మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అసూయ

వికీసోర్స్ నుండి

52. అసూయ

ఎదురుగా ఉన్న తెల్లని గోడమీద ఎండ బాగా పడుతోంది. దాని తీక్షణమైన కాంతికి ముఖాలు మసకమసగ్గా కనిపిస్తున్నాయి. ఒక చిన్నపిల్ల తల్లి చెప్పకుండానే వచ్చి దగ్గరలో కూర్చుంది. అదంతా ఏమిటి అన్నట్లు తెల్లబోతూ కళ్లు పెద్దవి చేసి చూస్తోంది. అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంది. ఆ అమ్మాయి తల్లో పువ్వులున్నాయి. అ అమ్మాయి ప్రతీదీ గమనిస్తోంది పిల్లలందరి లాగే, దేన్నీ మనస్సులో పదిలపరచుకోకుండా. ఆ పిల్ల కళ్లు మెరుస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియట్లేదు ఆ పిల్లకి - ఏడవాలో, నవ్వాలో, ఎగరాలో. దానికి బదులు నా చెయ్యి పుచ్చుకుని ఎంతో దీక్షగా ఆసక్తిగా చూస్తోంది. అంతలోనే ఆ గదిలో చుట్టుపక్కలున్న మనుషులందరినీ మరిచిపోయి హాయిగా తన తల నా ఒడిలో పెట్టుకుని నిద్రపోయింది. ఆ అమ్మాయి తల మంచి తీరుగా సరిగ్గా సరిపోయినట్లుంది. ఎంతో పరిశుభ్రంగా ఉంది పిల్ల. ఆ అమ్మాయి భవిష్యత్తు కూడా ఆ గదిలో కూర్చుని ఉన్న తక్కిన వాళ్ల భవిష్యత్తులాగే అయోమయంగా దుఃఖపూరితంగా ఉంటుంది. ఆ అమ్మాయి సంఘర్షణ, సంతాపం ఆ గోడమీద ఎండలాగే అనివార్యమైనవి. బాధ నుంచీ, దుఃఖం నుంచీ విముక్తి పొందాలంటే అత్యున్నతమైన వివేకం ఉండాలి. ఆ అమ్మాయి విద్యా, ఆమె చుట్టూ ఉన్న ప్రభావాలూ ఆమెకు ఆ వివేకాన్ని కలుగనియ్యవు. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది అరుదుగా ఉంటుంది - అది పొగలేని జ్వాల. పొగ అంతటిని కమ్మేసి ఉక్కిరి బిక్కిరి చేసి తీవ్రమైన బాధ, కన్నీళ్లు తెప్పిస్తుంది. జ్వాల అరుదుగా కనిపిస్తుంది. పొగ అన్నిటికన్నా ముఖ్యమైపోయినప్పుడు జ్వాల ఆరిపోతుంది. ప్రేమ జ్వాల లేకుండా జీవితానికి అర్థం లేదు. అది మందకొడిగా అలసట గొలిపేలా తయారవుతుంది. కాని, చీకటి నింపే పొగలో జ్వాల నిలువ లేదు. ఆ రెండూ ఒకచోట ఉండలేవు. జ్వాల స్పష్టంగా ఉండాలంటే పొగ ఆగిపోవాలి. జ్వాలకి సాటి మరొకటి లేదు. పొగ జ్వాల కాదు. జ్వాలని తనలో ఇముడ్చుకోలేదు. పొగ జ్వాల ఉందని సూచించదు - పొగలేనప్పుడే జ్వాల ఉంటుంది కనుక.

"ప్రేమ, ద్వేషం ఒక చోట ఉండలేవా? అసూయ ప్రేమకు సూచన కాదా? మనం చేతుల్లో చేతులు పెట్టుకుంటాం. ఆ మరుక్షణం తిట్టిపోస్తాం. ఎంతో కఠినమైన మాటలంటాం. తరువాత ముద్దుపెట్టుకుని సమాధాన పడతాం. ఇదంతా ప్రేమకాదా? అసలు అసూయ ఉందంటేనే ప్రేమ ఉందన్న సూచన. వెలుగు - చీకటిలాగ - ఆ రెండూ జంటగా ఉంటాయి. ముక్కుమీద కోపం, ముద్దుపెట్టుకోవటం - ఈ రెండూ కలిస్తేనే కదా ప్రేమ. నది కల్లోలం గానూ ఉంటుంది. ప్రశాంతంగానూ ఉంటుంది. నీడలోనూ ప్రవహిస్తుంది, ఎండలోనూ ప్రవహిస్తుంది. అందులోనే ఉంది ఆ నదికి అందం."

