Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/భయం, తప్పించుకునే మార్గం

వికీసోర్స్ నుండి

75. భయం, తప్పించుకునే మార్గం

మేము క్రమంగా అధిరోహిస్తున్నాం కదలిక అనేది తెలియకుండా. మా క్రింద పెద్ద మేఘాల సముద్రం. కంటికి కనిపించినంత మేరా తెల్లగా మెరిసే తరంగాలు ఒకదానిపైనొకటి ఎంతో స్థిరంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. మధ్య మధ్య ఒక చుట్టు తిరిగి మరింతపైకి ఎక్కుతున్నాం. ఈ కాంతివంతమైన మరుగులో మధ్య మధ్య ఖాళీలున్నాయి. బాగా దిగువున పచ్చని భూమి. మా పైన నిర్మలంగా ఉన్న శీతాకాలపు నీలాకాశం, మృదువుగా, అనంతంగా ఉంది. మంచు నిండిన పర్వతశ్రేణి ఉత్తరం నుంచి దక్షిణందాకా పరుచుకుని ఉంది తీక్షణమైన సూర్యకాంతిలో మెరుస్తూ. ఈ పర్వతాలు పధ్నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. వాటికన్నా పైకి లేచి ఇంకా ఎక్కుతున్నాం. అది పరిచితమైన శిఖర శ్రేణి. ఎంతో సమీపంగా, నిర్మలంగా ఉన్నాయి. మేం దక్షిణంవైపు దూసుకువెళ్ళాం, చేరవలసిన ఇరవైవేల అడుగుల ఎత్తుకి చేరిన తరవాత.

పక్కన కూర్చున్న ప్రయాణీకుడు తెగమాట్లాడతాడు. ఆయనకి ఆ పర్వతాలు అపరిచితమైనవి. మేము పైకెక్కుతున్నప్పుడు ఆయన కునుకుతీశాడు. ఇప్పుడు మేలుకొని మాట్లాడటానికి ఆత్రుత పడుతున్నాడు. వ్యాపారం గురించి మొదటిసారిగా విదేశాలు వెడుతున్నట్లుంది. ఆయనకి ఎన్నింటిమీదో ఆసక్తి. వాటి గురించి బాగా తెలిసినట్లే మాట్లాడాడు. మా క్రింద ఇప్పుడు సముద్రం ఉంది దూరాన నల్లగా. కొన్ని ఓడలు ఇక్కడా అక్కడా చుక్కలు పెట్టినట్లు ఉన్నాయి. దాని ఒడ్డుమీదుగా దీపాలతో వెలుగుతున్న ఒక్కొక్క నగరం దాటాం. రెక్కలు తొణకనైనా లేదు. భయం లేకుండా ఉండటం ఎంత కష్టమో చెబుతున్నాడాయన - ఒక్క కూలిపోవటం గురించే కాదు, జీవితంలో జరిగే దుర్ఘటనలన్నిటి గురించీ. ఆయనకి వివాహమైంది. పిల్లలున్నారు. ఎప్పుడూ భయమే - భవిష్యత్తు గురించే కాదు, మొత్తంమీద అన్నింటికీ. ఆ భయానికి ప్రత్యేక కారణం లేదు. ఎంతో విజయం సాధించినా, ఈ భయం ఆయన జీవితాన్ని శక్తిహీనంగా బాధామయంగా చేస్తున్నదిట. అసలు ఆయనకి ఎప్పుడూ భయమే, కాని ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంటున్నదిట. భయంకరమైన కలలు కూడ వస్తున్నాయట. ఆయన భయం గురించి భార్యకి కూడ తెలుసుట. కాని అది ఎంత తీవ్రంగా ఉన్నదో మాత్రం ఆవిడకి తెలియదుట.

భయం అనేది దేనికైనా సంబంధించే ఉంటుంది. ఊహా రూపంలో అది ఒక మాట మాత్రమే. భయం అనేమాట నిజమైన భయం కాదు. మీకు ప్రత్యేకంగా దేన్ని గురించి భయమో తెలుసునా?

"ఫలానా అని ఎప్పుడూ తెలుసుకోలేకపోతున్నాను. నా కలలు కూడా అస్పష్టంగానే ఉంటున్నాయి. వాటన్నిటిలోనూ ఉండేది భయమే. స్నేహితులతోనూ, వైద్యులతోనూ ఆ విషయం మాట్లాడాను. వాళ్లు నవ్వేసైనా ఊరుకున్నారు. లేదా, ఏవిధంగానూ సహాయపడనైనా లేదు. అంతా మాయగా ఉంది. ఈ భయంకరమైన స్థితినుంచి విముక్తి పొందాలని కోరిక."

