మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/తెలిసినది, తెలియనిది

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

18. తెలిసినది, తెలియనిది


నిశ్చలమైన నీటిమీద సాయంకాలపు నీడలు పొడుగ్గా పడుతున్నాయి. పగలు పూర్తి అవుతున్న కొద్దీ నది ప్రశాంతగా అవుతోంది. చేపలు నీళ్లలోంచి పైకి గెంతుతున్నాయి. పెద్ద పెద్ద పక్షులు చెట్లలో తలదాచుకోవటానికి వస్తున్నాయి. ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. నీలంగా మెరుస్తోంది ఆకాశం. మనుషులతో నిండిన పడవ ఒకటి నది మీంచి వస్తోంది. చప్పట్లు కొడుతూ పాడుతున్నారు పడవలో వాళ్లు. కొంచెం దూరంలో ఆవు ఒకటి అరుస్తోంది. సాయంకాలపు సుగంధం పరివ్యాప్తమై ఉంది. బంతి పువ్వుల దండ ఒకటి నీళ్లతో బాటు కొట్టుకుపోతోంది, సూర్యాస్తమయంలో మెరుస్తూ. అంతా ఎంత అందంగా సజీవంగా ఉంది - అ నదీ, ఆ పక్షులూ, ఆ వృక్షాలూ, అ పల్లెవాళ్లూ.

నదికి ఎదురుగా మేము ఒక చెట్టు క్రింద కూర్చున్నాం. ఆ చెట్టుకి దగ్గరలోనే ఒక చిన్న గుడి ఉంది. బక్క చిక్కిన ఆవులు కొన్ని ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాయి. ఆ గుడి ఎంతో శుభ్రంగా బాగా తుడిచి ఉంది. పూలపొదలు నీళ్లు పోసి బాగా పెంచినట్లున్నాయి. ఒకాయన సంధ్యావందనం చేస్తున్నాడు. ఆయన కంఠంలో సహనం, విషాదం ఉన్నాయి. సూర్యుని అంతిమ కిరణాల కాంతితో అప్పుడే వికసించిన పూలరంగులో ఉన్నాయి నీళ్లు. అంతలో ఎవరో ఒకాయన వచ్చి, మాతో బాటు కూర్చుని, తన అనుభవాల గురించి చెప్పటం మొదలుపెట్టారు. తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు దైవాన్ని అన్వేషించటంలోనే గడిచాయన్నాడు. ఎన్నో నిరాడంబర మార్గాలను అనుసరించాడుట. ఎన్నో ప్రీతికరమైన వాటిని త్యజించాడుట. సంఘ సేవలో ఎంతో తోడ్పడ్డాడుట - పాఠశాల నిర్మించటం, మొదలైన వాటిలో ఆయనకి ఎన్నో విషయాల్లో ఆసక్తి ఉన్నదిట. కాని, దైవాన్ని కన్నుక్కోవాలనే ఆసక్తే ఆయన్ని దహించి వేస్తున్నదిట. ఇన్నేళ్లకి, ఇప్పుడు అ దైవాన్ని వినగలుగుతున్నాడుట. చిన్న చిన్న విషయాల్లోనూ, పెద్ద విషయాల్లోనూ కూడా మార్గదర్శక మవుతున్నదిట. తన సొంత ఉద్దేశమంటూ ఏదీ లేదుట. అంతా ఆ అంతర్వాణి చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాడుట. అది ఎప్పుడూ ఆయన్ని భంగపరచలేదుట, అప్పుడప్పుడు దాన్ని స్పష్టంగా, సరిగ్గా గ్రహించలేక పోయినప్పటికీ ఆయన ప్రార్థన అంతా ఈ కాయాన్ని పవిత్రం చేసుకోవటం కోసం, అ దైవానుగ్రహానికి పాత్రం కావటం కోసమేనట.

