Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఒంటరితనం

వికీసోర్స్ నుండి

42. ఒంటరితనం

ఆవిడ కొడుకు ఈ మధ్యనే పోయాడుట. ఇప్పుడేం చెయ్యాలో తెలియటం లేదు అందావిడ. బోలెడు తీరుబడి. ఏమీ తోచదు. అలసట, దుఃఖం. చచ్చిపోతే బాగుండుననుకుంటోంది. కుర్రవాడిని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా తెలివిగా పెంచిందిట. అన్నిటికన్నా మంచి స్కూల్లోనూ, కాలేజిలోనూ చదివించిందిట. కుర్రవాణ్ణి పాడుచెయ్యలేదుట - అవసరమైన ప్రతిదీ ఆతడికిచ్చినప్పటికీ. తన నమ్మకం, ఆశ, అన్నీ అతడిలోనే ఉంచిందిట. తన ప్రేమంతా అతనికే ఇచ్చిందిట - ఇంకొకరెవరూ దాన్ని పంచుకోవటానికి లేరు కనుక. ఆవిడా, ఆవిడ భర్తా చాలాకాలం క్రిందటే విడిపోయారుట. ఆవిడ కొడుకు చనిపోవటం - అతని జబ్బుని తిన్నగా కనిపెట్టకపోవటం వల్లా, ఆపరేషను సరిగ్గా చెయ్యకపోవడంవల్లా అని చెప్పింది. "డాక్టర్లు ఆపరేషను విజయవంతమైందనే అన్నారు" అంది చిరునవ్వుతో. ఇప్పుడు ఆవిడ ఒంటరిగా మిగిలింది. జీవితం వ్యర్ధంగా అర్థశూన్యంగా కనిపిస్తోందిట. అతడు పోయినప్పుడు ఎంతో ఏడ్చిందిట. ఇప్పుడిక కన్నీళ్లు మిగలలేదుట - మందకొడిగా అలసటగా ఉండే శూన్యత తప్ప. తమ ఇద్దరి గురించీ ఎన్నో ఆలోచించి ఉంచిందిట. ఇప్పుడు అంతా పోగొట్టుకుంది.

సముద్రం మీంచి గాలి చల్లగా హాయిగా వీస్తోంది. చెట్టు క్రింద ప్రశాంతంగా ఉంది. పర్వతాల మీద రంగులు స్పష్టంగా ఉన్నాయి. నీలిరంగు పాల పిట్టలు తెగకూస్తున్నాయి. ఆవూ, దూడా కలిసి తిరుగుతున్నాయి. ఉడత ఒకటి చర్రుమని చెట్టుమీదికి పాకింది - కిచకిచ మంటూ. ఒక కొమ్మమీద కూర్చుని అరవటం మొదలుపెట్టింది. ఆ అరవటం చాలాసేపు సాగించింది తోక పైకీ క్రిందికీ ఆడిస్తూ. దాని కళ్లు తెగమెరుస్తున్నాయి. కాలిగోళ్ళు వాడిగా ఉన్నాయి. ఒక బల్లి వెచ్చదనం కోసం బయటికి వచ్చి ఓ ఈగని పట్టుకుంది. చెట్లపైనున్న కొమ్మలు నాజూగ్గా ఊగుతున్నాయి. ఎండిపోయిన చెట్టొకటి నిటారుగా ఉండి, వెనుక ఆకాశం కనిపిస్తూ అద్భుతంగా ఉంది. సూర్యుడి ఎండకి అది తెల్లబడిపోతోంది. దాని ప్రక్కన మరో ఎండిన చెట్టుంది - నల్లగా, వంకరగా. ఈ మధ్యనే చచ్చిపోయినట్లుంది. దూరాన పర్వతాల మీద మేఘాలు కొన్ని నిలిచిపోయాయి.

