మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఒకే రీతిగా ఉండటం
43. ఒకే రీతిగా ఉండటం
ఆయన తెలివైనవాడు, చురుకైనవాడు. ఏవో కొన్ని ఎంచుకున్న పుస్తకాలు చదువుతూ ఉంటాడని స్పష్టమవుతోంది. వివాహితుడైనా, సంసార తాపత్రయం ఉన్నవాడు కాదు. తను ఆదర్శవాదిననీ, సంఘ సేవకుడననీ తనే చెప్పుకున్నాడు. రాజకీయ కారణాలవల్ల జైలుకి వెళ్లాడుట. ఎంతో మంది స్నేహితులున్నారుట. తనకు గాని, తన పార్టీకి గాని పేరు తెచ్చుకోవాలనే బాధ లేదు ఆయనకి. ఆ రెండూ ఒకటిగానే గుర్తిస్తాడాయన. ఆయనకి సంఘసేవలోనే నిజమైన ఆసక్తి ఉంది - అదైనా మానవ కల్యాణానికి దారి తీస్తుందేమోనని. దైవతత్పరత ఉన్నవాడని చెప్పవచ్చును. కాని, ఆవేశపరుడూ, మూఢవిశ్వాసాలు ఉన్నవాడూ కాదు. ఒక ప్రత్యేక సిద్ధాంతంలో గాని, ఆచారంలో గాని నమ్మకం ఉన్నవాడు కాదు. వైరుధ్యం అన్న సమస్య గురించి - తనలోని వైరుధ్యమే కాక, ప్రకృతిలోనూ, ప్రపంచంలోనూ ఉన్నదాన్ని గురించి చర్చించటానికి వచ్చానన్నాడు. ఈ వైరుధ్యం అనివార్యమైనదని ఆయనకి అనిపిస్తున్నదట. తెలివైనది, తెలివి తక్కువది, మనిషిలో ఉండే పరస్పర విరుద్ధమైన కోరికలు, మాటకీ, ఆచరణకీ, మాటకీ, భావానికీ - ఈ విధంగా వైరుధ్యం ప్రతి చోటా కనిపిస్తుందన్నాడు. ఒకే రీతిగా ఉండటం అంటే ఆలోచనారహితంగా ఉండటమే. ఆలోచన వల్ల బాధ పడటానికి సాహసించటం కన్న, మార్పు లేకుండా ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం, ఒక సిద్ధాంతానికో, సంప్రదాయానికో అనుగుణంగా వర్తించటం ఎక్కువ సులభం, క్షేమదాయకం. అధికారానికి అంతర్గతంగా గాని, బహిరంగంగా గాని తలవంచటానికి ఎదురు ప్రశ్న వేయవలసిన అవసరం ఉండదు. అది ఆలోచననీ, దానితో బాటు వచ్చే ఆదుర్దాలనీ, ఆందోళనలనీ నిర్మూలిస్తుంది. మనం నిశ్చయించుకున్న వాటినీ, అనుభవాలనీ, నిర్ణయాలనీ అనుసరించటం వల్ల మన లోలోపల వైరుధ్యం కలగదు. మన లక్ష్యం కోసమే మనం ఒకే రీతిలో ఉంటాం. ఒక మార్గాన్ని ఎంచుకుని దాన్నే అనుసరిస్తాం - దేనికీ లొంగకుండా కృతనిశ్చయంతో అనుసరిస్తాం. మనలో చాలామంది ఏవిధమైన ఆందోళనా కలిగించని, అధమం, మానసిక రక్షణ కలిగించే జీవనమార్గాన్ని ఆశించరా? తన ఆదర్శానికి అనుగుణంగా జీవించే మనిషిని మనం ఎంత గౌరవిస్తాం! వారిని ఉదాహరణలుగా తీసుకుంటాం. వారిని అనుసరించాలి, ఆరాధించాలి. ఒక ఆదర్శాన్ని అనుసరించటానికి కొంత శ్రమా, పీకులాటా ఉన్నప్పటికీ, మొత్తం మీద అది సంతోషదాయకంగానూ, సంతృప్తికరంగానూ ఉంటుంది. అయితే, ఆదర్శాలు స్వయం నిర్మితాలూ, స్వీయ కల్పితాలే కదా. ఆధ్యాత్మిక విషయాల్లో గాని, ప్రాపంచిక విషయాల్లో గాని మీ ఆదర్శపురుషుణ్ణి ఎంచుకుని అతణ్ణి అనుసరిస్తారు. ఒకే రీతిగా ఉండాలనే కోరిక ఒక విధమైన శక్తినీ, సంతృప్తిని ఇస్తుంది - చిత్తశుద్ధిలో రక్షణ ఉంటుంది కనుక. కాని, చిత్తశుద్ధి నిరాడంబరత కాదు. నిరాడంబరత లేకుండా అవగాహన కలగడం సాధ్యం కాదు. బాగా ఆలోచించి తయారు చేసుకున్న పథకానికి అనుగుణంగా ఒకే రీతిలో నడిచినట్లయితే, ఏదో సాధించాలనే తపనని తృప్తి పరచినట్లవుతుంది. అందులో విజయం సాధిస్తే సౌఖ్యమూ, రక్షణా ఉంటాయి. ఒక ఆదర్శాన్ని పెట్టుకుని దాన్ని నిరంతరం అనుకరించటం వల్ల ప్రతిఘటన అలవడుతుంది. సర్దుకుపోవటం అనేది ఆ అనుకరించే పద్ధతిని అతిక్రమించకపోవటం. ఒకే రీతిగా ఉండటం వల్ల రక్షణా, నమ్మకం ఉంటాయి. అందుకే అంత గతిలేనట్లు దాన్ని పట్టుకుని వదలం. తనతో తను వైరుధ్యంతో ఉండటం అంటే సంఘర్షణతోనూ, దుఃఖంతోనూ జీవించటం. 'నేను' స్వభావమే స్వతస్సిద్ధంగా వైరుధ్యంతో కూడుకున్నది. రకరకాల ముఖాలతో ఉండే పరస్పర విరుద్ధమైన ఆసక్తులూ, విలువలూ, వివిధస్థాయిల్లో అనేక రకాల కోరికలతో కలిసి వేయబడినది. ఈ 'తను', ఈ 'నేను' రకరకాల కోరికల వల. ప్రతి కోరికకీ దాని ప్రేరణా, దాని లక్ష్యం దానికుంటాయి. ఇతర ఆశలకూ, ప్రయత్నాలకూ తరచు వ్యతిరేకంగా ఉంటాయి. ఉత్సుకత కలిగించే పరిస్థితులనూ అనుభూతులనూ బట్టి ఇవి బహుముఖాలు తగిలించుకుంటాయి. అందుచేత 'నేను' నిర్మాణ క్రమంలోనే ఉన్న వైరుధ్యం మనలో భ్రమనీ, బాధనీ పెంపొందిస్తుంది. దాన్ని తప్పించుకోవటానికి అన్ని రకాల స్వీయవంచనలకూ సిద్ధమవుతాము. దానివల్ల సంఘర్షణా, దుఃఖం మరింత అధికమవుతాయి. అంతరంగిక వైరుధ్యం దుర్భరమై పోయినప్పుడు మనం తెలిసిగాని, తెలియకుండా గాని మరణం ద్వారానో, మతి భ్రమణం ద్వారానో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాం. లేదా, ఒక భావానికో, ఒక సంఘానికో, ఒక దేశానికో, ఏదో కార్యకలాపానికో అంకితమైపోతాం. అది మనల్ని పూర్తిగా ఆకట్టుకుంటుంది. లేదా, ఒక మత సంస్థవైపుకీ, దాని ప్రగాఢ విశ్వాసాల వైపుకీ, ఆచారాలవైపుకీ మొగ్గుతాం. మనలోని ఈ విభజన మరింత ఆత్మవిస్తరణకో, వినాశానికో, మతి భ్రమణానికో దారి తీస్తుంది. మనం ఉన్నట్లు కాకుండా ఇంకేదో అవాలనే ప్రయత్నం వైరుధ్యాన్ని పెంచుతుంది. ఉన్న స్థితి అంటే ఏర్పడిన భయం దానికి వ్యతిరేకమైన ఒక భ్రమని పెంపొందిస్తుంది. ఆ వ్యతిరేకమైన దాని కోసం ప్రయత్నించటంలో భయం నుంచి తప్పించుకోగలమని ఆశపడతాం. సమన్వయం అంటే వ్యతిరేకమైనదాన్ని పెంచటం కాదు. సమన్వయం వ్యతిరిక్తత వల్ల రాదు. ప్రతి దానిలోనూ దానికి వ్యతిరేకమైన అంశాలు ఇమిడి ఉంటాయి. మనలోని వైరుధ్యం ప్రతి రకమైన శారీరక, మానసిక ప్రతిక్రియకీ దారితీస్తుంది. ఆ ప్రతిక్రియ సౌమ్యంగా ఉండొచ్చును. గౌరవనీయంగా ఉండొచ్చును, ప్రమాదకరంగా ఉండొచ్చును. ఒకే రీతిగా ఉండటం వల్ల ఈ వైరుధ్యం మరింత గందరగోళంగా, మరింత అస్పష్టంగా తయారవుతుంది. ఒకే ఒక్క కోరికనో, ఆసక్తినో కేంద్రీకృతం చేసుకుని దాన్ని సాధించటానికి ప్రయత్నించటం వల్ల వ్యతిరిక్తత 'నేను' ని ఆవరిస్తుంది. అంతరంగిక వైరుధ్యం బహిరంగంగా సంఘర్షణని తెస్తుంది. సంఘర్షణ వైరుధ్యాన్ని సూచిస్తుంది. కోరిక తీరుతెన్నులను అర్థం చేసుకోవటంలోనే స్వీయ వైరుధ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
సమైక్యత మనస్సు యొక్క పై అంతస్తులకే పరిమితం కాజాలదు. అది పాఠశాలలో నేర్చుకుంటే వచ్చేది కాదు. జ్ఞానం వల్లగాని, ఆత్మ త్యాగం వల్ల గాని రాదు. సమైక్యత ఒకే రీతిలో ఉండటం నుంచీ, వైరుధ్యం నుంచీ కూడా విముక్తి కలుగజేస్తుంది. కాని, సమైక్యత అంటే అన్ని కోరికల్నీ, అన్నిరకాల ఆసక్తుల్నీ కలిపి ఒకేలా చేయటం కాదు. సమైక్యత ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం కాదు - ఆ పద్ధతి గౌరవనీయమైనదైనా సరే, కపటమైనదైనా సరే - దాన్ని సూటిగా, స్పష్టంగా సమీకరించటం కాదు, మరోదారిని, అగోచరంగా సమీపించాలి. సమైక్యతని ఊహించటం అంటే ఒక పద్ధతిని అవలంబించటమే - దానివల్ల తెలివితక్కువ తనం, వినాశకత్వం పెంపొందుతాయి. సమైక్యతకి ప్రయత్నించటం అంటే, దాన్నొక ఆదర్శంగా, స్వయం కల్పిత లక్ష్యంగా చేయటమే. అన్ని ఆదర్శాలూ స్వీయ కల్పితాలే కనుక అవి తప్పనిసరిగా, సంఘర్షణకీ, శత్రుత్వానికీ కారకమవుతాయి. వ్యక్తి తనకు తాను కల్పించే రూపం తన ప్రకృతిదే కాబట్టి అది వైరుధ్యయుతంగానూ, సందిగ్ధ జనకంగానూ ఉంటుంది. సమైక్యత ఒక ఊహకాదు. కేవలం జ్ఞాపకం వల్ల కలిగిన ప్రతిక్రియ కాదు. అందువల్ల దాన్ని పెంచటానికి వీలవదు. సంఘర్షణ ఉన్నందువల్లనే సమైక్యత కావాలనే కోరిక కలుగుతుంది. సమైక్యత పెంపొందించుకోవటం ద్వారా సంఘర్షణకి అతీతం కావటం జరగదు. వైరుధ్యాన్ని కప్పిపుచ్చవచ్చు. లేదనవచ్చు, ఉందని తెలియకుండా ఉండొచ్చు. కాని అది అక్కడే ఉంటుంది - బయట పడటానికి ఎదురుచూస్తూ.