అపరిమితమైనటువంటి దాన్ని మీరూ నేనూ కనుక్కోగలమా? కాలంతో ప్రమేయం లేనట్టి దాన్ని, కాలంతో రూపొందినట్టిదాని సహాయంతో అన్వేషించగలమా? ఎంతో కష్టపడి శ్రద్ధగా సాధన చేసిన శిక్షణ అపరిచితమైనట్టి దానికి దారి చూపుతుందా? ఆది కాని అంతంకాని లేనట్టి దానికి ఒక మార్గమంటూ ఉంటుందా? అటువంటి సత్యాన్ని మన కోరికల వలలో పట్టుకోగలమా? మనం ఏది పట్టుకోగలిగినా, అది తెలిసినదాని ప్రతిరూపం మాత్రమే. నామకరణం చేయబడినది అనామిక కాలేదు. నామకరణం చేయటం అంటే నిద్రాణంగా ఉన్న ప్రతిక్రియలను మేలుకొల్పటం మాత్రమే. ఈ ప్రతిక్రియలు ఎంత ఉన్నతమైనవైనా, ఎంత సంతోషకరమైనవైనా, నిజమైనవి కాదు. ఏదైనా ఉత్తేజం కలిగిస్తే మనలో ప్రతిక్రియ ఏర్పడుతుంది. సత్యం ఎటువంటి ఉత్తేజాన్నీ కలిగించదు. అది ఉంటుంది. అంతే.

మనస్సు తెలిసినదాన్నుంచి తెలిసినదానికి కదులుతూ ఉంటుంది. మీకు తెలియని దాన్ని గురించి మీరు ఆలోచించలేరు. అది అసంభవం. మీరు ఆలోచించేదంతా తెలిసిన దాన్నుంచే వస్తుంది, గతం నుంచి, ఆ గతం ఏనాటిదో కావచ్చు, ఒక్క క్షణం క్రిందటిదయినా కావచ్చు. ఈ గతం కూడా ఆలోచనే. అనేక ఆకృతుల్లో, ఎన్నో ప్రభావాలకులోనై, పరిస్థితులకూ, ఒత్తిడికీ లోనవుతూ తన్ను తాను మార్చుకుంటూ, ఎప్పటికీ గత ప్రక్రియగానే మిగిలి పోతుంది. ఆలోచన దేన్నైనా కాదనగలదు, అవునన గలదు, అంతే. దేన్నీ కనుగొనటంగాని, కొత్త దాన్ని వెతకటంగాని చెయ్యలేదు. ఏ కొత్త విషయాన్ని గురించీ ఆలోచన రాదు. కాని, ఆలోచన మౌనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్తది రావచ్చు. కాని, దాన్ని మళ్లీ పాతదాన్నిగా, అనుభవం అయిన దానిగా చేస్తుంది ఆలోచన. ప్రతి అనుభవానికీ అనుగుణంగా తన్ను తాను రూపొందించుకొని, మార్పులు చేసుకుంటూ రంగులు మార్చుకుంటూ ఉంటుంది ఆలోచన ఎప్పుడు చూసినా, ఆలోచన చేసే పని అనుభవాన్ని వ్యక్త పరచటం మాత్రమే, అంతేకాని, అనుభవం పొందే స్థితిలో ఉండటం కాదు. అనుభవం పొందటం అయిపోగానే ఆలోచన అందుకుని ఆ అనుభవాన్ని తనకు తెలిసిన రకంగా పిలుస్తుంది. ఆలోచన తెలియని దానిలోకి దూరలేదు. అందుచేత సత్యాన్ని కనుగొనటం గాని అనుభవం పొందటం గాని దానికి చేతకాదు.

