మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సమైక్యత
74. సమైక్యత
ఆ చిన్న కుక్కపిల్లలు బొద్దుగా శుభ్రంగా ఉన్నాయి. వెచ్చని ఇసుకలో ఆడుకుంటున్నాయి. ఆరున్నాయి అవి. అన్నీ తెల్లగా, మట్టిరంగు మచ్చలతో ఉన్నాయి. తల్లి వాటికి కొంచెం దూరంలో నీడలో పడుకుంది. సన్నగా బక్కచిక్కి ఎంత గజ్జిపట్టి ఉందంటే ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా లేదు. దాని శరీరం నిండా పుళ్లే. కాని తోక ఆడిస్తోంది తన పిల్లల్ని చూసుకుని గర్వంగా. ఓ నెలో ఎంతో తప్ప బ్రతక్కపోవచ్చు. వీధమ్మట తిరుగుతూ మురికి వీధుల్లోనో, గ్రామంలోనో కనిపించినదల్లా ఏరుకుంటూ ఆకలితో ఎప్పుడూ ముందుకి ఉరికే కుక్కల్లో అదొకటి. మనుషులు దానిమీదకి రాళ్లు విసురుతూ తలుపు దగ్గరనుంచి తరిమేస్తారు. వాటిని తప్పించుకోవాలి కాని ఇక్కడ నీడలో పాత జ్ఞాపకాలు ఎంతో దూరమై పోయాయి. అలిసిపోయి ఉంది. కుక్కపిల్లల్ని ముద్దు చేసి వాటితో కబుర్లు చెప్పటం జరుగుతోంది. అది మధ్యాహ్నం; విశాలమైన నది మీంచి వచ్చేగాలి స్వచ్ఛంగానూ చల్లగానూ ఉంది. ఆ క్షణంలో తృప్తిగా ఉంది. తరవాత తిండి ఎక్కడ నుంచి వస్తుందన్నది వేరే విషయం. దానికోసం ఇప్పటినుంచీ బాధపడటం ఎందుకు?
గ్రామం అవతల నది ఒడ్డున పచ్చని పొలాలకవతల దుమ్మూ రొదతో ఉండే బాటకి దిగువున ఉన్న ఇంట్లో జనం ఎదురువస్తున్నారు మాట్లడటానికి. అన్నిరకాల వాళ్లూ ఉన్నారు. ఆలోచనాపరులూ, ఆత్రుతలో ఉన్నవారూ, బద్ధకంగా ఉన్నవారూ, నిర్వచనాల ప్రకారం, నిర్ణయాల ప్రకారం జీవించేవారూ, ఆలోచనాపరులు శాంతంగా ఉన్నారు. సమయస్ఫూర్తి ఉన్నవారు మెల్లిగా నసుగుతున్నవాళ్లను చూసి విసుక్కుంటున్నారు. నెమ్మదిగా ఉన్నవాళ్లు తొందరపడేవాళ్లతో కలిసిరావలసి వచ్చింది. అవగాహన మెరుపులా వస్తుంది. మెరుపుకీ మెరుపుకీ మధ్య నిశ్శబ్ద విరామం ఉండాలి. అర్థం చేసుకోవటం మాటల్లో కాదు. మేధా సంబంధమైన అవగాహన అనేది లేదు. మేధా సంబంధమైన అవగాహన మాటల స్థాయిలోనే జరుగుతుంది. ఆలోచనా ఫలితం కాదు అవగాహన. ఆలోచన అనేది మాటల్లో, సంకేతాల్లో, రూపకల్పనా ప్రక్రియలో ఉంటుంది. జ్ఞాపకం లేకుండా ఆలోచన ఉండదు. జ్ఞాపకమే మాట, సంకేతం, మనశ్చిత్రం. ఈ స్థాయిలో అవగాహన కలగదు. రెండుమాటల మధ్య ఏర్పడిన ఖాళీలో మాట ఆలోచనగా రూపొందే లోపున అవగాహన కలుగుతుంది. అవగాహన సమయస్ఫూర్తి ఉన్నవారికి గాని, నెమ్మదిగా ఉన్నవారికి గాని కలుగుతుందని కాదు, అపరిమితమైన ఈ విరామస్థితిని తెలుసుకున్నవారికి మాత్రమే కలుగుతుంది.
