మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/వైరుధ్యం
51. వైరుధ్యం
ఆయన బాగా పేరు పొందిన, బాగా నిలదొక్కుకున్న రాజకీయవేత్త. కొంత అహంకారం ఉన్నవాడు. అందువల్ల ఆయనకి అసహనం. ఉన్నత విద్య పొందినవాడు. ఆయన బాగా విచారించి, అతిమెల్లిగా వ్యక్తం చేస్తున్నాడు తన అభిప్రాయాలు. సూక్ష్మంగా సూచించటం ఆయనకి చేతకాదు. ఎందుకంటే ఆయనకి ఇతరులను మెప్పించే అలవాటుంది. ఆయనే ప్రజలు, ప్రభుత్వం, అధికారం. ఆయన ధారాళంగా ప్రసంగించగలడు. ధారాళంగా మాట్లాడటమే ఒక దురదృష్టం. ఆయన్ని ఎవ్వరూ అక్రమ పద్ధతిలోకి లాగలేరు. అందువల్లనే ప్రజల మీద ఆయన కంత ప్రభావం. అ గదిలో కూర్చోవటానికి ఆయనకి ఒక విధంగా అసౌకర్యంగా ఉంది. రాజకీయవేత్త ఎక్కడో దూరాన ఉన్నాడు. మనిషి ఇక్కడున్నాడు, మనఃకల్లోలంతో తన్ను తాను తెలుసుకుంటూ. ఆ దర్పం, దృఢవిశ్వాసం పోయాయి. తెలుసుకోవాలనే ఆదుర్దా, యోచనా, ఆత్మవివరణా ఉన్నాయి.
అపరాహ్ణపుటెండ, కిటికీ లోంచి వస్తోంది. అలాగే వీధిలో చప్పుళ్లు కూడా. పచ్చని కాంతి పుంజాల్లాటి చిలకలు రోజంతా బయటికి తిరగటం పూర్తి అయాక రాత్రికి పట్నంలో దారి పక్కల్నీ, తోటల్లోనూ ఉన్న పెద్ద చెట్ల మధ్య తలదాచుకోవటానికి తిరిగి వస్తున్నాయి. ఎగురుతూ, అ చిలకలు భీకరంగా కీచుమంటూ అరుస్తున్నాయి. ఒక వరుసలో తిన్నగా ఎగరవు - పడుతూ, లేస్తూ, పక్కలికి తిరుగుతూ, ఎగురుతున్నంత సేపూ గొడవగా కేకలేస్తూ ఉంటాయి. వాటి ఎగరటం తీరూ, వాటికేకలూ వాటి అందానికి విరుద్ధంగా ఉంది. దూరంగా సముద్రం మీద ఒకే ఒక్క ఓడ, తెల్లని తెరచాపతో ఉంది. గది చిన్న జనసమూహంతో నిండి ఉంది - వివిధ రకాల ఆలోచనల వైరుధ్యంతో. ఒక కుక్కపిల్ల లోపలికి వచ్చి ఇటూ అటూ చూసి వెళ్లిపోయింది, ఎవరూ గమనించకుండా. గుడిలో గంట మోగుతుంది.
"మన జీవితంలో వైరుధ్యం ఎందుకుంటుంది?" అని అడిగాడాయన. "మనం శాంతి, అహింస అనే ఆదర్శాల గురించి మాట్లాడుతూ ఉంటాం, కాని యుద్ధానికి పునాది వేస్తూ ఉంటాం. మనం యథార్థవాదులుగా కావాలి గాని స్వాప్నికులుగా కాదు. మనకి శాంతి కావాలి. అయినా, దైనందిన కార్యకలాపాలు యుద్ధానికి దారితీస్తాయి. మనకి కాంతి కావాలి. అయినా మనం కిటికీ మూసేస్తాం. మన ఆలోచనా విధానమే వైరుధ్యం - కావాలి, వద్దు. ఈ వైరుధ్యం మన ప్రకృతి సిద్ధమే కావచ్చు. అందువల్ల దాన్ని ఐక్యం చేసి మొత్తం ఒకేలా చేయటానికి ప్రయత్నించటం వృథాయే అనిపిస్తుంది. ప్రేమ, ద్వేషం ఎప్పుడూ ఒకేచోట ఉన్నట్లు తోస్తుంది. ఈ వైరుధ్యం ఎందుకుంది? ఇది అనివార్యమా? దాన్ని తప్పించుకోవటానికి వీలుందా? నేటి ప్రభుత్వం శాంతి కోసమే ఉండటానికి వీలవుతుందా? అది ఒకేలా ఉండటానికి వీలవుతుందా? అది శాంతికోసం పని చెయ్యాలి, అయినా యుద్ధం కోసం సంసిద్ధం కావాలి. శాంతి అనే లక్ష్యాన్ని యుద్ధ సంసిద్ధతతో చేరుకోవాలి."