ఒంటరితనం ఎంత విచిత్రమైనది, ఎంత భయంకరమైనది! దానికి మరీ దగ్గరగా వెళ్ళడానికి ఎప్పుడూ ఒప్పుకోము. ఒకవేళ ప్రమాదవశాత్తూ వెళ్ళినా తొందరగా పారిపోయి వచ్చేస్తాం. ఒంటరితనం నుంచి పారిపోవడానికీ, దాన్ని కప్పిపుచ్చడానికీ ఏమైనా చేస్తాం. వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ మనం చేసేది దాన్ని తప్పించుకోవడమో, లేదా దాన్ని నెగ్గుకురావడమోననిపిస్తుంది. ఒంటరితనాన్ని తప్పించుకోవడం, జయించడం - రెండూ వృథాయే. అణచిపెట్టి ఉన్నా, నిర్లక్ష్యం చేయబడినా ఆ బాధ, ఆ సమస్య అలాగే ఉంటుంది. జన సమూహంలో పడి మిమ్మల్ని మీరు తప్పించుకోవచ్చు. అయినా చెప్పలేనంత ఒంటరిగా ఉంటారు. తీవ్రంగా పనిచేస్తూ ఉండవచ్చు. కాని ఒంటరితనం మిమ్మల్ని ఆవరిస్తుంది. పుస్తకం మూసెయ్యండి. అది అక్కడే ఉంటుంది. వినోదాలూ, తాగుళ్ళూ అయిపోయిన తరవాత ఒంటరితనపు భయం తిరిగి వస్తుంది. మీరెంతో ఆకాంక్షతో పైకి రావచ్చు. ఇతరులపైన మీకెంతో అధికారం ఉండొచ్చు. జ్ఞాన సంపద మెండుగా ఉండొచ్చు. ఆరాధనలో, వ్యర్ధ పూజా పునస్కారాల్లో మిమ్మిల్ని మీరు మరిచిపోవచ్చు. మీ ఇష్టం వచ్చినది చెయ్యండి. ఒంటరితనం బాధ కొనసాగుతూనే ఉంటుంది. మీ కొడుకు కోసమే, మీ గురువు కోసమే, మీ సహజ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కోసమే మీరు బ్రతుకుతూ ఉండొచ్చు. అయినా ఒంటరితనం బాధ కొనసాగుతూనే ఉంటుంది. అయినా ఒంటరితనం అలాగే నిరీక్షిస్తూ, పరికిస్తూ, వెనక్కి ముడుచుకుంటూ, మళ్ళీ ముందుకి సమీపిస్తూ ఉంటుంది.

ఒంటరితనం పూర్తిగా వేరైపోవడాన్ని తెలియజేస్తుంది. మన కార్యకలాపాలన్నీ స్వార్థపూరితమైనవి కాదా? మన సంబంధాల్లో, మన హక్కుల్లో, ఆస్తిపాస్తుల్లో ఆధిక్యాన్ని కోరడం లేదా? ఆ విధంగా ప్రతిఘటనని సృష్టించడం లేదా? పనిని "నీది" అనీ, "నాది" అనీ చూడటం లేదా? మనం ఒక సంఘంతో, ఒక దేశంతో, కొద్దిమందితో ఏకమై ప్రత్యేకించుకోవడం లేదా? మనల్ని మనం ప్రత్యేకించుకునే ధోరణి విభజించడానికీ, వేరు చేయడానికీ కాదా? అసలు ఆత్మ కార్యకలాపమే ఏ స్థాయిలోనైనా ప్రత్యేకించుకొనేదే. ఒంటరితనం అనేది ఏ విధమైన కార్యకలాపమూ లేని వ్యక్తి స్వీయ చైతన్యావస్థ. ఏ కార్యకలాపమైనా, శారీరకమైనదైనా, మానసికమైనదైనా స్వీయ విస్తరణకి అంటే స్వప్రయోజన విస్తరణకి మార్గం అవుతుంది. ఏ విధమైన కార్యకలాపమూ లేనప్పుడు తన లోపలి శూన్యత తెలిసివస్తుంది. ఈ శూన్యాన్నే మనం నింపటానికి ప్రయత్నిస్తాం. ఆ నింపటంలోనే మన జీవితాన్ని గడుపుతాం - ఉదాత్తంగానో, నీచంగానో. ఉదాత్తస్థాయిలో నింపటం వల్ల సాంఘికంగా ఏ విధమైన హానీ లేనట్లు కనిపించవచ్చు. కాని, భ్రమ చెప్పలేనంత దుఃఖాన్నీ, వినాశాన్నీ పెంపొందిస్తుంది - అది తక్షణం కాకపోవచ్చు. ఈ శూన్యాన్ని నింపాలనే తాపత్రయం, లేదా దాన్నుంచి పారిపోవాలనుకునేది - ఏదైనా ఒకటే - దాన్ని పవిత్రం చెయ్యటానికి గాని, అణచిపెట్టటానికి గాని సాధ్యం కాదు. ఆ అణచిపెట్టే, పవిత్రం చేసే రూపం ఏమిటి? ఆ రూపం కూడా మరోరకమైన తాపత్రయమే కాదా? వేటికోసం తాపత్రయపడతామో అవి మారవచ్చు. కాని, అన్ని తాపత్రయాలూ ఒకలాంటివే కాదా? మీ తాపత్రయం తాగుడు నుంచి కాల్పనిక ప్రక్రియకి మారవచ్చు. కాని, ఈ తాపత్రయపు ప్రక్రియని అర్థం చేసుకోకపోతే భ్రమ అనివార్యమవుతుంది.

