మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/వెర్రిభ్రమ

వికీసోర్స్ నుండి

46. వెర్రిభ్రమ

ఆయనకి చిన్నచిన్న విషయాల గురించి వెర్రిభ్రమలు ఉన్నాయన్నాడు. వెర్రిభ్రమలు నిత్యం మారుతూ ఉంటాయిట. ఏదో శారీరక లోపం ఊహించుకుని దాన్ని గురించే ఆదుర్దా పడుతూ ఉంటాడుట, కొన్ని గంటలయింతరవాత దాని స్థానంలో మరో సంఘటనో, ఆలోచనో చోటు చేసుకుంటుందిట. ఆదుర్దా కలిగించే ఒక వెర్రిభ్రమలో నుంచి మరొక వెర్రిభ్రమలో పడి బ్రతుకుతున్నట్లు ఉందిట. ఈ వెర్రిభ్రమలను జయించటానికి వాటి గురించి పుస్తకాలు చదువుతాడుట. ఎవరైనా స్నేహితుడితో తన సమస్య చెప్పుకుంటాడు. ఒక మనస్తత్వ పరిశీలకుడి దగ్గరికి కూడా వెళ్లాడుట. అయినా, ఏ విధంగానూ బాధ నివారణ కాలేదుట. ఎంతో గంభీరమైన, ఆసక్తికరమైన సమావేశాల్లో పాల్గొన్న తరవాత తక్షణం మళ్లీ ఈ వెర్రి భ్రమలు ప్రవేశిస్తాయిట. వాటి కారణం ఆయన తెలుసుకోగలిగితే వాటిని అంతం చెయ్యటానికి వీలవుతుందా? కారణం కనుక్కోగలిగినంత మాత్రాన ఫలితం నుంచి విముక్తి కలుగుతుందా? కారణం తెలిసినందువల్ల ఫలితం పోతుందా? యుద్ధానికి కారణాలు ఆర్థికమైనవీ, మానసికమైనవీ మనకి తెలుసును. అయినా, రాక్షసత్వాన్నీ, ఆత్మవినాశాన్నీ ప్రోత్సాహపరుస్తున్నాం. కారణాన్ని వెతకటంలో మన ఉద్దేశం ఫలితాన్ని తప్పించుకోవాలనే కదా. ఈ కోరిక ఇంకో రకమైన ప్రతిఘటన, లేదా ఖండన. ఖండన ఉన్నప్పుడు అవగాహన ఉండదు.

"అయితే ఏం చెయ్యాలి" అని అడిగాడాయన.

మనస్సు ఈ అల్పమైన తెలివి తక్కువ భ్రమల ఆధీనంలో ఎందు - కుంటోంది? "ఎందుకు" అని అడగటం,మీరు కాకుండా వేరే ఇంకేదైనా కారణం ఉందేమో కనుక్కోవాలని ప్రయత్నించటం కాదు. మీ ఆలోచనా ధోరణి గురించి తెలుసుకునే ప్రయత్నం మాత్రమే. ఇంతకూ మనస్సు ఆ విధమైన గొడవ ఎందుకు పడుతోంది? అది పైపైనే ఉండేదీ, వెలితిగా, అల్పంగా ఉండేదీ కనుకనూ, అందువల్లనే తన ఆకర్షణల్లో తానే పడుతున్నది కనుకనూ కాదా?

"అవును" అని సమాధానమిచ్చాడు. "అది నిజమే అనిపిస్తోంది. కాని పూర్తిగా కాదు. ఎందుకంటే, నేను ప్రతి విషయం గురించీ తీవ్రంగా ఆలోచిస్తాను" అన్నాడు.

ఈ వెర్రిభ్రమలు కాక, మీ ఆలోచనలింకా దేన్ని గురించి?

"నా ఉద్యోగం గురించి" అన్నాడు. "నేనొక బాధ్యత గల పదవిలో ఉన్నాను. రోజంతా ఒక్కొక్కప్పుడు బాగా రాత్రి వరకూ నా ఆలోచనలన్నీ నా వ్యవహారాల గురించే. తరుచు చదువుతూ ఉంటాను. కాని, నా సమయమంతా చాలావరకు నా ఉద్యోగ నిమిత్తమే ఖర్చవుతుంది."

మీరు చేస్తున్నపని మీ కిష్టమేనా?

