Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అందం

వికీసోర్స్ నుండి

73. అందం

గ్రామం మురికిగా ఉంది, కాని ప్రతి గుడిసె చుట్టూ శుభ్రంగా ఉంది. వాకిలి కడిగి రోజూ ముగ్గువేసినట్లుంది. గుడిసె లోపల కూడా పరిశుభ్రంగానే ఉంది, వంటవల్ల వచ్చే పొగ తప్పించి, ఇంటిల్లపాదీ అక్కడే ఉన్నారు - తండ్రీ, తల్లి, పిల్లలు, ఒకముసలావిడ, నాయనమ్మ అయిఉండొచ్చు. అందరూ సంతోషంగా, చిత్రంగా తృప్తిపడుతున్నట్లుగా ఉన్నారు. మాటలద్వారా తెలుసుకోవటం కష్టం. మాకు వాళ్ల భాష రాదు. మేము కూర్చున్నాం. ఎవరికీ ఇబ్బందిగా అనిపించలేదు. వాళ్ల పనులు వాళ్లు చూసుకుంటున్నారు. పిల్లలు దగ్గరికి వచ్చారు. ఒక పిల్లవాడూ, ఒక పిల్లా కూర్చున్నారు చిరునవ్వు నవ్వుతూ. సాయంకాలం భోజనం తయారయినట్లే ఉంది. అంత ఎక్కువగా ఏం లేదు. మేము వెళ్లిపోతూంటే అందరూ బయటికి వచ్చి చూస్తూ నిలబడ్డారు. సూర్యుడు నది మీదికి వచ్చాడు ఒకే ఒక పెద్ద మేఘం వెనుక నుంచి. మేఘం మంటల్లో ఉంది. నీళ్లు అడవి మంటల్లాగా మెరుస్తున్నాయి.

వరుసగా పొడుగునా ఉన్న గుడిసెల మధ్య నుంచి ఒక విశాలమైన దారి ఉంది. ఆ దారికిరువైపులా బాహాటంగా మురికి కాలువలు ఉన్నాయి ఊహించలేనన్ని రకాల పురుగులతో. నల్లటి బురద మీద తెల్లటి పురుగులు పెనుగులాడటం స్పష్టంగా కనిపొస్తోంది. పిల్లలు దారిలో ఆడుకుంటున్నారు, పూర్తిగా ఆటల్లో మునిగిపోయి నవ్వుకుంటూ అరుస్తున్నారు, దారినపోయే వాళ్లని పట్టించుకోకుండా. నది ఒడ్డున కొబ్బరిచెట్లు ఎర్రని ఆకాశంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. పందులూ, మేకలూ, గొడ్లూ గుడిసెల చుట్టూ తిరుగు తున్నాయి. పిల్లలు మేకో, ఆవో అడ్డొస్తే తోలేస్తున్నారు. చీకటి పడుతూంటే గ్రామంలో సద్దుమణుగుతోంది. పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు తల్లులు పిలుస్తూంటే.

ఆ పెద్ద ఇంటి చుట్టూ అందమైన తోట ఉంది, చుట్టూ తెల్లని గోడలతో. తోట రంగురంగుల్లో పూసి ఉంది. బోలెడు డబ్బు ఖర్చుచేసి జాగ్రత్త తీసుకొని ఉండాలి. అత్యంత ప్రశాంతంగా ఉంది. ప్రతీదీ కళకళలాడుతోంది. అ పెద్ద చెట్టు అందం తక్కిన వాటన్నిటి పెరుగుదలకీ రక్షణ కల్పిస్తున్నట్లుగా ఉంది. ఆ నీటి ధార పక్షులకు ఆహ్లాదం గొల్పుతూ ఉండి ఉండాలి. కాని ఇప్పుడు నిశ్శబ్దంగా తనలో తనే పాడుకుంటోంది, ఏ గొడవా లేకుండా ఒంటరిగా ఉండి. రాత్రికి అన్నీ మూసేసుకుంటునట్లుగా ఉన్నాయి.