"విధ్వంసం అంటే ఏమిటి? ప్రపంచంలోని మానవ సంబంధాల్లోనూ, మనలోనూ కూడా ఈ విధ్వంసం త్వరత్వరగా జరుగుతూండటం చూస్తున్నాం. ఈ ముక్కముక్కలైపోవటాన్ని ఎలా ఆపటం? మనలో సమైక్యత కలగటానికి ఎలా వీలవుతుంది?"
విధ్వంసం జరిగే విధానాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే, సమైక్యత కలుగుతుంది. సమైక్యత మన జీవితంలోని ఒకటి రెండుస్థాయిల్లో మాత్రమే లేదు. అన్నీ కలిసి సమకూడటంలోనే ఉంటుంది. అది జరగగలిగే ముందు, విధ్వంసం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి, వద్దా? సంఘర్షణ విధ్వంసానికి సూచనా? మనం నిర్వచనం కోసం ప్రయత్నించటం లేదు, ఆమాట వెనక ఉన్న అర్థాన్ని తెలుసుకోవటమే.
"పోరాటం అనివార్యం కాదా? బ్రతుకంతా పోరాటమే. పోరాటం లేకపోతే క్షీణత ఏర్పడుతుంది. ఒక లక్ష్యం కోసం నేను పోరాడకపోతే నేను ధ్వంసమైపోతాను. ఊపిరి తీసుకోవటం లాగే పోరాటం కూడా అత్యవసరం."
కచ్చితంగా చెప్పటంతో పరిశీలన అంతా ఆగిపోతుంది. విధ్వంసం అవటానికి సంబంధించిన అంశాలేమిటి అని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం మనం. వాటిలో సంఘర్షణ, పోరాటం ఒకటి కావచ్చు, సంఘర్షణ, పోరాటం అంటే మన ఉద్దేశంలో ఏమిటి?
"పోటీ పడటం, కష్టపడటం, కృషి చెయ్యటం, సాధించాలనే ఇచ్ఛ, అసంతృప్తి మొదలైనవి."
పోరాటం బ్రతుకులోని ఒక స్థాయిలోనే కాదు, అన్ని స్థాయిల్లోనూ ఏదైనా అవుతూ ఉండటం పోరాటం కాదా? గుమాస్తా యజమాని అవటం, పూజారి మతగురువు అవటం, శిష్యుడు గురువు అవటం - ఇలా మానసికంగా అవటమే కృషి, పోరాటం.
"ఈ అవటం అనేది లేకుండా ఉండగలమా? అదొక అవసరం కాదా? సంఘర్షణ నుంచి ఎవరైనా విముక్తి ఎలా పొందగలరు? ఈ కృషికి వెనక భయం లేదా."
మనం కేవలం మాటల్లోనే కాక అనుభవంలో ఈ విధ్వంసం ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం, అంతేకాని, సంఘర్షణ నుంచి ఎలా ముక్తిపొందటమా, దాని వెనక ఏముందా అని కాదు. జీవించటం, అవటం అనేవి రెండు వేరువేరు స్థితులు, కావా? బ్రతకటానికి కృషి అవసరం కావచ్చు. కాని మనం అవటం అనే ప్రక్రియ గురించి విచారిస్తున్నాం, ఇంకా బాగా అవాలని, ఏదో అవాలని పొందే మానసిక తపన, ఉన్నస్థితిని దానికి విరుద్ధంగా మార్చటానికి జరిగే పోరాటం. మానసికంగా అవాలనుకోవటం వల్లనే మన దైనందిన జీవితం బాధాకరంగా పోటీతో కూడినదిగా, ఒక పెద్ద సంఘర్షణగా తయారవుతోందేమో. అవటం అంటే మనం అర్థం చేసుకున్న దేమిటి? పూజారి దేవాలయాధికారి అవాలనుకోవటం, శిష్యుడు గురువు అవాలనుకోవటంలాగ మానసికంగా అవాలనుకోవటం. ఈ అవాలనుకునే ప్రక్రియతో కృషి జరుగుతుంది. వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని, ఉన్న స్థితిని ఇంకోలా మార్చాలనే పోరాటమే ఇది. కాదా? నేను ఇది, నేను అది అవాలనుకుంటున్నాను. ఈ అవటంలో అనేక సంఘర్షణలు ఉంటాయి. ఒకదాని తరవాత మరొకటి. అది అయిన తరవాత మరొక అది, దాని తరవాత మరొకటి, అనంతంగా ఉంటుంది. ఈ ఇది అది అవటం అనేదానికి అంతం లేదు. అందుచేత, సంఘర్షణ అనంతమవుతుంది. నేను ఉన్నట్లుగా కాకుండా వేరుగా ఎందుకవాలనుకుంటున్నాను?