మనం ఒక నిశ్చితమైన లక్ష్యాన్నీ ఆదర్శాన్నీ ఎందుకు పెట్టుకుంటాం? దాన్నుంచి వైరుధ్యాన్ని ఎందుకు సృష్టిస్తాం? ఒక నిశ్చితాంశం, ఒక నిశ్చితాభిప్రాయం లేనట్లయితే వైరుధ్యమే ఉండదు. మనం స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసి, దానికి దూరంగా తిరుగుతూ ఉంటాం. దాన్నే వైరుధ్యం అంటున్నాం. ఒక నిశ్చితాభిప్రాయానికి అనేక వక్రమార్గాల ద్వారా, వివిధ స్థాయిల్లో చేరుకుంటాం. అటుపైన ఆ నిశ్చితాభిప్రాయానికీ, ఆదర్శానికీ అనుగుణంగా జీవించటానికి ప్రయత్నిస్తాం. అలా చెయ్యలేం కనుక ఒక వైరుధ్యం సృష్టింపబడుతుంది. ఇక, ఒకవైపున ఆ నిశ్చిత లక్ష్యానికి, ఆదర్శానికి, నిశ్చితాభిప్రాయానికీ, ఆలోచనకీ, మరోవైపున చర్యకీ వంతెన కట్టటానికి ప్రయత్నిస్తాం. ఈ వంతెన కట్టడాన్ని ఒకే రీతిలో ఉండటం అంటున్నాం. ఆ విధంగా ఒకే రీతిలో ఉన్నవాణ్ణి, తన నిశ్చితాభిప్రాయానికీ, తమ ఆదర్శానికీ కట్టుబడి ఉన్నవాణ్ణి ఎంత మెచ్చుకుంటాం? అటువంటి మనిషిని మహాత్ముడు అంటాం. కాని, పిచ్చివాళ్లు కూడా ఒకే రీతిలో ఉంటారు. వారి నిశ్చితాభిప్రాయాలకి వాళ్లూ కట్టుబడి ఉంటారు. తన్ను తాను నెపోలియన్ అనుకునే వాడిలో వైరుధ్యం ఉండదు. అతను తన నిశ్చితాభిప్రాయంలో మూర్తీభవిస్తాడు. తన ఆదర్శంతో తన్ను తాను ఐక్యం చేసుకున్న వాడు స్పష్టంగా మతి స్తిమితం లేని వాడే.
ఆదర్శం అని మనం పిలిచే ఆ నిశ్చితాభిప్రాయం ఏ స్థాయిలోనైనా
ఏర్పడవచ్చు - వ్యక్తంగా కావచ్చు, అవ్యక్తంగా కావచ్చు. ఒకసారి ఏర్పరచుకున్న తరవాత మన చర్యని దాని సమీపానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తాం. అదే వైరుధ్యాన్ని సృష్టిస్తుంది. ఏర్పరచుకున్న విధానానికీ, ఆదర్శానికీ అనుగుణంగా ఒకే రీతిలో వర్తించటం అన్నది ముఖ్యం కాదు. అసలు ఆ నిశ్చిత లక్ష్యాన్ని ఎందుకు పోషిస్తున్నామని కనుక్కోవటం ముఖ్యం. ఎందుకంటే, ఆ విధానం లేకపోతే వైరుధ్యమే ఉండదు కనుక. అంచేత మనకి ఆదర్శం నిశ్చితాభిప్రాయం ఉండటం ఎందుకు? ఆదర్శం చర్యకి ప్రతిబంధకం కాదా? చర్యని మార్చటానికీ, అదుపులో పెట్టటానికీ కదా ఆదర్శం బయలుదేరినది? ఆదర్శం లేకుండా వ్యవహరించటం సాధ్యం కాదా? ఆదర్శం గతానికీ, ప్రభావితమవటానికీ ప్రతిక్రియ. అందువల్ల, మనిషిని సంఘర్షణనుంచీ, గందరగోళం నుంచీ అది ఎన్నటికీ విముక్తి కలిగించలేదు. ఆదర్శం, నిశ్చితాభిప్రాయం మనిషికీ మనిషికీ మధ్య విభేదం ఎక్కువ చేసి త్వరలో నాశనం అయేందుకు దోహదం చేస్తుంది.
