మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సాఫల్యం

వికీసోర్స్ నుండి

35. సాఫల్యం

ఆవిడకి వివాహం అయింది. కాని పిల్లల్లేరు. ఐహికంగా సుఖంగానే ఉన్నట్లు చెప్పిందావిడ. డబ్బు ఆవిడకి సమస్య కాదుట. కార్లున్నాయి, మంచి హోటళ్లున్నాయి. అన్నిచోట్లకీ ప్రయాణం చెయ్యొచ్చు. ఆవిడ భర్త బాగా వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకున్న ఆసక్తి అంతా భార్యని ముస్తాబు చేయించటం, ఆవిడ సుఖంగా ఉండేలా చూడటం. ఆవిడ కోరినదల్లా సమకూర్చటం. ఇద్దరూ బాగా చిన్నవాళ్లే. కలిసిమెలిసి ఉంటారు. ఆవిడకి సైన్సులోనూ కళల్లోనూ ఆసక్తి ఉందిట. మతం విషయంలో కూడా కొంత ప్రవేశం ఉందిట. ప్రస్తుతం ఆధ్యాత్మిక విషయాలు తక్కిన వాటన్నిటినీ పక్కకి తోసేస్తున్నాయని చెప్పింది. వివిధ మతాలు ఏవేం బోధించాయో అవన్నీ ఆవిడకి తెలుసునట. కాని ఆ వ్యవస్థల సమర్థత, వాళ్ల ఆచారాలూ, ప్రగాఢ విశ్వాసాలూ ఆవిడకి నిరాశ కలిగించాయట. నిజమైన విషయాలను శోధించాలని గాఢంగా వాంఛిస్తున్నదట. ఆవిడ తీవ్రమైన అసంతృప్తితో ఉంది. ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లోని గురువుల వద్దకు వెళ్లిందట. కాని ఏదీ ఆవిడకి శాశ్వతమైన తృప్తినివ్వలేదుట. ఆవిడ అసంతృప్తి, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి, పిల్లలు లేకపోవటం వల్ల కలిగింది కాదు. ఆ విషయమై ఆవిడ చాలా ఆలోచించిందిట. ఆ అసంతృప్తి సాంఘిక విషయాల్లో ఆశాభంగం కలగటం వల్ల వచ్చిందీ కాదుట. కొంతకాలంపాటు ఆవిడ పేరు పొందిన వాళ్లలో ఒకరి చేత మనస్తత్వ విశ్లేషణ చేయించుకుందిట. అయినా, అంతరంగంలోని ఈ బాధ, శూన్యత ఇంకా అలాగే ఉన్నాయట.

సాఫల్యాన్ని కోరటం ఆశాభంగాన్ని కొని తెచ్చుకోవటానికే. ఆత్మకి సాఫల్యం అనేది లేదు. అది కోరినదల్లా సొంతం చేసుకొని, తన్ను తాను శక్తిమంతం చేసుకోవటమే. సొంతం చేసుకున్నది ఎటువంటి స్థాయికి చెందినదైనా, అది ఆత్మకి శక్తి, సంపద, చురుకుతనం కలిగినట్లు భావన కలుగచేస్తుంది. ఈ అనుభూతినే సాఫల్యం అంటారు. అన్ని అనుభూతుల లాగే అది కూడా త్వరలోనే రూపుమాసి, దాని స్థానంలో మరొకదాన్ని తేవటం, ప్రత్యామ్నాయంగా ఉంచటం - ఈ విధమైన ప్రక్రియ మన కందరికీ తెలిసినదే. ఈ రకం క్రీడతోనే మనలో చాలా మంది తృప్తిపడుతున్నారు. అయితే, కొంతమందికి ఇంకా శాశ్వతమైన సంతృప్తి కావాలి. తమ జీవితాంతం పొంద గలిగే సంతృప్తి కావాలి. అటువంటిది దొరికినట్లయితే, ఇకవారికి ఏవిధమైన ఇబ్బందీ కలుగకూడదని ఆశిస్తారు. కాని, ఇబ్బంది కలుగుతుందేమోనన్న అవ్యక్త భయం నిత్యం ఉంటుంది. దాన్ని ప్రతిఘటించటం సూక్ష్మరూపాలలో అలవరచుకుని, వాటిల్లో రక్షణ పొందుతుంది మనస్సు. అందుచేత మరణభయం అనివార్యమవుతుంది. సాఫల్యం, మరణభయం - ఈ రెండూ ఆత్మని శక్తి సంపన్నం చేసుకునే ఏక ప్రక్రియకి రెండు వైపులు. సాఫల్యం అంటే దేనితోనో ఒకదాంతో - పిల్లలతో గాని, ఆస్తితోగాని, భావాలతో గాని తన్నుతాను ఐక్యం చేసుకోవటమే కదా. పిల్లలు, ఆస్తి కొంతవరకు ప్రమాదకరం. కాని భావాలు ఎక్కువ క్షేమాన్నీ రక్షణనీ ప్రసాదిస్తాయి. మాటలు, అంటే భావాలూ, జ్ఞాపకాలూ - వీటికి సంబంధించిన అనుభూతులు - ఇవి చాలా ముఖ్యం అవుతాయి. సాఫల్యం, సంపూర్ణత కేవలం మాటలుగా మాత్రమే మిగులుతాయి.

