మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఉన్నది, ఉండవలసినది

వికీసోర్స్ నుండి

50. ఉన్నది, ఉండవలసినది

"నాకు వివాహం అయింది. పిల్లలున్నారు." అని చెప్పిందావిడ. "కాని, నాలోని ప్రేమ అంతా పోయింది. నేను క్రమంగా ఎండిపోతున్నాను. ఏదో కాలక్షేపం క్రింద సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పటికీ, అవి ఎంత వ్యర్థమో గ్రహించాను. నాకు ప్రగాఢంగా, సంపూర్ణంగా ఆసక్తి కలిగించేదేదీ లేదనిపిస్తోంది. ఈ మధ్య ఇంటిపనుల నుంచీ, సాంఘిక కార్యకలాపాల నుంచీ చాలాకాలంపాటు సెలవు తీసుకుని చిత్రలేఖనం ప్రయత్నించాను. కాని నా మనస్సు అందులోనూ లేదు. పూర్తిగా చచ్చిపోయినట్లూ సృజనాత్మకత లేనట్లూ నిస్పృహగా అసంతృప్తిగా అనిపిస్తోంది. నేనింకా వయస్సులో ఉన్నదాన్నే. కాని, భవిష్యత్తంతా చీకటి నిండినట్లుగా ఉంది. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కాని, అది ఎంత తెలివి తక్కువతనమో గ్రహించాను. నాకు అంతకంతకు అయోమయంగా ఉంటోంది. నా అసంతృప్తికి అంతం లేదనిపిస్తోంది."

దేన్ని గురించి మీకు అయోమయంగా ఉన్నట్లుంది? మీ సమస్య మీ సంబంధ బాంధవ్యాల గురించా?

"అబ్బే అదికాదు, అవన్నీ అయిపోయాయి. ఎలాగో చచ్చిచెడి బయటపడ్డాను. కాని నాకు మతిపోతోంది. ఏదీ నాకు సంతృప్తి నివ్వటం లేదు."

మీకేదైనా ప్రత్యేక సమస్య ఉందా, లేక అన్ని విధాలా అసంతృప్తికరంగా ఉన్నట్లు ఊరికే అనిపిస్తోందా? ఎక్కడో లోలోపల ఆదుర్దా, భయం ఉండి ఉండాలి. అది మీరు తెలుసుకోవటం లేదేమో. అదేమిటో తెలుసుకోవాలని కోరుతున్నారా?

"అవును. అందుకే మీ వద్దకు వచ్చాను. ఇప్పుడున్నట్లు ఇదే విధంగా ఇంక ఉండలేను. ఏదీ ముఖ్యమనిపించటం లేదు. తరుచు అస్వస్థతగా ఉంటోంది."

మీ అస్వస్థత మీ పరిస్థితుల నుంచి మీరు తప్పించుకునేందుకు మార్గం కావచ్చు.

"అదే అని నా నమ్మకం. కాని నేనేం చెయ్యాలి? నాకు నిజంగానే దారీ తెన్నూ తోచటం లేదు. నేను ఇక్కణ్ణించి వెళ్లేముందు దీన్నుంచి తప్పించుకునే మార్గాన్ని తెలుసుకుని తీరాలి."

సంఘర్షణ రెండు వాస్తవాల మధ్యగాని, వాస్తవమైనదానికీ, ఊహాజనితమైన దానికీ మధ్యగాని ఉన్నదా? మీ అసంతుష్టి కేవలం అసంతృప్తి మాత్రమేనా? అసంతృప్తి అయితే సులభంగానే తృప్తి కలిగించవచ్చు. లేక, నిష్కారణంగా దుఃఖపడటమా? అసంతృప్తి త్వరలోనే ఏదో మార్గం వెతుక్కుంటుంది తృప్తి పొందటానికి. ఆ అసంతృప్తిని త్వరలో ఒక మార్గాన పెట్టవచ్చు. కాని, అసంతుష్టిని ఆలోచన ద్వారా ఉపశమనం కలిగించటానికి కుదరదు. ఈ అసంతుష్టి అనేది సంతృప్తి కలగలేదని తెలుసుకోవటం వల్ల ఏర్పడినదా? తృప్తి కలిగినట్లయితే మీ అసంతుష్టి మాయమవుతుందా? ఒక విధమైన శాశ్వతమైన సంతృప్తికోసం ప్రయత్నిస్తున్నారా నిజానికి?

"లేదు. అది కాదు. నేను ఏ విధమైన తృప్తికోసం ప్రయత్నించటం లేదు. అధమం, అలా చేస్తున్నానని అనుకోను నేను. నాకు తెలిసిందల్లా అయోమయంలో, సంఘర్షణలో ఉన్నాననీ, దాంట్లోంచి బయట పడే మార్గం కనిపించటం లేదనీ."

మీరు సంఘర్షణలో ఉన్నారని మీరంటున్నారంటే, అది దేనికో సంబంధించి ఉండే ఉంటుంది. మీ భర్తతో కానీ, లేదా పిల్లలతో కానీ, లేదా మీ కార్యకలాపాలతో కానీ సంబంధం ఉన్నదై ఉంటుంది. మీ సంఘర్షణ ఈ రకమైనదేదీ కాదని అన్నట్లయితే మీ సంఘర్షణ మీరున్న స్థితికీ, మీరు కోరుకుంటున్న స్థితికీ మధ్య సంఘర్షణ అయి ఉండాలి. వాస్తవానికీ, ఆదర్శానికీ మధ్యా, ఉన్నదానికీ ఉండవలసినది అనే కల్పనకీ మధ్యా సంఘర్షణ. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీకో అభిప్రాయం ఉంది. ఈ స్వయంకల్పితమైన పద్ధతి ప్రకారం ఉండాలన్న కోరికవల్లనే సంఘర్షణా, అయోమయ స్థితీ ఏర్పడి ఉండవచ్చు. మీరున్నట్లుగా కాకుండా ఇంకెలాగో ఉండాలని మీరు గిలగిల్లాడుతున్నారు, అంతేనా?

