మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/మానసిక రక్షణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

31. మానసిక రక్షణ

ఆయన ఆ విషయమై అన్ని విధాలా ఆలోచించానన్నాడు. ఆ విషయం మీద ఏమేమిటి రాసి ఉన్నయో అవన్నీ చదివానన్నాడు. దివ్యగురువులు ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉన్నారన్న నమ్మకం తనకి కలిగిందన్నాడు. వారు తమ ప్రత్యేకమైన శిష్యులికి తప్ప ఇతరులెవ్వరికి భౌతికంగా దర్శనం ఇవ్వకపోయినా, కొందరితో వేరే మార్గాల్లో సంపర్కం పెట్టుకుంటారు. ప్రపంచ సమాలోచనకీ, కార్య నిర్వహణకీ నాయకులైన వారిని లాభదాయకంగా ప్రభావితం చేసి వారికి మార్గాన్ని సూచిస్తారు. ఆ విషయం నాయకులకు తెలియకుండా విప్లవాన్నీ, శాంతినీ తీసుకొస్తారు. ప్రతి భూఖండంలోనూ కొంతమంది దివ్యజ్ఞాన ప్రభువులు ఉన్నారనీ, ఆయా భూఖండాల భవితవ్యాన్ని రూపుదిద్దుతూ వాటికి వారి ఆశీర్వచనాలను అందజేస్తూ ఉంటారని తాను గట్టిగా నమ్ముతున్నాననీ చెప్పాడాయన. అటువంటి మహాపురుషులకు శిష్యులుగా ఉన్న చాలామందిని ఆయన ఎరుగునుట. వారికి తాము శిష్యులమని వాళ్లు చెప్పబట్టే తెలిసిందని అన్నాడాయన జాగ్రత్తపడుతున్నట్లు. ఆయన ఎంతో మనస్ఫూర్తిగానే చెబుతున్నాడు. ఆ దివ్యగురువులను గురించి మరింత తెలుసుకోవాలని కోరుతున్నాడు. ప్రత్యక్షానుభవం కలగటం, ప్రత్యక్షంగా వారితో సంపర్కం కలగటం సాధ్యమా అని అడిగాడాయన.

నది ఎంత నిశ్చలంగా ఉంది! రెండు మెరుస్తున్న చక్కని పక్షులు ఒడ్డుకి దగ్గరగా నీటిపైన పైకీ క్రిందికీ ఎగురుతున్నాయి. తేనెటీగలు కొన్ని తేనె పుట్టకోసం నీటిని పోగుచేస్తున్నాయి. చేపలవాడి పడవ ఒకటి ప్రవాహం మధ్యన ఉంది. నది ఒడ్డు పొడుగునా చెట్లు ఆకులతో ఒత్తుగా ఉన్నాయి. ఆ చెట్ల నీడలు నిండుగా నల్లగా ఉన్నాయి. పొలాల్లో కొత్తగా నాటిన వరినారు పచ్చగా కనిపిస్తున్నాయి. తెల్లటి పిట్టలు కూస్తున్నాయి. ఆ దృశ్యం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో మన అల్ప సమస్యల గురించి మాట్లాడుకోవటం జాలిపడవలసిన విషయంలా తోచింది. ఆకాశం సాయంకాలపు లేత నీలిరంగులో ఉంది. గొడవ గొడవగా ఉండే పట్టణాలు ఎంతో దూరంలో ఉన్నాయి. నదికి అవతలి ఒడ్డున ఒక గ్రామం ఉంది. నది చుట్టూ ఒడ్డు వెంబడే ఒక దారి ఉంది. ఓ కుర్రవాడు స్పష్టంగా గొంతెత్తి పాడుతున్నాడు. అతని పాట అక్కడి ప్రశాంతతని భంగం చెయ్యటం లేదు. మనం చాలా చిత్రమైన మనుషులం. ఏదో కావాలని ఎక్కడెక్కడో దూరదూర ప్రదేశాల్లో వెతుకుతూ తిరుగుతాం - అది మనకి ఎంతో దగ్గరలోనే ఉన్నప్పటికీ. సౌందర్యం ఎక్కడో ఉంటుంది. ఇక్కడ కాదు; సత్యం మన ఇళ్లలో ఉండదు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటుంది అనుకుంటాం. ప్రపంచానికి మరోవైపుకి పోతాం గురువుని అన్వేషించటానికి. నౌకరు గురించి మనం తెలుసుకోం. జీవితంలోని సామాన్య విషయాలను అర్థం చేసుకోము. ప్రతిరోజూ జరిగే పోరాటాలనూ, కలిగే సంతోషాలనూ అర్థం చేసుకోము. అయినా, ఏదో మర్మభూయిష్టమైనదాన్నీ, నిగూఢమైనదాన్నీ అందుకోవటానికి ప్రయత్నస్తాం. మనల్ని మనమే తెలుసుకోం. ఎవరో ఒక బహుమానాన్ని ఒక ఫలితాన్నీ ఒక ఆదర్శలోకాన్నీ ఇస్తానని ఆశపెడితే, వారికి సేవ చెయ్యటానికీ, వారిని అనుసరించటానికీ అంగీకరిస్తాం. మనం గందరగోళంగా ఉన్నంత కాలం మనం ఎంచుకున్నదేదైనా గందరగోళంగానే ఉంటుంది. మనం సగం అంధులమై ఉన్నప్పుడు స్పష్టంగా చూడలేము. మనం చూసేది కొంత భాగం మాత్రమే. అందుచేత అది నిజమైనది కాదు. ఇదంతా మనకి తెలుసు. అయినా, మన కోరికలూ, మన తాపత్రయాలూ ఎంత బలమైనవంటే, మనల్ని భ్రమల్లోకీ, అంతులేని దుఃఖాల్లోకీ ఈడ్చుకుపోతాయి.

