మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ

వికీసోర్స్ నుండి

17. సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ

ఆ దారి పొలం ప్రక్కనుంచే పోయి, కొండమీదుగా వెడుతుంది. దాని కెదురుగుండా ఇళ్లూ, ఆవులూ, ఆవుదూడలూ, కోళ్లూ, గుర్రాలూ, బోలెడు వ్యవసాయ యంత్రాలూ కనిపిస్తాయి. అడవుల్లోంచి వెళ్ళే ఆ దారి ఎంతో బాగుంటుంది. లేళ్లూ, ఇతర వన్యమృగాలు అటు వెడుతూ ఉంటాయి తరుచుగా. వాటి అడుగుల ఆనవాళ్ళు మెత్తని మట్టి మీద ఇక్కడ, అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పొలంలోంచి కంఠధ్వనులూ, నవ్వులూ, రేడియో శబ్దాలూ చాలా దూరం వరకూ వినిపిస్తూ ఉంటాయి. అ పొలంలో బాగా పనిసాగుతున్నట్లుంది. తీర్చిదిద్దినట్లు శుభ్రంగా ఉంది. తరచు వాళ్ల గొంతులు కోపంతో అరుస్తున్నట్లు గట్టిగా వినిపిస్తాయి. దాంతో, పిల్లలు చడీచప్పుడు లేకుండా అయిపోతారు. చెట్ల మధ్యనుంచి ఏదో పాట వినిపిస్తోంది. కోపంతో వాళ్లు అరిచిన అరుపులకి పాట శబ్దం అణగిపోయింది. హఠాత్తుగా ఒక స్త్రీ ఇంట్లోంచి బయటికి వచ్చింది; తలుపు ధడాలున వేసి, దూడల పాక దగ్గరికి వెళ్ళి ఒక - ఆవుని బెత్తం పుచ్చుకుని కొట్టటం మొదలు పెట్టింది. ఆ బెత్తం చప్పడు కొండ పైదాకా వినిపిస్తోంది.

మనం ప్రేమించేదాన్ని నాశనం చెయ్యటం ఎంత సులభం! మన మధ్య అవరోధం ఎంత త్వరలో ఏర్పడిపోతుంది, ఒక్కమాటతో, ఒక్క చేష్టతో, ఒక్క చిరునవ్వుతో! ఆరోగ్యం, మనస్థితి, కోరిక - వీటి వెంట వాటి నీడ పడుతుంది. అంతవరకూ ఉత్సాహంగా ఉన్నదే మందకొడిగా, భారంగా తయారవుతుంది. వాడుకుని వాడుకుని మనల్ని మనమే అలసిపోయేట్లు చేసుకుంటాం. అంతకు ముందు చురుకుగా స్పష్టంగా ఉన్నదే అలసటగా అయోమయంగా అయిపోతుంది. నిరంతరం ఘర్షణ, ఆశ, నిరాశ - వీటితో, ఎంతో అందంగా సరళంగా ఉన్నదే భయంకరంగా, మర్మ గర్భితంగా అయిపోతుంది. సంబంధం క్లిష్టమైనది, కష్టపూరితమైనది. దానిలోంచి ఏ మచ్చా లేకుండా బయటపడగలిగే వాళ్లు చాలా కొద్దిమంది ఉంటారు. మనం చలనం లేకుండా, శాశ్వతంగా కొనసాగేట్లు ఉండాలనుకున్నా, సంబంధం అనేది ఒక సంచలనం, ఒక ప్రక్రియ. దాన్ని గాఢంగా, సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, ఏదో అంతరంగికమైన పద్ధతిలో, బాహ్య పద్ధతిలో అనుగుణంగా ఉండటంతోకాదు. ఉన్న పద్ధతి ప్రకారం నడుచుకోవటం సంఘంలోని కట్టుబాటు. ప్రేమకి ఆ కట్టుబాటుతో పని లేదు. సంబంధ బాంధవ్యంలో ప్రేమ పవిత్రం చేసే ప్రక్రియ. స్వార్ధపరమైన మార్గాలన్నిటినీ తేటతెల్లం చేసే ప్రక్రియ అది. ఆ విధమైన ఆవిష్కరణ జరగకుండా సంబంధ బాంధవ్యాలకి అర్థంలేదు.

