మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఉత్తేజం
48. ఉత్తేజం
"పర్వతాలు నాలో నిశ్శబ్దాన్ని కలిగించాయి" అందావిడ. "ఈ మధ్య ఎంగాడిన్‌కి వెళ్లాను. దాని సౌందర్యం నన్ను పూర్తిగా మౌనంగా చేసింది. ఆ అద్భుతాన్నంతా చూసి మూగదాన్నైపోయాను. అదొక బ్రహ్మాండమైన అనుభవం. ఆ నిశ్శబ్దాన్ని - సజీవంగా స్పందించే, సంచలించే ఆ నిశ్శబ్దాన్ని అలాగే పట్టుకుని ఉండగలిగితే బాగుండుననిపించింది. మీరు చెప్పే నిశ్శబ్దం నేను పొందిన ఈ అసాధారణమైన అనుభవం లాంటిదేననుకుంటాను. నేను అనుభవం పొందిన నిశ్శబ్దానికి ఉన్న లక్షణాలున్నదేనా మీరు చెప్పేది కూడా - అన్న విషయాన్ని నిజంగా తెలుసుకోవాలని ఉంది నాకు. ఆ నిశ్శబ్దం ప్రభావం చాలాకాలం దాకా ఉంది. ఇప్పుడు, దాన్ని మళ్లీ అందుకుని దానిలోనే జీవించటానికి ప్రయత్నిస్తున్నాను."
ఎంగాడిన్ మిమ్మల్ని నిశ్శబ్దంగా చేసింది. మరొకొర్ని ఒక అందమైన మానవాకారం, వేరొకర్ని ఒక దివ్యగురువో, ఒక పుస్తకమో, తాగుడో నిశ్శబ్దంగా చేస్తుంది. బాహ్య ఉత్తేజం ద్వారా ఎవరైనా ఒక అనుభూతికి లోనవుతారు. దాన్నే నిశ్శబ్దం అంటారు. అది విపరీతమైన సంతోషాన్ని కలిగిస్తుంది. రోజూ ఉండే సమస్యల్నీ, సంఘర్షణలనీ అవతలికి తోసేసి తేలిగ్గా చేసుకోవటమే ఆ అందమూ, మాహాత్య్మమూ యొక్క ప్రభావం. బాహ్య ఉత్తేజంతో మనస్సు తాత్కాలికంగా శాంతి నొందుతుంది. అదొక కొత్త అనుభవం, కొత్త ఉల్లాసం కావచ్చు. దాన్నింక మళ్లీ అనుభవం పొందుతూ ఉండనప్పుడు, మనస్సు దాన్నొక జ్ఞాపకంగా తలుచుకుంటుంది. పర్వతాల్లో ఉండిపోవటం సాధ్యం కాకపోవచ్చు. మళ్లీ వెళ్లి తమ పనిలో తాము చేరాలి. కాని, ఆ ప్రశాంత స్థితి మరొకరకమైన ఉత్తేజం ద్వారా, తాగుడు ద్వారా, మనిషి ద్వారా, ఊహద్వారా తిరిగి పొందటానికి ప్రయత్నించటం సాధ్యమే. అదే మనలో చాలామంది చేసేది. ఇవన్ని వివిధ రకాలైన ఉత్తేజాలు - మనస్సుని నిశ్చలం చెయ్యటానికి సాధనాలు. అందుచేత సాధనాలు ప్రధానమవుతాయి, ముఖ్యమవుతాయి. మనం వాటికి బంధితులమవుతాం. సాధనం మనకి నిశ్శబ్దం అనే సుఖాన్నిస్తుంది. కాబట్టి అది మన జీవితంలో ఆధిపత్యం వహిస్తుంది. అదే మన ముఖ్య ఆసక్తి మానసికావసరం. దాన్ని రక్షించుకుంటాం. దానికోసం అవసరమైతే ఒకరినొకరం నాశనం చేసుకుంటాం. సాధనం, అనుభవం స్థానంలో ఉంటుంది. అదిప్పుడు కేవలం జ్ఞాపకం మాత్రమే.
ఉత్తేజాలు అనేక విధాలుగా ఉండొచ్చును. మనిషిపై ఉన్న ప్రభావాన్ని బట్టి ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉండొచ్చును. కాని, అన్ని ఉత్తేజాల్లోనూ ఒక సామాన్య లక్షణం ఉంది - ఉన్న స్థితి నుంచీ, మన దినచర్య నుంచీ, సజీవంగా లేని సంబంధం నుంచీ, ఎప్పటికప్పుడు పాతబడే జ్ఞానం నుంచీ పారిపోవాలనే కోరిక. మీరొక మార్గం ఎంచుకుంటారు. నేనొకదాన్ని ఎంచుకుంటాను. నేను ఎంచుకున్న ప్రత్యేక రకం మీ దానికన్న ఎక్కువ లాభదాయకమని ఎప్పుడూ భావిస్తాను. కాని, తప్పించుకునే మార్గం ఏ రూపంలోనైనా - ఆదర్శమైనా, సినిమా అయినా, చర్చి అయినా - హానికరమైనదే. భ్రమకీ, అఘాతానికీ దారి తీస్తుంది. స్పష్టంగా కనిపించే వాటికన్న మానసికమైన మార్గాలు మరింత హానికరమైనవి. అవి సూక్ష్మమైనవీ, క్లిష్టమైనవీ కాబట్టి కనిపెట్టటం ఎక్కువ కష్టం. ఉత్తేజం ద్వారా ఉదయింప జేసిన నిశ్శబ్దం, క్రమశిక్షణల ద్వారా, నిగ్రహాల ద్వారా, ప్రతిఘటనల ద్వారా - వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని - సాధించిన నిశ్శబ్దం ఒక ఫలితం, ఒక ప్రభావం మాత్రమే. అందుచేత సృజనాత్మకమైనది కాదు. అది గతించిపోయినదే.