నిశ్చిత లక్ష్యం ఏదీ లేనట్లయితే, ఆదర్శం లేనట్లయితే, పెడమార్గం పట్టే అవకాశం గాని, వైరుధ్యం గాని ఉండదు. ఒకే రీతిలో ఉండాలనే తపన ఉండదు. అప్పుడిక క్షణక్షణమూ చర్యే ఉంటుంది. అ చర్య ఎప్పుడూ సంపూర్ణంగానూ, నిజమైనదిగానూ ఉంటుంది. సత్యం ఆదర్శం కాదు, కల్పన కాదు, అది వాస్తవమైనది. వాస్తవమైన దాన్ని అర్థం చేసుకోవచ్చు, దానితో వ్యవహరించవచ్చు. వాస్తవాన్ని అర్థం చేసుకోవటం వల్ల శత్రుత్వం పెంపొందదు, ఆదర్శం వల్ల అలాకాదు. ఆదర్శాలు ఎన్నటికీ మూలపరివర్తనని తీసుకురాలేవు. అవి తెచ్చేది కొద్ది మార్పులతో కొనసాగే పాతది మాత్రమే. క్షణక్షణమూ తీసుకునే చర్య వల్లనే మూల పరివర్తన సంభవిస్తుంది. అది ఆదర్శం మీద ఆధారపడి ఉండదు. అందువల్ల నిశ్చితాభిప్రాయానికి బంధింపబడి ఉండదు.
"కానీ, ప్రభుత్వం ఈ సూత్రం ప్రకారం వ్యవహరించలేదు. ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ జరగాలి. ఒక సమస్య విషయమై దీక్షతో కూడిన కృషి ఉండాలి. నా మటుకు నాకు అందులో గొప్ప అవకాశాలున్నట్లు గ్రహించాను. కాని సామూహిక కార్యాచరణకి అది పని చెయ్యదు."
ప్రణాళిక ప్రకారం చర్య తీసుకోవాలంటే దాన్ని నిత్యం మార్పు చేయటం అవసరమవుతుంది. ఒక స్థిర పథకం ప్రకారం చర్య తీసుకోవాలంటే అది తప్పకుండా భగ్నమవుతుంది - దానితో బాటు భౌతిక వాస్తవికతలనూ, మానసికమైన ఒత్తిడులనూ విచారించకుండా ఉంటే; మీరొక వంతెనను కట్టాలని పథకం వేసుకుంటే, దాని నమూనాని తయారు చేయటమే కాదు, ఉన్న మట్టినీ, భూభాగాన్నీ, కట్టవలసిన స్థలాన్నీ కూడా పరిశీలించాలి. లేకుంటే మీ పథకం సరిపోదు. భౌతిక వాస్తవికతలనూ, మానసికమైన ఒత్తిడులనూ, అన్నిటితో కూడిన మానవ ప్రక్రియని అర్థం చేసుకున్నడే పూర్తి చర్య సాధ్యమవుతుంది. ఈ అవగాహన ఏ నమూనాపైనా ఆధారపడి ఉండదు. దానికి కావలసినది సర్దుకు పోవలసిన లక్షణం. అదే వివేకం. వివేకం లేనప్పుడే మన నిశ్చితాభిప్రాయాలనీ, ఆదర్శాలనీ, లక్ష్యాలనీ పట్టుకుంటాం. ప్రభుత్వ వ్యవస్థ స్థిరమైనది కాదు. దాని నాయకులు అనుకుంటే అనుకోవచ్చు. ప్రభుత్వం కూడా వ్యక్తిలాగే సజీవమైనది. క్రియాశక్తి సంపన్నమైనది. క్రియాశక్తి సంపన్నమైన దానిని ఒక నమూనా అనే చట్రంలో బంధించలేము. మనం సాధారణంగా ప్రభుత్వం చుట్టూ గోడలు నిర్మిస్తాం - నిశ్చితాభిప్రాయాలూ, ఆదర్శాలు అనే గోడల మధ్య బంధించి ఉంచగలమని ఆశిస్తాం - కాని, ఒక సజీవమైన దాన్ని బంధించి ఉంచలేరు - దాన్ని చంపకుండా. అందుచేత ప్రభుత్వాన్ని నాశనం చెయ్యటానికి పూనుకుని ఒక పథకం తయారు చేస్తాం ఒక ఆదర్శం ప్రకారం. చచ్చిపోయిన దాన్ని మాత్రమే చట్రంలో బిగించగలరు. జీవితం నిత్యం చలనంలో ఉంటుంది కాబట్టి జీవితాన్ని ఒక నిశ్చితమైన విధానానికీ, ఒక నిశ్చితాభిప్రాయానికి కట్టి ఉంచిన క్షణంలో వైరుధ్యం బయలు దేరుతుంది. ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం వ్యక్తి వినాశమే. అందుచేత ప్రభుత్వ వినాశం కూడా. ఆదర్శం జీవితం కన్న ఉన్నతమైనది కాదు. మనం దాన్ని అలా చేసినప్పుడు గందరగోళం, వైరుధ్యం దుఃఖం తప్పవు.