మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/చిత్తశుద్ధి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

34. చిత్తశుద్ధి

పచ్చని చిన్న మైదానం, దాని చుట్టూ అంచున కళకళలాడుతూ పువ్వులు. ఎంతో జాగ్రత్త తీసుకుని దాన్ని అందంగా ఉంచారు. ఎండ మాత్రం వీలైనంత వరకు గడ్డిని మాడ్చేసి పువ్వులు ఎండిపోయేట్లు చేస్తోంది. ఈ ముచ్చటైన తోటకి అవతలున్న కొన్ని ఇళ్లు దాటితే నీలిరంగు సముద్రం ఎండకి తళతళలాడుతోంది. దానిమీద తెల్లని తెరచాపతో ఒక ఓడ. గదిలోంచి చూస్తే క్రిందనున్న తోట, ఇళ్ల కప్పులు, చెట్లపైభాగం కనిపిస్తాయి. ఆ గది కిటికీ లోంచి ఉదయం పూటా, సాయంకాలం పూటా సముద్రం చూడటానికి హాయిగా ఉంటుంది. పగటిపూట దాని నీళ్లు కాంతివంతంగా కఠినంగా ఉన్నట్లుంటాయి. కాని, మిట్ట మధ్యాహ్నం కూడా ఓడ తెరచాప కనిపిస్తూనే ఉంటుంది. సూర్యుడు సముద్రం లోపలికి వెళ్ళిపోతాడు మెరిసే ఎర్రని బాట వేస్తూ సంధ్య వెలుగు ఉండదు. నక్షత్రం ఒకటి ఆకాశం మీద తిరిగి అంతలోనే మాయమవుతుంది. అప్పుడే ఉదయిస్తున్న చంద్రుని ఛాయ సాయంకాలాన్ని ఆవరించుకుంటుంది. కాని అంతలోనే చంద్రుడు కూడా ఆ కల్లోలిత సముద్రంలోకి మాయమవుతాడు. నీళ్లనిండా చీకటి నిండుతుంది.

ఆయన చాలాసేపు భగవంతుడి గురించీ, మొక్కల గురించీ, సంధ్యా వందనాల గురించీ, ఉపవాసాల గురించీ మాట్లాడాడు. మొక్కల గురించీ, రగులుతున్న కోరికల గురించీ, చాలా స్పష్టంగా, నిశ్చితంగా వ్యక్తం చేశాడు. సరియైన మాటలకోసం తడుముకోవటం లేదు. ఆయనది బాగా శిక్షణ పొందిన మనస్సు. ఆయన ఉద్యోగానికి కావలసినదే అది. ఆయన కాంతివంతమైన కళ్లతో చురుకుగా చూస్తున్నాడు, కొంత కఠినత్వం ఆయనలో ఉన్నప్పటికీ. లక్ష్యసిద్ధికోసం పట్టుదల, లొంగే స్వభావం లేకపోవటం కనిపిస్తున్నాయి ఆయన కూర్చున్న తీరులో. ఆయనలో ఏదో అసాధారణమైన ఇచ్ఛాశక్తి ప్రేరణ ఉన్న సంగతి స్పష్టమవుతోంది. ఆయన చిరునవ్వు నవ్వినా, ఆయన మనస్సు చురుకుగా పర్యవేక్షణ చేస్తూ, తన ఆధిక్యతని చూపిస్తూనే ఉంది. ఆయన దైనందిన జీవితంలో చాలా సక్రమంగా ఉంటాడు. తాను అలవరచుకున్న అలవాట్లను తన ఇచ్ఛానుసారంగానే మార్చుకుంటాడు. ఇచ్ఛ లేకుండా ఏ సద్గుణమూ ఉండదన్నాడు. చెడుని నిర్మూలించాలంటే ఇచ్ఛ ఉండటం అవసరం. మంచికీ చెడుకీ మధ్య యుద్ధం అనంతమైనది, ఇచ్ఛ ఒక్కటే చెడుని అదుపులో పెట్టగలిగేది. ఆయనలో కొంత సరళ స్వభావం కూడా ఉంది. ఎందుకంటే, తోటకేసీ, హాయిగొల్పే పువ్వులకేసీ చూసినప్పుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. కాని, ఆయన తన ఇచ్ఛ, దాని కార్యరూపం - వీటి నుంచి మనస్సుని మరో చోటికి పోనివ్వటం లేదు. ఆయన పరుషపదాల్ని వాడకుండా ఉండటానికి ప్రయాసపడుతున్నప్పటికీ, ఏ మాత్రం కోపం, అసహనం కలిగినా, ఆయన ఇచ్ఛ ఆయన్ని ఉద్రిక్తుణ్ణి చేస్తోంది. ఆయన లక్ష్య పరిధిలో అందానికి స్థానం ఉన్నట్లయితే దాన్ని స్వీకరిస్తాడు. కాని, ఇంద్రియ సుఖానుభూతి కలుగుతుందేమోనన్న భయం మెదలుతూనే ఉంటుంది. ఆయన బాగా చదువుకున్నవాడు. సభ్యత తెలిసినవాడు. ఆయన ఇచ్ఛ ఆయన్ని వెన్నంటే ఉంది.

