Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/నిద్ర

వికీసోర్స్ నుండి

16. నిద్ర

శీతాకాలం, చలి విపరీతంగా ఉంది. చెట్లు మోడులైపోయాయి. ఆకులన్నీ రాలిపోయి కొమ్మలు బోడిగా ఉన్నాయి. ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా చల్లగాలులకూ రాత్రిళ్లు కురిసే మంచుకి గురి అవుతున్నాయి. దూరాన ఎత్తైన కొండల నిండా దట్టంగా మంచు. వాటిపైన తెల్లటి కెరటాల్లాంటి మబ్బులు వ్రేలాడుతున్నాయి. గడ్డి మట్టిరంగులో ఉండి. ఎన్నో నెలల నుంచి వర్షాల్లేవు. వసంతకాలపు వానల కింకా చాలా కాలం పడుతుంది. భూమి నిద్రావస్థలో ఉన్నట్లు, సాగు చేయకుండా పడిఉన్నట్లుగా ఉంది. పచ్చని చెట్లమీద గూళ్లు కట్టుకుని కిలకిలమంటూ ఎగిరే పక్షుల్లేవు. దారులన్నీ గట్టిపడి మట్టికొట్టుకొని ఉన్నాయి. సరస్సులో కొన్నిబాతులు దక్షిణం వైపుకి మధ్యమధ్య ఆగుతూ పోతున్నాయి. కొత్త వసంతం వస్తుందని ఆశపెడుతున్నాయి పర్వతాలు. భూమి దానిగురించి కలగంటోంది.

నిద్ర అనేది లేకపోతే ఏమవుతుంది మనకి? ఇంకా కొట్లాడుకోవడానికీ, కుట్రలుపన్నటానికీ, అల్లరి తలపెట్టటానికీ మరింత సమయం దొరుకుతుందా? మనం మరింత క్రూరంగా, దయాదాక్షిణ్యాలు లేకుండా ఉంటామా? లేక, నమ్రత, దయ, పొదుపు చూపించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందా? మనం మరింత సృజనాత్మకంగా అవుతామా? నిద్ర చాలా చిత్రమైనది. దానికి అసాధారణమైన ప్రాముఖ్యం ఉంది. చాలా మందికి వారి దైనందిన చర్యలన్నీ రాత్రిళ్లు నిద్రలో కూడా కొనసాగుతూ ఉంటాయి. నిద్రలో కూడా వారి జీవితం కొనసాగుతుంది. మందకొడిగానో, ఉత్సాహభరితంగానో, రుచీపచీలేని అర్థరహితమైన పోరాటం మరోస్థాయిలో విస్తృతమవుతుంది. నిద్ర వల్ల శరీరంలో పునరుత్తేజం కలుగుతుంది. దాని బ్రతుకు అది బ్రతికే లోపలి జీవికి పునరుద్ధరణం కలుగుతుంది. నిద్రలో కోరికలు నిద్రాణంగా ఉంటాయి. అందువల్ల జీవికి అడ్డంరావు. శరీరం పునర్వికాసం పొందిన మీదట కోరిక తన చర్యల్ని ఉత్సాహంతో విస్తృతం చేసుకోవటానికి మరింత అవకాశం కలుగుతుంది. లోపలి జీవి విషయంలో ఎంత తక్కువగా కలుగజేసుకుంటే అంత మంచిది నిజానికి. ఆ జీవి విషయమై మనస్సు ఎంత తక్కువగా వ్యవహరిస్తే దాని పనులు అంత ఆరోగ్యకరంగా, అంత సహజంగా ఉంటాయి. ఆ జీవికి జబ్బులు రావటం అన్నది వేరే విషయం - మనస్సు వల్ల వచ్చినవి గాని, దాని స్వీయ బలహీనత వల్ల వచ్చినవి గాని.

