మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/చేతన, అంతశ్చేతన
54. చేతన, అంతశ్చేతన
ఆయనొక వ్యాపారస్థుడు, రాజకీయవేత్త కూడా. రెండు విధాలా విజయవంతమయాడు. వ్యాపారం, రాజకీయాలూ - రెండూ మంచి జోడి అన్నాడాయన నవ్వుతూ. అయినా, ఆయన ఒక విధంగా మూఢవిశ్వాసాల్లో నమ్మకం గలవాడే. వీలు చిక్కినప్పుడల్లా పవిత్ర గ్రంథాలను చదువుతాడుట. కొన్ని పదాల్ని పదేపదే పునశ్చరణ చేస్తాడుట. వాటివల్ల లాభం ఉందనుకుంటాడాయన. వాటివల్ల ఆత్మశాంతి చేకూరుతుంది అన్నాడాయన. ఆయన వయస్సు మీరినవాడే. ఆయన డబ్బున్నవాడు. ఆయన చేత్తోగాని, హృదయంతోగాని ఔదార్యం చూపినవాడు కాదు. ఆయన ఎంతో గడుసువాడనీ, ముందువెనకా ఆలోచించే రకమనీ తెలుస్తూనే ఉంది. అయినా, భౌతిక విజయం కాక, ఇంకేదో కావాలన్న తపన ఉంది. జీవితం ఆయన్ని స్పృశించనేలేదని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆయన ఎంతో కష్టపడి తన్ను తాను రక్షించుకున్నాడు. ఏ విధమైన ప్రభావానికీ లోబడిపోకుండా. శారీరకంగానూ, మానసికంగానూ కూడా ఆయన తన్ను తాను అభేద్యంగా చేసుకున్నాడు. మానసికంగా తను ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవటానికి ఇష్టపడలేదు. ఆపని చెయ్యగల స్తోమత ఆయనకుంది. కాని, దాని ఫలితం ఆయన మీద పని చెయ్యటం మొదలుపెట్టింది. ఆయన జాగ్రత్తగా గమనించకుండా ఉన్నప్పుడు, ఆయనలో ఎవరో వెంట పడుతున్నట్లుంటుంది ఆయన చూపు. ధనరీత్యా ఆయన సురక్షితంగానే ఉన్నాడు. అధమం, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఏవిధమైన పరివర్తనా ఉండదు. ఆధ్యాత్మిక లోకం అనే దాంట్లో కూడా ఆయన రక్షణ కోసం కొంత ప్రయత్నించదలుచుకున్నాడు. తను సొంతం చేసుకున్నవాటి మీద తప్ప ఆయనకు ప్రేమలేదు. పిల్ల తల్లిని వాటేసుకున్నట్లుగా వాటిని కరుచుకుని ఉన్నాడాయన. ఆయనకి అంతకన్న వేరే ఏమీ లేదు. మెల్లిగా ఆయనకి తెలుస్తోంది తను ఎంతో దుఃఖితుడని. ఈ గ్రహింపు కలగకుండా వీలైనంతవరకు తప్పించుకున్నాడు. కాని జీవితం ఆయన్ని ఒత్తిడి చేస్తోంది.
ఒక సమస్యని వ్యక్తంగా ఉన్న చేతన పరిష్కరించ లేకుండా ఉంటే, అవ్యక్తంగా వుండే అంతశ్చేతన దానిని పరిష్కరించటంలో సహాయపడుతుందా? ఈ వ్యక్తంగా ఉన్నదేమిటి? అవ్యక్తంగా ఉన్నదేమిటి? ఈ రెండింటికి మధ్యా ఒక గీత ఉన్నదా, ఒకటి ఆఖరై రెండవది మొదలయే చోట? వ్యక్తంగా ఉన్న దానికొక పరిధి ఉందా - దాన్ని దాటి వెళ్లలేక పోవటానికి? తన హద్దులకు తన్ను తానే పరిమితం చేసుకుంటుందా? అవ్యక్తంగా ఉన్నది వేరు, వ్యక్తంగా ఉన్నది వేరునా? అవి పోలిక లేనివా? ఒకటి భగ్నమైతే రెండవది పనిచెయ్యటం మొదలు పెడుతుందా?
మనం 'వ్యక్తంగా ఉన్నది' లేదా 'చేతన' అనేదేమిటి? అది దేనితో తయారైనదో అర్థం చేసుకోవటానికి, ఏదైనా సమస్యని మనం సచేతనంగా ఎలా సమీపిస్తామో గమనించాలి. మనలో చాలామంది సమస్యకి పరిష్కారం వెతకటం కోసం ప్రయత్నిస్తారు. మనం పరిష్కారం గురించి ఆలోచిస్తాం, సమస్య గురించి కాదు. సమస్యని పరిష్కారం ద్వారా తప్పించుకోవాలని కోరుకుంటాం. సమస్యని యథాతథంగా గమనించం, కాని, సంతృప్తికరమైన జవాబు కోసం తడుముకుంటాం. మన చేతనంలో మన ఆలోచన అంతా పరిష్కారాన్ని, సంతృప్తికరమైన నిర్ణయాన్ని వెతకటం గురించే. తరుచు మనకి తృప్తి కలిగించే పరిష్కారాన్ని కనుక్కుంటాం. ఆ తరవాత సమస్యని పరిష్కరించేశామనుకుంటాం. మనం నిజానికి చేసేదేమిటంటే, సమస్యని ఒక నిర్ణయంతో, ఒక సంతృప్తికరమైన పరిష్కారంతో కప్పిపెట్టి ఉంచుతాం. ఆ నిర్ణయం బరువు క్రింద తాత్కాలికంగా ఊపిరి సలపకుండా అణచిపెట్టి ఉన్నప్పటికీ, ఆ సమస్య ఇంకా అలానే ఉంటుంది. పరిష్కారం కోసం వెతకటం సమస్యని తప్పించుకోవటమే. తృప్తికరమైన పరిష్కారం లేనప్పుడు వ్యక్తంగా ఉన్న పైపై మనస్సు వెతకటం మానేస్తుంది. అప్పుడు అవ్యక్తంగా ఉన్నదనబడే లోలోపలి మనస్సు అందిపుచ్చుకుని పరిష్కారాన్ని కనుక్కుంటుంది.