చిత్తశుద్ధి నిరాడంబరంగా ఉండలేదు. చిత్తశుద్ధి ఇచ్ఛను పెంపొందించేందుకు మూలాధారం. స్వార్థం ఎన్ని విధాలుగా ఉంటుందో ఇచ్ఛ తెలుసుకోలేదు. ఆత్మజ్ఞానం ఇచ్ఛానుసారం కలిగేది కాదు. క్షణక్షణం జీవితంలో ప్రతి సంచలనానికీ కలిగే ప్రతిక్రియలను తెలుసుకోవటం ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. వాటంతట అవే కలిగే ప్రతిక్రియలను ఇచ్ఛ ఆటంకపరుస్తుంది. అసలా ప్రతిక్రియల వల్లనే ఆత్మయొక్క రూపనిర్నాణం ఆవిష్కారమవుతుంది. కోరిక యొక్క సారమే ఇచ్ఛ. కోరికను అర్థం చేసుకోవటానికి ఇచ్ఛ ప్రతిబంధక మవుతుంది. ఇచ్ఛ ఏ రూపంలో ఉన్నా - మనస్సు పైపైన ఉన్నది గాని, లోలోపలికి వేళ్లు పాతుకుపోయిన కోరికలు గాని, ఉదాసీనంగా ఉండలేవు. ఉదాసీనతలోనే, అప్రమత్తమైన నిశ్శబ్దంలోనే, సత్యమనేది ఉంటుంది. సంఘర్షణ ఎప్పుడూ కోరికల మధ్యనే. ఆ కోరికలు ఏస్థాయిలో ఉన్నవైనా సరే. ఒక కోరికని బలపరుస్తూ, దానికి వ్యతిరేకంగా ఉండే తక్కిన వాటిని అణచివేసి నట్లయితే, మరింత ప్రతిఘటన ఏర్పడుతుంది. ఈ ప్రతిఘటనే ఇచ్ఛ. ప్రతిఘటన ద్వారా అవగాహన కలగదు. ముఖ్యమైన దేమిటంటే, కోరికను అర్థం చేసుకోవటం. అంతేకాని, ఒక కోరికను మరోకోరిక ద్వారా తప్పించు కోవటం కాదు. ఏదో సాధించాలి, ఏదో లాభం పొందాలి అనే కోరిక చిత్తశుద్ధికి పునాది. ఈ బలవత్తరమైన కోరిక పైపైదైనా, లోలోపలిదైనా, దానికి అనుగుణంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. దానితోనే భయం ఆరంభమవుతుంది. భయం ఆత్మజ్ఞానాన్ని అనుభవం వరకే పరిమితం చేస్తుంది. అందుచేత, అనుభవించిన దానికి అతీతంగా ఉండటం సాధ్యం కాదు. పరిమితమైనది కాబట్టి, ఆత్మజ్ఞానం విస్తృతమైన, గాఢమైన ఆత్మచైతన్యావస్థను మాత్రమే అలవరచు కుంటుంది. అనేక స్థాయిల్లో, అనేక సమయాల్లో "నేను" అనేది అంత కంతకు విస్తృతమవుతుంది. అంచేత, సంఘర్షణ, బాధా కొనసాగుతూనే ఉంటాయి. ఏదో కార్యకలాపంలో పడి మిమ్మల్ని మీరు ప్రయత్నపూర్వకంగా మరిచి పోవచ్చు - తోట పెంచటంలోనో, ఒక సిద్ధాంతాన్ని అవలంబించటంలోనో, ప్రజలందరిలోనూ యుద్ధం చెయ్యాలనే తీవ్రమైన ఉత్సాహం ప్రకోపించేటట్లు ఉద్రిక్తపరచవచ్చు. కానీ, దాంతో మీరే దేశం, మీరే సిద్ధాంతం, మీరే కార్యకలాపం, మీరే భగవంతుడూ అవుతారు. తాదాత్మ్యత ఎక్కువైన కొద్దీ సంఘర్షణనీ, బాధనీ మరింత కప్పిపుచ్చటం జరుగుతుంది. దేనితోనో ఒకదానితో ఐక్యం చేసుకోవాలనే అంతులేని పోరాటం సాగుతుంది. ఎంచుకున్న ఒకదానితో ఒకటై పోవాలని కోరిక చిత్తశుద్ధిలో సంఘర్షణకి దారి తీస్తుంది. దాంతో నిరాడంబరత పూర్తిగా పోతుంది. ముఖాన విభూతి పూసుకోవచ్చు, సామాన్యమైన వస్త్రం కట్టుకోవచ్చు, బిచ్చగానిలా తిరగవచ్చు. కాని అది నిరాడంబరత కాదు.

నిరాడంబరత, చిత్తశుద్ధి ఎన్నటికీ ఒకచోట సఖ్యంగా ఉండలేవు. ఏదో ఒకదానితో, ఏ స్థాయిలోనైనా సరే, తన్నుతాను ఐక్యం చేసుకున్నవాడు ఎంత చిత్తశుద్ధి కలవాడైనా నిరాడంబరుడు కాడు. ఏదో అవాలనే ఇచ్ఛే నిరాడంబరతకి వ్యతిరేకం. ఇంకా పోగుచెయ్యాలనే ఆకాంక్ష ఇంకా సాధించాలనే వాంఛ లేకుండా స్వేచ్ఛగా ఉన్నప్పుడే నిరాడంబరత్వం వస్తుంది. సాధించిన దానితో ఐక్యం అయిపోవటం - ఆ ఐక్యం అయిపోవటమే ఇచ్ఛ. అప్రమత్తంగా, ఉదాసీనంగా తెలుసుకోవటమే నిరాడంబరత. ఆవిధంగా తెలుసుకోవటంలో అనుభవించేవాడు అనుభవాన్ని పదిలపరచటం జరగదు. స్వయం విశ్లేషణ ఈ విధంగా అవ్యక్తంగా తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. విశ్లేషించటంలో ఎప్పుడూ ఒక ఉద్దేశం ఉంటుంది. - స్వేచ్ఛ పొందాలనో, అర్థం చేసుకోవాలనో, లాభం పొందాలనో, ఇటువంటి కోరిక ఆత్మచైతన్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. అదే విధంగా ఆత్మపరీక్ష చేసుకుని తీసుకున్న నిర్ణయాలు కూడా ఆత్మజ్ఞానాన్ని అరికడతాయి.