నిష్ఠలూ, నియమాలూ, త్యజించటాలూ, మమకారాలు త్రెంచుకోవటాలు, పూజలూ, సద్గుణ సాధనా - ఇవన్నీ ఎంత మహోన్నతమైన వైనా అన్నీ ఆలోచనా ప్రక్రియలే. ఆలోచన ఎప్పుడూ లక్ష్యం వైపూ, విజయసాధనకోసం మాత్రమే పనిచేయగలుగుతుంది. అవన్నీ అది ఎరిగున్నవే. సాధించిన ఘనత రక్షణ కల్పిస్తుంది - తెలిసిన దాని వల్ల వచ్చేది ఆత్మరక్షక విశ్వాసం. ఊరూపేరు లేని దానిలో రక్షణ కోసం వెతకటం వృథా. ఒకవేళ రక్షణ లభించినా, అది గతంలో తెలిసిన దాని ప్రతిరూపమే. అందువల్ల మనస్సు పూర్తిగా గాఢ నిశ్శబ్దంతో ఉండాలి. కాని ఈ నిశ్శబ్దం త్యాగంతోనూ, ఆరాధనతోనూ, అణగ త్రొక్కటంతోనూ కొనగలిగేది కాదు. మనస్సు ఇంక దేనినీ కోరకుండా ఉన్నప్పుడు, ఏదో అవాలనే ప్రక్రియలో ఇక ఏ మాత్రం చిక్కుకుని ఉండనప్పుడూ ఈ నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఈ నిశ్శబ్దం కూడబెట్టిన బాపతు కాదు. సాధన వల్ల నిర్మితమైనది కాదు. ఈ నిశ్శబ్దం కాలరహితమైన దానిలాగే మనస్సుకి తెలియనిది. మనస్సు కనుక నిశ్శబ్దాన్ని అనుభవించినట్లయితే, అది గతంలో అనుభవించిన నిశ్శబ్దాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది - ఆ గుర్తుకు తెచ్చుకునేది గత అనుభవాల ఫలితంగా ఏర్పడిన "అనుభవించేది" లేక అనుభోక్త అనేది. అనుభోక్త పొందిన అనుభవం కేవలం స్వయం కల్పితమైనది, పునశ్చరణ మాత్రమే. మనస్సు కొత్తదాన్ని ఎన్నటికీ అనుభవం పొందలేదు. అందువల్ల మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఉండాలి.

మనస్సు అనుభవం పొందే స్థితిలో లేనప్పుడే నిశ్చలంగా ఉండగలుగు తుంది. అంటే, అనుభవంలోకి వస్తున్న దాన్ని ఫలానా అని చెప్పి, పేరుపెట్టి, తక్కిన జ్ఞాపకాలతోబాటు సుస్థిరం చేసుకోవటం, దాచుకోవటం చెయ్యకుండా ఉన్నప్పుడే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఈ నామకరణం చెయ్యటం, సుస్థిరం చెయ్యటం చైతన్యావస్థలోని వేరువేరు పొరల్లో జరిగే నిరంతర ప్రక్రియ. కాని, మనస్సు పైపైన నిశ్చలంగా ఉన్నప్పుడు లోలోపలి మనస్సు కొన్ని సూచనలను అందివ్వవచ్చు. చైతన్యావస్థ యావత్తూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏదో అవాలని ఏవిధమైన కోరికా లేకుండా స్వేచ్ఛగా ఉన్నప్పుడు, అనాలోచితంగా ఉన్నప్పుడు - అప్పుడు మాత్రమే అపరిమితమైనది ఉద్భవిస్తుంది. ఈ స్వేచ్ఛను అలాగే ఉంచుకోవాలనే కోరిక, స్వేచ్ఛగా అయిన దాని జ్ఞాపకం కొనసాగేటట్లు చేస్తుంది. దీనివల్ల సత్యానికి ఆటంకం కలుగు తుంది. సత్యం ఒకేవిధంగా కొనసాగదు. అది క్షణక్షణానికీ, ఎప్పుడు చూసినా కొత్తగా, ఎప్పుడు చూసినా స్వచ్ఛంగా ఉంటుంది. కొనసాగేది ఎన్నటికీ సృజనాత్మకం కాదు.

పైపై మనస్సు వ్యక్తపరిచేందుకున్న సాధనం మాత్రమే. అపరిమితమైన దాన్ని కొలిచే శక్తి లేదు దానికి. సత్యం గురించి చెప్పటానికి వీలుకాదు. వీలున్నట్లయితే, అది సత్యమే కాదింక.

ఇదే ధ్యానం చేయటమంటే.