నిద్రకి ఎంతో అర్థం ఉంది. కోరికలు శక్తిమంత మవుతున్న కొద్దీ నిద్రకి అర్థం పోతుంది. కోరికలు పైకి కనిపించేవి అయినా, కనిపించనివి అయినా అన్నీ ప్రధానంగా పైన ఉండేవే. నిద్రా సమయంలో ఇవి పైకి కనిపించకుండా ఉంటాయి. తాత్కాలికంగా. నిద్ర కోరికకి వ్యతిరేకమైనది కాదు. నిద్ర అంటే ఏమీ లేకపోవటం అని కాదు - కోరిక చొరరాని స్థితి అని మాత్రమే. చైతన్యపు పై పొరలు స్తిమిత పడటం జరుగుతుంది నిద్రలో. అందుచేత అవి లోలోపలి పొరలు అందించే సమాచారాన్ని గ్రహించగలుగుతాయి. కాని ఇది సమస్య మొత్తంలో కొద్ది భాగాన్ని అర్థం చేసుకున్నట్లవుతుంది. చైతన్యపు పొరలన్నీ ఒక దాన్నొకటి, పని పాటలు చేసుకుంటున్న సమయంలోనూ, నిద్రపోతున్నప్పుడూ కూడా తెలుసుకోవటం నిస్సంశయంగా సాధ్యమవుతుంది. ఇది అవసరం కూడా. ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనస్సు తనకు తాను ఆపాదించుకున్న స్వీయ ప్రాముఖ్యం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అందువల్ల ఇక మనస్సు ఆధిక్యం ఉన్న అంశంగా ఉండదు. ఆ విధంగా మనస్సు తన స్వార్ధ పూరితమైన ప్రయత్నాలనూ, చర్యలనూ స్వేచ్ఛగా, సహజంగా వదులు కుంటుంది. ఈ ప్రక్రియలో ఏదో అవాలనే వాంఛ పూర్తిగా కరిగిపోతుంది. కూడబెట్టాలనే తొందర ఇక ఉండనే ఉండదు.

నిద్రలో జరిగేదింకా కొంత ఉంది. మన సమస్యలికి పరిష్కారం దొరుకుతుంది అందులో చైతన్యంతో ఉండే మనస్సు నెమ్మదిగా ఉన్నప్పుడు పరిష్కారాన్ని గ్రహించటానికి వీలవుతుంది. ఇది సులభమే. అంతకన్న అర్థవంతమైనదీ, ముఖ్యమైనదీ ఏమిటంటే, అది పునరుద్ధారణం. అది అలవరుచుకునేది కాదు. ఒక సహజ నైపుణ్యాన్నిగాని, సామర్థ్యాన్నిగాని, సాంకేతిక నైపుణ్యాన్నిగాని, ఒక కార్యకలాపాన్నిగాని ప్రవర్తననిగాని ప్రయత్నపూర్వకంగా అలవరచుకోగలరు ఎవరైనా. కాని, ఇది పునరుద్ధారణం కాదు. అలవరచుకోవటం అంటే సృజించటం కాదు. ఏదో అవాలనుకుని ఏదైనా ప్రయత్నించినట్లయితే, ఈ సృజనాత్మక పునరుద్ధారణం సాధ్యమవదు. మనస్సు తనంతట తాను కూడబెట్టాలనే కోరికని వదులుకోవాలి. ఒక అనుభవం ద్వారా మరికొంత అనుభవాన్నీ, విజయాన్నీ సాధించటం కోసం కూడబెట్టటం పోవాలి. ఈ కూడ బెట్టాలనే తపన, స్వీయ రక్షణ చేసుకోవాలనే తపన కాలగతిని పెంపొందిస్తూ, సృజనాత్మక పునరుద్ధారణం కాకుండా చేస్తుంది.

చైతన్యావస్థకి కాలంతో సంబంధం ఉన్నదని మనకి తెలుసును. జరిగిన దాన్ని సుస్థిరం చేసుకోవటం, అనుభవాన్ని దాచుకోవటం - వివిధ స్థాయిల్లో జరిగే ప్రక్రియ అది. చైతన్యావస్థలో ఏం జరిగినా అది దాని ప్రతిరూపం మాత్రమే. దాని లక్షణం దానిది. అది పరిమితమైనది. నిద్ర పోతున్నప్పుడు ఈ చైతన్యావస్థ శక్తిమంతం అవుతుంది. లేదా, పూర్తిగా విరుద్ధంగానైనా జరుగవచ్చు. నిద్ర మనలో అనేక మందికి వారి అనుభవాలను శక్తిమంతం చేస్తుంది. అనుభవాన్ని ముద్రించుకుంటుంది, దాచుకుంటుంది. అయితే, అది విస్తృతమవటమేగాని పునరుద్ధారణం కాదు. విస్తృతమైనప్పుడు ఒకవిధమైన ఉత్తేజం కలుగుతుంది. విజయప్రదంగా ఉంటుంది. అర్థమైనట్లూ, ఇంకా అనేక రకాలుగా ఉంటుంది. కాని అదంతా సృజనాత్మక పునరుద్ధారణం కాదు. ఏదో అవాలనుకునే ప్రక్రియ పూర్తిగా అంతం కావాలి, మరికొంత అనుభవానికి దారితీయటం ద్వారా కాదు. అది అంతం అవటం కోసం మాత్రమే.

నిద్రలోనూ, తరుచు పని చేసుకునే సమయంలోనూ, ఏదో అవాలను కోవటం పూర్తిగా ఆగిపోయినప్పూడూ, కారణం, దాని ఫలితం అంత మొంది నప్పుడూ కాలాతీతమైనదీ, కారణ ఫలితాల పరిమితికి అతీతమైనదీ సిద్ధిస్తుంది.