గురువుల్లో ఉండే నమ్మకమే గురువుల్ని సృష్టిస్తుంది. నమ్మకం అనుభవాన్ని తీర్చిదిద్దుతుంది. ఒక ప్రత్యేక కార్యక్రమంలోనో, సిద్ధాంతంలోనో నమ్మకం ఉంటే, కోరుకున్న దాన్ని అది సృష్టిస్తుంది. కాని, దానివల్ల ఎంత నష్టం, ఎంత బాధ! సామర్థ్యం ఉన్న వ్యక్తి చేతుల్లో నమ్మకం శక్తిమంతమవుతుంది. తుపాకికన్న ప్రమాదకరమైన ఆయుధం అవుతుంది. మనలో చాలామంది వాస్తవానికన్న నమ్మకానికే ఎక్కువ విలువనిస్తారు. ఉన్న దాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకంతో పనిలేదు. అంతేకాక, నమ్మకం, ఉద్దేశం, దురభిప్రాయంగాని ఉంటే అవగాహనకి ప్రతిబంధకం. కాని మనకి నమ్మకాలూ, దృఢాభిప్రాయాలే కావాలి. అవి మనలో వేడిని పుట్టిస్తాయి. మనకి ఆశ చూపిస్తాయి. మనల్ని ప్రోత్సహిస్తాయి. మన నమ్మకాల తీరుల్ని అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకు వాటిని పట్టుకుని వ్రేలాడుతున్నమో అర్థం చేసుకున్నట్లయితే, వైరుధ్యానికి ఉండే ముఖ్యకారణం ఒకటి మటుమాయ మవుతుంది. లాభం పొందాలనే కోరిక - వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని, అజ్ఞానానికీ, భ్రమకీ, వినాశానికీ, దుఃఖానికీ దారితీస్తుంది. కోరిక అనేది ఇంకా ఎక్కువ భౌతిక సుఖాలకోసమే కాదు; ధనం, జ్ఞానం, ప్రత్యేకత వల్ల వచ్చే అధికారం కోసం కూడా ఉంటుంది. ఇంకా కావాలనే తాపత్రయం సంఘర్షణకీ, దుఃఖానికీ దారితీస్తుంది. అన్ని రకాలుగానూ ఆత్మవంచన చేసుకుంటూ ఈ దుఃఖాన్ని తప్పించుకుపోవటానికి ప్రయత్నిస్తాం - అణచి వేయటం ద్వారా, దాని స్థానంలో మరొకటి ఉంచటం ద్వారా, దాన్ని పవిత్రం చేయటం ద్వారా, కాని, ఆ తాపత్రయం కొనసాగుతూనే ఉంటుంది - మరొక స్థాయిలో కావచ్చు. తాపత్రయం ఏ స్థాయిలోనైనా అది ఎప్పటికీ సంఘర్షణే, దుఃఖమే. అన్నింటిలోకీ సులభమైన పలాయన మార్గాల్లో గురువు ఒకటి. తాపత్రయం ఒకటి. కొంతమంది రాజకీయ సిద్ధాంతాల ద్వారా, దాని కార్యకలాపాల ద్వారా తప్పించుకుంటారు. కొంతమంది పూజలూ, క్రమశిక్షణ - వాటివల్ల కలిగే అనుభూతుల ద్వారా తప్పించుకుంటారు. మరి కొంతమంది గురువు ద్వారా తప్పించుకుంటారు. అలాంటప్పుడు తప్పించుకునే మార్గాలే అతి ముఖ్యమైపోతాయి. భయం, పట్టుదల ఈ మార్గాల్ని సురక్షితంగా ఉంచుతాయి. ఇక, మీరు ఉన్న స్థితి ఏమిటి అనేదానితో ప్రమేయం ఉండదు. గురువే ముఖ్యం అవుతాడు. మీ ప్రాముఖ్యం సేవకుడిగా మాత్రమే, లేక శిష్యుడిగా మాత్రమే - దాని అర్థం ఏదైనప్పటికీ. అందులో ఏదో ఒకటి అవటానికి మీరు కొన్ని పనులు చేస్తారు. కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకుంటారు. కొన్ని పాట్లు పడతారు. ఇదేకాదు. ఇంకేమైనా చెయ్యటానికైనా మీరు సంసిద్ధులే - ఈ ప్రత్యేకత సుఖాన్నీ, అధికారాన్నీ ఇస్తుంది కనుక. గురువు పేరుతో సుఖం, అధికారం గౌరవనీయమవుతాయి. మీరింక ఒంటరిగా, అయోమయంగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండరు. మీరు వారికో, ఆ పార్టీకో, చెందుతారు. మీరు క్షేమంగా ఉంటారు.

