మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సిద్ధాంతం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

72. సిద్ధాంతం

"ఈ మనస్తత్వం గురించీ, మనస్సులోపల జరిగే కార్యకలాపాల గురించీ మాట్లాడినదంత సమయం వృథా చేయటానికే, జనానిక్కావలసినది పని, తిండి, మొట్టమొదట ఎదుర్కోవలసినది ఆర్థిక పరిస్థితి అని స్పష్టమైనప్పుడు మీరు శ్రోతల్ని ప్రయత్నపూర్వకంగా పెడదారి పట్టించటం లేదా? మీరు చెప్పేదానికి ఆఖరున ప్రయోజనం ఉంటే ఉండొచ్చు. కాని జనం మలమలమాడిపోతూంటే ఈ చెత్తంతా ఏ ప్రయోజనకరం? కడుపు నిండుగా లేకపోతే మీరు ఏమీ ఆలోచించలేరు. ఏమీ చెయ్యలేరు."

గడుపుకు పోవటానికి కడుపులో కొంత ఏదో పడాలన్నది నిజమే. కాని, అందరికీ తిండి దొరకాలంటే మన ఆలోచనా విధానంలోనే మూల పరివర్తన రావాలి. అందువల్లనే మానసిక రంగాన్ని ఎదుర్కోవటం ముఖ్యం. మీకు తిండి సరుకులు తయారుచేయటం కన్న సిద్ధాంతమే ఎంతో ఎక్కువ ముఖ్యం. బీద జనులకి తిండి ఉండాలనీ, వారి గురించి విచారించాలనీ మీరు మాట్లాడవచ్చు. కాని మీరు మీ ఉద్దేశం గురించీ, మీ సిద్ధాంతం గురించే ఎక్కువ విచారించటంలేదా?

"అవును, అదే చేస్తున్నాం. కాని, సామూహిక చర్య తీసుకోవటానికీ, జనాన్ని పోగుచెయ్యటానికీ సాధనం మాత్రమే సిద్ధాంతం. ఒక ఉద్దేశం లేకుండా అందరూ కలిసి పనిచెయ్యటం కుదరదు. ఉద్దేశం, ప్రణాళిక మొదట వస్తాయి. తరవాత ఆచరణ జరుగుతుంది."

ఇందువల్ల మానసిక అంశాలను మీరూ మొదట విచారిస్తున్నారు. వాటిని తరవాత ఆచరించటం జరుగుతుంది అంటున్నారు. అందుకని మానసిక అంశాల గురించి మాట్లాడటం జనాన్ని ప్రయత్నపూర్వకంగా పెడదారిని పట్టించటం అనరు కదా. మీరనేదేమిటంటే, మీదొక్కటే సహేతుకమైన సిద్ధాంతం అనీ, అందుకని ఇంకో దానితో ఇబ్బంది పడటం ఎందుకనీ, కదా? మీ సిద్ధాంతం కోసం అంతా కలిసి చర్య తీసుకోవాలను కుంటున్నారు. అందుకని మానసిక ప్రక్రియ గురించి ఇంకా ఆలోచించటం సమయాన్ని వృథా చేయటమే, అసలు విషయాన్ని వదిలి పెడమార్గాన్ని పట్టడమే అంటున్నారు. మీ ప్రకారం అసలు విషయం వర్గభేదం లేని సమాజాన్ని నెలకొల్పటం, అందరికీ పని కల్పించటం మొదలైనవి.

"మా సిద్ధాంతం విస్తృత చారిత్రాత్మక పరిశోధనా ఫలితం. జరిగిన యథార్థాల ప్రకారం చరిత్రను వ్యాఖ్యానించినది. అది వాస్తవిక సిద్ధాంతం, మతానికి చెందిన మూఢ విశ్వాసాల వంటిది కాదు. మా సిద్ధాంతానికి వెనుక అనుభవం ఉంది, కేవలం. ఊహా దృశ్యాలూ, భ్రమలూ కాదు."

