మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సహజత్వం
53. సహజత్వం
ఏదో గంభీర విషయాన్ని చర్చించటానికి వచ్చిన కొద్దిమందిలో ఆవిడ కూడా ఉంది. కుతూహలం కొద్దీ వచ్చి ఉండచ్చు, లేదా, స్నేహితులెవరైనా తీసుకొస్తే వచ్చి ఉండవచ్చు. మంచి దుస్తులు వేసుకుంది. హుందాగా ఉంది. తను చాలా అందంగా ఉంటానని ఆవిడ అనుకుంటోందన్నది స్పష్టమే. ఆవిడ తన గురించే అన్నీ ఆలోచిస్తున్నట్లుగా ఉంది - తన శరీరం, తన అందం, తన జుట్టు, తను ఇతరుల మీద కలిగిస్తున్న ప్రభావం - ఇదంతా. ఆవిడ చేష్టలు జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నట్లుగా ఉన్నాయి. మధ్యమధ్య వివిధ ధోరణులను ప్రదర్శించింది ముందుగానే ఎంతో జాగ్రత్తగా ఆలోచించి. ఆవిడ ధోరణి అంతా ఎంతో కాలం నుంచి అలవాటు చేసుకున్న ఠీవి, దానిలో ఎలాగైనా ఏం జరిగినా సరే ఇమిడిపోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లుగా ఉంది. తక్కిన వాళ్లు ఏవో గంభీర విషయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ గంటసేపూ ఆవిడ అదే ఠీవిలో ఉంది. ఆ గంభీరమైన, తీవ్రమైన ముఖాల మధ్య తనగురించే ఆలోచిస్తున్న ఆ అమ్మాయి ఆ చెబుతున్నదాన్ని వింటూ చర్చలో పాల్గొనటానికి ప్రయత్నిస్తోంది. కాని, ఆవిడ నోటివెంట మాటలు వెలువడలేదు. చర్చిస్తున్న సమస్య గురించి తనకు కూడా తెలుసునన్న విషయాన్ని ప్రదర్శించాలని కోరుతోంది. కాని, ఆమె కన్నుల్లో కంగారు - తను ఆ గంభీర సంభాషణలో పాల్గొన లేకపోతున్నానని. అంతలోనే తనలో తాను ముడుచుకుని పోతున్నట్లు కనిపించింది, కాని తాను ఎంతోకాలం నుంచి అలవరచుకున్న ఆ ఠీవిలోనే ఉందింకా. సహజత్వాన్ని ప్రయత్న పూర్వకంగా నాశనం చేయటం జరుగుతోంది.
ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఠీవి అలవరచుకుంటారు. ఒకవైపు స్థితిమంతుడైన వ్యాపారస్థుని నడకా, ఠీవీ, విజయాన్ని సూచించే అతని చిరునవ్వూ; మరోవైపు కళాకారుడి రూపం, ఠీవీ; ఇంకో పక్కన వినయ విధేయతలు కల శిష్యుడు, ఆ పక్కని క్రమశిక్షణ పొందిన సాధువు ఠీవి. తన గురించే ఆలోచించే ఆ అమ్మాయి లాగే ఆ ధర్మనిరతుడనుకునే అతని ఠీవి, క్రమశిక్షణతో ప్రయత్న పూర్వకంగా ఎన్నో వదులుకుని త్యాగంచేసి, కావాలని అలవరచుకున్నదే. ఆవిడ ఒక విధంగా ఉండాలనే ప్రయత్నంలో సహజత్వాన్ని త్యాగం చేస్తున్నట్లుగానే ఆయన తన లక్ష్యం కోసం తనని తాను బలిదానం చేసుకుంటాడు. ఇద్దరికీ కావలసినది లక్ష్యసాధనే - వేరు వేరుస్థాయిల్లో అయినా. ఆయన సాధించే ఫలితం సంఘానికి ఎక్కువ లాభదాయకం కావచ్చు, ఆవిడ లక్ష్యం కన్నా. కాని, ప్రధానంగా రెండూ ఒక లాంటివే. ఒకటి రెండవదాని కన్న ఉన్నతమైనది కాదు. ఇద్దరూ వివేకం లేని వారే. ఇద్దరూ సూచించేది మనస్సు అల్పత్వాన్నే. అల్ప మనస్సు ఎప్పటికీ అల్పంగానే ఉంటుంది. దాన్ని సంపన్నంగా పుష్కలంగా చేయటం సాధ్యంకాదు. అటువంటి మనస్సు తన్ను తాను అలంకరించుకోవటమో, సద్గుణాలను సంపాదించటమో చేసినప్పటికీ, అది ఎప్పటిలాగే ఉంటుంది వెలితిగా. తామనుకునే వికాసం, అనుభవం - వీటి ద్వారా దాని అల్పత్వమే అధికమవుతుంది. అనాకారిగా ఉన్న దాన్ని అందంగా చెయ్యలేము. అల్పమనస్సు సృష్టించే దేవుడు అల్పదైవమే అవుతాడు. వెలితిగా ఉండే మనస్సు లోతు తెలియనంతగా మారదు - జ్ఞానంతోనూ గడుసు మాటలతోనూ, వివేకవంతుల మాటలను ఉదాహరించటంతోనూ ఎంత అలంకరించుకున్నప్పటికీ, బాహ్య రూపాన్ని ఎంత ముస్తాబు చేసినప్పటికీ. అలంకారాలు ఆంతరంగికమైనవైనా, బహిరంగంగా ఉన్నవైనా మనస్సుని లోతు తెలియనంతగా చేయవు. ఆ లోతు తెలియని ప్రగాఢమైన మనస్సే సౌందర్యాన్నిస్తుంది - అంతేకాని, ఆభరణమూ, పెంపొందించుకున్న సద్గుణమూ కాదు. సౌందర్యం కలగటానికి మనస్సు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తన అల్పత్వాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆ తెలుసుకుంటూ ఉండటంలో పోల్చి చూడటం పూర్తిగా ఆపివెయ్యాలి.