సంఘర్షణనే మనం పట్టించుకునేది, సమైక్యతని కాదు. సమైక్యత కూడా శాంతి లాగే అసలు లక్ష్యం కాదు. పక్క నుంచి పుట్టుకొచ్చినది. అది ఒక ఫలితం మాత్రమే - అందువల్ల దానికంత ప్రాముఖ్యం లేదు. సంఘర్షణని అర్థం చేసుకోవటంతో సమైక్యత, శాంతమే కాక అంతకన్న అనేక రెట్లు గొప్పదైన దేదో ఉంటుంది. సంఘర్షణని అణచివెయ్యటం గాని, పవిత్రం చెయ్యటం గాని సాధ్యం కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మరొకటి లేదు. సంఘర్షణ తాపత్రయం వల్ల వస్తుంది. కొనసాగాలనీ, ఇంకా అవాలనీ కోరటం వల్ల వస్తుంది - అంటే స్తబ్ధంగా ఉండిపోతూ తృప్తిపడటం కాదు. "ఇంకా" అనేది 'నేను' నిత్యం చేసే గోల. అది అనుభూతి కోసం అపేక్షించటం - గతించినది గాని, రానున్నది గాని. అనుభూతి మానసికమైనది. అందువల్ల సంఘర్షణని అర్థం చేసుకోవటానికి మనస్సు సాధనం కాదు. అర్థం చేసుకోవటం మాటల్లో కాదు. అది మానసిక ప్రక్రియ కాదు. అందువల్ల అది అనుభవానికి చెందిన విషయం కాదు. అనుభవం ఒక జ్ఞాపకం. మాటలేకుండా, సంకేతం లేకుండా, రూపం లేకుండా జ్ఞాపకం అనేది ఉండదు. సంఘర్షణ గురించి బోలెడు గ్రంథాలు చదవచ్చు. దానికీ, సంఘర్షణని అర్థం చేసుకోవటానికీ సంబంధం లేదు. సంఘర్షణని అర్థం చేసుకోవాలంటే ఆలోచన అడ్డు రాకూడదు. ఆలోచించేవాడు లేకుండా సంఘర్షణని తెలుసుకోవటం జరగాలి. ఆలోచించే వాడు ఎంచుకుంటాడు. సంతోషకరమైన వాటివైపూ, సంతృప్తికరమైన వాటివైపూ తప్పని సరిగా మొగ్గుతాడు. దాంతో, సంఘర్షణని పోషిస్తాడు. ఒక ప్రత్యేక విషయంలో సంఘర్షణని వదిలించుకోవచ్చు. సంఘర్షణ పుట్టించే క్షేత్రం అలాగే ఉంటుంది. ఆలోచించేవాడు సమర్థించటమో, ఖండించటమో చేస్తే అవగాహన కాకుండా అడ్డుపడతాడు. ఆలోచించేవాడు లేకుండా ఉంటే సంఘర్షణ సూటిగా అర్ధమవుతుంది - అనుభవించేవాడు అనుభవం పొందుతున్నట్లుగా కాదు. అనుభవమవుతూన్న స్థితిలో అనుభవించేవాడు గాని, అనుభవం పొందబడేది కాని ఉండదు. అనుభవమవటం సూటిగా అవుతుంది. ఆ సంబంధం సూటిగా ఉంటుంది. జ్ఞాపకం ద్వారా కాదు. ఈ ప్రత్యక్ష సంబంధమే అవగాహన కలుగజేస్తుంది. అవగాహన వల్ల సంఘర్షణ నుంచి విముక్తి కలుగుతుంది. సంఘర్షణ నుంచి విముక్తి కలగటంతో సమైక్యత ఏర్పడుతుంది.