మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఆధ్యాత్మిక మార్గదర్శి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

47. ఆధ్యాత్మిక మార్గదర్శి

ఆయన గురువు వర్ణించటానికి వీల్లేనంత గొప్పవాడనీ, ఆయనకి తను చాలా ఏళ్లపాటు శిష్యుడిగా ఉన్నాననీ చెప్పాడాయన. ఆయన గురువు కఠినమైన అఘాతాలను కలిగిస్తూ దుర్భాషలాడుతూ, అవమాన పరిచే మాటల ద్వారా, చర్యల ద్వారా తన ఉపదేశాలను బోధపరిచేవాడుట. ఎంతో మంది ప్రముఖులు ఆయన్ని అనుసరించే వారిలో ఉన్నారని కూడా చెప్పాడాయన. ఆయన పద్ధతిలో ఉన్న మోటుతనమే మనుషుల్ని ఆలోచించేటట్లు చేసేదిట. లేచి కూర్చుని, చప్పున గ్రహించేటట్లు చేసేదిట. చాలామంది నిద్రావస్థలో ఉంటారు. అటువంటివారిని కుదిపి లేపి కూర్చోబెట్టటం అవసరం అన్నాడాయన. ఈ గురువు దేవుణ్ణి గురించి నానామాటలూ అనేవాడుట. ఆయన శిష్యులు ఎంతో తాగవలసివచ్చేదిట. ఎందుకంటే గురువు గారే భోజనంతో బాటు తెగ తాగేవాడుట. కాని, ఆయన బోధనలు మాత్రం ప్రగాఢంగా ఉండేవిట. ఒకప్పుడు వాటిని రహస్యంగా ఉంచేవారుట. ఇప్పుడు అందరికీ తెలియనిస్తున్నారట.

శరత్కాలపు సూర్యకాంతి కిటికీలోంచి పుష్కలంగా ప్రసరిస్తోంది. వీధి రొద అంతా వినిపిస్తోంది. ఎండిపోతున్న ఆకులు తళతళలాడుతున్నాయి. గాలి హాయిగా దట్టంగా వీస్తోంది. అన్ని నగరాల్లో లాగే ఒక విధమైన నిస్పృహ, చెప్పలేని బాధతో కూడిన వాతావరణానికి విరుద్ధంగా ఉంది సాయంకాలపు కాంతి. కృత్రిమమైన ఆనందోత్సాహం మరింత దుఃఖభాజనంగా ఉంది. సహజంగా ఉండటం అంటే ఏమిటో, హాయిగా నవ్వటం అంటే ఏమిటో మరిచిపోయినట్లున్నాం. మన ముఖాలు దుఃఖంతో, ఆదుర్దాతో ముడుచుకు

పోయి ఉంటాయి. కాని ఆకులు మాత్రం ఎండల్లో మెరుస్తున్నాయి. ఒక మేఘం అటువైపు నుంచి వెళ్లింది.

ఆధ్యాత్మిక ఉద్యమాల్లో కూడా సాంఘిక విభేదాలను పాటిస్తారు.పదవిలో ఉన్న వ్యక్తిని ఎంత ఆత్రుతగా ఆహ్వానించి ముందు సీట్లో కూర్చోబెడతారు! ప్రఖ్యాతి గాంచినవారిని అనుసరించేవారు వారిని ఎలా పట్టుకు వ్రేలాడుతారు! ప్రత్యేకత కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఎంత తృష్ణ మనకి! దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు అనీ, దివ్యజ్ఞాన సంపన్నుడు, గురువు, ప్రవేశం పొందినవాడు, శిష్యుడు, ఆరంభదశలో ఉన్నవాడు - అనే విభజనలతో ఉండే అధికార పరంపరలో ఒక ప్రత్యేక స్థానం కోసం తీవ్రంగా వాంఛించడమే ఆధ్యాత్మిక వికాసం అనుకుంటారు. దైనందిన ప్రాపంచిక వ్యవహారాల్లో ఇటువంటి తాపత్రయం ఉంటుందన్నది విదితమే. దాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ, అదే ప్రవృత్తి, ఇటువంటి మూర్ఖప్రత్యేకతలకు తావులేని చోట కూడా తీసుకురావటం చూస్తే మన తాపత్రయాలతో, తృష్ణలతో ఎంత ప్రభావితం అయి ఉన్నాయో తెలుస్తుంది. ఈ తాపత్రయాలను అర్థం చేసుకోకుండా అహంభావం నుంచి విముక్తి పొందాలనుకోవటం వృథాయే.

"కానీ," అంటూ కొనసాగించి, ఆయన " మాకు మార్గదర్శకులూ, గురువులూ, దివ్యప్రభువులూ కావాలి కదా. మీరు వారికి అతీతులు కావచ్చు, కాని మావంటి సాధారణమైన వాళ్లకి వారి అవసరం ఉంటుంది. లేకుంటే దారి తప్పిన గొర్రెల్లాగ అవుతాం" అన్నాడు.

