మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/కోపం

వికీసోర్స్ నుండి

30. కోపం

అంత ఎత్తుమీద కూడా ఎండ తీక్షణంగా ఉంది. కిటికీ అద్దాలు ముట్టుకుంటే వెచ్చగా ఉన్నాయి. విమానం ఇంజను మోత హెచ్చూ తగ్గూ లేకుండా ఒకేలా వినిపిస్తూ జోకొడుతున్నట్లుగా ఉంది. చాలామంది ప్రయాణీకులు కునుకుతున్నారు. భూమి మాకు బాగా దిగువున ఎండలో మాడిపోతుంది. అంతా మట్టిరంగు, మధ్య మధ్య ఆకుపచ్చ రంగు అతుకులు. అప్పుడే భూమి మీదకు దిగాం. ఎండవేడి మరింత దుర్భరంగా ఉంది. నిజంగా బాధాకరంగా ఉంది. భవనం నీడలో నిలబడినా ఆ వేడికి బుర్ర పగిలి పోతుందేమోననిపించింది. అది వేసవికాలం. దేశమంతా ఎడారిలా ఉంది. మళ్లీ బయలుదేరాం. విమానం పైకి ఎగిరింది చల్లని గాలుల్ని వెతుక్కుంటూ కొత్తగా వచ్చిన ప్రయాణీకులు ఎదురుగా ఉన్న సీట్లలో కూర్చుని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లమాటలు వినకుండా ఉండటం అసాధ్యంగా ఉంది. మొదలు పెట్టటం మెల్లిగానే మొదలు పెట్టారు. అంతలోనే వాళ్ల కంఠాల్లో కోపం ధ్వనిస్తూంది - చనువూ, విసుగూతో మిళితమైన కోపం. ఆ ఉద్వేగంలో తక్కిన ప్రయాణీకుల సంగతి మరిచిపోయినట్లున్నారు వాళ్లు. ఒకరిమీద ఒకరు ఎంత అసహనంతో ఉన్నారంటే, అక్కడ వాళ్లిద్దరే ఉన్నట్లూ, చుట్టు పక్కల ఇంకెవ్వరూ లేనట్లూనూ.

కోపానికి ఆవిధమైన ఒంటరితనాన్ని కల్పించే లక్షణం ఉంది. దుఃఖం లాగే అది కూడా వేరు చేస్తుంది. తాత్కాలికంగానైనా అన్ని సంబంధాలూ అంతమొందుతాయి. కోపానికి తాత్కాలికమైన బలం, ఒంటరిగా ఉండే వారిలో ఉండే జీవశక్తీ ఉంటాయి. కోపంలో ఒక విధమైన నిస్పృహ ఉంటుంది. ఒంటరితనమే నిస్పృహ కనుక. కోపం వల్ల నిరాశా, అసూయా, గాయపరచాలనే తపనా ఉధృతంగా వెలువడుతాయి. వీటివల్ల కలిగే సంతోషం మనల్ని మనం సమర్థించుకోవటం వల్లనే. ఇతరులను మనం నిందిస్తాం, అట్లా నిందించడంలోనే మనల్ని మనం సమర్థించుకోవడం ఉంది. ఏదో ఒక విధమైన ధోరణి లేకుండా - ఆత్మస్తుతి గాని, ఆత్మనిందగాని - మనం ఎలా ఉంటాం? మనల్ని మనం ఆకాశానికి ఎత్తుకోవటానికి అన్ని పద్ధతులూ అవలంభిస్తాం. మామూలు కోపం, హఠాత్తుగా ఎగిరిపడటం, మళ్లీ దాన్ని త్వరలో మరచిపోవటం - అది ఒకటి. కాని, ప్రయత్నపూర్వకంగా పెంచుకున్న కోపం, ఎంతోకాలం నిలవుంచి, గాయపరచటానికీ, నాశనం చెయ్యటానికీ ఎదురు చూస్తూండటం మరొక విషయం. మామూలు కోపాన్ని ఏదైనా శారీరక కారణం వల్ల వచ్చి ఉంటే దాన్ని కనిపెట్టి, దాన్ని పోగొట్టవచ్చు. కాని, మానసిక కారణం వల్ల వచ్చిన కోపం చాలా సూక్ష్మమైనదీ, క్లిష్టమైనదీ - వ్యవహరించటానికి. మనలో చాలా మందిమి కోపం వచ్చినా పరవాలేదనుకుంటాం. దానికి వెంటనే కారణాన్ని వెతికి చూపిస్తాం. మనకి గాని, ఇతరులెవరికైనా గాని అన్యాయం జరిగినప్పుడు మనం ఎందుకు కోపగించుకోకూడదు? అందువల్ల మనం సహేతుకంగా కోపగించుకుంటాం. ఊరికే కోపం వచ్చిందని చెప్పి, అంతటితో ఎప్పుడూ ఊరుకోం. దానికి గల కారణాన్ని విపులంగా విశదీకరిస్తాం. మనం అసూయపడుతున్నామనీ, మనకి విరక్తి కలిగిందనీ ఊరికే చెప్పి ఊరుకోం. దాన్ని సమర్థించి విశదీకరిస్తాం. అసూయ లేకుండా ప్రేమ ఎలా ఉంటుందని కూడా అడుగుతాం, లేదా, ఎవరి ప్రవర్తనో మనకి నిరాశ కలిగించిందనో ఏదో చెబుతాం.