ఆవిడ నాట్యం చేస్తుంది. సంపాదన కోసం కాదు. ఇష్టం కొద్దీ. ఆవిడ బాగానే నాట్యం చేస్తుందని కొందరి ఉద్దేశం. తన కళ గురించి ఆవిడ గర్వపడుతూ ఉండి ఉండొచ్చు. ఆవిడలో దర్పం ఉంది. తాను సాధించిన దాని గురించిన దర్పమే కాదు, ఆధ్యాత్మికంగా తనకున్న విలువ గురించి కూడా లోలోపల గుర్తింపు ఉన్నట్లుంది. ఇంకెవరైనా బాహ్యవిజయానికి తృప్తి పడినట్లుగానే, తన ఆధ్యాత్మిక పురోగతికి ఆవిడ తృప్తిచెందుతోంది. ఆత్మ పురోగతి చెందటం అంటే ఆత్మవంచన చేసుకోవటమే. కాని, అది చాలా తృప్తికరంగా ఉంటుంది. ఆవిడ నగలు పెట్టుకుని ఉంది. ఆవిడ గోళ్లు ఎర్రగా ఉన్నాయి. పెదవులకు తగిన రంగువేసుకుంది. ఆవిడ నాట్యం చెయ్యటమే కాక, కళగురించీ, అందం గురించీ, ఆధ్యాత్మిక సాధన గురించీ ఉపన్యాసా లిస్తూ ఉంటుంది. స్వాతిశయం, ఆకాంక్షా ఆవిడ ముఖంమీదే కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగానూ, కళాకారిణిగానూ కూడా కీర్తి సంపాదించాలనుకుంటోంది. ఇప్పుడు ఆధ్యాత్మికతే గెలుస్తోంది.

తనకేమీ వ్యక్తిగత సమస్యలు లేవంది. కాని అందం గురించీ, ఆధ్యాత్మికత గురించీ మాట్లాడాలనుకుంటోంది. వ్యక్తిగత సమస్యల్ని లెక్క చెయ్యదుట, ఎంతైనా అవి అర్థరహితమైనవేనని. పెద్ద పెద్ద సమస్యల గురించే విచారిస్తుందిట. అందం అంటే ఏమిటి? అది అంతర్గతమైనదా, బాహ్యమైనదా? ఊహా విషయమూ, వాస్తవిక విషయమా, రెండూ కలిసినదా? తనకు తెలిసినదే నిశ్చయమనుకుంటోంది. నిశ్చయంగా ఉండటమే అందాన్ని కాదనటం. నిశ్చయంగా ఉండటం అంటే సంకుచితంగా అభేద్యంగా ఉండటం. విశాల హృదయం లేకుండా సున్నితత్వం ఎలా ఉంటుంది?

"అందం అంటే ఏమిటి?

ఒక నిర్వచనం కోసం గాని, సూత్రం కోసం గాని ఎదురుచూస్తున్నారా, లేక పరిశీలించాలని కోరుతున్నారా?

"అయితే పరిశీలనకూ సాధనం ఉండనక్కరలేదా? తెలుసుకోకుండా, వివరణల్లేకుండా పరిశీలించటం ఎలా? మనం ఎక్కడికి వెడుతున్నామో తెలుసుకోవాలి కదా వెళ్లే ముందు?"

జ్ఞానం పరిశీలనకి అవరోధం కాదా? మీకు తెలిసినప్పుడు ఇక పరిశీలన ఎలా సాధ్యం? "తెలిసి ఉండటం" అనే పదమే పరిశీలించడం ఆగిపోయిందని సూచించదా? తెలిసి ఉండటమంటే పరిశీలించకపోవటమే. అందువల్ల మీరు కేవలం ఒక నిర్ణయాన్నీ, ఒక నిర్వచనాన్నీ మాత్రమే అడుగుతున్నారు. అందానికి కొలమానం ఉంటుందా? అందం తెలిసిన దాన్నిగాని, ఊహించిన నమూనానిగాని పోలి ఉంటుందా? అందం చట్రం లేకుండా ఉన్న ఊహా చిత్రమా? అందం ప్రత్యేకమైనదా? ప్రత్యేకమైనది సమగ్రమైనది కాగలదా? అంతర్గతంగా స్వేచ్ఛ లేనిదే బాహ్యమైనది అందంగా ఉండగలదా? అందం అలంకారమా? ముస్తాబా? అందాన్ని బయట ప్రదర్శించటం సున్నితత్వాన్ని సూచిస్తుందా? మీరు కోరుతున్నదేమిటి? బాహ్యమైనదీ, అంతరంగికమైనదీ కలిసినదా? అంతరంగికంగా లేకుండా బాహ్యంగా ఎలా ఉండగలదు? దేనికి మీరు ప్రాముఖ్యాన్నిస్తున్నారు?

"నేను రెండింటికీ ప్రాముఖ్యానిస్తున్నాను పరిపూర్ణ రూపం లేనిదే పరిపూర్ణ జీవితం ఎలా ఉండగలదు? బాహ్యమైనదీ, అంతరంగికమైనదీ కలిస్తేనే అందం.

అందుచేత అందంగా అవటానికి మీ దగ్గరొక సూత్రం ఉంది. ఆ సూత్రం అందం కాదు. కేవలం కొన్ని మాటలు మాత్రమే. అందంగా ఉండటం అంటే అందంగా అయే పద్ధతి కాదు. మీరు ప్రయత్నిస్తున్న దేమిటి?

