మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/మాటలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

36. మాటలు

ఆయన విస్తారంగా చదివాడు. బీదవాడైనా, తను జ్ఞాన సంపన్నుడి ననుకుంటాడాయన. అందువల్ల ఆయనకి కొంత ఆనందం. ఆయన ఎన్నో గంటల సేపు పుస్తకాలు చదువుతూనూ, చాలా సేపు ఏకాంతంగానూ గడుపుతాడుట. ఆయన భార్య పోయింది. ఆయన పిల్లలిద్దరూ ఎవరో బంధువుల దగ్గర ఉంటున్నారు. ఈ బంధుత్వపు బెడదంతా తప్పించుకున్నందుకు కొంతవరకు సంతోషిస్తున్నాడాయన. ఆయన తన ఒక్కడితో సరిపెట్టుకుంటూ స్వతంత్రంగా ఉంటున్నాడు. మెత్తని వాడైనా పట్టుదల గల మనిషి. ఎంతో దూరం నుంచి వచ్చానన్నాడు. ధ్యానం విషయమై తెలుసుకోవటానికి - ముఖ్యంగా, కొన్ని మంత్రాలూ, పదాలూ నిత్యం పదే పదే జపించటం ద్వారా ఎంతో సులువుగా మనస్సుని శాంతింప జేయటం విషయమై. అంతేకాదు అసలు మాటల్లోనే కొంత మాయ ఉందిట. శబ్దాల్ని సరియైన పద్ధతిలో ఉచ్చరించాలిట. సరిగ్గా వల్లించాలిట. ఈ శబ్దాలు ప్రాచీన కాలం నుంచీ సంక్రమించినవట. అ శబ్దాల్లోని అందం, వాటి గమకం, లయ ఇవే ధ్యానం కేంద్రీకరించటానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయిట. ఆ విధంగా చెప్పి, మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఆయన గొంతు బాగుంది. ఆ శబ్దాల్ని అర్థం చేసుకున్నందువల్లనూ వాటిపైన ఉన్న అభిమానం వల్లనూ ఆ గొంతులో ఒకవిధమైన తీయదనం వచ్చింది. ఎంతోకాలం నుంచి శ్రద్ధగా సాధన చేయటం వల్ల సునాయాసంగా వల్లిస్తున్నాడు. ఆయన వల్లించటం మొదలు పెట్టటంతో సర్వాన్నీ విస్మరించాడు.

పొలంలోంచి పిల్లన గ్రోవి శబ్దం వినవస్తోంది. మధ్య మధ్య ఆపుతూ వాయిస్తున్నా, స్వరం స్పష్టంగానూ పరిశుద్ధంగానూ ఉంది. అతడు పెద్ద చెట్టు క్రింద చిక్కని నీడలో కూర్చుని వాయిస్తున్నాడు. అతనికి అవతల దూరాన కొండలు ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ కొండలు, ఆ మంత్ర పఠనం, పిల్లన గ్రోవి శబ్దం - అన్నీ కలిసి, మాయమై మళ్లీ మొదలవుతున్నాయి. చిలకలు చప్పుడు చేస్తూ ఎగిరి వెళ్లాయి. మళ్లీ పిల్లనగ్రోవి మీద స్వరాలూ, గంభీరంగా, శక్తిమంతంగా చదువుతూన్న మంత్రం. అది ప్రాతఃకాలం. సూర్యుడు చెట్లమీదుగా పైకి వస్తున్నాడు. జనం గ్రామాలనుంచి పట్నానికి పోతున్నారు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ. పిల్లనగ్రోవీ, మంత్రమూ - రెండూ ఆగకుండా వినిపిస్తూనే ఉన్నాయి. దారిన పోయేవాళ్లు కొంతమంది ఆగిపోయారు వినటానికి. ఆ దారి ప్రక్కనే కూర్చుండిపోయారు ఆ మంత్రాలకీ, ఉదయకాలం మహిమకీ ముగ్ధులై. దూరం నుంచి వినిపిస్తున్న రైలుకూత వేటికీ అడ్డు రాలేదు. అన్ని శబ్దాలూ కలిసిపోయి భూతలాన్ని నింపినట్లుగా తోచింది. కాకి గట్టిగా అరవటం కూడా కటువుగా ధ్వనించలేదు.