"ఆ, కాని పూర్తిగా సంతృప్తికరం కాదు. నా జీవితమంతా నేను చేస్తున్నదానితో అసంతృప్తి పడుతూనే ఉన్నాను. కాని, నా ప్రస్తుత పదవిని నేను వదులుకోలేను. ఎందుకంటే, నాకింకా కొన్ని బాధ్యతలున్నాయి. పైగా వయస్సు పైబడుతోంది. నాకు చికాకు కలిగిస్తున్నవి ఈ వెర్రిభ్రమలే, నా ఉద్యోగం అన్నా, మనుషులన్నా అంతకంతకు పెరుగుతున్న అయిష్టతా కూడా నాకు చికాకు కల్గిస్తున్నాయి. నేనెప్పుడూ కనికరం చూపించలేదు. భవిష్యత్తు గురించి ఆదుర్దా అధికమవుతోంది. శాంతి అన్నది ఉండటం లేదనిపిస్తోంది. నేను నా పని బాగానే నిర్వర్తిస్తాను, కాని. ...."

ఉన్నదానితో మీరు ఎందుకంత పోరాడుతున్నారు? నేను ఉంటున్న ఇల్లు గొడవగొడవగా మురికిగా ఉండొచ్చు. సామాను ఘోరంగా ఉండొచ్చు. ఎక్కడా అందం అనేది లేకుండా ఉండి ఉండొచ్చు. కాని, అనేక కారణాల వల్ల నేను అక్కడే ఉండవలసి రావచ్చు. ఇంకో ఇంటికి వెళ్లిపోలేను. అప్పుడు, ఉన్న వాటిని స్వీకరించాలన్న ప్రశ్నకాదు, స్పష్టంగా కనిపిస్తున్న వాటిని చూడటం ఉన్న దాన్ని నేను చూడనట్లయితే, ఆ పూలకుండీ చూసినా, ఆకుర్చీ చూసినా, ఆ బొమ్మ చూసినా రోత పుట్టేలా బాధపడతాను. అవే నా వెర్రి భ్రమలైపోతాయి. ఇక మనుషులన్నా, నా ఉద్యోగమన్నా, ఏమన్నా రోత పుడుతుంది. అవన్నీ వదిలేసి మళ్లీ మొదలుపెడితే అది వేరే సంగతి. కానీ, అలా చెయ్యలేను. ఉన్నదాన్ని గుర్తించటం నిరాసక్తమైన తృప్తికీ, నిర్లక్ష్యానికీ దారి తీయదు. ఉన్నదానికి నేను లొంగినట్లయితే, అది అవగాహన అవటమే కాకుండా ఒక విధమైన ప్రశాంతత వస్తుంది పైపై మనస్సులో. పైపై మనస్సు శాంతంగా లేనట్లయితే, అది పిచ్చి భ్రమలలో పడుతుంది - వాస్తవమైనవైనా, ఊహామయమైనవైనా; సంఘసేవలోనో, మత విశ్వాసంలోనో - గురువూ, రక్షకుడూ, పూజలూ వంటివి. పైపై మనస్సు శాంతంగా ఉన్నప్పుడే నిగూఢంగా ఉన్నది విశదమవుతుంది. నిగూఢంగా ఉన్నదాన్ని బయటపెట్టాలి. కాని, పైపై మనస్సు వెర్రిభ్రమలతో, ఆదుర్దాలతో బరువై పోయినప్పుడు అది సాధ్యం కాదు. పైపై మనస్సు నిత్యం ఏదో ఒక ఆందోళనలో ఉంటుంది. కనుక మనస్సు పై పొరలకీ, లోలోపలి పొరలకీ సంఘర్షణ తప్పదు. ఈ సంఘర్షణ పరిష్కారం కానంతవరకూ వెర్రిభ్రమలు అధికమవుతాయి. ఈ వెర్రిభ్రమలు మన సంఘర్షణ నుంచి తప్పించుకోవటానికి మార్గాలే కదా. తప్పించుకునే మార్గాలన్నీ ఒకలాంటివే - కొన్ని సాంఘికంగా ఎక్కువ హానికరమైనవైనప్పటికీ.

వెర్రిభ్రమగాని, ఏ సమస్యగాని, దాని మొత్తం ప్రక్రియని తెలుసుకున్నప్పుడే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. సంపూర్ణంగా తెలుసు కోవటానికి ఖండన జరక్కూడదు. సమస్యని సమర్థించటం జరగకూడదు. తెలుసుకొని ఉండటం ఇష్టాయిష్టాలు లేకుండా జరగాలి. ఆవిధంగా తెలుసుకోవటానికి ఎంతో ఓర్పు, సున్నితత్వం ఉండాలి. ఉత్సుకతా, నిర్వరామమైన శ్రద్ధా ఉండాలి - మొత్తం ఆలోచనా ప్రక్రియని గమనించటానికీ, అర్ధం చేసుకోవటానికీ.