Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సమస్య, ప్రతిక్రియ (సవాలు చేయడం, సమాధానం)

వికీసోర్స్ నుండి

55. సమస్య, ప్రతిక్రియ (సవాలు చేయడం, సమాధానం)

నది నిండుగా, విసురుగా ఉంది. కొన్ని చోట్ల కొన్ని మైళ్ల వెడల్పులో ఉంది. అంత నీటిని చూడటం ఆనందదాయకంగా ఉంది. ఉత్తరం వైపు పచ్చని కొండలు తుఫాను తరవాత స్వచ్ఛంగా ఉన్నాయి. నదిలో ఆ పెద్ద వంపునీ, దానిమీద తెల్లని తెరచాపలతో ఉన్న పడవల్నీ చూడటం అద్భుతంగా ఉంది.

పడవలు పెద్దగా, ముక్కోణాకారంలో ఉన్నాయి. ఆ ఉదయారుణ కాంతిలో అవి రమణీయంగా కనిపిస్తున్నాయి - అవి ఆ నీటిలోంచే వచ్చాయా అన్నట్లు. పగటి చప్పుళ్లు ఇంకా మొదలవలేదు. పడవవాని పాట దరిదాపు అవతలి తీరం నుంచి నీటిమీద తేలుతూ వస్తోంది. అ సమయంలో అతని పాటతో అవని అంతా నిండినట్లుగా అనిపించింది. అన్ని శబ్దాలూ నిశ్శబ్దమై పోయాయి. రైలు కూత కూడా మృదువుగానూ, వినసొంపుగానూ అయింది.

క్రమంగా ఊళ్లో చప్పుళ్లు ప్రారంభమయాయి. కుళాయి దగ్గర తగువులూ, గొర్రెల అరుపులూ ఆవులు పాలు పిండమని పిలవటం, వీధిలో పోయే బరువైన బళ్లూ, కాకుల కూతలూ, పిల్లల కేకలూ, నవ్వులూ - మరోరోజు పుట్టింది. సూర్యుడు కొబ్బరి చెట్లమీద ఉన్నాడు. కోతులు గోడ మీద కూర్చున్నాయి. వాటి పొడుగాటి తోకలు భూమిని అంటేలా ఉన్నాయి. అవి పెద్దవే గాని పిరికివి. వాటిని పిలిస్తే నేల మీదికి గెంతి, పొలంలోని పెద్ద చెట్లు మీదికి పారిపోయాయి. వాటి ముఖాలూ, పంజాలూ నల్లగా ఉన్నాయి. చాలా తెలివైనవిలా ఉన్నాయి. కాని, గడుసుతనం, అల్లరీలేదు చిన్నవాటికున్నట్లు.

"ఆలోచన అదేపనిగా ఎందుకుంటుంది? విరామమెరుగనట్లుగా, విసుగు పుట్టించేలా వదలకుండా ఉంటుంది. మీరేం చేసినా సరే, అది పనిచేస్తూనే ఉంటుంది. ఆ కోతుల్లాగ. దాని కార్యకలాపం అలిసిపోయేలా చేస్తుంది. దాన్నుంచి తప్పించుకోలేరు. అవిరామంగా మీ వెంట పడుతుంది. దాన్ని అణచివెయ్యటానికి ప్రయత్నించండి. కొద్ది క్షణాల్లో మళ్లీ తలెత్తుతుంది. ఎప్పుడూ శాంతంగా ఉండదు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకున్నట్లుండదు. ఎప్పుడూ దేని వెంటో పడుతుంది. ఎప్పుడూ విశ్లేషిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ తన్ను తాను చిత్రవధ చేసుకుంటూ ఉంటుంది. నిద్రపోతున్నా, నడుస్తున్నా ఆలోచన నిత్యకల్లోలితంగా ఉంటుంది. దానికి శాంతి గాని విశ్రాంతి గాని ఉన్నట్లు లేదు."

ఆలోచన ఎప్పుడైన శాంతితో ఉండగలదా? శాంతి గురించి ఆలోచించ గలదు. శాంతియుతంగా ఉండాలని ప్రయత్నించగలదు. నిశ్చలంగా ఉండాలని తన్ను తాను నిర్బంధించుకోగలదు, కాని ఆలోచన అనేదే ప్రశాంతంగా ఉండగలదా? అవిరామంగా ఉండటమే ఆలోచన ప్రకృతి కాదా? నిత్య సమస్యకి నిత్య ప్రతిక్రియ కాదా అది? సమస్యకి ఆగిపోవటం అనిలేదు - జీవితంలోని ప్రతిక్షణమూ ఒక సవాలు కాబట్టి. అ సవాలు గురించి తెలుసుకుని ఉండినట్లయితే క్షీణించటం, నశించటం జరుగుతుంది. సవాలు చేయటం, దానికి ప్రతిక్రియ - ఇదే జీవనవిధానం. ప్రతిక్రియ చాలినంత ఉండవచ్చు. ఉండకపోవచ్చు. సమస్యకి ప్రతిక్రియ చాలనప్పుడే ఆలోచన రేకెత్తుతుంది, అవిశ్రాంతంగా. సమస్య చర్య తీసుకోమంటుంది - మాటలలో పెట్టటం కాదు. మాటలలో పెట్టటమే ఆలోచన. మాట, సంకేతం - ఇవి చర్యని సరిగ్గా రూపొందనివ్వవు. ఊహే మాట. జ్ఞాపకమూ మాటే. సంకేతం లేకుండా, మాట లేకుండా జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం అంటే మాట, ఆలోచన. సమస్యకి నిజమైన ప్రతిక్రియ ఆలోచనేనా? సమస్య ఓక ఊహా? సమస్య ఎప్పుడూ కొత్తగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆలోచనా, ఊహా ఎప్పుడైనా కొత్తగా ఉంటాయా? ఆలోచన నిత్యనూతనమైన సమస్యని కలుసుకున్నప్పుడు ఏర్పడిన ప్రతిక్రియ పాతదాన్నుంచీ, గతించిన దాన్నుంచీ వచ్చినది కాదూ?

