మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సమస్యలు - తప్పించుకునే మార్గాలు
49. సమస్యలు - తప్పించుకునే మార్గాలు
"నాకెన్నో తీవ్ర సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించటానికి ప్రయత్నించి, అవి మరింత క్లిష్టంగా బాధాకరంగా అయేటట్లు చేశానేమో అనిపిస్తోంది. నాకు మతిపోతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. వీటన్నిటికీ తోడు నాకు వినిపించదు. వినిపించటానికి చెవిలో పెట్టుకునే పీడ - ఇదొకటి నాకు. నాకు బోలెడు మంది పిల్లలు, నా భర్త నన్నొదిలేశాడు. నా పిల్లల గురించే నాకు బాధ. నేను పడిన దురవస్థలన్నీ వాళ్లు తప్పించుకోవాలని నా కోరిక."
మన సమస్యలకి పరిష్కారం కనిపెట్టాలని ఎంత ఆదుర్దా మనకి! పరిష్కారం కనిపెట్టాలని ఎంత ఆత్రుత పడతామంటే, సమస్యని పరిశీలించనే లేము. సమస్యని ప్రశాంతంగా గమనించనివ్వదు. సమస్యే ముఖ్య విషయం - పరిష్కారం కాదు. పరిష్కారం కోసం వెతికితే దొరుకుతుంది. కానీ, సమస్య అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఆ పరిష్కారానికి సమస్యతో సంబంధం లేదు. మన అన్వేషణ సమస్యను తప్పించుకునే మార్గంకోసం. పరిష్కారం పైపైన వాడే మందే. అంచేత సమస్యని అవగాహన చేసుకోవటం అవదు. అన్ని సమస్యలకీ ఒక్కటే మూలం. ఆ మూలాన్ని అర్థం చేసుకోకుండా సమస్యని పరిష్కరించటానికి ఏ ప్రయత్నం చేసినా అది మరింత గందరగోళానికీ, దుస్థితికీ కారణమవుతుంది. సమస్యని అర్థం చేసుకోవాలనే ఉద్దేశం గంభీరమైనదనీ, అన్ని సమస్యల నుంచీ విముక్తి పొందవలసిన అవసరం ఉన్నదనీ ముందుగా స్పష్టమవాలి. అప్పుడే సమస్యల్ని సృష్టించిన దాన్ని సమీపించవచ్చు. సమస్యలనుంచి విముక్తి కలగకుండా ప్రశాంతంగా ఉండటం సాధ్యం కాదు. ప్రశాంతత ఆనందానికి అత్యవసరం. కాని, ఆనందం లక్ష్యం కాదు. గాలి ఆగిపోయినప్పుడు సరస్సు నిశ్చలంగా ఉన్నట్లు సమస్యలు పోగానే మనస్సు కూడా నిశ్చలమవుతుంది. కాని, మనస్సుని నిశ్చలంగా చెయ్యలేము. అలా అయితే అది చచ్చిపోయినట్లే. అది చలనంలేని నీటి మడుగు. ఇది స్పష్టమైనప్పుడు సమస్యల్ని సృష్టించే దాన్ని గమనించవచ్చు. ఈ గమనించటం నిశ్శబ్దంగా జరగాలి - సుఖదుఃఖాలను బట్టి ముందుగానే నిర్ణయించుకున్న పథకం ప్రకారం కాదు. "కాని, మీరు అసంభవమైన దాన్ని అడుగుతున్నారు! మన విద్యాభ్యాసం మన మనస్సుకి విచక్షణ చేయగలిగేలా, పోల్చేలా, నిర్ణయించేలా, ఎంచుకునేలా నేర్పుతుంది. దేన్నైనా గమనించినప్పుడు ఖండించకుండానో, సమర్ధించకుండానో ఉండటం చాలా కష్టం. ఈ ప్రభావం నుంచి తప్పించుకుని నిశ్శబ్దంగా గమనించటం ఎలా?"