మత సంస్థల సిద్ధాంతాలూ, మూఢ విశ్వాసాలూ కూడా అనుభవం మీద ఆధారపడినవే - ఎవరు బోధనలు చేశారో వారివి కావచ్చు. అవి కూడా చారిత్రాత్మక సత్యాలపైన ఆధారపడినవే. మీ సిద్ధాంతం పరిశోధనలవల్లా, కొన్ని యథార్థాలను పోల్చటం వల్లా, వాటిలో కొన్ని యథార్థాలను స్వీకరించి కొన్నిటిని వదిలివేయటం వల్లా ఫలించినది కావచ్చు. మీ నిర్ణయాలు అనుభవం వల్ల కలిగినవి కావచ్చు. కాని మిగిలిన సిద్ధాంతాలు కూడా అనుభవం వల్లనే కలిగినప్పుడు వాటిని తిరస్కరిస్తారెందుకు? మీ సిద్ధాంతం చుట్టూ ఒక గుంపుని చేర్చుకుంటారు, ఇంకొకరు వాళ్ల సిద్ధాంతం చుట్టూ చేర్చుకున్నట్లు. మీరు సామూహిక చర్య కావాలంటారు. వాళ్లూ మరోవిధంగా అదే కావాలంటారు. ప్రతి సందర్భంలోనూ సామూహిక చర్య ఒక భావం నుంచి ఉత్పన్నమవుతుంది. మీ ఇరువురికీ భావాల గురించే ఆలోచన - వ్యక్తంగా కాని, అవ్యక్తంగా కాని - సామూహిక చర్య తీసుకు రావటం కోసం. ప్రతి సిద్ధాంతం వెనుకా అనుభవం ఉంది. ఎటొచ్చీ, మీరు వారి అనుభవంలోని నిజాన్ని ఖండిస్తున్నారు. వారు మీనిజాన్ని ఖండిస్తారు. వాళ్లు మీ వ్యవస్థ ఆచరణ యోగ్యం కాదనీ, బానిసత్వానికి దారి తీస్తుందనీ, ఇంకా ఎన్నో అంటారు. మీరు వాళ్లని యుద్ధప్రియులనీ, వారి వ్యవస్థ ఆర్థిక వినాశానికి దారితీయక తప్పదనీ అంటారు. అందుచేత మీ ఇరువురూ సిద్ధాంతాల గురించే విచారిస్తున్నారు, జనానికి తిండిపెట్టాలనీ, వారికి ఆనందాన్ని కలిగించాలనీ కాదు. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది - మనిషి సంగతి మరుగునపడిపోయి.

"మనిషిని రక్షించటానికే మనిషిని మరిచిపోవటం జరుగుతుంది. భావి మానవుని కోసం నేటి మనిషిని త్యాగం చేస్తాం."

భవిష్యత్తుకోసం ప్రస్తుతాన్ని హింసామార్గంలో అంతం చేస్తారు. భవిష్యత్తుని నిర్ణయించే అధికారాన్ని మీరు ప్రభుత్వం పేరుతో వహిస్తారు. చర్చి దేవుడి పేరుతో చేసింది. మీ ఇరువురికి దేవుళ్లున్నారు, పవిత్ర గ్రంథాలున్నాయి. మీ ఇరువురికీ వ్యాఖ్యాన కర్తలూ, మతప్రవక్తలూ ఉన్నారు - సత్యాన్నీ, అసలైన దాన్నీ వదిలి పెడత్రోవని పట్టిన వాళ్లని శపిస్తారు! మీ ఇరువురి మధ్యా ఎంతో తేడా లేదు. ఇరువురికీ చాలా పోలిక ఉంది. మీ సిద్ధాంతాలు వేరు కావచ్చు, కాని పద్ధతి దాదాపు ఒక రకమే. మీ ఇరువురూ భావి మానవుని రక్షించటం కోసం ప్రస్తుతం ఉన్న మనిషిని త్యాగం చెయ్యాలనుకుంటారు - మీకు భవిష్యత్తు అంతా తెలిసినట్లూ, భవిష్యత్తు ఒక విధంగా నిశ్చితమైనదన్నట్లూ, దాని మీద మీకు సర్వాధికారాలూ ఉన్నట్లూ! కాని, భవిష్యత్తు గురించి ఎవరైనా సందిగ్ధంలో ఉన్నట్లే మీరు ఉన్నారు. భవిష్యత్తుని రూపొందించే ఎన్నో అభేద్యమైన సత్యాలున్నాయి ప్రస్తుతంలో. మీ ఇరువురూ ఒక ప్రతిఫలాన్నీ, ఒక ఆదర్శ వ్యవస్థనీ, ఒక ఆశ్రయాన్నీ, భవిష్యత్తులో ఇస్తామని మాటిస్తారు. కాని, భవిష్యత్తు సిద్ధాంతపూర్వకమైన నిర్ణయం కాదు. ఊహలెప్పుడూ గతాన్ని గురించీ, భవిష్యత్తు గురించే ఉంటాయి. ప్రస్తుతం గురించి ఎప్పుడూ ఉండవు. ప్రస్తుతం గురించి ఊహించలేరు. ఆచరణే జరుగుతుంది. తక్కినదంతా ఆచరణని ఆలస్యం చేయటం, ముందెప్పుడో చేయవచ్చు ననుకోవటం. అందువల్ల అది ఆచరణ కాదు. చర్య తీసుకోకుండా తప్పించుకోవటం. గతం గురించి గాని, భవిష్యత్తు గురించి కాని ఒక చర్యను ఊహించటం అంటే చర్య తీసుకోకుండా ఉండటమే. చర్య తీసుకోవటం ప్రస్తుతంలోనే జరుగుతుంది ఇప్పుడే. ఊహ ఎప్పుడూ గతం గురించిగాని, భవిష్యత్తు గురించి కాని ఉంటుంది. ప్రస్తుతం గురించి ఊహ ఉండటం కుదరదు. సిద్ధాంతవాదికి గతంగాని, భవిష్యత్తుగాని ఒక నిశ్చితస్థితి - అతడు కూడా గతానికీ, భవిష్యత్తుకీ చెందినవాడే కనుక. సిద్ధాంతవాది ప్రస్తుతంలో ఎప్పుడూ ఉండడు. అతడికి జీవితం ఎప్పుడూ గతంలోనైనా ఉంటుంది, భవిష్యత్తులోనైనా ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో ఉండనే ఉండదు. ఊహ ఎప్పుడూ గతంలోంచి వచ్చి ప్రస్తుతంగుండా భవిష్యత్తులోకి పోతుంది. సిద్ధాంతవాదికి ప్రస్తుతం అనేది భవిష్యత్తుకి దారితీసే మార్గం మాత్రమే. అందుచేత అది అంత ముఖ్యం కాదు. మార్గంతో నిమిత్తం లేదు. గమ్యం మాత్రమే. గమ్యం చేరటానికి ఏ మార్గాన్నైనా అనుసరించండి. గమ్యం నిశ్చితమైనది. భవిష్యత్తు తెలిసినదే. అంచేత ఆ గమ్యానికి అడ్డొచ్చే వాళ్లెవరినైనా అంతం చెయ్యండి.

