మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ధ్యానం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

29. ధ్యానం

ఆయన ధ్యానం అంటున్నదాన్ని చాలా ఏళ్ళపాటు సాధన చేశాడు. ఆ విషయం మీద ఎన్నో పుస్తకాలు చదివిన తరవాత, ఒక మఠానికి వెళ్లి అక్కడ రోజుకి కొన్ని గంటల సేపు ధ్యానం చేసే వాళ్లను చూసిన తరవాత ఆయన కూడా కొన్ని క్రమశిక్షణలను అవలంభించాడు. దాన్ని గురించి ఆయన అభిమానంతోనూ లేడు, అలాగని తను చేసిన త్యాగానికి ఆయనకి కళ్లలో నీళ్లు తిరగనూలేదు. ఇన్ని సంవత్సరాల తరవాత ఆయన తన మనస్సుని అదుపులో పెట్టుకోగలుగుతున్నప్పటికీ అప్పుడప్పుడు అది అదుపులో లేకుండా పోతోందని చెప్పాడాయన. ధ్యానంలో ఆనందం కలగటం లేదుట. తనపై తాను విధించుకున్న ఆ క్రమశిక్షణ ఆయన్ని కఠినంగానూ, నిస్సారంగానూ చేస్తోందిట. మొత్తంమీద అదంతా చాలా అసంతృప్తికరంగా ఉందిట. ఆయన మత సమాజాలనబడే ఎన్నో వాటిల్లో చేరాడుట. అయితే, ఇప్పుడు అవన్నీ ఆఖరు చేసుకుని తనంతట తనే ఆ దైవాన్ని, వాళ్లంతా ఆశపెట్టిన దాన్ని స్వతంత్రంగా అన్వేషిస్తున్నాడుట. వయస్సు పైబడుతోంది. అలిసిపోతున్నట్లనిపించటం మొదలైందిట.

మనస్సుని శుద్ధి చేయటానికి సరియైన ధ్యానం అవసరం. ఎందువల్లనంటే, మనస్సుని శూన్యంగా చేయకుండా పునఃసృష్టి సాధ్యంకాదు. కేవలం కొనసాగుతూ ఉండటం పతనావస్థే. నిరంతరం పునశ్చరణతో, తప్పుడు ప్రయోగం వల్ల కలిగే ఘర్షణతో, మందకొడిగా, నిస్సత్తువగా చేసే అనుభూతులతో మనస్సు క్రమంగా క్షీణించిపోతుంది. మనస్సుని అదుపులో పెట్టటం ముఖ్యంకాదు. మనస్సుకి వేటిపైన ఆసక్తిపోతున్నదో కనుక్కోవటం ముఖ్యం. మనస్సు పరస్పర విరుద్ధమైన ఆసక్తుల సమూహం. ఒక ఆసక్తిని కాదని, మరొక ఆసక్తిని బలపరచటాన్నే ఏకాగ్రత అంటున్నాం. అదే క్రమశిక్షణా పద్ధతి. ప్రతిఘటించటానికి సాధన చేయటమే క్రమశిక్షణ. ప్రతిఘటన ఎప్పుడైతే ఉందో అప్పుడు అవగాహన ఉండదు. క్రమశిక్షణ పొందిన మనస్సు స్వేచ్ఛలేని మనస్సు. స్వేచ్ఛ ఉన్నప్పుడే దేన్నైనా కనుక్కోవటం సాధ్యమవుతుంది. తనలోని సంచలనాలన్నిటి ముసుగూ తొలగించి చూడటం. ఏ స్థాయిలో ఉన్నవాటినైనా కనుక్కోవటం అప్రయత్నంగా ప్రేరణ లేకుండా జరగాలి. ఆ కనుక్కున్నవి సంతోషదాయకమైనవి కాకపోయినా, తనలోని సంచలనాలన్నిటినీ ఆవిష్కరించి అవగాహన చేసుకోవాలి. కాని క్రమశిక్షణలన్నీ ప్రేరణ రహితమైన ఆవిష్కరణలు జరగకుండా చేస్తాయి. క్రమశిక్షణలు ఎంత నిర్దిష్టమైనవైనప్పటికీ మనస్సుని ఒక చట్రంలో బిగిస్తాయి. మనస్సు తను పొందిన శిక్షణవల్ల దానికి తగినట్లుగా సర్దుకుంటుంది. కాని, అది దేనితో సర్దుబాటు చేసుకుంటుందో అది నిజమైనది కాదు. క్రమశిక్షణలు కేవలం బలవంతాన విధించినవి మాత్రమే. ఆవిష్కరణకి అవి మార్గాలు కాలేవు. క్రమశిక్షణ వల్ల మనస్సు తన లక్ష్యంకోసం తన్ను తాను శక్తిమంతం చేసుకోగలదు. కాని ఈ లక్ష్యం స్వీయకల్పితమైనదే. అది నిజమైనది కాదు. మనస్సు తను కోరిన విధంగానే నిజాన్ని రూపొందిస్తుంది. క్రమశిక్షణలు ఆ రూపానికి జీవశక్తిని ప్రసాదిస్తాయి.

