మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సత్యాన్వేషణ

వికీసోర్స్ నుండి

19. సత్యాన్వేషణ

ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు. ఓడమీదా, విమానం మీదా వేలకొద్దీ మైళ్లు ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన తన భాషలోనే మాట్లాడాడు. ఆయన ఎన్నో కష్టాలుపడి ఈ కొత్త వాతావరణంలో సర్దుకుంటున్నాడుట. ఇటువంటి తిండికీ, వాతావరణానికీ, బొత్తిగా అలవాటు పడలేదెప్పుడూ. ఎత్తు ప్రదేశాల్లో పుట్టి పెరిగిన వాడవటం వల్ల ఈ ఉక్క భరించలేకపోతున్నాడుట. ఆయన బాగా చదువుకున్నవాడు. ఏదో శాస్త్రజ్ఞుడు. కొన్ని రచనలు కూడా చేశాడుట. ప్రాక్పశ్చిమ వేదాంతాలు రెండింటితోనూ బాగా పరిచయ ముందాయనకి. ఆయన రోమన్ కాథలిక్. చాలా కాలం నుంచి ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. కానీ, సంసారం కోసం గడుపు కొస్తున్నాడుట. ఆయన వివాహం సుఖంగా సాగుతున్నట్లే అనుకోవచ్చు. తన పిల్లలిద్దరి మీదా ఆయనకి ప్రేమ. ఆ దూరదేశంలో కాలేజిలో చదువు కుంటున్నారిప్పుడు. వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందిట. కాని ఆయనకి జీవితంలోనూ, కార్య నిర్వహణలోనూ అసంతృప్తి అంతకంతకు ఎక్కువవుతోందిట. ఇంక భరించలేని స్థితికి వచ్చిందిట. సంసారాన్ని వదిలేసి, భార్యకీ, పిల్లలకీ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి ఇక్కడికి వచ్చాడిప్పుడు. ఎలాగోలాగ గడుపుకోవటానికి తగినంత డబ్బుంది చేతిలో. దైవాన్ని అన్వేషించటానికి వచ్చాడుట. తను మతి స్తిమితంలేని వాణ్ణి కాదన్నాడు. తన లక్ష్యం ఏమిటో తనకు స్పష్టంగా తెలుసునన్నాడు.

ఈ స్థిరత్వం అనేది విజయం సాధించినవాళ్లు గాని, సాధించలేక నిరుత్సాహంతో బాధపడుతున్న వాళ్లుగాని నిర్ణయించి తీర్పు చెప్పవలసిన విషయం కాదు. విజయం సాధించిన వాళ్లు కూడా మతి స్థిరంగా లేని వాళ్లు కావచ్చు. సాధించలేక నిరుత్సాహపడిన వాళ్లు కూడా దుస్సహంగా ద్వేషపూరితంగా తయారవచ్చు, లేదా, ఏదో స్వయం కల్పితమైన భ్రమలో పడి తద్వారా విమోచన మార్గాన్ని చూసుకోవచ్చు. స్థిరత్వం అనేది విశ్లేషణ కర్తలు పరీక్షించి తేల్చి చెప్పేది కాదు. ఏదో ఒక సూత్రంలో ఇమిడినంత మాత్రాన అది స్థిరత్వం అని సూచనకాదు. అసలా సూత్రమే అస్థిరమైన సంస్కృతి వల్ల పుట్టినది కావచ్చు. కూడ బెట్టాలనే తత్వం గల సమాజం - దాని పద్ధతులూ, సూత్రాలూ అన్ని అస్థిరమైనవే. అవి వామపక్షానివైనా, దక్షిణ పక్షానివైనా, అ కూడబెట్టే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, ప్రజలకి ఉన్నా ఒకటే. స్థిరత్వం అంటే కూడబెట్టక పోవటం. స్థిరత్వం, అస్థిరత్వం అనేవి రెండూ ఆలోచనా రంగానికి చెందినవే. అందుచేత దానికదే న్యాయ నిర్ణేత కాలేదు. ఆలోచన అనేదే పరిమిత ప్రతిక్రియ కాబట్టి, నిర్ణీత సూత్రాలకీ, న్యాయసూత్రాలకీ కట్టు బడినది కాబట్టి ఆది సత్యం కాదు. సత్యం ఒక భావం కాదు, ఒక నిశ్చితాభిప్రాయం కాదు.

