మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సద్గుణం

వికీసోర్స్ నుండి

13. సద్గుణం

సముద్రం ప్రశాంతంగా ఉంది. తెల్లని ఇసుక మీద ఒక్క అల అయినా లేదు. ఆ విశాలాఖాతానికి ఉత్తరం వైపు చుట్టూ పట్టణం ఉంది. దక్షిణం వైపు కొబ్బరి చెట్లున్నాయి దాదాపు నీటికి తగుల్తూ. ఇనుప కమ్మీకి అవతల ఉన్న పెద్ద చేపల్లో మొదటిది కొద్దిగా కనిపిస్తోంది. వాటికవతల చేపలవాళ్ల పడవలూ, లావాటి తాళ్లతో కట్టేసిన కొన్ని దుంగలూ ఉనాయి. కొబ్బరి చెట్లకు దక్షిణంగా ఉన్న గ్రామానికి వెడుతున్నారు వాళ్లు. సూర్యాస్తమయం దేదీప్యమానంగా ఉంది - మామూలుగా ఉంటుందనుకునే చోట కాక తూర్పువైపున. అది సూర్యాస్తమయపు ప్రతిబింబం మాత్రమే. అందమైన ఆకృతుల్లో ఉన్న పెద్ద పెద్ద మేఘాలు సూర్యకిరణం ప్రతిఫలించే రంగు లన్నిటితోనూ వెలుగుతున్నాయి. అది నిజంగా అద్భుతంగా, భరించలేమన్నట్లుగా ఉంది. నీటిపైన కూడా ఆ కాంతివంతమైన రంగులు పడి అనంతాకాశానికి కాంతిపథాన్ని సృష్టించాయి.

పట్నం నుంచి పల్లెలకి తిరిగి వెడుతున్న కొంతమంది చేపలవాళ్ళు మినహా, ఆ సముద్రపు ఒడ్డు దాదాపు నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. మేఘాలకు పైన ఒకే ఒక్క నక్షత్రం కనిపిస్తోంది. మేము తిరిగి వస్తూంటే ఒక స్త్రీ మాతో బాటు చేరి గంభీరమైన విషయాలు మాట్లాడటం మొదలు పెట్టింది. ఆవిడ ఒక సంఘంలో చేరిందట. ఆ సంఘ సభ్యులు ధ్యానం చేస్తారుట. ముఖ్యమైన సద్గుణాలన్నిటినీ అలవరచుకుంటారుట. ప్రతినెలా ఒక సద్గుణాన్ని ఎంచుకుని, ఆ నెలంతా దాన్ని సాధన చేసి ఆచరణలో పెట్టటం జరుగుతుందిట. ఆవిడ ధోరణిని బట్టీ, మాట్లాడిన దాన్ని బట్టీ, ఆత్మశిక్షణలో ఆవిడ బాగా తర్ఫీదు పొందిన దానిలాగ, ఆవిడ మనోభావాలకీ, ఉద్దేశాలకీ వ్యతిరేకంగా ఉన్నవారిపట్ల కొంత అసహనం ఉన్నదానిలాగ కనిపించింది.

సద్గుణం హృదయానికి సంబంధించినది; మనస్సుకి చెందినది కాదు. మనస్సు ఒక సద్గుణాన్ని అలవరచుకుంటున్నదంటే బాగా కపటంగా ఆలోచిస్తున్నట్లే. అదొక ఆత్మరక్షణ - పరిసరాల కనుగుణంగా, తెలివిగా సర్దుకుపోవటమే. స్వీయపరిపక్వత కోసం ప్రయత్నించటం అంటే సద్గుణాన్ని వదులుకోవటమే. భయం ఉంటే సద్గుణం ఎలా ఉంటుంది? భయం ఎప్పుడూ మనస్సులో ఉంటుంది. హృదయంలో కాదు. భయం అనేక రూపాల్లో - సద్గుణం, మాన్యత, సర్దుకుపోవటం, సేవ మొదలైన వాటిలో దాక్కుంటుంది. మానసిక సంబంధాల్లోనూ, మానసిక కార్యకలాపాల్లోనూ భయం ఎప్పుడూ ఉంటుంది. మనస్సూ, దాని చర్యలూ వేరువేరు కావు. కాని అదే వేరు చేస్తుంది - తను కొనసాగుతూ ఉండటానికీ, స్థిరత్వం పొందటానికీ. కుర్రవాడు పియానో మీద సాధన చేసినట్లు మనస్సు కూడా నైపుణ్యంతో సద్గుణాన్ని సాధన చేస్తుంది - తన్ను తాను సుస్థిరం చేసుకోవాటానికీ, జీవితాన్ని ఎదుర్కోవటంలో ఆధిక్యం పొందటానికీ, లేదా, తాను మహోన్నత మనుకుంటున్న దాన్ని సాధించటానికీ. జీవితాన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధత ఉండాలి. అంతేగాని, తన చుట్టూ తాను గీత గీసుకున్నట్లు సద్గుణమనే గౌరవప్రదమైన గోడ కట్టుకోవటం కాదు కావలసినది. మహోన్నతమైన దాన్ని ప్రయత్నించి సాధించలేము. దానికి మార్గంలేదు. లెక్క ప్రకారం క్రమంగా అభివృద్ధి చెందటమంటూ లేదు. సత్యం దానంతట అదే రావాలి. మీరు దాని దగ్గరకు పోలేరు. మీరు అలవరచుకుంటున్న సద్గుణం మిమ్మల్ని అక్కడికి చేర్చలేదు. మీరు సాధించేది సత్యంకాదు. కేవలం మీ స్వయం సంకల్పిత వాంఛ మాత్రమే. ఒక్క సత్యంలోనే ఆనందం ఉంటుంది.