మనం ప్రేమ అనేదేమిటి? అసూయ, కామం, కఠిన వాక్కులు, కౌగిలింతలు, చేతులు పట్టుకోవటాలు, తగువులాడుకోవటం, మళ్లీ కలుసుకోవటం - ఇవన్నీ కలిసినది. ఇవన్నీ ప్రేమ అనబడేదానిలోని వాస్తవాలు. ఈ రంగంలో కోపగించుకోవటం, కౌగిలించుకోవటం - ఈ రెండూ దైనందిన యథార్థాలు, కాదా? వివిధ వాస్తవాల మధ్య సంబంధం ఏర్పరచటానికి గాని, వాటిని ఒక దానితో ఒకటి పోల్చటానికి గాని ప్రయత్నిస్తాం. అదే రంగంలోని ఒక వాస్తవాన్ని మరో వాస్తవంతో పోల్చి దాన్ని ఖండించటమో సమర్థించటమో చేస్తాం, లేదా, ఆ రంగంలోని ఒక వాస్తవాన్ని దాని కవతలగా మరో రంగానికి చెందిన వాస్తవంతో సంబంధం ఏర్పరచటానికి ప్రయత్నిస్తాం. ప్రతి యథార్ధాన్నీ విడిగా తీసుకోకుండా ఒక దానికీ మరొక దానికీ మధ్య సంబంధం వెతకటానికి ప్రయత్నిస్తాం. మనం ఎందుకు చేస్తాం ఇలా? ఒక యథార్థాన్ని అదే రంగంలోని మరో యథార్థం ద్వారా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించకుండా ఉన్నప్పుడే ఆ యథార్థం అర్థమవుతుంది. అలా కాకపోయినట్లయితే సంఘర్షణా, అయోమయ స్థితీ సృష్టించటమవుతుంది. అదే రంగంలోని రెండు వాస్తవాలను మనం ఎందుకు పోల్చుతాం? ఒక వాస్తవాన్ని తేటతెల్లం చేయటానికి గాని, వివరంగా తెలియజేయటానికి గాని మరో వాస్తవం యొక్క ప్రాధాన్యాన్ని ఎందుకు వాడుకుంటాం?

"మీరు చెప్పిన దాంట్లోని అర్ధాన్ని ఇప్పుడే గ్రహించగలుగుతున్నాను. అయితే, మనం ఎందుకు చేస్తాం అలా?"

మనం యథార్ధాన్ని భావం అనే తెరద్వారా, జ్ఞాపకం అనే తెర ద్వారా చూడగలమా? మీ చెయ్యి పట్టుకున్నందువల్ల అసూయ అర్థమవుతుందా నాకు? చెయ్యిపట్టుకోవటం యథార్థం. అసూయ కూడా వాస్తవమే. అసూయ ఎలా పనిచేస్తుందో మీరు చెయ్యిపట్టుకున్నారన్నది నేను జ్ఞాపకం తెచ్చుకోవటం మూలంగా అర్థమవుతుందా? జ్ఞాపకం పోలుస్తుంది, మార్పులు చేస్తుంది, ఖండిస్తుంది, సమర్థిస్తుంది, ప్రత్యేకంగా గుర్తిస్తుంది. కాని అవగాహన కలుగజేయలేదు. ప్రేమ అనబడే రంగంలోని యథార్థాలను భావాలతోనూ నిర్ణయాలతోనూ సమీపిస్తాం. అసూయ అనే సత్యాన్ని విడిగా తీసుకుని దాన్ని నిశ్శబ్దంగా గమనించం. కాని ఆ సత్యాన్ని మెలికలు తిప్పుతాం - ఒక పద్ధతి ప్రకారం, ఒక నిశ్చితాభిప్రాయం ప్రకారం. మనం దాన్ని సమీపించే విధానం అదే. ఎందువల్లనంటే, అసూయ అనే సత్యాన్ని అర్థం చేసుకోవటం మనకి నిజంగా ఇష్టం లేదు కనుక. అసూయ యొక్క అనుభూతులు కూడా కౌగిలింత మాదిరిగానే ఉత్తేజకరంగా ఉంటాయి. కాని, మనకి బాధ, అసౌకర్యం లేకుండా ఉత్తేజం కావాలి - ఉత్తేజంతో బాటు అవీ అనివార్యమైనప్పటికీ. అందువల్లనే ప్రేమ అనే రంగంలో సంఘర్షణ, గందరగోళం, వైరుధ్యం ఉంటాయి. కాని అది ప్రేమా? ప్రేమ ఒక భావమూ, ఒక అనుభూతీ, ఉత్తేజమూనా? ప్రేమ అంటే అసూయా?

"భ్రమ లోనే నిజం పొదిగి ఉండదా? కాంతిని చీకటి ఆవరించదా? దాచి ఉంచదా. దైవం బంధింపబడి లేదా?"

ఇవన్నీ ఊహలూ, ఉద్దేశాలూ. అంచేత వాటిల్లో నిజం లేదు. అటువంటి ఊహలు శత్రుత్వాన్ని పెంపొందిస్తాయి. అవి సత్యాన్ని కప్పి ఉంచలేవు, వెలుగు ఉన్నచోట చీకటి ఉండదు. చీకటి వెలుగుని దాచి ఉంచలేదు. అది అలాచేసిందంటే అది వెలుగు కాదన్న మాటే. అసూయ ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. భావంలో ఉండదు ప్రేమ. పరస్పర సంబంధం ఉన్నప్పుడే ఒకరినొకరు తెలుసుకోగలుగుతాం. ప్రేమ భావంతో ముడిపడి లేదు. అందువల్ల భావంతో ప్రేమని సమీపించలేము. ప్రేమ పొగలేని జ్వాల.