ఈ విశదీకరించటం, మాటల్లో వ్యక్తపరచటం, మౌనంగా గాని, పైకి చెప్పి గాని - ఇవే కోపాన్ని నిలవుండేటట్లు చేస్తాయి. అది పెరిగేటట్లూ, లోతుకి పోయేటట్లూ చేస్తాయి. అ విశదీకరణ - మౌనంగా గాని, మాట్లాడుతూగాని - మనల్ని మనం కనిపెట్టకుండా 'డాలు'లా అడ్డుపెడుతుంది. మనల్ని మెచ్చుకోవాలనో, పొగడాలనో ఏదో ఆశిస్తాం. ఇది సంభవించనప్పుడు మనం నిరాశ చెందుతాం. మనకి నిస్పృహ, ఈర్ష్యా కలుగుతాయి. అప్పుడు ఆగ్రహంతోగాని, మృదువుగా గాని మరొకర్ని తప్పుపడతాం. మన నిస్పృహకి ఇతరులు కారకులని అంటాం. నా సుఖానికి గాని, నా హోదాకిగాని, గౌరవానికి గాని మీపైన ఆధారపడతాను కాబట్టి మీరు నాకు ముఖ్యం. అందుచేత మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. మిమ్మల్ని సొంతం చేసుకోవాలి. మీ ద్వారా నానుంచి నేను పారిపోతాను. నా కాళ్లమీదికి నన్ను వెనక్కి తోసేసినప్పుడు నా సొంతస్థితికి నేనే భయపడటంతో, నేను కోపగించుకుంటాను. కోపం అనేక రూపాలు సంతరించుకుంటుంది. నిరాశ, కచ్ఛ, విరక్తి, ఈర్ష్య మొదలైనవి.

కోపాన్ని నిలువ చెయ్యటానికి, అంటే, కచ్ఛ కలిగి ఉండటానికి విరుగుడు క్షమించగలగటం. కానీ, కోపాన్నీ నిలువ చేసుకోవటం క్షమించగలగటం కన్న ముఖ్యమైనది. కోపం కూడబెట్టటమే లేనప్పుడు క్షమించగలిగి ఉండవలసిన అవసరమే ఉండదు. కచ్ఛ ఉన్నట్లయితే క్షమించగలిగి ఉండటం అవసరమవుతుంది. కాని, పొగడ్తకీ, గాయాన్నీ మనస్సులో పెట్టుకోవటానికీ లోనవకుండానూ, నిర్లక్ష్యంతో కరుడు కట్టకుండాను స్వేచ్ఛగా ఉండటంలో దయాదాక్షిణ్యాలుంటాయి. ఇచ్చా పూర్వకంగా కోపాన్ని వదిలించుకోలేం. ఎందుకంటే, ఇచ్ఛకూడా హానికరమైనదే. ఇచ్ఛ కోరికనుంచీ, ఏదో అవాలనే తాపత్రయం నుంచీ జనించినదే. ఇచ్ఛాపూర్వకంగా, బలవంతంగా కోపాన్ని అణచివేయటం అంటే, కోపాన్ని మరోస్థాయికి మార్చటం, దానికి మరోపేరు పెట్టటం, అంతే. అది అప్పటికీ హానికరమే. హానికరంగా లేకుండా ఉండటానికి - అంటే, ఆ విధంగా ఉండటానికి ప్రయత్నించాలని కాదు - కోరికని అర్థం చేసుకోవాలి. కోరిక స్థానంలో ఆధ్యాత్మికంగా మరొకటేమీ లేదు. దాన్ని అణచిపెట్టటం గాని, పవిత్రంగా చూడటంగాని సాధ్యంకాదు. కోరికని మౌనంగా, పక్షపాతం లేకుండా తెలుసుకోవటం జరగాలి. ఈ విధంగా నిర్లిప్తంగా తెలుసుకోవటంలో కోరిక అంటే ఏమిటో అనుభవం పొందటం జరుగుతుంది. అప్పుడు అనుభవించేవ్యక్తి దానికొక పేరు పెట్టటం జరగదు.