తను సుస్థిరంగా ఉండాలని, మనస్సు గడుసుగా సర్దుకుపోవటంలోనే భయాన్ని పోషిస్తూ ఉంటుంది. ఈ భయాన్నే పూర్తిగా అవగాహన చేసుకోవాలి గాని, సద్గుణంతో ఉండటం ఎలాగా అని కాదు. అల్పమనస్సు సద్గుణాన్ని అవలంబించినా దాని అల్పత్వం పోదు. దాని అల్పత్వాన్ని తప్పించుకోవటానికి చేసే ప్రయత్నమే అవుతుంది సద్గుణం. అటువంటి సద్గుణం కూడా అల్పమైనదే అవుతుంది. ఈ అల్పత్వాన్ని అర్ధం చేసుకోనట్లయితే సత్యాన్ని అనుభవం పొందటం ఎలా సాధ్యమవుతుంది? అల్పమైన మనస్సు సద్గుణాలు అవలంబించినా పరిమితులు లేని దానిని ఎలా ఆహ్వానించ కలుగుతుంది?

మానసిక ప్రవృత్తిని, అంటే, తనని తాను అర్ధం చేసుకోవటంలోనే సద్గుణం కలుగుతుంది. సద్గుణం అంటే కూడబెట్టిన నిరోధక శక్తి కాదు. సద్గుణం అంటే ఉన్నస్థితిని అప్రయత్నంగా తెలుసుకోవటమూ, అవగాహన చేసుకోవటమూ. మనస్సు అవగాహన చేసుకోలేదు. అవగాహన అయిన దాన్ని ఆచరణలోకి అనువదించవచ్చు, అంతేగాని, అవగాహన మాత్రం చేసుకోలేదు. అర్ధం చేసుకోవటానికి గుర్తించే, గ్రహించే ఆర్ద్రత అవసరం. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అటువంటి ఆర్ద్రతని హృదయం మాత్రమే అందివ్వ గలుగుతుంది. కాని మానసిక ప్రశాంతత నైపుణ్యంతో, పరిశ్రమతో వచ్చేది కాదు. ప్రశాంతత కావాలనే కోరికే దాన్ని సాధించటానికి ఒక శాపం; దానితో అనంతమైన సంఘర్షణలూ, బాధలూ; ప్రతికూలంగాగాని, అనుకూలంగా గాని ఏదో అవాలని తాపత్రయ పడటం అంటే హృదయంలోకి సద్గుణాన్ని చేరనివ్వకపోవటమే. సద్గుణం సంఘర్షణ కాదు. సాధించవలసిన ఘనత కాదు, సాధన కొనసాగించటం కాదు, ఫలితం పొందడం కాదు. స్వయం సంకల్పిత వాంఛలేని స్థితి అది. మరొక స్థితికోసం ప్రయాసపడుతూ ఉంటే మనం సహజ స్థితిలో లేనట్లే. మరేదో అవాలని కష్టపడుతున్నప్పుడు ఉన్న స్థితిలో లేనట్లే. మరొక స్థితికోసం పడే కష్టంలో ప్రతిఘటన, ఇంద్రియ సంయమనం, శరీర శోషణ, సన్యసించడం ఉంటాయి. వీటిని అధిగమించటం కూడా సద్గుణం కాదు. ఏదో అవాలనే తాపత్రయం లేకుండా స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఉండే ప్రశాంతతే సద్గుణం. ఈ ప్రశాంతత హృదయంలో ఏర్పడినది, మనస్సులోనిది కాదు. సాధన చేసి, పట్టుదల పట్టి, ప్రతిఘటించి మనస్సుని ప్రశాంతంగా చెయ్యవచ్చు. కాని, అటువంటి శిక్షణ హృదయం యొక్క సద్గుణాన్ని నాశనం చేస్తుంది. సద్గుణం లేకపోతే శాంతి ఉండదు. ఆనందం ఉండదు. హృదయం యొక్క సద్గుణమే అవగాహన.