మనలోని సందిగ్ధతతోనే మనం రాజకీయనాయకులను గాని, ఆధ్యాత్మిక మార్గదర్శకలను గాని ఎంచుకుంటాం, కాబట్టి వారు కూడా సందిగ్ధంలో ఉన్నవారే. మనల్ని బతిమాలి, బుజ్జగించి, ప్రోత్సహించి, సంతృప్తి పరిచే వాళ్లనే కోరతాం మనం. అందుకే గురువుని ఎంచుకుంటాం-మనం వాంఛించిన దాన్ని మనకు ఇస్తాడని. సత్యాన్ని అన్వేషించం, సంతృప్తీ, అనుభూతీ కోరుకుంటాం. ముఖ్యంగా ఆత్మస్తుతి కోసమే గురువునీ, లేక దివ్య ప్రభువునీ సృష్టిస్తాం. మనం తప్పిపోయినట్లు సందిగ్ధంలోనూ, ఆదుర్దాలోను పడిపోతాం-అహం ఉండకూడదన్నప్పుడు. మీకు ప్రత్యక్షంగా, భౌతికంగా గురువెవ్వరూ లేనట్లయితే, మీకు ఎక్కడో నిగూఢంగా మాయగా ఉన్నవాణ్ణి సృష్టిస్తారు. మొదటిరకం, అనేక రకాల భౌతిక-మానసిక ప్రభావాల మీద ఆధారపడినది. రెండోరకం స్వీయకల్పిత, స్వయం నిర్మిత ఆదర్శం. కానీ రెండూ మీరు ఎంచుకున్నవే. ఎంచుకోవటం మీ ఇష్టం మీదా, అయిష్టం మీదా ఆధారపడి ఉంటుంది. మీ అయిష్టతకి అంతకన్న గౌరవనీయమైన, శాంతి ప్రదమైన పేరు పెట్టొచ్చు. కాని మీకున్న సందిగ్ధతలోనుంచీ, వాంఛలలో నుంచే మీరు ఎంచుకుంటారు. మీరు సంతృప్తిని కోరుతున్నట్లయితే సహజంగా మీరు కోరేదే మీకు దొరుకుతుంది. కాని, దాన్నే సత్యం అనకూడదు మనం. అనుభూతి పొందాలనీ, సంతృప్తి పొందాలనీ కోరటం అంతమైనప్పుడే సత్యం సాక్షాత్కరమవుతుంది.

"నాకు ఒక గురువు ఉండటం అవసరం లేదని మీరు నన్ను ఒప్పించలేక పోయారు" అన్నాడాయన.

సత్యం వాదించవలసిన విషయం, ఒప్పించవలసిన విషయం కాదు. అది అభిప్రాయ ఫలితం కాదు. "కాని, దివ్యప్రభువులు దురాశనీ, ఈర్ష్యనీ జయించటంలో నాకు సహాయపడతారు" అన్నాడు మళ్లీ ఆయన.

ఇంకొకరు ఎంత గొప్పవారైనా మీలో పరివర్తన తెప్పించటంలో సహాయపడగలరా? అదే సాధ్యమయితే మీలో పరివర్తన తెచ్చినట్లు కాదు, మిమ్మల్ని అధీనంలో ఉంచి ప్రభావితం చెయ్యటమే. ఈ ప్రభావం చాలా కాలం నిలిచి ఉండొచ్చు. కాని మీరు పరివర్తన చెందినట్లు కాదు. మీరు లొంగిపోయారు. మీరు ఈర్ష్యకి లొంగినా, ఉన్నతమైనదనుకునేదాని ప్రభావానికి లోనైనా, మీరు బానిసగా ఉన్నట్లే. మీరు స్వేచ్ఛగా లేరు. మనకి బానిసత్వంలో ఉండటం ఇష్టం. ఎవరో ఒకరి అధీనంలో ఉండాలి - దివ్యగురువైనా, మరొకరైనా. ఎందుకంటే, అధీనతలో రక్షణ ఉంటుంది. గురువు ఒక ఆశ్రయం అవుతాడు. స్వాధీనం చేసుకోవటం అంటే పరాధీనమవటమే, అంతేకాని స్వాధీనత అంటే ఈర్ష్య నుంచి విముక్తి పొందటం కాదు.

"దురాశని ప్రతిఘటించాలి నేను. దానితో పోరాడాలి. దాన్ని సర్వనాశనం

చెయ్యటానికి అన్ని ప్రయత్నాలూ చెయ్యాలి. అప్పుడే అది పోతుంది" అన్నాడాయన.