వ్యక్తంగా ఉన్న మనస్సు సమస్యని తప్పించుకోవటానికి మార్గం వెతుకుతుందనీ, తృప్తికరమైన నిర్ణయమే ఆ తప్పించుకునే మార్గం అనీ స్పష్టమవుతోంది. వ్యక్తంగా లేదా చేతనంగా ఉన్న మనస్సు నిర్ణయాలతో తయారైనదే కదా - ఆ నిర్ణయాలు అనుకూలమైనవి గాని, ప్రతికూలమైనవి గాని. వేరొకటి వెతకటం దానికి చేతనవునా? అనుభవాలవల్లా, గతించిన వాటి ప్రభావం వల్లా ఏర్పడిన నిశ్చితాభిప్రాయాలకు ఆటపట్టు కాదా. పైపై మనస్సు? నిజానికి, వ్యక్తంగా ఉన్న మనస్సు గతంతో తయారైనదీ, గతంమీద ఆధారపడినదీ - ఎందువల్లనంటే, జ్ఞాపకమే నిశ్చితాభిప్రాయాలతో వేయబడినది. ఈ నిశ్చితాభిప్రాయాలతో మనస్సు సమస్యని సమీపిస్తుంది. సమస్యని ఆ నిశ్చితాభిప్రాయల తెర లేకుండా చూడటం చేతకాదు దానికి. దానికి నిశ్చితాభిప్రాయాలు మాత్రమే తెలుసును - అవి సంతోషకరమైనవి గానీ, సంతోషకరం కానివి గానీ, ఉన్న వాటికి మరికొన్ని నిర్ణయాలనూ, అభిప్రాయాలనూ, మార్పులేని స్థిరపడిన అభిప్రాయాలు మరికొన్నిటినీ చేర్చుకోగలదంతే. ఏ నిర్ణయమైనా స్థిరపడిన అభిప్రాయమే. వ్యక్తంగా ఉన్న చేతన మనస్సు తప్పని సరిగా నిర్ణయాన్ని కోరుతుంది.
సంతృప్తికరమైన నిర్ణయాన్ని కనుక్కోలేకపోయినప్పుడు చేతన మనస్సు వెతకటం మానేస్తుంది. స్తిమితంగా ఉంటుంది. అంతశ్చేతన హఠాత్తుగా ఒక పరిష్కారాన్ని ఈ స్తిమితంగా ఉన్న చేతనకు సూచిస్తుంది. ఇప్పుడు అవ్యక్తంగా ఉన్న లోపలి మనస్సుకి, వ్యక్తంగా ఉన్న మనస్సుకి నిర్మాణంలో ఏదైనా తేడా ఉన్నదా? అవ్యక్తంగా ఉన్న మనస్సు కూడా జాతి గురించీ, వర్గం గురించీ, సంఘం గురించీ ఏర్పడిన నిశ్చితాభిప్రాయాలూ, జ్ఞాపకాలూ కలిసి నిర్మితమైనది కాదా? నిజానికి, అవ్యక్తంగా ఉన్న మనస్సు కూడా గతం ఫలితమే. ఎటొచ్చీ, అది కనిపించకుండా నిరీక్షిస్తూ ఉంది అంతే. అవసరమైన వెంటనే తన నిగూఢ నిశ్చితాభిప్రాయాలను బయట పెడుతుంది. అవి సంతృప్తికరంగా ఉంటే పై మనస్సు వాటిని స్వీకరిస్తుంది. లేని పక్షంలో గిజగిజలాడుతూ, ఒక అద్భుతం జరిగి, సమస్యకు పరిష్కారం జరుగుతుందని ఆశపడుతుంది. పరిష్కారం దొరక్కపోతే విసుక్కుంటూ ఆ సమస్యని భరిస్తుంది. ఇది క్రమంగా మనస్సుని తినేస్తుంది. దాంతో రోగం, మతి భ్రమణం మొదలవుతాయి.
పై మనస్సూ, లోపలి మనస్సూ పోలిక లేకుండా ఉండవు. అవి రెండూ కూడా నిశ్చితాభిప్రాయాలతోనూ, జ్ఞాపకాలతోనూ తయారైనవే. రెండూ గతం నుంచి ఏర్పడినవే. పై మనస్సూ, లోపలి మనస్సూ - రెండూ నిశ్శబ్దంగా ఉండి అనుకూలమైనవి గాని ప్రతికూలమైనవిగాని అయిన నిశ్చితాభిప్రాయాలను ప్రదర్శించకుండా ఉంటేనే సమస్య అంతమొందుతుంది. మనస్సంతా పూర్తిగా నిశ్చలంగా ఉండి, సమస్యని ఇష్టాయిష్టాలు లేకుండా తెలుసుకున్నప్పుడు సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. అప్పుడే సమస్యని సృష్టించే ఆ స్థితి ఉండదు.