మీరు నిజంగా విముక్తి పొందాలనుకుంటున్నారా, లేక ఊరికే అంటున్నారా?

నేను యథాలాపంగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు మీకు. ఈ భయం పోవటానికి ఏమైనా చేస్తాను. "నేను అంత దైవభక్తి ఉన్నవాణ్ణి కాదు, కాని, అది నాలో లేకుండా చెయ్యమని దేవుని ప్రార్థించాను కూడా. నేను పనిలోనో, ఆటల్లోనో ఆసక్తికరంగా ఉన్నప్పుడు అది ఉండదు. కాని భీకర మృగం లాగ ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలోనే నాతో కూడా ఉంటుంది మళ్ళీ."

ఇప్పుడు మీకా భయం ఉందా? అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుస్తోందా? ఆ భయం వ్యక్తంగా ఉందా? నిగూఢంగా ఉందా?

"ఉందన్న అనుభూతి కలుగుతుంది. కాని అది వ్యక్తంగా ఉందో, అవ్యక్తంగా ఉందో తెలియదు."

ఎంతో దూరంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుందా, దగ్గరలో ఉన్నట్లా - కైవారంలో, దూరం దృష్టిలో కాదు, భావన రూపంలో?

"దాన్ని గురించి తెలుస్తున్నప్పుడు ఎంతో దగ్గరలో ఉన్నట్లుంటుంది. కాని దానికీ దీనికీ ఏమిటి సంబంధం?"

దేనితోనైనా సంబంధం ఉన్నప్పుడే భయం కలుగుతుంది. అది మీ కుటుంబం, మీపనీ, మీ భవిష్యత్తు గురించీ, మరణం గురించీ ఆలోచిస్తూ ఉండటం, ఏదైనా కావచ్చు. మీకు మరణం అంటే భయమా?

"ప్రత్యేకంగా లేదు. అయితే, చాలాకాలం తీసుకోకుండా త్వరగా చచ్చిపోవాలని మాత్రం ఉంది. నా కుటుంబం గురించి గాని, నా ఉద్యోగం గురించి గాని. నాకు ఆదుర్దా లేదు."

అలా అయితే, పైపై సంబంధాలు భయానికి కారణం కానట్లయితే, ఏదో లోలోపలిదై ఉండాలి. అదేమిటో సూచించవచ్చు ఎవరైనా. కాని, దాన్ని మీ అంతట మీరే తెలుసుకోగలిగితే దానికి మరింత విలువ ఉంటుంది. పైపై సంబంధాల గురించి మీరు ఎందువల్ల భయపడటంలేదు? "నాకు నా భార్యకీ పరస్పర ప్రేమ ఉంది. తను ఇంకో మగవాడి వైపు చూడాలని కూడా అనుకోదు. నేను పరస్త్రీలవైపు ఆకర్షితుణ్ణి కాను. మేము ఒకరితో ఒకరం పరిపూర్ణతను పొందుతాం. పిల్లలగురించి ఆదుర్దా ఉంటుంది. చెయ్యగలిగిందంతా చేస్తాం. ఆర్దికంగా ఈనాటి గందరగోళంలో వాళ్ళకి ధనరక్షణ ఎవ్వరూ కల్పించలేరు. వాళ్ళకి చేతనైన బాగు వాళ్ళు చేసుకోవాలి. నా ఉద్యోగం సురక్షితంగా ఉంటుంది. కాని నా భార్యకి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చుననే భయం ఉండటం సహజం."

అందుచేత మీరు మీ ప్రగాఢ బాంధవ్యం గురించి నిశ్చయంగానే ఉన్నారు. ఎందువల్ల అంత నిశ్చయంగా ఉన్నారు?

"నాకు తెలియదు. ఉన్నానంతే. కొన్ని విషయాలు అలాగే ఉంటాయనుకోవాలి. ఉండవా?"

అదికాదు అసలు విషయం. మనం దాన్ని గురించి తెలుసుకుందామా? మీ అంతరంగిక సంబంధం గురించి దేనివల్ల మీరు అంత నిశ్చయంగా ఉన్నారు? మీరూ మీ భార్యా ఒకరితో ఒకరు సంపూర్ణతని పొందుతున్నారని మీరు అనటంలో అర్థం ఏమిటి?

"ఒకరివల్ల ఒకరం పరస్పరం ఆనందం పొందుతున్నాం; తోడుగా ఉండటం, అర్థం చేసుకోవటం, ఇలా. గాఢంగా ఆలోచిస్తే మేం ఒకరిమీద ఒకరం ఆధారపడుతున్నాం. మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా అది పెద్ద ఆఘాతం అవుతుంది. ఆ ఉద్దేశంలో మేము పరస్పరం ఆధారపడి ఉన్నాం."

