Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సున్నితత్వం

వికీసోర్స్ నుండి

20. సున్నితత్వం

అ తోట రమణీయంగా ఉంది. మెత్తని పచ్చగడ్డితో మైదానాలు; నీడ నిచ్చే పురాతన వృక్షాలూ. ఆ ఇల్లు చాలా పెద్దది - విశాలమైన గదులు గాలీ, వెలుతురుతో మంచి తీరుగా ఉన్నాయి. ఆ చెట్లలో ఎన్నో పక్షులు గూళ్లుకట్టుకున్నాయి. బోలెడు ఉడతలున్నాయి. ఫౌంటెన్ చుట్టూ ఎన్నో పక్షులు - పెద్దవీ, చిన్నవీ, గ్రద్దలూ, కాకులూ, పిచుకలూ, గొడవ చేసే చిలకలూ. అ ఇల్లూ, తోటా కూడా వేటితోనూ సంబంధం లేకుండా వేరుగా ఉన్నాయి - ముఖ్యంగా, వాటి చుట్టూ ఎత్తైన తెల్లని ప్రహరీ గోడలు ఉండటం వల్ల. ఆ గోడలకు లోపలవైపు బాగుంటుంది. బయట రోడ్డు మీంచీ, పల్లెలోంచీ వచ్చే శబ్దాలు. ఆ ఇంటి గేటు ముందు నుంచే వెడుతుంది రోడ్డు. ఆ రోడ్డమ్మట కొన్ని గజాలు పోతే ఒక పల్లె ఉంది, ఒక పెద్ద పట్టణం శివార్లలో. పల్లె దుర్గంధ భూయిష్టంగా ఉంది. ముఖ్యమైన ఇరుకు సందుకి రెండువైపులా కుళ్లు కాలవలు. అక్కడున్నవి పూరిళ్లు. ఇళ్లముందు ముగ్గులు వేసి ఉన్నాయి. పిల్లలు సందులో ఆడుకుంటున్నారు. సాలెవాళ్లు కొందరు చక్కని రంగుదారాలు మగ్గాలికి బిగదీసి కట్టారు, బట్టనేయటానికి. వాళ్లు పని చేస్తూంటే గుంపుగా నిలబడి కొంతమంది పిల్లలు చూస్తున్నారు. ఆ దృశ్యం ముచ్చటగా ఉంది, రంగులతో, చప్పుళ్లతో, వాసనలతో, గ్రామస్థులు అప్పుడే స్నానాలు చేశారు. వాళ్ల ఒంటిమీద బట్టలు అతి స్వల్పంగా ఉన్నాయి, వాతావరణం వేడిగా ఉండటం మూలాన్ని సాయంకాలం అయేసరికి వాళ్లలో కొంతమంది తాగి అరుస్తూ మోటుగా ప్రవర్తిస్తున్నారు.

ఆ రమణీయమైన తోటనీ; ఈ సజీవమైన పల్లెనీ వేరు చేస్తున్న దొక్క పలుచని గోడ మాత్రమే. అందాన్ని పట్టుకుప్రాకులాడుతూ, అనాకారి తనాన్ని వద్దనటం సున్నితత్వం లేకపోవటం వల్లనే. విరుద్ధమైన దానిని అలవాటు చేసుకోవటం వల్ల మనస్సు సంకుచితమవుతుంది. హృదయం పరిమితమవుతుంది. సద్గుణం విరుద్ధమైనది కాదు. దానికి విరుద్ధంగా ఏదైనా ఉన్నదంటే అది సద్గుణం కాదింక. ఆ పల్లె అందాన్ని గ్రహించటానికి అక్కడి పచ్చని పూలతోటని చూసి ఆనందించగలగాలి. అయితే, అందాన్ని మాత్రమే గమనించి, అందంగా లేనిది కనిపించకుండా మూసుక్కూర్చుంటాం. ఈ విధంగా అణచిపెట్టటం వల్ల సున్నితత్వం లేకుండా పోవటం మొదలవుతుంది. అందాన్ని చూసి మెచ్చుకోవటం జరగదు. బాగున్నది ఊరికి దూరంగా ఉన్న తోటలో కాదు. ఆ రెండింటికి అతీతమైన సున్నితత్వంలో ఉంటుంది. వద్దనటం గాని, కావాలనటం గాని సంకుచితత్వానికి దారితీస్తుంది. అంటే సున్నితత్వం లేకుండా ఉండేటట్లు చేస్తుంది. సున్నితత్వం అనేది మనస్సు జాగ్రత్తగా పోషించుకోవలసినది కాదు. మనస్సుకి చేతనైనది విభజించటం, ఆధిక్యం కనపరచటం. మంచీ, చెడూ రెండూ ఉంటాయి. ఒకదాని వెంటబడి, రెండవదాన్ని తప్పించుకోవటం సున్నితత్వానికి దారి తీయదు. సత్యం ఉనికిని తెలుసుకోవటానికి సున్నితత్వం ముఖ్యంగా అవసరం.