"మనం ప్రభావితం కావటం వల్లా, సాంఘిక ప్రభావాల వల్లా, మన ఆదర్శాల వల్లా. మనం చెయ్యగలిగిందేమీ లేదు. అది మన స్వభావం."
మనం చెయ్యగలిగిందేమీ లేదు అనేసరికి చర్య ముగిసిపోతుంది. బద్ధకంగా ఉండే మనస్సే ఇలా ఉద్ఘాటించి బాధని భరిస్తూ ఉంటుంది. అది తెలివి తక్కువతనం. మనం అ విధంగా ఎందుకు ప్రభావితం అయి ఉన్నాం? మనల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? మనం ప్రభావితం కావటానికి తలవొగ్గుతాం కాబట్టి మనమే ఆ ప్రభావాలను తయారుచేస్తాం. మనం ఇది అయి ఉన్నప్పుడు అది అవటానికి పోరాటం సలిపేలా చేసేది ఆదర్శమా? లక్ష్యమూ, ఆదర్శ స్థితీనా సంఘర్షణ కల్పించేది? ఒక లక్ష్యం కోసం పోరాటం జరపకపోతే మనం ధ్వంసం అయిపోతామా?
"నిస్సంశయంగా నిలవుండిపోతాం, చెడునుంచి మరింత చెడుగా అవుతాం. నరకంలో పడటం సులభం, స్వర్గాన్ని అధిరోహించటం కష్టం." మళ్లీ మనకి ఊహలు, ఉద్దేశాలూ, ఏమవుతుందోననేదాన్ని గురించి, అంతేకాని జరిగేదాన్ని ప్రత్యక్షంగా అనుభవించం. ఊహలు అవగాహనకి అడ్డు తగుల్తాయి - నిర్ణయాలూ, సమర్ధనల్లాగే. ఊహలూ, ఆదర్శాలూ మనం సాధించటానికీ, అవటానికీ పోరాడేటట్లు చేస్తున్నాయా? నేను ఇది, ఆదర్శం నన్ను అది అవటానికి పోరాడేటట్లు చేస్తుందా? ఆదర్శమే సంఘర్షణకి కారణమా? ఆదర్శం ఉన్న స్థితికి పూర్తిగా విరుద్ధమైనది కాదా? అది పూర్తిగా వేరైనదైతే, దానికీ ఉన్నస్థితికీ సంబంధం ఉండదు, అలాంటప్పుడు ఉన్నస్థితి ఆదర్శంలా కాలేదు. అవటానికి ఉన్నస్థితికీ, ఆదర్శానికీ గానీ లక్ష్యానికి గాని సంబంధం ఉండాలి. ఆదర్శం మనం పోరాడేలా ప్రోత్సహిస్తుందంటున్నారు మీరు. అంచేత ఆదర్శం ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఆదర్శం మనస్సు కల్పించినది కాదా?
"నేను మీలా ఉండాలనుకుంటున్నాను. అది కల్పితమా?"
