మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/హృదయ నిరాడంబరత

వికీసోర్స్ నుండి

14. హృదయ నిరాడంబరత

ఆకాశం తెరిపిగా నిండుగా ఉంది. విశాలంగా రెక్కలు తెరుచుకుని ఒక లోయ మీంచి మరొక లోయ మీదికి సునాయసంగా ఎగిరివెళ్లే పెద్ద పక్షులు లేవు ఎక్కడా ఒక్క మేఘం కూడా కదలటం లేదు. చెట్లు నిశ్చలంగా ఉన్నాయి. నీడలో కొండల మలుపులన్నీ తెలుస్తున్నాయి. ఆత్రుతగా ఉన్న లేడి ఒకటి పట్టరాని కుతూహలంతో చూస్తోంది. మా రాకతో మెరుపులా మాయమైపోయిందది. మట్టిరంగు పొద క్రింద బోదురు కప్ప ఒకటి వెడల్పాటి కొమ్ములతో పెద్ద కళ్లతో చలనం లేకుండా ఉంది. పశ్చిమం వైపు కొండలు అస్తమిస్తున్న సూర్యకాంతిలో మొనదేలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికి బాగా దిగువున ఒక పెద్ద భవనం ఉంది. దానిలో ఈతలాడే నీటిమడుగు ఉంది. అందులో ఎవరో కొంతమంది ఉన్నారు. ఆ ఇంటి చుట్టూ అందమైన తోట ఉంది. ఆ ప్రదేశం సంపదతో తులతూగుతూ, మిగతావాటికి దూరంగా ఒకవిధమైన ధనిక వాతావరణంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా దిగువున దుమ్ముతో నిండిన దారి ప్రక్కన ఎండిపోయిన పొలంలో ఒక చిన్న గుడిసె ఉంది. దారిద్ర్యం, అశుభ్రత, కాయకష్టం, అన్నీ అంత దూరం నుంచే కనిపిస్తున్నాయి. అంత ఎత్తునుంచి చూచినప్పుడు ఆ రెండింటికీ అట్టే ఎడం కనిపించలేదు. కురూపితనం, అందం, రెండూ ఒకదాన్ని ఒకటి అంటి పెట్టుకునే ఉన్నాయి.

వస్తు వాహనాలు కలిగి ఉండటంలో నిరాడంబరత కన్న హృదయ నిరాడంబరత చాలా ముఖ్యమైనది, అర్ధవంతమైనది. ఏవో కొద్ది వస్తువులతో తృప్తిపడి ఉండటం అంత కష్టం కాదు. సౌఖ్యాన్ని వదులుకోవటం, ధూమపానం మొదలైన అలవాట్లను మానివెయ్యటం - ఇవి హృదయ నిరాడంబరతని సూచించవు. వేషభూషణాలతో, సౌఖ్యాలతో, అనేక ఆకర్షణలతో నిండి ఉన్న ప్రపంచంలో గోచీగుడ్డ కట్టుకుని తిరిగినంత మాత్రాన స్వేచ్ఛా జీవనాన్ని సూచించదు. సంసారాన్నీ, ప్రాపంచిక ధర్మాల్నీ త్యజించిన మనిషికే లోలోపల కోరికలూ, కాంక్షలూ, దహించివేస్తూ ఉంటాయి. పైకి సన్యాసి వేషం వేసినా శాంతి అనేది ఎరుగడు. అతని కన్నులు నిత్యం దేనినో అన్వేషిస్తూనే ఉంటాయి. అతని మనస్సుని సంశయాలూ, ఆశలూ దొలుస్తూ ఉంటాయి. పైకి క్రమశిక్షణ అలవరచుకుంటారు. అన్నిటినీ త్యజిస్తారు. క్రమక్రమంగా మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ పథాన్ని మీరు నిర్మించుకుంటారు. మీ అభివృద్ధిని సద్గుణాల కొలమానంతో కొలుచుకుంటారు - ఇది మానేశారో లేదో, అది మానేశారో లేదో, మీ ప్రవర్తనలో ఏ మాత్రం నిగ్రహం చూపిస్తున్నారో, ఎంత సహనం, ఎంత దయ చూపిస్తున్నారో, అంటూ మనస్సుని కేంద్రీకృతం చేసే కళను అభ్యసిస్తారు. అడవుల్లోకి గాని, మఠంలోకి గాని, ఏదైనా చీకటి గదిలోకి గాని వెళ్లిపోతారు ధ్యానం చేసుకోవటానికి. పైకి మాత్రం మీ జీవితాన్ని నిరాడంబరంగా చేసుకుంటారు. ఇలా జాగ్రత్తగా ఆలోచించి తయారు చేసుకున్న పథకం ప్రకారం ఈ లౌకిక ప్రపంచానికి అతీతమైన సౌఖ్యాన్ని పొందాలని ఆశిస్తారు.