నిశ్శబ్దంగా గమనించటం, ఇష్టాయిష్టాలు లేకుండా తెలుసుకోవటం అవగాహనకి ముఖ్యావసరమని మీరు గ్రహించినట్లయితే మీరు గ్రహించిన దానిలోని సత్యం మిమ్మల్ని మీగతం నుంచి విముక్తి చేస్తుంది. అనాసక్తంగా, చురుకుగా తెలుసుకోవటం తక్షణం అవసరం అని మీరు గ్రహించినప్పుడే "ఎలా" అనే ప్రశ్నా, మీ గతాన్ని రూపుమాపే మార్గం కోసం ప్రయత్నం బయలు దేరతాయి. సత్యమే విముక్తి కలిగిస్తుంది - సాధనమూ, పద్ధతీ కాదు. నిశ్శబ్దంగా గమనించటం వల్లనే అవగాహన కలుగుతుందనే సత్యాన్ని గ్రహించాలి. అప్పుడే ఖండన నుంచీ, సమర్ధన నుంచీ మీకు విముక్తి కలుగుతుంది. మీరు ప్రమాదాన్ని చూడగానే దాన్ని తప్పించుకోవటం ఎలా అని మీరు అడగరు. ఇష్టాయిష్టాలు లేకుండా తెలుసుకునే అవసరాన్ని మీరు గ్రహించటం లేదు కనుకనే మీరు "ఎలా" అని అడుగుతున్నారు. దాని అవసరాన్ని మీరు ఎందుకు గ్రహించరు?
"నాకు గ్రహించాలనే ఉంది. కాని, ఈ విధంగా నేనిదివరకెన్నడూ ఆలోచించలేదు. నేను చెప్పగలిగిందల్లా నా సమస్యల్ని వదిలించుకోవాలని కోరుతున్నాను. అవి నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నాకు హాయిగా ఉండాలని ఉంది అందరి మాదిరిగా."
అనాసక్తంగా ఉంటూ, నిశ్చలంగా ఉంటూ తెలుసుకోవాలనే ముఖ్యావసరాన్ని గ్రహించటానికి అంగీకరించం - వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని - నిజంగా మనం ఆ సమస్యల్ని దూరం చేసుకోవాలని కోరటం లేదు కనుక. అవి లేకపోతే మనం ఎలా ఉంటాం? మనకి తెలిసిన దాన్ని పట్టుకుని ఎలాగో వ్రేలాడతాం - అదెంత బాధాకరమైనదైనాసరే. అంతేకాని, మనల్ని ఎక్కడికి తీసుకుపోతోందో తెలియని కొత్తదాన్ని ప్రయత్నించటానికి సాహసించం. సమస్యలు ఎంతైనా, మనకి పరిచితమైనవి. కాని, వాటిని సృష్టించిన దాన్ని గురించిన ఆలోచన - అది మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియక భయాన్ని మందకొడితనాన్నీ కలుగజేస్తుంది. సమస్యల గురించి ఆదుర్దా లేకపోతే మతిపోయినట్లుంటుంది. మనస్సు వాటివల్లనే బ్రతుకుతోంది. అవి ప్రపంచ సమస్యలైనా, వంటింటి సమస్యలైనా, రాజకీయాలైనా, వ్యక్తిగత వ్యవహారాలైనా, మతానికి సంబంధించినవైనా, సిద్ధాంతానికి సంబంధించినవైనా. అందువల్ల మన సమస్యలే మనల్ని అల్పంగా, సంకుచితంగా ఉండేట్లు చేస్తాయి. ప్రపంచ సమస్యల గురించి బాధపడే మనస్సు ఎంత అల్పమైనదో, ఆధ్యాత్మిక వికాసం పొందటం విషయంలో బాధలు పడుతున్న మనస్సూ అంతే అల్పమైనది. సమస్యల వల్ల భయంతో మనస్సు బరువెక్కిపోతుంది. ఎందుచేతనంటే, సమస్యలు అహానికి, - "నేను" అనేదానికి, "నా" అనేదానికి శక్తినిస్తాయి. సమస్యలు లేకుండా జయాపజయాలు లేకుండా ఉంటే "నేను" అన్నది లేదు.
