Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/క్రియ, భావం

వికీసోర్స్ నుండి

44. క్రియ, భావం

ఆయన మృదువుగానూ, శాంతంగానూ ఉన్నాడు. ఆయన ముఖం మీద వెంటనే వస్తుంది చక్కని చిరునవ్వు. ఎంతో సామాన్యమైన దుస్తులు వేసుకున్నాడు. ఆయన ప్రవర్తన నెమ్మదిగానూ మొహమాటంతో కూడినట్లు గానూ ఉంది. ఆయన అహింసని ఎన్నో సంవత్సరాలుగా సాధన చేశాడుట. దాని శక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యం బాగా తెలుసుకున్నాడుట. దాన్ని గురించి ఎన్నో పుస్తకాలు రాశాడుట. తనతో కూడా ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చాడు. ఎన్నో ఏళ్లనుంచీ ప్రయత్నపూర్వకంగా దేన్నీ చంపలేదని వివరించాడు. కూరగాయలు తప్ప, వేటినీ తినడుట. తను కూరగాయలు తినే విషయం గురించి ఎన్నో వివరాలు చెప్పాడు. ఆయన జోళ్లూ, చెప్పులూ సహజంగా చచ్చిపోయిన జంతువుల చర్మం నుంచి చేసినవి మాత్రమేనట. ఆయన తన జీవితాన్ని వీలైనంత నిరాడంబరంగా చేసుకున్నాడుట. ఆహార పదార్థాలను గురించి చదివాడుట. తనకు అవసరమైన వాటినే తింటాడుట. ఆయన ఎన్నో సంవత్సరాలుగా కోపం తెచ్చుకోలేదుట. కాని కొన్ని సందర్భాల్లో అసహనం కలుగుతుంది. అది కేవలం నరాల్లో కలిగే ప్రతిక్రియ మాత్రమేనట. ఆయన ప్రసంగం హద్దుల్లో ఉండి సౌమ్యంగా ఉంది. అహింసకున్న శక్తి ప్రపంచాన్ని మారుస్తుందనీ, దాని కోసం తన జీవితాన్ని అంకితం చేశాననీ చెప్పాడాయన. తన గురించి తాను సులభంగా మాట్లాడే రకం కాదాయన. కాని, అహింస విషయంలో ఆయన ధారాళంగా మాట్లాడాడు. మాటలు ప్రయత్నం లేకుండానే ప్రవహిస్తున్నాయి. తన కిష్టమైన ఆ విషయం గురించి మరింత ప్రగాఢంగా చర్చించటానికే వచ్చానని చెప్పాడు.

దారికెదురుగా ఆ పెద్ద కాలవ ప్రశాంతంగా ఉంది. వాటిల్లో నీళ్లు కల్లోలితమైనాయి పెద్ద గాలి వీచే సరికి. చెట్టుకున్న పెద్ద పెద్ద ఆకుల నీడ నీటిమీద పడుతోంది. ఒకటో రెండో కలువ పువ్వులు నీటిపై భాగం మీద ప్రశాంతంగా తేలుతున్నాయి. ఒక మొగ్గ నీటిపైకి కొద్దిగా కనిపిస్తోంది. పక్షులు రావటం మొదలైంది. ఎన్నో కప్పలు బయటికి వచ్చి మళ్లీ నీళ్లలోకి దూకాయి. అలలు క్రమంగా మాయమైపోయాయి. మళ్లీ నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఒక పొడుగాటి చెట్టుకి బాగాపైన పిట్ట ఒకటి కూర్చుని ముక్కుతో ఈకలు సవరించుకుంటూ పాడుతోంది. ఒక వంపులా ఎగిరి మళ్లీ తన చిటారు కొమ్మమీదికి వస్తోంది. ప్రపంచాన్ని చూసీ, తన్ను తాను చూసుకునీ మురిసిపోతుంది. మాకు కొద్ది దూరంలోనే ఒక లావుపాటి ఆయన పుస్తకం పుచ్చుకుని కూర్చున్నాడు. కాని, ఆయన దృష్టి ఎక్కడో ఉంది. చదవటానికి ప్రయత్నిస్తున్నాడు గాని, ఆయన మనస్సు మళ్లీ మళ్లీ పారిపోతోంది. ఆఖరికి ఆ పోరాటం ఆపేసి, మనస్సుని దాని త్రోవని దాన్ని వదిలేశాడు. ఒక లారీ కొండమీది నుంచి క్రిందికి మెల్లిగా భారంగా వస్తోంది. దాని వేగం ఇంకా తగ్గించవలసి వచ్చింది.

క్రియారూపంలో పెట్టటానికి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం - పైకి కనిపించే చేష్టల రూపంలో ముందు బాహ్యంగా ఒక క్రమపద్ధతి తీసుకురావటానికి ప్రయత్నిస్తాం. మన తీర్మానాల ప్రకారం అంతరంగంలో ఏర్పరచుకున్న సూత్రాల ప్రకారం బాహ్యంగా మన జీవితాన్ని సరిదిద్దుకుంటాం. అంతరంగికమైన దానికి అనుగుణంగా, బాహ్యంగా ఉన్నదాన్ని ఎందుకు బలవంతంగా మారుస్తాం? ఒక భావం ప్రకారం ఎందుకు క్రియ జరుపుతాం? భావం క్రియ కన్నా ఎక్కువ శక్తిమంతమైనదా?