కనుక్కోవటంలోనే, ఆత్మ అవలంబించే మార్గాలన్నిటినీ క్షణక్షణమూ కనుక్కోవటంలోనే ఆనందం ఉంటుంది. ఆత్మని ఏస్థాయిలో ఉంచినా, అది మనస్సే. మనస్సు దేని గురించి ఆలోచించగలిగినా అది మానసికమైనదే. మనస్సుకి చెందని దాన్ని గురించి మనస్సు ఆలోచించలేదు. అపరిచితమైన దాన్ని గురించి మనస్సు ఆలోచించలేదు. ఆత్మ ఏస్థాయిలో ఉన్నా, అది అపరిచితమైనదే. పైపై మనస్సు గ్రహించలేని పొరలు కొన్ని ఆత్మవి ఉన్నప్పటికీ, అవి పరిచితమైన రంగానికి చెందినవే. ఆత్మయొక్క సంచలనాలన్నీ సంబంధ బాంధవ్యాలలో క్రియారూపంలో వెల్లడి అవుతాయి. సంబంధ బాంధవ్యాలు ఒక మూసలో లేనప్పుడు ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లభిస్తుంది. ఆత్మ యొక్క చర్యే సంబంధం పెట్టుకోవటం. ఈ చర్యని అర్థం చేసుకోవటానికి పక్షపాతం లేకుండా తెలుసుకోవాలి. ఎందువల్లనంటే, ఒక పక్షాన్ని ఎంచుకోవటంతో, ఒక ఆసక్తిని కాదని, మరొక దాన్ని బలపరచటమవుతుంది. ఆత్మయొక్క చర్యని అనుభవం పొందటమే తెలుసుకోవటం. ఈ అనుభవం పొందటంలో అనుభవించేది ఉండదు. అనుభవం పొందబడేది ఉండదు. ఆ విధంగా మనస్సు తాను కూడబెట్టిన వాటినన్నిటినీ వదిలి శూన్యమవుతుంది. 'నేను' అనే కూడబెట్టేది ఉండదిక. కూడబెట్టినవన్నీ గాక 'నేను' అనేదేదీ వేరుగా లేదు. ఈ నేను గమనించే దానిగా, పర్యవేక్షించేదానిగా, నిగ్రహంలో ఉంచేదానిగా తన లక్షణాలను తన నుంచి వేరు చేసుకుంటుంది - ఆత్మరక్షణ కోసమూ, అస్థిరత మధ్య తనకు స్థిరత్వాన్ని ఇచ్చుకోవటం కోసమూ. పరస్పరం లీనమయే, సమైక్యమయే అనుభవం పొందటం మనస్సుకి ద్వంద్వ స్థితినుంచి స్వేచ్ఛని కలుగజేస్తుంది. ఆ విధంగా మనస్సు యొక్క యావత్ప్రక్రియనూ - పైన జరిగేదాన్నీ, లోపల చాటుగా జరిగేదాన్ని అంతా కొంచెం కొంచెంగా ఒక్కొక్కదాని కార్యకలాపమే కాకుండా మొత్తం మీద అనుభవం పొందటం, అవగాహన కావటం జరగాలి. అప్పుడు కలలు, దైనందిన కార్యకలాపం, అన్నీ శూన్యమవుతాయి. తెలుసుకోవటానికి మనస్సు పూర్తిగా శూన్యం అవాలి. కాని, తెలుసుకోవటం కోసం శూన్యం కావాలని తాపత్రయ పడటం ఎడతెగని ప్రతిబంధక మవుతుంది. దాన్నికూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రత్యేకస్థాయిలో అని కాకుండా, అనుభవం పొందాలనే తాపత్రయం పూర్తిగా నశించాలి. జరిగిన అనుభవాలతో, వాటి జ్ఞాపకాలతో అనుభవించేది తన్ను తాను పోషించు కోకుండా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది.