ఆ అమ్మాయి అలవరచుకున్న ఠీవీ, ఆ ధర్మనిరతుడనని చెప్పుకునే ఆయన క్రమశిక్షణతో కూడిన ఠీవీ - రెండూ అల్పమనస్సు చిత్రహింసతో సాధించిన ఫలితాలే. అత్యవసరమైన సహజత్వాన్ని పూర్తిగా వదులుకున్నారు. ఇద్దరికీ సహజత్వం అంటే భయమే - తాము వాస్తవంగా ఉన్న స్థితి తమకూ, ఎదుటి వారికీ బయటపడుతుందేమోనని. ఇద్దరూ దాన్ని నాశనం చెయ్యటానికే పూనుకున్నారు. వారి సఫలతకి కొలమానం ఏమిటంటే, వారు ఎంచుకున్న పద్ధతికీ, నిశ్చితాభిఫ్రాయానికీ పూర్తిగా అనుగుణంగా ఉండటమే. కాని ఉన్న స్థితిని తెరిచి చూపే సాధనం ఒక్క సహజమైన స్పందనే. అప్రయత్నంగా జరిగే ప్రతిక్రియ మనస్సుని ఉన్నదున్నట్లుగా తెరిచి చూపుతుంది. కాని ఆవిష్కృతమైన దాన్ని వెంటనే అలంకార భూషితం చేయటమో, నాశనం చేయటమో జరుగుతుంది. అందుచేత సహజత్వాన్ని అంతం చేయటమవుతుంది. సహజత్వాన్ని హతమార్చటం అల్పమనస్సు అవలంభించే పద్ధతి. దానికోసం బాహ్యంగా కూడా అలంకరిస్తుంది - ఏ స్థాయిలోనైనా. ఈ అలంకరణే స్వీయ ఆరాధన. సహజత్వంలోనే, స్వేచ్ఛలోనే ఏదైనా కనుక్కోవచ్చు. క్రమశిక్షణ పొందిన మనస్సు కనుక్కోలేదు. ఎంతో సమర్ధవంతంగా, దానికోసం నిర్దయగా ప్రవర్తించవచ్చు. కాని, ఆలోతు తెలియనంత ప్రగాఢమైన దాన్ని కన్నుక్కోవటం సాధ్యం కాదు. భయమే క్రమశిక్షణ అనే ప్రతిఘటనని సృష్టిస్తుంది. కాని, అప్రయత్నంగా భయాన్ని కనుక్కున్నప్పుడు భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఒక పద్ధతికి అనుగుణంగా ఏ స్థాయిలోనైనా, ఉండటమే భయం. అది సంఘర్షణనీ, గందరగోళాన్నీ వైరుధ్యాన్నీ పెంపొందిస్తుంది. ఎదురు తిరిగిన మనస్సు భయం లేకుండా ఉండదు, ఎందువల్ల నంటే వ్యతిరేకమైనది ఎన్నటికీ సహజంగా స్వేచ్ఛగా ఉండదు.
సహజంగా ఉండకుండా ఆత్మజ్ఞానం ఉండటం సాధ్యంకాదు. స్వీయ జ్ఞానం లేకపోతే మనస్సు మీద వచ్చేపోయే ప్రభావాలుంటాయి. ఈ వచ్చేపోయే ప్రభావాలు మనస్సుని సంకుచితంగా గాని, విస్తృతంగా గాని చేస్తాయి. కాని, ఇంకా ప్రభావపు పరిధిలోనే ఉంటుంది. ఒకటిగా కూర్చిన వాటిని తిరిగి విడగోట్టవచ్చు. ఆవిధంగా లేనటువంటి దాన్ని స్వీయజ్ఞానం ద్వారానే తెలుసుకోవటం సాధ్యం. "నేను" అనేది దగ్గరగా కూర్చబడినటువంటిదే. "నేను"ని విడగొట్టటంలోనే ప్రభావాల ఫలితమైనటువంటి దాన్నీ, కారణాలకు అతీతమైనటువంటి దాన్నీ తెలుసుకోవచ్చు.