"ఆధారపడటం" అనేదానికి మీరు చెప్పే అర్థం ఏమిటి? ఆవిడ లేకపోతే మీరు తప్పిపోయినట్లుగా అవుతారనీ, ఒంటరిగా ఉన్నట్లు భావన కలుగుతుందనీనా? అదేనా? ఆవిడకూడా అలాగే భావిస్తారు. అందుచేత మీరు ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నారు.

"అందులో తప్పేముంది?"

మనం నిరసించటం లేదు. నిర్ణయించటం లేదు. పరిశీలిస్తున్నాం. అంతే. ఇదంతా తెలుసుకోవాలని మీరు నిజంగా అనుకుంటున్నారా? సరే. అయితే తెలుసుకుందాం. మీ భార్య లేకపోతే మీరు ఒంటరిగా అయిపోతారు. నిశితంగా చూస్తే మీరు తప్పిపోయినట్లవుతారు. ఆవిడ మీకు అత్యవసరం, కారా? మీ ఆనందం కోసం ఆవిడపైన ఆధారపడుతున్నారు. ఈ ఆధారపడటాన్నే ప్రేమ అంటున్నారు. మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారు. మీ ఒంటరితనాన్ని కప్పిపుచ్చటానికి ఆవిడ ఎప్పుడూ ఉన్నారు, మీరు ఆవిడకి ఉన్నట్లు. కాని ఆ యథార్థం ఇంకా అలాగే ఉంది, కాదా? ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి మనం ఒకరినొకరు ఉపయోగించుకుంటాం. అనేక మార్గాల్లో దాన్నుంచి తప్పించుకుంటాం వివిధ బాంధవ్యరూపాల ద్వారా. అటువంటి ప్రతి బాంధవ్యం ఒక ఆధారం అవుతుంది. సంగీతం నాకు ఆనందాన్నిస్తుంది. కాబట్టి రేడియో వింటాను. అది నానుంచి నన్ను దూరంగా తీసుకుపోతుంది. పుస్తకాలూ, జ్ఞానం కూడా నానుంచి నేను పారిపోయేందుకు ఎంతో వీలైన మార్గాలు. వీటన్నిటి మీదా ఆధారపడతాం.

"నా నుంచి నేను ఎందుకు తప్పించుకోకూడదు? నేను గర్వపడేందుకేమీ లేదు నాలో. నా భార్యతో ఐక్యం అయితే, ఆవిడ నాకన్న ఎంతో నయం కనుక, నన్ను నేను తప్పించుకుంటాను."

నిజమే. మూడొంతుల మంది అలాగే తమ్ముతాము తప్పించుకుంటారు. కాని మిమ్మల్ని మీరు తప్పించుకోవటం వల్ల మీరు ఆధారపడుతున్నారు. ఆధారపడటం అంతకంతకు ఎక్కువవుతుంది. పారిపోయే మార్గాలు మరింత అత్యవసరమవుతాయి, ఉన్నస్థితి అంటే ఉండే భయానికి తగినట్లుగా. భార్య, పుస్తకం, రేడియో అత్యంత ముఖ్యంఅవుతాయి. పారిపోయే మార్గాలు అతి ముఖ్యం, అతి విలువైనవి అయిపోతాయి. నన్ను నేను తప్పించుకుపోవటానికి నా భార్యని ఉపయోగించుకుంటాను. అందువల్లనే ఆవిడపై మమత. ఆవిణ్ణి సొంతం చేసుకోవాలి. ఆవిణ్ణి పోగొట్టుకోకూడదు. ఆవిడ కూడా మీ సొంతం అవాలనుకుంటుంది. ఆవిడ కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు కనుక. తప్పించుకునే అవసరం ఇద్దరికీ ఉంది. ఒకరినొకరు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఉపయోగించుకోవటాన్నే ప్రేమ అంటారు. మీరు ఉన్నట్లుగా మీకిష్టం లేదు. అందుచేత ఉన్నస్థితి నుంచి, అంటే మీ నుంచి మీరు పారిపోతున్నారు. "అది స్పష్టమైంది. అందులో ఏదో ఉందని గ్రహిచాను. అది సబబుగానే ఉంది. కాని పారిపోవటం ఎందుకు? దేన్నుంచి పారిపోవటం?"