ఒక పాతదీ, ఒక కొత్తదీ కలిస్తే అ కలయిక సంపూర్ణంగా ఉండదు. సంపూర్ణత కోసం అవిరామంగా అన్వేషించే ఆలోచనే ఈ అ అసంపూర్ణత. ఆలోచనా, ఊహా ఎప్పుడైనా సంపూర్ణమవుతాయా? ఆలోచన, ఊహ జ్ఞాపకానికి ప్రతిక్రియ. జ్ఞాపకం ఎప్పుడూ అసంపూర్ణమైనదే. అనుభవం సమస్యకి ప్రతిక్రియ. ఈ ప్రతిక్రియ గతంచేతా, జ్ఞాపకం చేతా ప్రభావితం, నిబద్ధితం అయి ఉంటుంది. ప్రతిక్రియ ఆ ప్రభావాన్నీ, నిబద్ధతనీ పటిష్ఠం చేస్తుంది. అనుభవం విముక్తి కలిగించదు. నమ్మకాన్నీ, జ్ఞాపకాన్నీ పటిష్ఠం చేస్తుంది. ఈ జ్ఞాపకమే సమస్యకి ప్రతిక్రియ జరిగేటట్లు చేస్తుంది. అందువల్ల అనుభవం ప్రభావితం చేసేదవుతుంది. నిబద్ధితం చేసేదవుతుంది.

"అయితే ఆలోచనకున్న స్థానం ఏమిటి?"

మీరనేది ఆలోచనకి చర్యలో స్థానం ఏమిటి అనేనా? చర్యకి ఊహతో ఏమైనా పని ఉందా? చర్యని మార్చటానికో, నిగ్రహించటానికో, రూపొందించటానికో ఊహ చర్యలో ఒక అంశం అవుతుంది. కాని, ఊహ చర్య కాదు. ఊహ, నమ్మకం చర్యనుంచి రక్షణ కలిగిస్తాయి.. చర్యని మార్పుచేసే, రూపొందించే నిగ్రహకర్తగా ఊహకి స్థానం ఉంది. ఊహ చర్యకోసం తయారైన ఒక పథకం.

"అ పథకం లేకుండా చర్య సాధ్యమేనా?"

ఏదైనా ఫలితం ఆశించినట్లయితే, చర్య సాధ్యంకాదు, ముందుగానే నిర్ణయించుకున్న లక్ష్యం కోసం చేసే చర్య చర్య కాదు. ఒక పద్ధతి ప్రకారం నడవాలనుకున్నట్లయితే, అప్పుడు ఆలోచనకీ, ఊహకీ స్థానం ఉంటుంది. ఆలోచన యొక్క కర్తవ్యం చర్య అనబడేది ఎలా ఉండాలో ఒక పథకం సృష్టించి అటుపైన చర్యని నాశనం చెయ్యటమే. మనం చాలావరకు చర్యని నాశనం చెయ్యాలనే ఆలోచిస్తాం. ఊహ, నమ్మకం, అంధవిశ్వాసం చర్యని నాశనం చెయ్యటానికి దోహదం చేస్తాయి. చర్య అంటే తెలియని దాన్నుంచి రక్షణ లేకపోవటం, సున్నితంగా ఉండటం. ఆలోచన, నమ్మకం - అంటే తెలిసి ఉన్నది తెలియని దానికి ఆటంకం అవుతుంది. ఆలోచన తెలియని దానిలోనికి చొరబడలేదు. ఆలోచన ఆగిపోతే గాని తెలియనిది ఉండదు. తెలియని దాని చర్య ఆలోచన ఫలితంగా జరిగే చర్యకి అతీతమైనది. ఆలోచనకి ఈ సంగతి తెలిసి, వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని తెలిసినదాన్నే పట్టుకుని ఉంటుంది. తెలియని దానికి - సమస్యకి తెలిసినదే ఎప్పుడూ ప్రతిక్రియ అవుతుంది. ఈ అసంపూర్ణ ప్రతిక్రియ నుంచే సంఘర్షణ గందరగోళం, దుఃఖం మొదలవుతాయి. తెలిసినదీ, ఊహా అంతమైనప్పుడే తెలియని దానిపైన చర్య సాధ్యమవుతుంది. అది అపరిమితమైనది.