకు ప్రాకులాడుతారు. ఇప్పుడు మీ భర్తని పట్టుకుని ప్రాకులాడినట్లు, అంచేత, అదంటే కూడా మీకు అసూయ కలుగుతుంది. మీ భర్తకి ప్రయత్యామ్నాయంగా మరొకటి వెతుక్కోవాలనుకుంటున్నారు మీరు - అంతేగాని అసూయకి విముక్తికాదు. మనమంతా అంతే. ఒకటి వదిలేసేముందు ఇంకొకటి ఉంటుందన్నది నిశ్చయంగా తెలియాలనుకుంటాం. మీరు పూర్తిగా సందేహ స్థితిలో ఉన్నప్పుడే ఈర్ష్యకి తావుండదు. నిశ్చయంగా ఉన్నప్పుడు, మీ దగ్గర ఏదో ఉన్నదని అనుకుంటున్నప్పుడు ఈర్ష్య ఉంటుంది. తమ ఒక్కరి సొంతమే అనే భావమే నిశ్చయం. సొంతం చేసుకోవటం అంటే అసూయపడటమే. సొంతం చేసుకున్నది ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ప్రేమ ఉండదు. సొంతం చేసుకోవటమంటేనే ప్రేమని నాశనం చెయ్యటం.

"నేను ఇప్పుడే గ్రహించగలుగుతున్నాను. నా భర్తని ఎప్పుడూ నిజంగా నేను ప్రేమించలేదు. ఎప్పుడైనా ప్రేమించానా? నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది."

ఆవిడ ఏడ్చింది.