"కానీ "నేను" అన్నది లేకుండా ఎవరైనా ఎలా బ్రతకగలరు? చర్య అంతటికీ మూలం అదేకదా."
కోరిక, జ్ఞాపకం, సుఖదుఃఖాలంటే భయం - వీటి ఫలితంగా చర్య జరిగినంతకాలం అది సంఘర్షణనీ, గందరగోళాన్నీ, వైరుధ్యాన్ని పెంపొందించి తీరుతుంది. మన చర్య మనం పొందిన ప్రభావాన్ని బట్టి ఉంటుంది - ఏ స్థాయిలోనైనా. క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మన ప్రతిక్రియ అసంతుష్టికరంగా, అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి సంఘర్షణ బయలుదేరి తీరాలి - అదే సమస్య. అహం స్వరూపంలోనే సంఘర్షణ ఉంది. సంఘర్షణ లేకుండా, దురాశ, భయం, విజయం - వీటి సంఘర్షణ లేకుండా జీవించటానికి పూర్తిగా అవకాశం ఉంది. కాని, ప్రత్యక్షానుభవం ద్వారా కనుక్కునే వరకూ ఈ అవకాశం కేవలం సిద్ధాంతరూపంలోనే ఉంటుంది - వాస్తవంగా కాదు. అహం రీతుల్ని అర్థం చేసుకున్నప్పుడే దురాశ లేకుండా బ్రతకటం సాధ్యమవుతుంది.
"నా చెవుడు నా భయాలవల్లనూ, అణచి పెట్టిన అనుభూతుల వల్లనూ అంటారా? చెవి నిర్మాణంలో ఏ విధమైన లోపమూలేదని డాక్టర్లు నమ్మకంగా చెప్పారు. నేను మళ్లీ వినగలిగే అవకాశం ఉంటుందంటారా? నా జీవిత మంతా ఏదో ఒక విధంగా అణగత్రొక్కబడే ఉన్నాను. నేను కావాలనుకున్నది ఒక్కటీ చెయ్యలేక పోయాను."
అంతర్గతంగానూ, బాహ్యంగానూ వాటిని అర్థం చేసుకోవటం కన్న అణచిపెట్టటం తేలిక. అర్థం చేసుకోవటం శ్రమతో కూడినది - ముఖ్యంగా చిన్నతనం నుంచీ ప్రభావితం అయినవారికి, కష్టమనిపించినా, అణచిపెట్టటం అలవాటయిపోతుంది. అవగాహన చేసుకోవటాన్ని అలవాటు చేసుకోవటం ఎన్నటికీ సాధ్యం కాదు. అది దినచర్య కాజాలదు. దానికి నిత్యం జాగరూకతతో గమనించటం, చురుకుగా ఉండటం అవసరం. అర్థం చేసుకోవటానికి మృదుత్వం, సున్నితత్వం, ఆప్యాయతా ఉండాలి. ఆవేశంతో కూడిన అనురాగం కాదు. అణచిపెట్టటానికి చురుకుగా తెలుసుకోవలసిన అవసరం లేదు. ప్రతిక్రియలతో వ్యవహరించేందుకు ఆ మార్గం అన్నిటికన్నా సులభమైనదీ, తెలివి తక్కువదీ. అణచిపెట్టటం అంటే ఒక అభిప్రాయానికీ, ఒక పద్ధతికీ అనుగుణంగా ఉండటం. అది పైపైకి రక్షణ, గౌరవం కలుగజేస్తుంది. అవగాహన విముక్తిని కలుగజేస్తుంది. కాని అణచిపెట్టటం ఎప్పుడూ సంకుచితంగా స్వార్థపూరితంగా చేస్తుంది. అధికారమన్నా, రక్షణ లేక పోవటమన్నా, సంఘమన్నా ఉండే భయం సిద్ధాంతపరమైన ఆశ్రయాన్ని సృష్టిస్తుంది. దాని భౌతిక స్థితి వైపుకి మనస్సు మళ్లుతుంది. ఈ ఆశ్రయం, ఏ స్థాయిలో ఉన్నా, ఎప్పటికీ భయాన్ని పోషిస్తూనే ఉంటుంది. ఆ భయం నుంచే ప్రత్యామ్నాయం వెతకటం, పవిత్రతని ఆపాదించటం, క్రమశిక్షణా మొదలైన అణచిపెట్టే పద్ధతులు వస్తాయి. అణచిపెట్టబడినది బయటకొచ్చే మార్గం ఏదో చూసుకోవాలి - అది శారీరక రుగ్మత కావచ్చు, సిద్ధాంత సంబంధమైన భ్రమకావచ్చు. ఎవరి ప్రవృత్తిని, విపరీత ప్రవర్తనలనూ బట్టివారు అనుభవించ వలసివస్తుంది.