మీ ఒంటరితనం నుంచి, మీ శూన్యత నుంచి, మీరున్న స్థితి నుంచి. ఉన్నస్థితిని చూడకుండా మీరు పారిపోతే దాన్ని నిజంగా మీరు అర్థం చేసుకోలేరు. అందుచేత ముందు మీరు పారిపోవటం, తప్పించుకోవటం ఆపెయ్యాలి. అప్పుడే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోగలుగుతారు. మీరు ఎప్పుడూ దాన్ని విమర్శిస్తూంటేనూ, దాన్ని ఇష్టపడితేనూ, అసహ్యించుకుంటేనూ దాన్ని గమనించలేరు. దాన్ని మీరు ఒంటరితనం అని చెప్పి, దాన్నుంచి పారిపోతారు. ఉన్నస్థితి నుంచి పారిపోవటమే భయం. ఈ ఒంటరితనం అంటేనూ, ఈ శూన్యత అంటేనూ భయపడుతున్నారు మీరు. ఆధారపడటం దాన్ని కప్పి ఉంచటానికే. అందుచేత అది నిత్యం ఉంటుంది. దాన్ని పూర్తిగా దేనితోనో ఐక్యం చేసుకోవటం వల్ల ఒక మనిషితో గాని, ఊహతో గాని, పూర్తిగా తప్పించుకు పారిపోగలమన్న హామీ ఉండదు. భయం ఎప్పుడూ వెనకాతలే ఉంటుంది. వేరే దేనితోనూ ఐక్యం చేసుకోకుండా ఉన్నప్పుడు, కలల్లోంచి బయట పడుతూ ఉంటుంది. ఐక్యం కాకుండా మధ్యమధ్య ఆగిపోవటం జరుగుతూ ఉంటుందెప్పుడూ - మతిస్తిమితం లేనివాళ్లయితే తప్ప.

"అయితే, నా భయం నాలోని వెలితివల్లా, నాలోని ఆశక్తి వల్లా వస్తోంది. అది బాగానే తెలిసింది. అది నిజమే. కాని దాన్ని గురించి నేనేం చెయ్యాలి?"

మీరేమీ చెయ్యలేరు. మీరేం చేసినా అది తప్పించుకోవటానికి చేసే కార్యకలాపమే. తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యవిషయం అదే. అప్పుడే గ్రహిస్తారు. మీరూ, ఆ వెలితీ వేరువేరు కాదని. మీరే ఆ అశక్తి. గమనించిన శూన్యతే గమనించేది. ఇంకా ముందుకి సాగండి. దాన్ని ఒంటరితనం అనటం ఉండదు. దానికొక పేరు పెట్టటం ఆగిపోతుంది. ఇంకా ముందుకి సాగండి. అది కొంత కష్టమే. ఒంటరితనం అనేదే ఉండదు. ఒంటరితనం, శూన్యత పూర్తిగా అంతమయిపోతుంది. ఆలోచించేదీ, ఆలోచనా అంతమవుతాయి. ఇదొక్కటే భయాన్ని అంతమొందిస్తుంది.

"అయితే ప్రేమ అంటే ఏమిటి?" ప్రేమ ఐక్యం చేసుకోవటం కాదు; ప్రేమించేవారి గురించి ఆలోచన కాదు. ప్రేమ ఉన్నప్పుడు దాన్ని గురించి ఆలోచించరు. అది లేనప్పుడే మీకూ, మీరు ప్రేమించేదానికి మధ్య దూరం ఉన్నప్పుడే దాన్ని గురించి ఆలోచిస్తారు. ప్రత్యక్ష సంపర్కం ఉన్నప్పుడు ఆలోచన ఉండదు. కల్పితరూపం ఉండదు, పోటీపడే జ్ఞాపకం ఉండదు. సంపర్కం తెగిపోయినప్పుడే, ఏ స్థాయిలోనైనా సరే, ఆ ఆలోచనా ప్రక్రియ, ఊహించటం మొదలవుతుంది. ప్రేమ మనస్సుకి చెందినది కాదు. మనస్సు, ఈర్ష్య, పట్టుకుని వ్రేలాడటం, గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం, పోగొట్టుకోవటం, రేపు గురించి తపించటం - వీటి వల్ల దుఃఖం, ఆదుర్దా అనే పొగ సృష్టింపబడుతుంది. ఈ పొగ జ్వాలని అణచివేస్తుంది. పొగ లేనప్పుడు జ్వాల ఉంటుంది. రెండూ ఒకచోట ఉండలేవు. అవి కలిసి ఉంటాయనే ఆలోచన కేవలం ఇచ్ఛ మాత్రమే. ఇచ్ఛ ఆలోచనా రూపమే. ఆలోచన ప్రేమ కాదు.