"ఆచరణకి అనుభవం ముఖ్యం. భావాలూ, వివరణలూ అనుభవం నుంచే వస్తాయి. మీరు అనుభవాన్ని కాదనటం లేదు, నిశ్చయంగా. ఊహా ప్రణాళిక లేకుండా చర్య తీసుకుంటే అది అరాజకంగా ఉంటుంది. అది గందరగోళంగా ఉంటుంది. తిన్నగా పిచ్చాసుపత్రికి తీసుకువెడుతుంది. అదుపులో పెట్టే ఒక ఉద్దేశం అనేది లేకుండా చర్య తీసుకోమని మీరు వాదిస్తున్నారా? ముందు ఒక ఉద్దేశం లేకుండా ఏ పనైనా ఎలా చేస్తారు?"

మీరన్నట్లుగా భావం, వివరణ, నిర్ణయం అనుభవం వల్ల వచ్చినదే. అనుభవం లేనిదే జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకుండా ఆచరణ ఉండదు. భావం చర్య తరవాత వస్తుందా, లేక భావం ముందొచ్చి చర్య తరవాత జరుగుతుందా? మీరు అనుభవం ముందు వస్తుందంటున్నారు, తరవాత చర్య, అవునా? అనుభవం అంటే మీ ఉద్దేశం ఏమిటి?

"అనుభవం ఒక బోధకుడికో, ఒక రచయితకో, విప్లవకారునికో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానం అతడు చదివినవాటి నుంచీ, అనుభవాల నుంచీ - తనవి గాని, ఇతరులనిగాని కూడబెట్టినది. జ్ఞానం, లేదా, అనుభవం నుంచి ఊహలు మిర్మితమవుతాయి. ఈ ఊహానిర్మాణంలో నుంచే ఆచరణ జరుగుతుంది."