కాని, అలా ఆవిష్కారం కాకుండా ఎంత పోరాడుతాం! ఈ పోరాటం అనేక రూపాల్లో ఉంటుంది - అధికారం చెలాయించటం గాని, అణగి ఉండటంగాని, భయంగాని, ఆశగాని, అసూయగాని, అనుగ్రహంగాని - ఇలా అనేక రకాలుగా. వచ్చిన చిక్కేమంటే మనం ప్రేమించలేం. ఒకవేళ ప్రేమ చూపించినా, అది మనం చెప్పిన పద్ధతి ప్రకారం నడవాలనుకుంటాం. దానికి స్వేచ్ఛనివ్వం. మనస్సులతో ప్రేమిస్తాం కాని హృదయాలతో కాదు. మనస్సు తన్ను తాను కావలసినట్లు మార్చుకోగలదు. కాని, ప్రేమ అలాకాదు. మనస్సు తన్ను తాను సురక్షితంగా ఉంచుకోగలదు. కాని, ప్రేమ అలా చేయలేదు. మనస్సు వెనక్కి లాక్కోగలదు. విడిగా, ప్రత్యేకంగా ఉండగలదు. ఆత్మీయంగా గాని, అంటీ ముట్టనట్లుగా గాని ఉండగలదు. ప్రేమను పోల్చి చూడటం, దాని చుట్టూ కంచె కట్టటం కుదరదు. అయితే, మనకొచ్చే కష్టమంతా మనం "ప్రేమ" అని అనే దాంట్లో ఉంది. నిజానికి, మనం అనేది మనస్సుకి చెందినదే. మన హృదయాలను మానసికమైన వాటితో నింపి, హృదయాలను శూన్యంగా, దేనికోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంచుతాం. ప్రాకులాడేదీ, ఈర్ష్యపడేది, పదిలపరిచేది, నాశనం చేసేదీ, అన్నీ మనస్సే. మన జీవితాన్ని ఆధీనంలో ఉంచేవి శరీరమూ మనస్సునూ. మనం ప్రేమించటంతో ఊరుకోము. మనం కూడా ప్రేమింపబడాలని ప్రాకులాడుతాం. మనం ఇచ్చేది తీసుకోవటం కోసమే. ఈ ఇవ్వటం మానసికంగానే కాని హృదయ పూర్వకంగా కాదు. మనస్సు ఎప్పుడూ నిశ్చితంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది. మనస్సుతో ప్రేమని నిశ్చితం చేయటం సాధ్యమేనా? కాలబద్ధమయే తత్వం గల మనస్సు అనంతమైన ప్రేమను అందుకోగలదా?

హృదయంలోని ప్రేమ కూడా కొన్ని తమాషాలు చేస్తుంది. ఎందుచేతనంటే, మనం మన హృదయాలను సంశయాత్మకంగా, సందిగ్ధమయంగా అయేటంతగా పాడుచేశాం. దీని వల్లనే జీవితం అంత బాధాకరంగానూ కష్టదాయకంగానూ అవుతోంది. ఒక క్షణంలో మనలో ప్రేమ ఉంటుంది, మరుక్షణం పోతుంది. మానసికం కానిది - ఎక్కణ్ణించి వచ్చిందో తెలుసుకోలేని ఒక ఊహాతీత మయిన శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తిని మనస్సు నాశనం చేస్తుంది. ఆ రెండింటికీ జరిగే యుద్ధంలో మనస్సే ప్రతిసారి విజేత. మనలో జరిగే ఈ సంఘర్షణకి పరిష్కారం మనసు తన చాతుర్యంతో సాధించేది కాదు. సంకోచించే హృదయం సాధించేది కాదు. ఈ సంఘర్షణని అంత చేసేందుకు మార్గమంటూ ఏదీ లేదు. ఒక మార్గాన్ని కనిపెట్టాలనుకోవటం కూడా, మనస్సు తన ఆధిక్యాన్ని చూపించుకోవాలనీ, సంఘర్షణని తప్పించుకుని శాంతంగా ఉండాలనీ, ప్రేమని పొందాలనీ, ఇంకేదో అవాలనీ తపించటమే.

మనస్సు కోరదగిన ప్రేమ అనే లక్ష్యంగా, ప్రేమించటానికి ఎటువంటి మార్గమూ లేదని అన్ని విధాలా తెలుసుకోవటమే మన ముఖ్య సమస్య. ఈ విషయాన్ని మనం నిజంగా ప్రగాఢంగా అర్ధం చేసుకున్నట్లయితే, ఈ లోకానికి అతీతమైనదేదో అందుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి దానితో సంపర్కం లేనంతవరకూ మనం ఏం తల పెట్టినా సంబంధ బాంధవ్యాల్లో ఏనాటికీ ఆనందం లభించదు. మీకు ఆ వరం లభించి, నాకు లభించినట్లయితే, మీకూ నాకు మధ్య సంఘర్షణ రావచ్చు. మీకు సంఘర్షణ లేకపోవచ్చు. నాకు ఉంటుంది. నా బాధలో, నా దుఃఖంలో నాకై నేను తెగతెంపులు చేసుకుంటాను. దుఃఖం కూడా సంతోషం లాగే ప్రత్యేకత నిస్తుంది. స్వయం సిద్ధంకాని ప్రేమ ఉండనంత కాలం సంబంధ బాంధవ్యాలు బాధాకరంగా ఉంటాయి.

ఆ ప్రేమ వరం కనుక పొందినట్లయితే నేనెలాంటి వాడినైనా నన్ను మీరు ప్రేమించక మానరు. అప్పుడు నా ప్రవర్తన బట్టి మీ ప్రేమకు రూపాన్నివ్వరు. అప్పుడు మనస్సు ఎన్ని వేషాలు వేసినా, మీరూ నేనూ వేరైనా, ఏవో కొద్ది విషయాల్లో మాత్రమే మీకు నాకూ కలిసినా, సమైక్యత ఏర్పడేది మీతోకాదు, నాలోనాకే. ఈ సమైక్యతని మనస్సు ఎట్టి సమయంలోనూ సాధించలేదు. మనస్సు పూర్తిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే, దానంతట అది అంతమైపోయినప్పుడే సమైక్యత సిద్ధిస్తుంది. అటువంటప్పుడే సంబంధ బాంధవ్యంలో బాధ అనేది ఉండదు.