'దైవం' అన్వేషిస్తే దొరికేదా? తెలుసుకోవటం సాధ్యం కాని దాన్ని ఎలా వెతుకుతారు? వెతకటానికి ముందు ఏం వెతకాలో తెలిసి ఉండాలి కదా. కనిపించాలని వెతికితే, మీకు కనిపించేది మీ స్వీయ ప్రతిరూపమే. మీరు కోరేదే మీకు కనిపిస్తుంది. సత్యం కోరిక సృష్టించినది కాదు. సత్యాన్ని అన్వేషించటం దాన్ని పోగొట్టుకోవటానికే. సత్యానికి స్థిర స్థావరం లేదు. దానికి మార్గంలేదు. మార్గదర్శకమైనది లేదు. మాట సత్యం కాదు. సత్యం ఏదో ప్రత్యేకంగా అమర్చిన స్థలంలోనూ, ఏదో ప్రత్యేక వాతావరణంలోనూ, ఎవరో ప్రత్యేకమైన వారిలోనూ కనిపిస్తుందా? ఇక్కడ ఉంది, అక్కడ లేదనా? సత్యానికి ఒకటి మార్గదర్శకము, మరొకటి కాదు అనా? అసలు మార్గదర్శకమైనది ఉన్నదా? సత్యాన్ని అన్వేషించినప్పుడు కనిపించేది అజ్ఞానం వల్ల ఉద్భవించినదే. ఎందుకంటే, అన్వేషణ అనేదే అజ్ఞానంలో పుట్టినది. సత్యాన్ని అన్వేషించలేరు. 'మీరు' లేనప్పుడే 'సత్యం' ఉంటుంది.

"అయితే ఆ పేరు లేని దాన్ని నేను కనుక్కోలేవా? నేను ఈ దేశానికి వచ్చినదే అందుకు - ఇక్కడ అటువంటి అన్వేషణా భావం ఎక్కువగా ఉంటుందని. భౌతికంగా ఇక్కడ ఎక్కువ స్వేచ్ఛగా ఉండటానికి వీలుంటుంది. అక్కడ కావలసినన్ని వస్తువులు ఇక్కడ అవసరం ఉండదు. ఇతర చోట్లలో లాగ సంపాదించిన వాటన్నిటికీ దాసోహం చెయ్యనక్కరలేదు. కొంతవరకు అదే కారణం అయి ఉంటుంది, కొందరు మఠాల్లో చేరటానికి. కాని మఠానికి వెళ్ళిపోవటంలో మానసికంగా పారిపోవటం లాంటివి ఉంటాయి. అటువంటి క్రమబద్ధమైన ఒంటరితనంలోకి పారిపోవాలని లేదు నాకు. నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఆ నామరహితమైన దానిని కనుక్కోవాలనే నేనిక్కడికి వచ్చాను. కనుక్కోగల శక్తి నాలో ఉందంటారా?"

అది శక్తికి సంబంధించిన విషయమా? శక్తి అనగానే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అనుసరించ గలగటం అని స్ఫురిస్తుంది. ఒక నిర్ణీత మార్గాన్ని అవసరమైన సర్దుబాట్లన్నీ చేసుకుంటూ అవలంబించటమా? మీరు ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఒక సామాన్యవ్యక్తిలా మీరు కోరుకున్నదాన్ని పొందటానికి అవసరమైనవన్నీ మీ వద్ద ఉన్నవా అని అడగటం లేదా? నిజానికి, మీ ప్రశ్నలో ఉద్దేశం, ఎవరో అసాధారణ వ్యక్తులే సత్యాన్ని కనుక్కోగలరనీ, అది సామాన్య మానవుడికి సాధ్యం కాదనీను. సత్యం కొందరికి మాత్రమే. కేవలం అసాధారణమైన మేధావులకు మాత్రమే ప్రాప్తమవుతుందనా? మనకా శక్తి ఉందా అని ఎందుకు అడుగుతాం? మన దగ్గరొక నమూనా ఉంది. అ సత్యాన్ని కనుక్కున్నామనుకునే వారి ఉదాహరణ ఉంది. ఉదాహరణ మనకన్న ఉన్నతస్థితిలో ఉండి మనలో ఒక విధమైన సందిగ్ధతని కలిగిస్తుంది. ఆ విధంగా ఉదాహరణకి ప్రాముఖ్యం హెచ్చిపోతుంది. ఇక ఉదాహరణకీ మనకీ మధ్య పోటీ వస్తుంది. మనం కూడా అదే విధంగా ఎవ్వరూ చెయ్యలేనిపని చేసి నిరూపించాలని ఉంటుంది. చైతన్యావస్థలో గాని, సుప్తచైతన్యస్థితిలో గాని, ఇప్పుడున్న దానిని ఉదాహరణలో మాదిరిగా ఉండే దానితో పోల్చి చూడటం వల్ల కదా "నాకా శక్తి ఉందా?" అనే ప్రశ్న వచ్చింది?