"నేను గమనించాను - ఎప్పుడైనా నాకిష్టం లేనిది వినదలుచుకోనప్పుడు ఈ సాధనమే నాకు ఆశ్రయమవుతుంది. నేను నా ప్రపంచంలోకి పారిపోయేందుకు సహాయపడుతుందది. కాని, సంవత్సరాల తరబడి అణచిపెట్టిన వాటి నుంచి ఎలా విముక్తి పొందటం? దానికి ఎంతో సమయం పట్టదా?" సమయం ప్రశ్న కాదది. గతాన్ని పెకిలించటమూ, జాగ్రత్తగా పరికించటమూ - అణచిపెట్టబడింది అనే సత్యాన్ని దర్శించటమే. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అనాసక్తంగా తెలుసుకోవటం జరిగినట్లయితే, మొత్తం అణచిపెట్టటం అనే ప్రక్రియని - ఆ సత్యాన్ని తక్షణం గ్రహించటం జరుగుతుంది. నిన్న, రేపు - అనే సందర్భంలో ఆలోచిస్తూ ఉంటే అణచిపెట్టటం అనే సత్యాన్ని కనుక్కోవటం సాధ్యం కాదు. సమయం గడుస్తున్న కొద్దీ అవగతమయేది కాదు సత్యం. సాధించి పొందగలిగేది కాదు సత్యం. దాన్ని గ్రహించాలి, లేదా గ్రహించకుండా ఉండాలి. దాన్ని క్రమంగా గ్రహించటానికి వీలవదు. అణచివేత నుంచి విముక్తి పొందాలన్న ఇచ్ఛ దాని గురించిన సత్యాన్ని తెలుసుకోవటంలో అవరోధమవుతుంది. 'ఇచ్ఛే, కోరిక - వ్యక్తమైనదైనా అవ్యక్తమైనదైనా, కోరిక ఉన్నప్పుడు అనాసక్తంగా గమనించడం ఉండదు. కోరిక, లేదా తాపత్రయం వల్లనే అణచివేత సంభవిస్తుంది. ఈ కోరికనే ఇప్పుడు ఇచ్ఛ అంటున్నా, తన సృష్టి నుంచి తాను విముక్తి పొందలేదు. మళ్లీ, ఇచ్ఛ అనే సత్యాన్ని కూడా అనాసక్తంగా చురుకుగా తెలుసుకొంటూ గ్రహించాలి. పరిశీలకుడు పరిశీలించే దాన్నుంచి తన్ను తాను వేరు చేసుకున్నా, దానిలోని భాగమే అతడు కూడా. పరిశీలించే దానివల్ల ప్రభావితుడైన వాడు కాబట్టి దాన్నుంచి విముక్తి పొందలేడు. ఈ సత్యాన్ని కూడా గ్రహించాలి. సత్యమే విముక్తి కలిగిస్తుంది. అంతేకాని, ఇచ్ఛా, ప్రయత్నమూ కాదు.