మనస్సు శుద్ధికావటం ఒక్క పైపై స్థాయిలోనే కాక, కనిపించని లోతుల్లో కూడా జరగాలి. అనుభవానికి నామకరణం చేయటం, మాటలలో రూపొందించటం అంతమైతే గాని ఇది జరగటం సాధ్యం కాదు. నామకరణం శక్తిమంతం చేసి, అనుభవించేదాన్నీ, స్థిరత్వం కావాలనే కోరికనీ, జ్ఞాపకానికి ప్రత్యేకత నిచ్చే లక్షణాన్ని కొనసాగేటట్లు చేస్తుంది. నామకరణం చేయడాన్ని నిశ్శబ్దంగా తెలుసుకోవడం, దాన్ని అవగాహన చేసుకోవడం జరగాలి.నామకరణం చేయటం ఒకరికి తెలియజేయాటానికే కాదు, అనుభవానికి జీవం పోస్తూ, కొనసాగేటట్లు చేయటానికీ, అవసరమైనప్పుడు దాన్ని రప్పించి, దాని అనుభూతులను పునస్సంభవం చేసుకోవటానికీ కూడా. ఈ నామకరణం చేసే పద్ధతి అంతమొందాలి - పైపై స్థాయిల్లోనే కాక, మనస్సు యొక్క నిర్మాణ క్రమం అంతటిలోనూ అంతమొందాలి. ఇది చాలా శ్రమతో కూడిన పని. అర్థం చేసుకోవటం, అనుభవం పొందటం అంత సులభం కాదు. ఎందువల్లనంటే, మన చైతన్య ప్రక్రియ అంతా - పేరు పెట్టటం, అనుభవాన్ని మాటల్లో చెప్పటం, తరువాత దాన్ని పదిలపరచటం. ఈ ప్రక్రియే, అనుభవం పొందబడినది కాక వేరే అనుభవించేది ఒకటి ఉన్నదన్న భ్రమని పోషించి శక్తివంతం చేస్తుంది. ఆలోచనలు లేకుండా ఆలోచించేది ఉండదు. ఆలోచనలే ఆలోచించేదాన్ని సృష్టిస్తాయి. ఆలోచించేది తన్నుతాను ప్రత్యేకించుకుంటుంది. తనకొక స్థిరత్వాన్ని ఇచ్చుకోవటం కోసం. ఎందుకంటే, ఆలోచన లెప్పుడూ అస్థిరమైనవే.

మొత్తం జీవనాన్ని, పైపైనే కాక లోలోపల కూడా గతాన్ని శుద్ధి చేసినప్పుడు స్వేచ్ఛ కలుగుతుంది. ఇచ్ఛ అంటే కోరిక. ఇచ్ఛాపూర్వకమైన చర్య ఏదైనా ఉంటే, స్వేచ్ఛగా ఉండటానికి గాని, శూన్యం చేసుకోవటానికి గాని, ఎట్టి ప్రయత్నం చేసినా స్వేచ్ఛ ఎప్పటికీ లభించదు. మొత్తం అస్తిత్వం పరిశుద్ధం కావటం జరగదు. చైతన్యావస్థలోని అనేకమైన పొరలు అన్నీ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు - సంపూర్ణంగా నిశ్చలంగా ఉన్నప్పుడు, అప్పుడే ఆ అపరిమితమైన, కాలంతో నిమిత్తంలేని ఆనందం లభిస్తుంది. పునఃసృష్టి సంభవమవుతుంది.