"ఆకారం, ఆత్మ - రెండింటిలోని అందాన్నీ. చక్కని పువ్వుని పెట్టటానికి అందమైన పాత్ర కావాలి."

అంతరంగిక సామరస్యం, దానితో బాటు బాహ్య సామరస్యం సున్నితత్వం లేకుండా ఉండగలవా? అనాకారిగా ఉన్నదాన్ని గాని అందంగా ఉన్నదాన్నిగాని గ్రహించటానికి సున్నితత్వం ముఖ్యావసరం కాదా? అందం అంటే అనాకారితనాన్ని తప్పించుకోవటమా?

"నిశ్చయంగా అంతే."

సద్గుణం అంటే తప్పించుకోవటమూ, ప్రతిఘటించటమూనా? ప్రతిఘటించటంలో సున్నితత్వం ఉంటుందా? సున్నితత్వం స్వేచ్ఛగా ఉండవద్దా? స్వార్థపూరితంగా ఉన్నవారు సున్నితంగా ఉండి, అందాన్ని తెలుసుకోగలరా? ఉన్న స్థితిపట్ల సున్నితంగా, సుకుమారంగా ఉండటం అత్యవసరం కాదా? మనం అందంగా ఉందనే దాన్ని మనతో ఐక్యం చేసుకుని, అనాకారిగా ఉండే దాన్ని తప్పించుకుంటారు. అందమైన తోటతో మనల్ని ఐక్యం చేసుకోవాలని కోరుతూ, దుర్గంధంతో ఉండే గ్రామాన్ని చూడకుండా కళ్లు మూసుకుంటాం. ఒకటి ప్రతిఘటిస్తూ మరొకటి స్వీకరించాలనుకుంటాం. ఐక్యం చేసుకోవటమంతా ప్రతిఘటన కాదా? గ్రామాన్నీ, తోటనీ కూటా ప్రతిఘటించకుండా, ఒకదానితో మరొకదాన్ని పోల్చకుండా వాటిని తెలుసు కోవటమే సున్నితంగా ఉండటమంటే. మీరు అందానికి, సద్గుణానికీ మాత్రమే సున్నితంగా ఉండి, చెడ్డదాన్నీ, అనాకారినీ ప్రతిఘటించాలను కుంటున్నారు. సున్నితత్వం, సుకుమారత్వం మొత్తం ప్రక్రియ. దాన్ని ఒక ప్రత్యేకమైన, తృప్తికరమైన స్థాయిలో తెగకొట్టటానికి వీల్లేదు.

"కాని నేను అందాన్నీ, సున్నితత్వాన్నీ కోరుతున్నాను."

నిజంగానా? అదే అయితే, అందం గురించి ఆలోచించటమంతా మానెయ్యాలి. ఈ ఆలోచనా, ఈ ఆరాధనా, ఉన్నస్థితి నుంచి, అంటే మీనుంచి మీరు పారిపోవాలని చేసే ప్రయత్నం కాదా? మీరు ఏవిధంగా ఉన్నారో, ఉన్నస్థితి ఏమిటో తెలుసుకోకుండా ఉన్నట్లయితే మీరు సున్నితంగా ఎలా ఉండగలరు? అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉన్నవాళ్లూ, నైపుణ్యం ఉన్నవాళ్లూ, అందాన్ని అభిలషించేవాళ్లూ తమస్వయం కల్పిత రూపాలను ఆరాధిస్తారంతే. వాళ్లు పూర్తిగా తమ చుట్టూ తాము ఆవరించుకుని, తమ చుట్టూ గోడ కట్టుకుని ఉంటారు. ఒంటరిగా ఏదీ ఉండలేదు కనుక బాధ కలుగుతుంది. అందం కోసం ఈ అన్వేషణ, కళ గురించి నిరంతరం మాట్లాడుతూ ఉండటం జీవితం నుంచి, అంటే తన నుంచి తానే పారిపోవటానికి గౌరవనీయంగా, ఉన్నతంగా పరిగణింపబడే మార్గం.

"కాని సంగీతం పారిపోయే మార్గం కాదు"

తన్ను తాను అవగాహన చేసుకునేందుకు బదులు దాన్ని అనుసరిస్తే అదీ అంతే. తన్ను తాను అర్థం చేసుకోకపోతే అన్ని కార్యకలాపాలూ గందరగోళానికీ, బాధకీ దారితీస్తాయి. 'నేను' నీ ఆలోచన పనిచేసే పద్ధతుల్నీ అవగాహన చేసుకున్నప్పుడే స్వేచ్ఛ ఏర్పడుతుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే సున్నితత్వం ఉంటుంది.