ఒక ఆదర్శంతో మనల్ని మనం ఎందుకు పోల్చుకోవటం ? ఈ పోల్చుకోవటం వల్ల అవగాహన కలుగుతుందా? అసలా ఆదర్శానికీ మనకీ తేడా ఉందా? ఇది మనం స్వయంగా కల్పించుకున్నదే కాదా? మనం తయారుచేసుకున్నది కాదా? మనం ఉన్న స్థితిని యథాతథంగా అర్థం చేసుకోకుండా అది అడ్డు నిలవటం లేదా? అలా పోల్చి చూడటం మనల్ని మనం అవగాహన చేసుకోకుండా తప్పించుకోవటం కాదా? మన నుంచి మనం తప్పించుకోవటానికి అనేక మార్గాలున్నాయి. అందులో పోల్చుకోవటం ఒకటి. నిజానికి ఎవరిని వారు అర్థం చేసుకొనకుండా సత్యాన్ని శోధించాలను కోవటం మన నుంచి మనం పారిపోవటమే. ఆత్మజ్ఞానం లేకుండా మీరు శోధించే దైవం కేవలం మీ భ్రమ మాత్రమే అవుతుంది. భ్రమ సంఘర్షణకీ, దుఃఖానికీ దారి తీయక తప్పదు. ఆత్మజ్ఞానం లేకుండా సరిగ్గా ఆలోచించటం కూడా సాధ్యం కాదు. అప్పుడు ఉన్న విజ్ఞానమంతా అజ్ఞానమే అయి, గందరగోళానికీ, వినాశానికీ దారి తీస్తుంది. ఆత్మజ్ఞానం అంతిమ లక్ష్యం కాదు. అనంతమైన దాన్ని తెరిచి చూపే ద్వారం మాత్రమే.

"ఆత్మ జ్ఞానం సంపాదించటం చాలా కష్టం కాదా? దానికి ఎంతో కాలం పట్టదా?"

అసలు స్వీయజ్ఞానం సంపాదించటం కష్టం అనే భావమే ఆత్మజ్ఞానానికి అవరోధం. నా సలహా ఏమిటంటే, అసలది కష్టమనీ, చాలా కాలం పడుతుందనీ అనుకోకండి. అదేమిటో, ఏంకాదో, ముందుగానే నిశ్చయానికి రాకండి. ఆరంభించండి. ఆత్మజ్ఞానం మీ సంబంధ, బాంధవ్యాల్లోనే ఆవిష్కరింపబడుతుంది. కావాలని ఒంటరిగా ఉండటంతోనూ, ఎవ్వరితోనూ కలవకుండా వేరుగా ఉండటంతోనూ ఆత్మజ్ఞానం కలగదు. సంబంధ బాంధవ్యాలను వదులు కోవటం అంటే మరణించటమే. మరణం అంతిమ ప్రతిఘటన. ప్రతిఘటించటం, అణచివేయటం, దాని స్థానంలో మరొకటి ప్రతిష్ఠించటం, ఆరాధించటం, ఏరూపంలోనైనా ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకాలే. ప్రతిఘటన కనిపించనిదైనా, కనిపించేదైనా, పోల్చటాలూ, సమర్ధింపులూ, ఖండించటాలూ, ఐక్యత వ్యక్తపరచటాలూ - ఇదంతా ఉన్నదాన్ని కాదనటమే. అర్ధమంతా ఉన్నదాంట్లోనే ఉంటుంది. అందులో ఉన్న అర్థాన్ని ఏ పక్షమూ వహించకుండా గ్రహించటమే దాని ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణే వివేకానికి నాంది. అపరిచితమైనదీ, అనంతమైనదీ సిద్ధించటానికి వివేకం అవసరం.