మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/నగరంలో జీవితం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

45. నగరంలో జీవితం

ఆ గది అన్ని విధాలా వీలుగా, ప్రశాంతంగా, హాయిగా ఉంది. గదిలో సామాను నాజూకుగా ఎంతో మంచి అభిరుచితో ఉంది. తివాసీ ఒత్తుగా మెత్తగా ఉంది. చలువరాతి గట్టుక్రింద నిప్పుచేసుకునే స్థలం - అందులో నిప్పులున్నాయి. ప్రపంచంలో అనేక ప్రదేశాల నుంచి తెచ్చిన పాత పూలకూజాలు ఉన్నాయి. గోడలమీద కొన్ని కొత్త చిత్రాలూ, కొన్ని పురాతన కళాకారుల చిత్రాలూ ఉన్నాయి. అ గది అందంగా సౌకర్యంగా ఉండటానికి ఎంతో ఆలోచించి జాగ్రత్త తీసుకున్నట్లుగా ఉంది. దానిలో వారి డబ్బూ, అభిరుచీ ప్రతిబింబిస్తోంది. ఆ గదిలోంచి చూస్తే చిన్నతోట, ఆ తోటలో పచ్చని మైదానం కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాలనుంచీ గడ్డి కత్తిరించబడి, పరిచినట్లుగా ఉంది.

నగరంలో జీవితానికీ జగత్తుకీ బంధం తెగిపోతుంది చిత్రంగా. లోయలూ, కొండలూ ఉండే స్థలాల్లో మనుషులు కట్టిన మేడలు, ఉరకలు వేసే జలధారల స్థానంలో వచ్చేపోయే వాహనాల రొద, రాత్రి నక్షత్రాలు కనిపించటం అరుదు. ఒకేళ ఎవరైనా చూడాలనుకున్నా నగర దీపాలు మరీ కాంతివంతంగా ఉంటాయి. నగరవాసులకేదో అవుతుంది నిశ్చయంగా. నాజూగ్గా మర్యాదగా ఉంటారు. వాళ్లకి చర్చిలూ, మ్యూజియమ్‌లూ, త్రాగుడూ, నాటకాలూ, అందమైన బట్టలూ, అంతులేని దుకాణాలూ ఉంటాయి. ఎక్కడ చూసినా మనుషులు - వీధుల్లో భవనాల్లో, గదుల్లో. ఆకాశంలో ఒక మేఘం వెడుతుంది. దానివైపు ఎవరో గాని కన్నెత్తి చూడరు. హడావిడి, కల్లోలం.

కాని, ఈ గదిలో అంతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. ధనవంతుల వద్ద ఉండే చిత్రమైన వాతావరణం ఉంది - అన్నిటికి దూరంగా, సురక్షితంగా, ధీమాగా, దేనికీ కొరత లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది. ఆయనకి వేదాంతంలో ఆసక్తి ఉందని చెప్పుకొస్తున్నాడాయన - పూర్వ పశ్చిమ సిద్ధాంతాలు రెండింటిలోనూ ఆసక్తి ఉందట. గ్రీకు దేశస్థులతోనే ప్రారంభమైందనటం ఎంత ఆసందర్భం - అక్కడికి, వాళ్లకి ముందు ఇంకేమీ లేనట్లు - అన్నాడాయన. అంతలోనే తన సమస్య గురించి చెప్పటం మొదలుపెట్టాడు. - ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అని. డబ్బుండటం, దానితో వచ్చే బాధ్యతలూ ఆయన్ని కొంత చికాకు పెడుతున్నాయిట. ఆయన దాన్ని సమస్యలా ఎందుకు చూస్తున్నాడు? ఎవరికిచ్చాడో, ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అంత ముఖ్యమైనదా? అది సమస్యగా ఎలా పరిణమించింది?