ఏం చేసినా, మనలో చాలామంది కోరుకునేది అదే కాదా - క్షేమంగా ఉండటం, సురక్షితంగా ఉండటం. నలుగురితో బాటూ తప్పిపోతే అదొక రకమైన మానసిక రక్షణ. ఒక సంఘంతో గాని, ఒక భావంతో గాని - సర్వసమ్మతమైనది గాని, ఆధ్యాత్మికమైనది గాని - ఏదో ఒకదానితో ఐక్యం చేసుకున్నట్లయితే సురక్షితంగా ఉన్నట్లనిపిస్తుంది. అందువల్లనే మనలో చాలామంది జాతీయ భావాన్ని పట్టుకుని వదలరు - అది వినాశానికీ, దుఃఖానికీ దారి తీసినా సరే. అందువల్లనే మత వ్యవస్థలకి ప్రజలపైన అంత ప్రభావం - అది విభేదాల్నీ, వైరుధ్యాన్నీ పుట్టించినా సరే. వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని రక్షణ కోసం తాపత్రయ పడటం వినాశాన్ని కలుగ జేస్తుంది. మానసికంగా క్షేమంగా ఉండాలనుకోవడం భ్రమని కలిగిస్తుంది. మన జీవితమంతా భ్రమ, దుఃఖం; మధ్య మధ్య ప్రశాంతమైన, సంతోషకరమైన క్షణాలు అరుదుగా ఉంటాయి. అందుకని ఏవి మనకి ఆశ్రయాన్ని కల్పిస్తాయని ఆశపెట్టినా మనం వెంటనే ఒప్పుకుంటాం. కొంతమంది రాజకీయ ఆదర్శాల నిరుపయోగాన్ని చూచిన మీదట మతం వైపుకి మొగ్గుతారు - గురువుల్లోనూ, మూఢవిశ్వాసాల్లోనూ ఆదర్శల్లోనూ రక్షణనీ, సుఖాన్నీ వెతుక్కోవటానికి. నమ్మకం అనుభవాన్ని రూపొందిస్తుంది కనక గురువులు ఉన్నారనేది తప్పించుకోశక్యం కాని నిజం అవుతుంది. ఒకసారి ఐక్యం చేసుకోవటంలో ఉన్న సుఖాన్ని అనుభవించిన తరువాత మనస్సు గట్టిగా బంధింపబడి ఉంటుంది. దాన్ని కుదపటం దేనికీ తరం కాదు. దాని లక్షణమే అనుభవం.

కాని అనుభవం నిజం కాదు. నిజాన్ని అనుభవం పొందటం సాధ్యం కాదు. అది ఉంటుంది, అంతే. అనుభవించేవాడు నిజాన్ని అనుభవం పొందుతున్నావని అనుకుంటే అతనికి తెలిసినది భ్రమ మాత్రమే. నిజం గురించి ఉన్న జ్ఞానమంతా భ్రమే. నిజం ఉండాలంటే జ్ఞానం, అనుభవం అంతమొందాలి. అనుభవం నిజాన్ని చేరుకోలేదు. అనుభవం జ్ఞానాన్ని రూపొందిస్తుంది. జ్ఞానం అనుభవాన్ని మలుస్తుంది. నిజం ఉండాలంటే ఆ రెండూ అంతమవాలి.