అనుభవం ఒక్కటే కొలమానమా? నిజమైన కొలమానమా? అనుభవం అంటే మన ఉద్దేశం ఏమిటి? మనం కలిసి మాట్లాడుకోవటం అనుభవం; ప్రేరేపణకు ప్రతిక్రియ జరుపుతున్నారు. ఈ విధంగా ఎదుర్కొన్నదానికి ప్రతిక్రియను జరుపుతున్నారు. ఈ విధంగా ఎదుర్కొన్నదానికి ప్రతిక్రియను జరపటం అనుభవం. కాదా? ప్రేరేపణ, ప్రతిక్రియ - రెండూ ఒకేసారి జరిగే ప్రక్రియ. పూర్వరంగపు పరిధిలో అవి రెండూ నిత్యం మెదుల్తూ ఉంటాయి. అంతకు ముందు జరిగినదే ఎదుర్కొన్నదానికి జవాబు చెబుతుంది. ఈ విధంగా ఎదుర్కొన్నదానికి ప్రతిక్రియ జరుపటమే అనుభవం కాదా? ప్రతిక్రియ అంతకు ముందున్న దాన్నుంచి వస్తుంది, ప్రభావితమైన దాన్నుంచి వస్తుంది. అనుభవం కూడా ఎప్పుడూ ప్రభావితమవుతుంది. అందువల్ల ఊహకూడా. ఊహపైన ఆధారపడిన చర్య ప్రభావితమైనదీ, పరిమితమైనదీ అవుతుంది. ఒక అనుభవం, ఊహ మరొక అనుభవానికీ ఊహకీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఐక్యత సిద్ధించదు, మరింత వైరుధ్యం మాత్రమే పెరుగుతుంది. రెండు విరుద్ధమైన వాటికి ఐక్యత ఏర్పడదు. వ్యతిరేకత లేనప్పుడే ఐక్యత ఏర్పడుతుంది. కాని భావాలు ఎప్పుడూ వైరుధ్యాన్ని పెంపొందింపజేస్తాయి. వ్యతిరేకమైన వాటిమధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘర్షణ నుంచి ఐక్యత సిద్ధించదు.

ఏదైనా ఎదుర్కొన్నప్పుడు పూర్వరంగం నుంచి ప్రతిక్రియ జరగటమే అనుభవం. పూర్వరంగం గతం యొక్క ప్రభావం. గతం అంటే జ్ఞాపకం. జ్ఞాపకం యొక్క ప్రతిక్రియే భావం. అనుభవం, జ్ఞానం అనబడే జ్ఞాపకంలో నుంచి తయారైన సిద్ధాంతం ఎన్నటికీ విప్లవకారకం కాదు. అది కేవలం మార్పుచెందిన గతం మాత్రమే. విరుద్ధమైన సిద్ధాంతం, సూత్రం కూడా భావమే. భావం ఎప్పుడూ గతం నుంచి వచ్చినదే. ఏ సిద్ధాంతమూ ఏకైక సిద్ధాంతం కాదు. మీ సిద్ధాంతం కూడా తక్కిన వాటిలాగే పరిమితమైనదీ, దురభిప్రాయాలతో కూడకున్నదీ, ప్రభావితమైనదీ అని చెబితే ఎవ్వరూ మిమ్మల్ని అనుసరించరు. మనలో చాలామంది సూత్రాలకూ నిర్ణయాలకూ అలవాటు పడిపోయినందువల్ల వాటిని అనుసరిస్తాం, పూర్తిగా వినియోగింప బడతాం - స్వలాభానికి వినియోగించుకునేవాడు తానుకూడా వినియోగింప బడినట్లుగానే. ఒక భావం మీద ఆధారపడిన చర్య ఎప్పటికీ స్వేచ్ఛాయుతమైన చర్య కాజాలదు. ఎప్పుడూ బంధించే ఉంచుతుంది. ఒక గమ్యం కోసం, ఒక లక్ష్యం కోసం చర్య తీసుకోవటం భవిష్యత్తు దృష్టిలో చర్య తీసుకోకపోవటమే. అప్పటికప్పుడు చూస్తే చర్య తీసుకుంటున్నట్లే తోస్తుంది. కాని అటువంటి చర్య ఆత్మవిధ్వంసకమైనది.. అది మన దైనందిన జీవితంలో స్పష్టపడుతూనే ఉంది.

"కాని ఎవరైనా ఏవిధమైన ప్రభావానికీ లోనుకాకుండా ఉండగలరా? అది సాధ్యం కాదనిపిస్తుంది మాకు."

మళ్లీ ఒక ఊహ, ఒక నమ్మకం మిమ్మల్ని బంధిస్తోంది. మీరు నమ్ముతారు, మరొకరు నమ్మరు. మీరిద్దరూ నమ్మకానికి బంధితులే. మీరు ప్రభావితమైన దాన్ని బట్టే మీరు అనుభవం పొందుతారు. ప్రభావితం కావటం యొక్క, ప్రభావం యొక్క ప్రక్రియ మొత్తాన్ని గమనిస్తేనే స్వేచ్ఛగా ఉండటానికి సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియని అర్థం చేసుకోవటమే స్వీయ జ్ఞానం. ఒక్క స్వీయజ్ఞానం వల్లనే బంధం ఉంచి స్వేచ్ఛ ప్రాప్తిస్తుంది. ఈ స్వేచ్ఛ ఎటువంటి నమ్మకమూ లేకుండా, ఎటువంటి సిద్ధాంతమూ లేకుండా ఉంటుంది.