ఆయన భార్య వచ్చింది. ఆకర్షణీయంగా, కాంతివంతంగా, కుతూహలంతో ఉన్నట్లుగా ఉంది. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్లు, మర్యాదస్తులు, ప్రాపంచిక విషయాల్లో శ్రద్ధ ఉన్నవాళ్లు, తెలివైన వాళ్లు. ఎన్నో విషయాల్లో ఆసక్తి ఉంది. ఇద్దరూ కూడా చిన్న ఊరు నుంచీ, గ్రామం నుంచీ వచ్చిన వాళ్లే. వారి హృదయాలు ఇంకా చిన్న ఊరులోనే ఉన్నాయి. ఆ ఒక్కటి - దయ అనేది ఎంతో దూరమై పోయినట్లుగా అనిపిస్తోంది. మనోలక్షణాలను ఎంతో శ్రద్ధగా పోషించుకున్నారు - ఒక విధమైన వాడితనం, కరుకుగా ప్రవర్తించటం. కానీ వాటివల్ల ఏమీ లాభం లేకపోయింది. ఆవిడ కొద్ది రచనలు చేసింది. ఆయన ఒకరకంగా రాజకీయ వేత్త. ఎంతో సునాయాసంగానూ, భరోసాతోనూ మాట్లాడారు వాళ్లు. ఏదైనా ఆవిష్కారం కావాలన్నా అవగాహన కావాలన్నా సందేహావస్థలో ఉండటం అవసరం. మీ కంతగా తెలిసి ఉన్నప్పుడు - ఆత్మ రక్షణ చేసుకునే కవచం అంతమెరిసేటట్లు పెట్టుకున్నప్పుడు ఏ మాత్రమూ బీటలూ పడకుండా లోపలనుంచి తాపడం చేసినప్పుడు సందేహావస్థ ఎలా ఉంటుంది? అనుభూతి కలిగించే వాటి బంధనంలో చిక్కుకున్నవారికి రేఖారూపాలు అసాధారణమైన ప్రాముఖ్యం గలవై ఉంటాయి. అప్పుడు అందం ఒక అనుభూతి, మంచితనం ఒక ఊహ, సత్యం సహేతుకంగా నిర్ణయించవలసినదీ అవుతుంది. అనుభూతులు ఆధిక్యం వహిస్తే సౌఖ్యం అత్యవసరమైపోతుంది - శరీరానికే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా - ముఖ్యంగా, మానసికంగా హరించి వేస్తూ భ్రమకి దారితీస్తుంది.

మనం సొంతం చేసుకున్నవే మనం. మనం వేటితో బంధం పెంచుకున్నామో అవే మనం. బంధనానికి ఔన్నత్యం ఉండదు. జ్ఞానంతో బంధం పెంచుకోవటానికీ, మరింకేదో సంతృప్తి కలిగించే దురలవాటుకీ తేడా లేదు. దేనితోనైనా బంధనం పెంచుకోవటం తన గొడవలో తాను మునిగి ఉండటమే - నీచ స్థాయిలోనైనా, ఉన్నతస్థాయిలోనైనా, బంధనం పెంచుకోవటం ఆత్మవంచన. తనలోని వెలితిని తప్పించుకోవటానికి అదొక మార్గం. మనం బంధనం పెంచుకునేవి - ఆస్తి, మనుషులూ, ఊహలూ - ఇవి అత్యంత ముఖ్యం అవుతాయి, శూన్యాన్ని నింపే అవన్నీ లేకపోతే తనే ఉండడు కనుక. ఉండడేమోనన్న భయంతో సొంతం చేసుకుంటారు. భయం భ్రమని పెంపొందిస్తుంది. నిశ్చితమైన వాటి బంధనంలో ఉండటమే భ్రమ - నిశ్చితమైనవి వస్తువులైనా, భావాలైనా; వివేకం, స్వేచ్ఛా ఉన్నప్పుడే వాస్తవికత తెలియటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ లేకుండా కపటత్వాన్ని వివేకం అనుకుంటారు. కపటంగా ఉండేవారి పద్ధతులెప్పుడూ గందరగోళంగా, వినాశకరంగా ఉంటాయి. ఈ ఆత్మరక్షకమైన కపటత్వమే. బంధనాలు ఏర్పరచుకునేట్లు చేస్తుంది. బంధనం బాధ కలిగించినప్పుడు కపటత్వమే బంధనం వదిలించుకోవటానికి ప్రయత్నిస్తుంది. పైగా త్యజించటాన్ని గర్వంగా, గొప్పగా భావించి, అందులో సంతోషాన్ని పొందుతుంది. కపట రీతులూ, ఆత్మ అవలంబించే మార్గాలూ అర్థం కావటమే వివేకానికి ఆరంభం.