Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అనుభవం పొందటం

వికీసోర్స్ నుండి

12. అనుభవం పొందటం

ఆ లోయ మీద నీడ పడుతోంది. అస్తమిస్తున్న సూర్యుడు దూరాన ఉన్న కొండ శిఖరాలను తాకుతున్నాడు. అ సంధ్యా కాంతి కొండల లోపల నుంచి వస్తున్నట్లుగా కనబడుతోంది. ఆ సుదీర్ఘ మార్గానికి ఉత్తరం వైపు కొండలు బోడిగా, గొడ్డుగా ఉన్నాయి అగ్నిప్రభావానికి గురియై. దక్షిణం వైపు కొండలు పువ్వులు పొదలతో - చెట్లతో నిండి పచ్చగా ఉన్నాయి. సుదీర్ఘమైన, సుందరమైన లోయ మధ్యనుంచి తిన్నగా పోతోంది ఆ మార్గం. ఆ సాయం సమయంలో కొండలు ఎంతో దగ్గరగా, కలలో వలె, తేలిగ్గా సున్నితంగా ఉన్నట్లనిపిస్తోంది. పెద్దపెద్ద పక్షులు ఎంతో తేలిగ్గా చుట్టూ తిరుగుతున్నాయి ఆకాశంలో. నేలమీద పాకే ఉడతలు బద్ధకంగా రోడ్డుకడ్డంగా పోతున్నాయి. దూరం నుంచి విమానాల మోత వినిపిస్తోంది. దారికిరుప్రక్కలా నారింజ తోటలు తీరుగా పరిశుభ్రంగా ఉన్నాయి. రోజంతా ఎండలో ఊదారంగు సబ్జా ఆకుల వాసన ఘాటుగా వస్తోంది. ఎండిన నేల వాసన, ఎండుగడ్డి వాసనా కూడా అలాగే ఉంది. కొట్టొచ్చే రంగులో ఉన్న నారింజ పళ్లతో చెట్లు ముదురురంగులో కనిపిస్తున్నాయి. కోలంకి పిట్టలు అరుస్తున్నాయి. ఒక వీధి కుక్క పొదల మాటున దూరింది. కుక్కచేసిన శబ్దానికి పొడుగాటి తొండ ఒకటి ఎండుకొమ్మల్లోకి తుర్రుమని పారిపోయింది. సాయంకాలపు నిశ్చలత భూమినిండా పరుచుకుంటోంది.

అనుభవం ఒకటి, అనుభవం పొందటం వేరొకటి. గతానుభవం అనేది అనుభవించడానికి ప్రతిబంధకం. గతానుభవం ఎంత ఆహ్లాదకరమైనదైనా, ఎంత అసహ్యకరమైనదైనా, ప్రస్తుతం 'అనుభవిస్తూ ఉండటం' అనేదాన్ని వికసించనియ్యదు. అనుభవం అప్పటికే గతకాలంలో కలిసిపోయినట్టిది. అప్పటికే గతంలో చేరిపోయినట్టిది. అది జ్ఞాపకంగా మిగిలిపోయి, ప్రస్తుతంలో జరిగే దానికి ప్రతిక్రియగా మాత్రమే సజీవమవుతుంది. జీవితం అంటే వర్తమానం. అనుభవం వర్తమానం కాదు; గతానుభవం యొక్క భారమూ, బలమూ ప్రస్తుతాన్ని మరుగుపరుస్తాయి. దానివల్ల ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నది కూడా గతానుభవంగా మారుతుంది. మనస్సే గతానుభవం, అది తెలిసినదే. అది ఎప్పటికీ అనుభవం పొందుతూ ఉన్న స్థితిలో ఉండదు. ఎందుకంటే మనసు అనుభవం పొందుతూ ఉండటం. అన్నది గతానుభవం కొనసాగటం మాత్రమే. మనస్సుకి అవిచ్ఛిన్నంగా కొనసాగటం మాత్రమే చేతనవును. అది కొనసాగుతున్నంత కాలం కొత్తదాన్ని దేన్నీ గ్రహించలేదు. కొనసాగుతున్నదానికి కొత్త అనుభవం పొందే స్థితిలోకి రావటం కుదరదు. అనుభవం పొందటానికి గతానుభవం ఒక సాధనం కాదు, గతానుభవం లేకుండా ఉన్నప్పుడే అనుభవం పొందటం సాధ్యమవుతుంది. ప్రస్తుతం అనుభవం పొందుతూ ఉండటానికి గతానుభవం ఉండకూడదు.