తాపత్రయం కాని వేరే రూపం ఏదీ లేదు. తాపత్రయమే ఉంటుంది. తాపత్రయపడేది అంటూ ఏదీ ఉండదు. తాపత్రయం వివిధ ముఖరూపాలను వివిధ సమయాల్లో ధరిస్తుంది. - ఆ వివిధ ఆసక్తుల జ్ఞాపకాలు మరో కొత్తదానితో కలిసినప్పుడు సంఘర్షణ బయలుదేరుతుంది. ఆ విధంగా ఎంచుకునేది ఒకటి పుట్టుకొస్తుంది - తాను తాపత్రయంతో సంబంధం లేని వేరే జీవినన్నట్లు స్థిరపరుచుకుంటుంది. కాని, ఆ జీవికీ, దాని లక్షణానికీ భేదం లేదు. శూన్యతనీ, అసంపూర్ణతనీ, ఒంటరితనాన్నీ నింపటానికి గాని, దాన్నుంచి పారిపోవటానికి గాని ప్రయత్నించే జీవీ, దేన్నుంచి పారిపోతుందో అదీ, వేరువేరు కాదు. ఆ జీవే అది. తన నుంచి తానే పారిపోలేదు. అది చేయగలిగినదల్లా తన్నుతాను అవగాహన చేసుకోవటమే. తనే ఒక ఒంటరితనం, తన శూన్యత. అది వేరు, తను వేరు అనుకున్నంతకాలం భ్రమా, అంతులేని సంఘర్షణా ఉంటాయి. తనే తన ఒంటరితనం అని ప్రత్యక్షంగా అనుభవం పొందినప్పుడే భయం నుంచి విముక్తి కలుగుతుంది. ఒక ఊహకి సంబంధించినప్పుడే భయం ఉంటుంది. ఊహ జ్ఞాపకం నుంచి వచ్చే ఆలోచనకి ప్రతిక్రియ. ఆలోచన అనుభవ ఫలితం. శూన్యత గురించి అది ఆలోచించగలిగినా, దాని గురించి అనుభూతులు కలిగినా, శూన్యతని ప్రత్యక్షంగా తెలుసుకోలేదు. ఆ "ఒంటరితనం" అనే శబ్దం, దాని బాధాకరమైన, భయంకరమైన జ్ఞాపకాలూ దాన్ని సరికొత్తగా అనుభవం పొందనియ్యవు. మాట అనేది జ్ఞాపకం. మాటకి ప్రాముఖ్యం లేనప్పుడు అనుభవించేదానికీ, అనుభవింపబడేదానికీ మధ్య సంబంధం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అప్పుడు ఆ సంబంధం ప్రత్యక్షంగా కలుగుతుంది. మాట ద్వారా, జ్ఞాపకం ద్వారా కాదు. అప్పుడు, అనుభవించేదే అనుభవం. అప్పుడే భయం నుంచి విముక్తి కలుగుతుంది.

ప్రేమా, శూన్యతా ఒక్కచోట ఉండలేవు. ఒంటరితనం అనే భావం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. మీ శూన్యతని "ప్రేమ" అనే మాట వెనుక దాచుకోవచ్చు. మీరు ప్రేమించే వస్తువు అక్కడింక లేనప్పుడు, దాన్నుంచి ప్రతిక్రియ రానప్పుడు, మీరు మీ శూన్యతని తెలుసుకుంటారు. మీరు నిస్పృహ చెందుతారు. మన నుంచీ, మన అసమర్థత నుంచీ మనమే తప్పించుకోవటానికి మార్గం కోసం "ప్రేమ" అనే పదాన్ని ఉపయోగిస్తాం. మనం ప్రేమించే వాణ్ణి పట్టుకు వదలం. అసూయ పడతాం. దగ్గర లేకుంటే బాధపడతాం. అతను మరణిస్తే మనకి పూర్తిగా మతి పోతుంది. అప్పుడు మరో రూపంలోనో, ఏదో నమ్మకంలోనో, ఇంకేదో ప్రత్యామ్నాయంలోనో సౌఖ్యాన్ని పొందాలని ఆశిస్తాం. ఇదంతా ప్రేమేనా? ప్రేమ ఒక ఊహ కాదు. సాంగత్య ఫలితం కాదు. మనకున్న దుస్థితి నుంచి పారిపోవటానికి ఉపయోగించుకునేది కాదు ప్రేమ. దాన్ని అలా ఉపయోగించినప్పుడు సమస్యల్ని సృష్టిస్తాం. వాటికి పరిష్కారాలుండవు. ప్రేమ ఊహజనితం కాదు. భావం, మనస్సూ ప్రముఖ అంశం కాకుండా ఉన్నప్పుడే నిజమైన దాన్ని అనుభవం పొందటం సాధ్యమవుతుంది.