నిశ్శబ్దం అనేది - మరొకదానికి ప్రతిక్రియ కానిది, ఫలితం కానిది, ఉత్తేజం వల్లా, అనుభూతి వల్లా ఉదయించని నిశ్శబ్దం - నిర్మింపబడినదీ. నిశ్చయింపబడినదీ కాదు. అది ఆలోచనా ప్రక్రియని అర్థం చేసుకున్నప్పుడు సాక్షాత్కారమవుతుంది. ఆలోచన జ్ఞాపకానికి ప్రతిక్రియ. వ్యక్తమైనవి గాని, అవ్యక్తమైనవి గాని, నిశ్చితాభిప్రాయాలకు ప్రతిక్రియ ఆలోచన. ఈ జ్ఞాపకం సంతోషాన్ని బట్టిగాని బాధని బట్టిగాని చర్యని శాసిస్తుంది. ఆవిధంగా భావాలు చర్యపై అధికారం చెలాయిస్తాయి. అందుచేత చర్యకీ, భావానికీ మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. ఈ సంఘర్షణ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. అది తీవ్రమవుతున్న కొద్దీ దాన్నుంచి విముక్తి పొందాలనే తపన కలుగుతుంది. కాని, ఈ సంఘర్షణ అర్థమై పరిష్కారమయేవరకూ దాన్నుంచి విముక్తి పొందాలని ఏ ప్రయత్నం చేసినా అది తప్పించుకునే మార్గమే అవుతుంది. చర్య భావాన్ని పోలి ఉండటానికి యత్నం జరుగుతున్నంత వరకూ సంఘర్షణ అనివార్యం. చర్య, భావం నుండి విడివడినప్పుడే సంఘర్షణ అంతమవుతుంది.
"కాని చర్య ఎప్పటికైనా భావం నుంచి విడిపోగలదా? భావన లేకుండా చర్య అనేది సాధ్యం కాదు నిశ్చయంగా. చర్య భావాన్ని అనుసరిస్తుంది. భావం ఫలితంగా జరగని చర్యని నేను ఊహించలేనేమో." భావం జ్ఞాపకానికి ఫలితం. జ్ఞాపకాన్ని మాటలలో పొందుపరచటమే భావం. భావం సమస్యనీ, జీవితాన్నీ ఎదుర్కోవటానికి సరిపోని ప్రతిక్రియ. జీవితాన్ని ఎదుర్కోవటానికి సరిపోయే ప్రతిక్రియ చర్య. అంతేకాని భావం కాదు. చర్య తీసుకోకుండా మనల్ని మనం రక్షించుకోవటానికి భావనాత్మకంగా ఎదుర్కొంటాం. భావాలు చర్యని పరిమితం చేస్తాయి. భావాల ఆవరణలో రక్షణ ఉంటుంది - చర్యలో కాదు. అందుచేత చర్యని భావానికి లొంగి ఉండేటట్లు చేయటం జరుగుతుంది. చర్య తీసుకునేందుకు ఏర్పరచుకున్న ఆత్మరక్షణ పథకమే భావం. తీవ్రమైన అవాంతరంలో చర్య సూటిగా ఉంటుంది - భావంతో సంబంధ లేకుండా. ఇలాంటి తక్షణచర్య జరగకుండానే మనస్సు తనకు తాను క్రమశిక్షణ నిచ్చుకుంటుంది. దాదాపు మనందరి లోనూ మనస్సుకి ఆధిపత్యం ఉంటుంది. భావాలు చర్యని నిగ్రహించేట్లు పనిచేస్తాయి. అందువల్లనే చర్యకీ, భావనకీ సంఘర్షణ ఉంటుంది.
"నా మనస్సు ఎంగాడిన్‌లో జరిగిన అందమైన అనుభవం వైపే పరుగులిడుతోంది. అది ఆ అనుభవాన్ని జ్ఞాపకం ద్వారా పునరుజ్జీవింప చేసుకోవటమేనా?"
నిశ్చయంగా, వాస్తవమైనది మీ ప్రస్తుత జీవితం. ఈ జనంతో కిక్కిరిసిన వీది, మీ పని, మీ దగ్గర సంబంధాలు. ఇవి సంతోషదాయకంగానూ, సంతృప్తికరంగానూ ఉన్నట్లయితే ఎంగాడిన్ మసక మసగ్గా అయిపోతుంది. కాని, వాస్తవంగా ఉన్నది గందరగోళంగానూ, బాధాకరంగానూ ఉంది. మీరు ఎప్పుడో జరిగిన దానివైపుకి, గతించిపోయిన అనుభవం వైపుకి మళ్లుతున్నారు. కాని, అది అంతమైపోయింది. జ్ఞాపకం ద్వారా మాత్రమే దానికి ప్రాణం పోస్తున్నారు - చచ్చిపోయిన దాంట్లో ప్రాణం దూర్చటానికి ప్రయత్నిస్తున్నట్లు. ప్రస్తుతం ఉన్నది అనాసక్తికరంగా వెలితిగా ఉండటంతో, గతం వైపుకో, స్వయం కల్పితమైన భవిష్యత్తు వైపుకో మళ్లుతాం. ప్రస్తుతం నుంచి ఇలా పారిపోవటం భ్రమకి దారితీయక తప్పదు. ప్రస్తుతాన్ని ఉన్నదున్నట్లు ఖండన లేకుండా సమర్థన లేకుండా చూడటం ఉన్నదాన్ని అవగాహన చేసుకోవటమే. అప్పుడే చర్య సంభవమవుతుంది. అటువంటి చర్య ఉన్న స్థితిలో పరివర్తన తెస్తుంది.