మనస్సు తన స్వీయరూపాన్నీ, తనకు తెలిసిన దాన్నీ మాత్రమే ఆహ్వానించగలదు. మనస్సు అనుభవం పొందటం ఆగిపోయేంతవరకు తెలియని దాన్ని అనుభవం పొందటం సాధ్యం కాదు. అనుభవం వ్యక్తం కావటమే ఆలోచన. ఆలోచన జ్ఞాపకానికి ప్రతిక్రియ. ఆలోచన అడ్డు వస్తున్నంత వరకూ అనుభవం పొందటం అనేది సాధ్యం కాదు. అనుభవాన్ని అంతమొందించే మార్గంగాని పద్ధతిగాని లేదు. ఆ మార్గమే అనుభవం పొందకుండా ఆటంకపరుస్తుంది. గమ్యాన్ని తెలుసుకొని ఉండటం అంటే కొనసాగుతున్న దాన్ని తెలుసుకోవటమే. గమ్యానికొక మార్గం ఉండటమంటే తెలిసిన దాన్ని కాపాడుకోవటమే. సాధించాలనే కోరిక సమసిపోవాలి. ఈ కోరికే గమ్యాన్నీ, మార్గాన్నీ కూడా సృష్టిస్తోంది. అనుభవం పొందటానికి నమ్రత అవసరం. కాని అనుభవం పొందటాన్ని కూడా అనుభవంలోకి ఇముడ్చుకోవాలని మనస్సుకి ఎంత ఆతురత! కొత్త దాన్ని పాతదిగా చేసెయ్యాలని ఎంత వెంటనే ఆలోచిస్తుంది! దాంతో అనుభోక్త (అనుభవం పొందేది) అనీ, అనుభూతమూ (అనుభవింపబడినది) అనీ వేరుచేసి, వాటి రెండింటికీ మధ్య సంఘర్షణ బయలుదేరతీస్తుంది.

అనుభవం పొందేస్థితిలో అనుభోక్త (అనుభవించేది) అనిగాని, అనుభూతము (అనుభవింపబడినది) అనిగాని ఉండదు. చెట్టు, కుక్క, సాయంకాలపు నక్షత్రం - వీటికి అనుభోక్త, అనుభవించడం అని ఏమీ లేదు. అనుభవం పొందుతూ ఉండటం మాత్రమే ఉంది. ద్రష్టకీ, దృశ్యాలకీ మధ్య అంతరం లేదు, వ్యవధి లేదు, విరామ స్థలంలేదు, ఆలోచనకీ తావులేదు. ఆలోచనకు తనకు తాను వ్యక్తిత్వాన్నిచ్చుకునే సావకాశం లేదు. ఆలోచన అనేదే ఉండదు. కాని అస్తిత్వం ఉంటుంది. ఆవిధంగా అస్తిత్వం ఉండే స్థితిని ఊహించటంగాని ధ్యానించటం గాని సాధ్యమవదు. అది సాధించగల విషయం కాదు. అనుభవించేది (అనుభోక్త) అనుభవించటం మానుకోవాలి. అప్పుడే అస్తిత్వం ఉంటుంది. దాని సంచలనంలోని ప్రశాంతతలోనే కాలరహితమైనది ఉంటుంది.