మీరు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలుగా మీకు దురాశతో సంఘర్షణ జరుగుతోంది. మీరు తగినంతగా కష్టపడి ప్రయత్నించలేదని చెప్పకండి. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సంఘర్షణ ద్వారా మీరేమైనా అర్థం చేసుకోగలరా? జయించటం అంటే అర్థం చేసుకోకపోవటమే. మీరు జయించిన దాన్ని మళ్లీ మళ్లీ జయించాలి. కాని, పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకున్న దాన్నుంచి విముక్తి లభిస్తుంది. అర్థం చేసుకోవటానికి ప్రతిఘటనా ప్రక్రియ తెలుసుకోవాలి. అర్థ చేసుకోవటం కన్న ప్రతిఘటించటం సులభం. పైగా, ప్రతిఘటించమనే మనకి బోధించారు. ప్రతిఘటించటానికి గమనించనక్కరలేదు, విచారించనక్కర్లేదు, తెలియజేయనక్కరలేదు. ప్రతిఘటన మనస్సు యొక్క మందకొడితనాన్ని సూచిస్తుంది. ప్రతిఘటించే మనస్సు అహంభావపూరితమై ఉంటుంది. సున్నితత్వం గాని, అవగాహనగాని దానికి సాధ్యం కావు. దురాశ లేకుండా చేసుకోవటం కన్నా, ప్రతిఘటన ధోరణి గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. నిజానికి, చెబుతున్న దాన్ని మీరు వినిపించుకోవటం లేదు. ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసిన పోరాటానికి, ప్రతిఘటనకీ ఫలితంగా మీలో పెరిగిన విశ్వాసాల గురించి ఆలోచిస్తున్నారు మీరు. మీరు అ విశ్వాసాలకి అంకితమై ఉన్నారు. మీ విశ్వాసాల గురించి మీరు ప్రసంగించి ఉండవచ్చు. రాసి ఉండవచ్చు. స్నేహితులను కూడ దీశారు. మీ దివ్యజ్ఞాన సంపన్నుని వలన మీరు లాభం పొందగలరని ఆశిస్తున్నారు - మీ ప్రతిఘటనలో ఆయన సహాయపడ్డాడు కనుక. అందుచేత మీ గతం అడ్డునిలిచి, ప్రస్తుతం చెబుతున్నదాన్ని విననీయటం లేదు.

"మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటున్నాను, ఒప్పుకోవటం లేదు కూడా" అన్నాడాయన.

దాన్ని బట్టే తెలుస్తోంది మీరు వినటం లేదని. మీ విశ్వాసాలనూ, ఇప్పుడు చెబుతున్న దాన్నీ పోల్చి చూస్తున్నారు. అంటే, వినకపోవటమే. వినటానికి మీకు భయం. అందుకని మీరు సంఘర్షణలో పడ్డారు. ఒప్పుకుంటూనే ఒప్పుకోవటం లేదు.

"మీరన్నది సరైనదే కావచ్చు. నేను ఇంతవరకు పోగుచేసినవన్నీ వదులుకోలేను - నా స్నేహితులు, నా జ్ఞానం, నా అనుభవం అవన్నీ వదులుకోవాలని నాకు తెలుసును. కాని, ఆ పనిచేయటం నా వల్లకాదు అంతే."

ఆయనలో సంఘర్షణ ఇప్పుడు మరింత ఎక్కువవుతుంది. ఉన్నదాన్ని తెలుసుకోగానే, ఎంత అయిష్టంగా ఉన్నా, మీ విశ్వాసాల కారణంగా ఎంత వద్దనుకున్నా, ప్రగాఢ వైరుధ్యం ప్రారంభమవుతుంది. ఈ వైరుధ్యం ద్వంద్వత్వం. రెండు వ్యతిరేకమైన కోరికలకు వంతెన కట్టడం కుదరదు. వంతెన కట్టినట్లయితే అది ప్రతిఘటనే, అంటే ఒకే రీతిలో ఉండటం. ఉన్నదాన్ని అవగాహన చేసుకున్నప్పుడే ఉన్నదాన్నుంచి విముక్తి లభిస్తుంది.

అదొక విచిత్రమైన యథార్ధం - అనుసరించేవారు తమకు నయాన్నో భయాన్నో మార్గదర్శనం చేయించాలని కోరుకోవటం. కఠినంగా ప్రవర్తించటం నేర్పించే ఒకరకమైన పద్ధతి అనుకుంటారు - ఆధ్యాత్మిక సిద్ధిని పొందేందుకు ఇచ్చే శిక్షణలో బాధలు పడటం, తీవ్రమైన అఘాతం పొందటం, బాధ పెట్టటంలో ఉండే సంతోషంలో ఒక భాగమే. మార్గదర్శకుడూ, అనుచరుడూ - పరస్పరం కించపరుచుకోవటం అనుభూతి పొందాలనే కోరిక మూలాన్నే. మీకు ఇంకా గొప్ప అనుభూతి కావాలి కనుక మీరు అనుసరిస్తారు. దాని కోసం ఒక మార్గదర్శినో, ఒక గురువునో సృష్టిస్తారు. ఈ కొత్త రకం సంతృప్తి కోసం కొంత త్యాగం చేస్తారు. అసౌఖ్యాన్నీ, అవమానాలనీ, నిరుత్సాహం పొందటాన్నీ సహిస్తారు. ఇదంతా ఒకరి వల్ల ఒకరు లాభం పొందటానికే. దీనికి, నిజంగా ఉన్న స్థితికీ ఏమీ సంబంధం లేదు. ఇది ఎన్నటికీ ఆనందానికి దారి తీయదు.