కాని, వాస్తవికతని బాహ్యనిగ్రహాల ద్వారా, ఆంక్షల ద్వారా చేరుకోగలరా? బాహ్యనిరాడంబరత, సుఖాల్ని వదులుకోవటం అవసరమే అయినా, ఆ మాత్రం చేష్టకే యథార్థం అనేదానికున్న ద్వారం తెరుచుకుంటుందా? సౌఖ్యంతో, విజయంతో, మనస్సు, హృదయం భారమైపోతాయి. ప్రయాణం చెయ్యాలంటే స్వేచ్ఛగా ఉండాలి. అయితే, మనం ఈ బాహ్యచేష్టతోనే ఎందుకంత సతమతమైపోతున్నాం? మన ఉద్దేశాన్ని బాహ్య రూపంలో పెట్టటానికి ఎందుకంత ఉత్సుకత, ఎందుకంత పట్టుదల? ఇది ఆత్మవంచన వల్ల కలిగే భయం వల్లనా, మరొక కారణం వల్లనా? మన చిత్తశుద్ది గురించి మనల్ని మనమే నమ్మించుకోవాలని ఎందుకు కోరుకుంటాం? సుస్థిరంగా ఉండాలనే కోరికలోనూ, ఏదో అయితే మనకి ఘనత ఉంటుందన్న నమ్మకంలోనూ ఈ సమస్యంతా ఇమిడి ఉంది.

ఏదో అవాలనే కోరికతోనే చిక్కులన్నీ ఆరంభమవుతాయి. ఏదో అవాలి అనే కోరిక లోపలా, బయటా కూడా అంతకంతకు పెరిగిపోవటం వల్ల కూడబెట్టు కోవటం, త్యజించటం, అలవరచుకోవటం, లేదా వదులుకోవటం చేస్తూ ఉంటాం. కాలం అన్నింటినీ దోచేస్తుందని తెలిసి కాలరహితమైన దానికోసం ప్రాకులాడతాం. ఏదో అవాలని చేసే ఈ పోరాటం - ఏదైనా చెయ్యటం ద్వారా గాని, మానెయ్యటం ద్వారా గాని, బంధనాలను పెంచుకోవటం ద్వారా గాని వాటిని వదులుకోవడం ద్వారా గాని, బాహ్యచేష్టలతో గాని, క్రమశిక్షణతోగాని, సాధనతో గాని ఎన్నటికీ అంతం కాలేదు. కాని, ఈ పోరాటాన్ని అవగాహన చేసుకోవటంతోనే, ఏ విధమైన, బాహ్య ప్రేరణా లేకుండా దానంతట అదిగా స్వేచ్ఛ కలుగుతుంది. బహిరంగంగానూ, ఆంతరంగికంగానూ జరిగే సేకరణ నుంచీ, అది కలిగించే సంఘర్షణల నుంచీ విముక్తి లభిస్తుంది. కేవలం బంధనాలను తెంచుకోవటం ద్వారా వాస్తవికతని చేరుకోలేము. ఏమార్గాన్ని అవలంబించినా అది సాధ్యంకాదు. అన్ని మార్గాలూ, లక్ష్యాలూ ఒకే విధమైన బంధనాలు. అవన్నీ వదులుకోవాలి వాస్తవిక స్థితి కోసం.