"నేను ఎందువల్ల అయోమయంగా ఉన్నానో నేనిప్పుడే గ్రహించ గలుగుతున్నాను. మీరన్నది నిజమే అనుకుంటాను."

సంఘర్షణ వాస్తవంగా ఉన్నదానికీ కల్పనకీ మధ్య, మీరు ఉన్న స్థితికీ ఫలానాలా ఉంటే బాగుండునని మీరు అనుకునే స్థితికీ మధ్య వస్తుంది. కల్పిత రూపం చిన్నతనం నుంచీ పెంచుతారు. క్రమంగా విస్తృతమై, లోతుగా పాతుకుని వాస్తవికంగా ఉన్నదానికి విరుద్ధంగా పెరుగుతూ ఉంటుంది. అన్ని ఆదర్శాలూ, లక్ష్యాలూ ఊహా లోకాల మాదిరిగానే ఈ కల్పన స్పష్టంగా ఉన్నదానికీ, వాస్తవంగా ఉన్నదానికీ విరుద్ధంగా ఉంటుంది. అందుచేత మీరు ఉన్న స్థితి నుంచి తప్పించుకునేందుకు మార్గమే కల్పన. ఈ తప్పించుకునే మార్గం పరస్పరం వ్యతిరేకంగా ఉన్నవాటి మధ్య నిష్ప్రయోజన కరమైన సంఘర్షణని సృష్టిస్తుంది. అన్ని రకాల సంఘర్షణా - అంతరంగికంగా గాని, బహిరంగంగా గాని వృథా, వ్యర్థం, తెలివితక్కువ. గందరగోళాన్నీ, వైరుధ్యాన్నీ సృష్టిస్తుంది.

అందువల్ల, నేను చెప్పేదేమంటే, మీ అయోమయం, మీరున్న స్థితికీ, మీరుండాలనుకున్న ఊహకీ మధ్య సంఘర్షణ వల్ల మొదలైంది. కల్పన, ఆదర్శం అసత్యమైనవి. తప్పించుకోవటానికి స్వయంగా కల్పించుకున్న మార్గం అది. దానిలో వాస్తవికత లేదు. వాస్తవమైనది మీరు ఉన్న స్థితి. మీరు ఎలా ఉండాలో అన్నదానికన్న మీరు ఉన్నస్థితి ఎంతో ఎక్కువ ముఖ్యం. ఉన్నదాని మీరు అర్థం చేసుకోగలరు. ఎలా ఉండాలో అనే స్థితిని అవగాహన చేసుకోలేరు. భ్రమ అర్థంకాదు. అది ఎలా బయలుదేరుతుందో మాత్రం అర్థమవుతుంది. కల్పన, ఊహజనితమైనది, ఆదర్శం - దేనిలోనూ నిజం లేదు. అదొక ఫలితం, ఒక గమ్యం. ముఖ్యమైనదేమిటంటే, అది ఏవిధంగా వచ్చిందో అర్థం చేసుకోవటం.

మీరున్న స్థితిని, అది సంతోషకరమైనదైనా, సంతోషకరం కానిదైనా, దాన్ని అవగాహన చేసుకోవటానికి కల్పనా, ఆదర్శప్రాయమైన స్వయం కల్పిత స్థితీ పూర్తిగా అంతమొందాలి. అప్పుడే ఉన్న స్థితిలో వ్యవహరించగలుగుతారు. ఉన్నదాని అర్థం చేసుకోవటానికి ఏవిధమైన ఇతర ఆకర్షణ లేమీ లేకుండా స్వేచ్ఛగా ఉండాలి. మరో ఆకర్షణ ఉంటే ఉన్నదాన్ని ఖండించటమో, సమర్ధించటమో జరుగుతుంది. మరో ఆకర్షణ ఉంటే పోల్చిచూడట మవుతుంది. వాస్తవంగా ఉన్నదాన్ని ప్రతిఘటించటంగాని, క్రమశిక్షణలో పెట్టటంగాని జరుగుతుంది. మరో ఆకర్షణ ఉంటే, అర్థం చేసుకోవటానికి పెద్ద ప్రయత్నం, బలవంతం చెయ్యవలసి ఉంటుంది. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటానికి తక్షణం ఉద్యమించేందుకు ఇతర ఆకర్షణలు అవరోధాలవుతాయి. ఉన్న స్థితి స్థిరమైనది కాదు. అది క్షణక్షణం జరుగుతూ ఉంటుంది. దాన్ని అనుసరించటానికి మనస్సు ఏవిధమైన నమ్మకానికి గాని, జయం కలుగుతుందనే ఆశకిగాని, భగ్నమవుతుందనే భయానికి గానీ కట్టుపడి ఉండకూడదు. అనాసక్తంగా చురుకుగా తెలుసుకుంటూ ఉన్నప్పుడే ఉన్నది ఆవిష్కృతమవుతుంది. ఆవిష్కృతం కావటం సమయానికి సంబంధించి ఉండదు.