నిశ్చయంగా. మనస్సులో ఒక భావం కలుగుతుంది. సంతోషకరమైనది కావచ్చు. అది అ భావం లాగ ఉండాలనుకుంటుంది. అదే మీ కోరికకి రూపకల్పన చేయటం. మీరు ఇది. ఇది మీకు ఇష్టం లేదు. మీరు అది అవానుకుంటున్నారు. మీ కిష్టమైనది అది. ఆదర్శం స్వయం కల్పితమే. దానికి వ్యతిరేకంగా ఉన్నస్థితి విస్తృతం కావటం. అది వ్యతిరేకమైనది కానేకాదు. ఉన్నస్థితి కొనసాగుతూ ఉండటమే, కొన్ని మార్పులతో కావచ్చు. కల్పన స్వయం ఇచ్ఛానుసారంగా జరిగినది. ఆ కల్పిత రూపాన్ని చేరుకోవటానికి జరిపే పోరాటమే సంఘర్షణ. ఉన్నస్థితి ఆదర్శరూపాన్ని కల్పించుకుని దాని కోసం పోరాటం సల్పుతుంది. ఈ పోరాటాన్నే అవటం అంటున్నాం. ఈ సంఘర్షణ ఉన్నస్థితి తను కాని స్థితిలాగ అవటానికి ప్రయత్నించటమే. కాని స్థితి ఆదర్శమూ, స్వయం కల్పితమూ. మీరు ఏదో అవాలనుకుని కష్టపడుతున్నారు. కాని, ఆ ఏదో అన్నది మీలోని భాగమే. ఆదర్శం మీరు కల్పించినదే. మీ మనస్సు మీమీద ఎలా చమత్కారం చేసిందో చూడండి. మీరు మాటలకోసం కష్టపడుతున్నారు. మీరు కల్పించినదాన్నే, మీ నీడనే వెంటాడుతున్నారు. మీరు హింసాత్మకంగా ఉన్నారు. అహింసాయుతంగా అవాలని పోరాటం సల్పుతున్నారు. అది ఆదర్శం. ఆదర్శం ఉన్నస్థితికి కల్పితరూపమే, మరో పేరుతో - అంతే. ఈ పోరాటం అవసరమనీ, ఆధ్యాత్మికమనీ, అభివృద్ధిదాయకమనీ, ఇంకా ఎన్నో అనుకుంటున్నారు. కాని, అదంతా మనఃపంజరంలో ఉన్నదే, భ్రాంతికి దారితీసేదే.
మీమీద మీరే ప్రయోగించుకునే ఈ చమత్కారాన్ని మీరు తెలుసుకుని ఉంటే అసత్యం అసత్యంగా గోచరిస్తుంది. భ్రాంతికోసం పోరాటం జరపటమే విధ్వంస కారకం. సంఘర్షణ అంతా, అవటం అంతా విధ్వంసమే. మనస్సు తనపై తాను ప్రయోగించుకున్న చమత్కారాన్ని తెలుసుకొన్నప్పుడు - అప్పుడు ఉన్నస్థితి మాత్రమే ఉంటుంది. అవటం అంతటినీ, ఆదర్శాలన్నిటినీ, పోల్చుకోవటాన్నీ, ఖండించటాన్నీ మనస్సు నుంచి జారవిడిచినప్పుడు, దాని నిర్మాణమే కూలిపోయినప్పుడు ఉన్నస్థితిలో సంపూర్ణ పరివర్తన కలుగుతుంది. ఉన్నస్థితికి పేరు పెట్టినంతకాలం, దానికీ మనస్సుకీ సంబంధం ఉంటుంది. ఈ పేరు పెట్టటం అనే ప్రక్రియ అంటే, జ్ఞాపకం. మనస్సు నిర్మాణమే లేనప్పుడు ఉన్నస్థితి ఉండదు. ఈ పరివర్తనలోనే సమైక్యత ఉంటుంది.
సమైక్యత ఇచ్ఛా పూర్వకమైన క్రియకాదు. సమైక్యం అయే విధానం కాదు. విధ్వంసం లేనప్పుడు, అవటానికై సంఘర్షణ, పోరాటం లేనప్పుడు - అప్పుడు మాత్రమే మొత్తంగా ఉండటం అనేది, సంపూర్ణంగా ఉండటం అనేది జరుగుతుంది.