భావం ముందు ఏర్పడుతుంది - సహేతుకంగానో, సహజంగా తట్టినందువల్లనో ఆ తరువాత క్రియని అ భావం సమీపానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తాం. దాని ప్రకారం జీవితం నడపటానికి ప్రయత్నిస్తాం. దాన్ని సాధన చేస్తాం. దానికి తగిన క్రమశిక్షణ పొందుతాం. క్రియని భావం సరిహద్దులలోకి తీసుకురావటానికి ఇదొక అనంతమైన కృషి. క్రియని భావం ప్రకారం రూపొందించటానికి ఎందుకీ అంతులేని బాధాకరమైన పోరాటం? లోపలి దానిలా పైదాన్ని చెయ్యాలనే ఈ తపన ఏమిటి? లోపలి దాన్ని శక్తిమంతం చెయ్యటానికా? లేక, లోపలిది సందేహావస్థలో ఉన్నప్పుడు దానికి పైదాని హామీ ఇవ్వటానికా? పైదాని నుంచి సౌఖ్యం పొదుతున్నప్పుడు పై దానికి ఎక్కువ ప్రాముఖ్యం, ప్రాధాన్యం ఏర్పడవా? బాహ్య వాస్తవికతకి ప్రాధాన్యం ఉంది. కాని, దాన్ని చిత్తశుద్ధికి తార్కాణంగా చూచినప్పుడు, భావానికే ఎక్కువ ఆధిక్యం అని సూచించదా? భావం ఎందుకంత శక్తిమంతమై పోయింది? మనల్ని క్రియాత్మకంగా చేయటానికా? మనం క్రియ జరపటానికి భావం ఎంత వరకు దోహదం చేస్తుంది? క్రియకి అడ్డు తగులుతుందా?

భావం క్రియని, నిశ్చయంగా పరిమితం చేస్తుంది. క్రియ అంటే ఉండే భయమే ఊహని కలిగిస్తుంది. ఊహలో రక్షణ ఉంటుంది. క్రియలో ప్రమాదం ఉంటుంది. క్రియ పరిమితులు లేనట్టిది. అట్టి క్రియని నిగ్రహించటానికి ఊహని పెంపొందించటం జరుగుతుంది. చర్యని ఆపుచేయటానికి భావం ఏర్పడుతుంది. క్రియలో మీరు నిజంగా ఔదార్యంగా ఉంటే ఏమవుతుంది? అందుచేత మీ హృదయంలోని ఔదార్యానికి వ్యతిరేకంగా మానసిక ఔదార్యం ఉంటుంది. మీరు అంతవరకే వెడతారు - రేపు ఏమవుతుందో మీకు తెలియదు కనుక, క్రియని భావం తీర్చిదిద్దుతుంది. క్రియ పరిపూర్ణంగా విశాలంగా, విస్తృతంగా, ఉంటుంది. భయం ఊహలాగే ముందు కొచ్చి బాధ్యత తీసుకుంటుంది. అ విధంగా భావం అత్యంత ముఖ్యమవుతుంది - క్రియ కాదు.

క్రియ ఊహకి అనుగుణంగా ఉండాలి అని ప్రయత్నిస్తాం. అహింస అనేది భావం లేదా ఆదర్శం. మన చర్యలూ, చేష్టలూ, ఆలోచనలూ, అన్నీ మనసులో ఉన్న ఆ పద్ధతి ప్రకారం రూపొందుతాయి. మనం తినేదీ, కట్టుకునేదీ, చెప్పేదీ చాలా ముఖ్యం అవుతాయి. మన చిత్తశుద్ధిని వాటి ద్వారా నిర్ణయిస్తాం కాబట్టి, చిత్తశుద్ధి ముఖ్యమైపోతుంది, అహింసాయుతంగా ఉండటం కాదు. మీ చెప్పులూ, మీరు తినేదీ ఎంతో ఆసక్తికరమైన అంశాలవుతాయి. అహింసాయుతంగా ఉండటం మరిచిపోవటమవుతుంది. భావం ఎప్పుడూ అప్రధానమైనదే. అప్రధానమైన విషయాలే ప్రధానమైన దానిపైన ఆధిక్యాన్ని చూపిస్తాయి. మీరు భావం గురించి రాయవచ్చు, ప్రసంగించవచ్చు, కబుర్లు చెప్పవచ్చు. ఊహలో ఆత్మవిస్తరణకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అహింసాయుతంగా ఉండటంలో ఆత్మవిస్తరణ వల్ల కలిగే సంతృప్తి ఉండదు. ఊహ స్వయంకల్పితం కాబట్టి ఉత్తేజకరంగా సంతృప్తికరంగా ఉంటుంది - వ్యక్తంగా అయినా, అవ్యక్తంగా అయినా. కాని అహింసాయుతంగా ఉండటంలో ఆకర్షణ ఉండదు. అహింస కేవలం లక్ష్యం కాదు. అహింస ఒక ఫలితం, పక్క నుంచి పుట్టుకొచ్చింది మాత్రమే. భావం ఆధిపత్యం వహించినప్పుడు అది లక్ష్యం మాత్రమే అవుతుంది. భావం ఎప్పటికీ నిశ్చితాభిప్రాయం, లక్ష్యం, స్వయంకల్పిత లక్ష్యం. ఊహ అనేది తెలిసిన దానిలో జరిగే సంచలనం. కాని, అహింసాయుతంగా ఉండటం ఎలాగో ఆలోచన రూపొందించలేదు. ఆలోచన అహింస గురించి లోతైన ఆలోచనలు చేయవచ్చు. కాని, అది అహింసాయుతంగా ఉండలేదు. అహింస ఊహ కాదు. దాన్ని క్రియాత్మకంగా చేయటం సాధ్యం కాదు.