ఎంతో చిత్రంగా శబ్దాల ధ్వనిలో చిక్కుకుంటాం మనం. మాటలు మనకెంత ముఖ్యమైపోయాయి. దేశం, దైవం, మతప్రవక్త, ప్రజాప్రభుత్వం, విప్లవం. ఆ మాటల్లోనే మనం జీవిస్తూ అవి సృష్టించే అనుభూతులతో ఆనందాన్ని పొందుతాం. ఈ అనుభూతులే అంత ముఖ్యమైపోయాయి. మాటలు మనకి తృప్తి కలిగిస్తాయంటే, వాటి ధ్వనులు మరిచిపోయిన అనుభూతులను మళ్ళీ మేల్కొల్పుతాయి. వాస్తవికతకు బదులు మాటలే ప్రత్నామ్నాయమైనప్పుడు వాటివల్ల కలిగే తృప్తి మరింత ఎక్కువగా ఉంటుంది. మన అంతరంగంలోని శూన్యతని ఆ మాటలతో, ఆ ధ్వనితో, చప్పుళ్లతో, కార్యకలాపంతో నింపుతాం. సంగీతం, మంత్రపఠనం మన నించీ, మన అల్పత్వాన్నుంచీ, విసుగుదల నుంచీ పారిపోవటానికి సుఖసాధనలు. మన గ్రంథాలయాల నిండా మాటలే. అంతులేకుండా ఎలా మాట్లాడతాం! ఓ పుస్తకం లేకుండా, ఏ పని చేస్తూ ఉండకుండా ఏకాంతంగా ఉండటానికి సాహసించలేము కూడా. మనం ఎకాంతంగా ఉన్నప్పుడు మనస్సు అశాంతిగా ఉంటుంది - ఇటూ అటూ అంతటా తిరుగుతూ, ఆదుర్దాపడుతూ, జ్ఞాపకం చేసుకుంటూ, కొట్టుకుంటూ. అందుచేత ఏకాంతమనేది ఎప్పుడూ ఉండదు. మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు.

ఏదో మాటనో, మంత్రాన్నో, ప్రార్థననో జపిస్తూ మనస్సుని నిశ్చలం చేయవచ్చును. నిస్సంశయంగా, మనస్సుకి మత్తు కలిగించి నిద్రపుచ్చవచ్చు. ఎంతో సంతోషకరంగా గాని, హింసాత్మకంగా గాని మనస్సుని నిద్రపోయేటట్లు చేయవచ్చు. నిద్రలో కలలు రావచ్చు. క్రమశిక్షణ ద్వారా, పూజ ద్వారా, జపం ద్వారా శాంతపరచిన మనస్సు ఎన్నటికీ చురుకుగా, సున్నితంగా, స్వేచ్ఛగా ఉండదు. ఈ విధంగా మృదువుగా గాని మోటుగా గాని, మనస్సుని బాదటం ధ్యానం కాదు. మంత్రాలు పఠించటం, బాగా పఠిస్తూంటే వినటం ఆనంద దాయకంగానే ఉంటుంది. కాని, అనుభూతి మరో అనుభూతికి ఆధారమవుతుంది. అనుభూతి భ్రమకి దారితీస్తుంది. మనలో చాలామంది భ్రమలలో బ్రతకటానికే ఇష్టపడతారు. ఇంకా తీవ్రమైన, విస్తారమైన భ్రమలను కనుక్కోవటంలో ఆనందం ఉంటుంది. కాని, ఆ భ్రమలను పోగొట్టుకుంటామన్న భయమే నిజాన్ని, వాస్తవాన్ని కప్పిపెట్టి, దాన్ని కనిపించకుండా చేస్తుంది. వాస్తవికతని అర్థం చేసుకునే శక్తి మనకి లేక కాదు. వాస్తవికతని తిరస్కరించి భ్రమలను పట్టుకోవటం వల్లనే మనం భయపడుతూ ఉంటాం. భ్రమలో అంతకంతకి లోతుకి కూరుకుపోవటం, మనల్ని బంధించిన బోనుని ముస్తాబు చేయడమూ ధ్యానం కాదు. భ్రమని పెంపొందించే మనో మార్గాలలో దేనివైపూ మొగ్గకుండా, తెలుసుకోగలగటమే ధ్యానానికి ఆరంభం.

నిజమైన దాని స్థానంలో మరొక దాన్ని సులభంగా పెట్టేసి, దానితోనే మనం తృప్తిపడటం చిత్రమైన విషయం. సంకేతం, మాట, కల్పన ఎంతో ముఖ్యమైపోతాయి. ఈ సంకేతం చుట్టూ ఆత్మవంచన అనే కట్టడాన్ని నిర్మిస్తాం. దానికి బలం చేకూర్చటానికి జ్ఞానాన్ని వినియోగిస్తాం. అందుకే నిజాన్ని అవగాహన చేసుకోకుండా అనుభవం అడ్డుపడుతుంది. తెలియ జేయటానికే కాకుండా, అనుభవానికి శక్తి సమకూర్చటానికి కూడా నామకరణం చేస్తాం. అనుభవానికి శక్తినివ్వటం ఆత్మని చైతన్యంగా చేసుకోవటమే. ఒకసారి ఆ ప్రక్రియలో చిక్కుకుంటే దాన్ని వదలటం కష్టం. ఆత్మ చైతన్యాన్ని తప్పించుకోవటం కష్టం. నిన్నటి అనుభవాలనూ, నేటి అనుభూతులనూ వదిలివేయటం అవసరం. లేనట్లయితే పునశ్చరణం అవుతుంది. ఒక చర్యని గాని, ఒక పూజని గాని, ఒక శబ్దాన్ని గాని పునశ్చరణ చేయటం వృథా పునశ్చరణలో పునఃసృష్టి ఉండదు. అనుభవం గతించిపోవటమే సృష్టి.