సత్యం భ్రాంతికీ, అబద్ధానికీ విరుద్ధమైనది కాదు. విరుద్ధమైనది అనుకుంటూ దాన్ని చేరటానికి ప్రయత్నిస్తే అది ఎన్నటికీ దర్శనం కాదు. విరుద్ధమైనది నశిస్తేనే సత్యం ఉండటం సాధ్యం. నిరసించటం వల్లా, ఐక్యం చేసుకోవటం వల్లా విరుద్ధమైన వాటి మధ్య సంఘర్షణ పెరుగుతుంది. సంఘర్షణ మరింత సంఘర్షణని పుట్టిస్తుంది. ఒక నిజాన్ని ఏవిధమైన భావోద్వేగం లేకుండా, కాదనకుండా చూసినట్లయితే సంఘర్షణ అనేది కలగదు. నిజం అనేదానికి విరుద్ధంగా మరింకేదీ ఉండదు. ఇష్టాయిష్టాలతో ఒక పక్షం వహించినప్పుడే విరుద్ధమైనది ఉంటుంది. ఈ పక్షపాత స్వభావమే సున్నితత్వం లేకుండా చేసి మన చర్యని ధ్వంసం చేస్తుంది.

మనం తోటలోనే ఉండిపోవాలనుకుంటే, గ్రామం అంటే విముఖత ఏర్పడుతుంది. ప్రతిఘటన ఉన్నప్పుడు చర్య తీసుకోవటం సాధ్యంకాదు. తోట పట్లగాని గ్రామం పట్లగాని. కార్య సంరంభం ఉండవచ్చు, కాని అది కార్యాచరణ కాదు. కార్య సంరంభానికి ఒక అభిప్రాయం ఆధారం, కార్యాచరణకు అలాకాదు. అభిప్రాయాలు పరస్పర విరుద్ధంగా ఉండొచ్చును. విరుద్ధమైన వాటి మధ్య కలిగే సంచలనం వట్టి కార్యసంరంభం మాత్రమే. ఎంతకాలం ఆగినా, ఎన్ని పరివర్తనలు చేసినా, కార్య సంరంభం వల్ల స్వేచ్ఛ ఎన్నటికీ లభించదు.

కార్య సంరంభానికి గతమూ భవిష్యత్తూ ఉంటాయి. కార్యాచరణకి అటువంటివి లేవు. కార్యాచరణ ఎప్పుడూ వర్తమానమే. అందుచేత తక్షణం జరుగుతుంది. సంస్కరణ అనేది కార్య సంరంభమే, కార్యాచరణ కాదు. సంస్కరణ అయిన దానికి ఇంకా సంస్కరణ అవసరమవుతుంది. సంస్కరణ అంటే అకర్మ. వ్యతిరేకత నుండి పుట్టినది కార్య సంరంభం. కార్యాచరణ క్షణక్షణమూ జరిగేది. సహజంగా కార్యాచరణలో వైరుధ్యం అనేది ఉండదు. కాని కార్య సంరంభం పైకి ఎడతెగకుండా జరుగుతున్నట్లు కనిపించినా దాని నిండా పరస్పర వైరుధ్యమే. విప్లవం అంతా పరస్పర విరుద్ధ శక్తులలో చిక్కుకున్నదే. అది ఎన్నటికీ స్వేచ్ఛను కలుగ జేయలేదు. సంఘర్షణా, ఎంపికా ఎన్నటికీ స్వేచ్ఛాదాయకం కాలేవు. ఎంపిక ఉంటే కార్యసంరంభం, ఉంటుంది, క్రియ ఉండదు. ఎంపిక అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు కార్యసంరంభంలో మునిగి తేలుతుంది తప్ప కార్యాచరణ జరగదు. కార్యాచరణ జరగటానికి మూలం వేరు.

చంద్రుడు పల్లె మీదుగా వచ్చాడు. తోటమీద నీడపడింది.