ఆత్మసాఫల్యం అనేది లేదు. ఆత్మని శాశ్వతం చేసుకోవటం మాత్రమే. నిరంతరం అధికమయే ఆత్మ సంఘర్షణలతో, వైరుధ్యాలతో, దుఃఖాలతో, అనంతమైన సంతృప్తిని ఏదో ఒక స్థాయిలో కోరుకోవటం ద్వారా గందరగోళాన్నీ దుఃఖాన్నీ కొనితెచ్చుకోవటమే అవుతుంది. సంతృప్తి అనేది ఎప్పటికి శాశ్వతంగా ఉండటం సాధ్యంకాదు. సంతృప్తి కలిగించిన అనుభవాన్నొక దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుఇకోవచ్చు. కాని, ఆ అనుభవం గతించి పోయింది. దాని స్మృతి మాత్రమే మిగిలింది. ఈ స్మృతికి జీవం ఉండదు. కాని, ప్రస్తుతానికి తగిన ప్రక్రియ లేకుండా చేసి, దానికి మీరు జీవం పోస్తున్నారు. గతించిన దానిపై మీరు జీవిస్తున్నారు. మనలో, అనేకమంది చేసేది అదే. ఆత్మ అవలంబించే మార్గాలను తెలుసుకోకపోవటం భ్రమకి దారితీస్తుంది. ఒక్కసారి భ్రమలో చిక్కుకున్నట్లయితే, దాని వల తెంపుకుని బయట పడటం కష్టం. భ్రమని గుర్తుపట్టటం కష్టం. భ్రమని కల్పించినా, ఆ సంగతి మనస్సు గ్రహించలేదు. దాన్ని అవ్యక్తంగా, పరోక్షంగా చేరుకోవాలి. కోరిక తీరుల్ని అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే, భ్రమలో ఉండిపోవటం అనివార్యం. అవగాహన ఇచ్ఛానుసారంగా కలిగేది కాదు. మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. మనస్సుని నిశ్చలంగా చేయలేము - అ చేసేది కూడా మనస్సే. అంటే, కోరిక తయారు చేసినదే కాబట్టి. ఈ ప్రక్రియ యావత్తూ తెలుసుకోవాలి. ఏ విధమైన మనోభీష్టం లేకుండా తెలుసుకోవాలి. భ్రమ పెంపొందకుండా ఉండటానికి అప్పుడే అవకాశం ఉంటుంది. భ్రమ చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే దాన్ని అంటిపెట్టుకుని ఉంటాం. భ్రమవల్ల బాధ కలగవచ్చు. కాని ఆ బాధే మన అసంపూర్ణతని బయటపెట్టి, ఆ భ్రమతో మనల్ని మనం పూర్తిగా ఐక్యం చేసుకునేట్లు తొందరపెడుతుంది. ఆ విధంగా భ్రమకి మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది ఉన్నదాన్ని - బాహ్యంగా కాదు - అంతర్గతంగా కప్పిపెట్టి ఉంచటంలో సహాయపడుతుంది. అంతర్గతంగా ఉన్నదాన్ని లెక్కచెయ్యకుండా ఉండటం వల్ల వినాశం, దుఃఖం సంభవిస్తాయి. ఉన్నదాన్ని దాచి పెట్టటం వలన భయం ఉంటుంది. ఇచ్ఛానుసారం వర్తించి భయాన్ని జయించలేము - ప్రతిఘటన వల్లనే ఇచ్ఛ పుడుతుంది కనుక. ఉదాసీనంగా ఉంటూ చురుకుగా తెలుసుకోవటం ద్వారానే భయం నుంచి విముక్తి లభిస్తుంది.