మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అధికారం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

28. అధికారం

పచ్చని మైదానం మీద నీడలు నాట్యం చేస్తున్నాయి. ఎండ వేడిగా ఉన్నా, ఆకాశం బాగా నీలంగానూ మృదువుగానూ ఉంది. దడి అవతల నుంచి ఒక ఆవు పచ్చగడ్డి వైపు చూస్తోంది. అంతమంది జనం గుమిగూడటం దానికి చిత్రంగా ఉంది. పచ్చగడ్డి దానికి పరిచితమైనదే. వర్షాలు పోయి చాలా కాలమై, నేల కాలిన మట్టి రంగులో ఉంది. టేకు చెట్టు మొదలు మీద బల్లి ఒకటి ఈగల్నీ, ఇంకేవో పురుగుల్నీ పట్టుకుంటోంది. దూరాన కొండలు కనీ కనిపించకుండా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఆ చెట్లక్రింద మాట్లాడటం అయిన తరువాత, ఆవిడ చెప్పింది - గురువులకే గురువైనవాడు మాట్లాడితే వినాలని వచ్చిందిటావిడ. మొదట్లో ఎంతో మనస్ఫూర్తిగా అనుకుంది. ఇప్పుడది పట్టుదలగా మారింది. ఈ పట్టుదల చిరునవ్వులతోనూ, సహేతుకమైన సహనంతోనూ కప్పిపుచ్చబడుతోంది. ఈ సహనం ఎంతో జాగ్రత్తగా ఆలోచించి అలవరుచుకున్నది. అది మానసికమైనది కాబట్టి దాన్నీ హింసాత్మకమైన, ఆగ్రహపూరితమైన అసహనంగా రగిలించవచ్చు. ఆవిడ లావుగా ఉంది. మృదువుగా మాట్లాడుతుంది. కానీ, ఆవిడలో దృఢాభిప్రాయాల వల్లా, నమ్మకాల వల్లా పెరిగిన నిరసన భావం ఒకటి మొదలుతోంది. సౌభ్రాతృత్వానికీ, సత్కార్యాలకీ తన్ను తాను అర్పించుకుందిట. కొంచెం సేపు ఆగి, ఆవిడ ఇంకా ఇలా అంది - దివ్య గురువు మాట్లాడుతూంటే ఆవిడకు తెలుస్తుందిట. అది ఇతరులకు తెలియని నిగూఢమైన విధానం; ఆవిడకి, ఆవిడ బృందానికీ మాత్రమే తెలుసునట. చేతులూపుతూ, బుర్ర ఒకవైపుకి వంచుతూ ఆవిడ చెప్పే తీరుని బట్టి, తనకు ప్రత్యేకమైన జ్ఞానం ఉన్నందుకు ఆవిడకి ఎంత సంతోషంగా ఉందో స్పష్టమవుతోంది.

ప్రత్యేక, రహస్య జ్ఞానం ప్రగాఢ సంతృప్తితో కూడిన సంతోషాన్నిస్తుంది. ఇతరులకు తెలియనిదేదో తనకి తెలియటం నిరంతర తృప్తి కలిగించేటట్లుగా ఉంటుంది. గౌరవాన్నీ, అధికారాన్నీ ఇచ్చే గంభీరమైన వేవో అందుబాటులో ఉన్నవన్న భావాన్ని కలిగిస్తుంది. మీరు వాటిని సూటిగా అందుకుంటున్నారు. ఇతరులికి లేనివేవో మీకున్నాయి. అందుచేత మీరు మీ దృష్టిలోనే కాక, ఇతరుల దృష్టిలో కూడా గొప్పవారు. ఇతరులు మీవైపు భయభక్తులతో చూస్తారు, మీకున్న దాంట్లో వారు కూడా భాగం పంచుకోవాలనుకుంటారు కనుక, మీరు ఇస్తారు, కాని, మరికొంత తెలుసుకుంటూ ఉంటారు. మీరు మార్గదర్శి అధికారి. ఈ హోదా మీకు సులభంగా లభిస్తుంది, ఎవరో ఒకరు చెప్పాలనీ, దారి చూపాలనీ జనం కోరుతూ ఉంటారు కనుక. మనం దారి తప్పినట్లూ అయోమయ స్థితిలో ఉన్నట్లూ తెలుసుకున్న కొద్దీ మరింత ఆత్రుత పడతాం - ఎవరైనా మనకి దారి చూపాలనీ, చెప్పాలనీ. అందుకని అధికారాన్ని ప్రభుత్వం పేరుతోనో, మతం పేరుతోనో, గురువు పేరుతోనో, లేదా, పార్టీ నాయకుని పేరుతోనో రూపొందించుకుంటాం.

పెద్ద విషయాల్లోగాని, చిన్న విషయాల్లోగాని, అధికారాన్ని ఆరాధించటం హానికరం. మత సంబంధమైన విషయాల్లో మరింత హానికరం. మీకూ సత్యానికీ నడుమ మధ్యవర్తి లేడు. ఎవరైనా ఉన్నట్లయితే అతడు వక్రమార్గంలో పెట్టేవాడే. హానికారకుడే. అతడు ఎవరు అన్నది ముఖ్య విషయం కాదు. మహోన్నత రక్షకుడు కావచ్చు. మీ సరికొత్త గురువు కావచ్చు. తెలుసుకున్నాడనుకున్న వాడికి తెలియదు. అతడు తెలుసుకోగలిగినవి - తనకున్న అయిష్టతలూ, తాను ఏర్పరచుకున్న నమ్మకాలూ, మనోవాంఛలూ, అంతే. సత్యాన్నీ, అపరిమితమైన దాన్నీ తెలుసుకోలేడు; హోదానీ, అధికారాన్నీ సంపాదించుకోవచ్చు, గడుసుగా అలవరచుకోవచ్చు, కాని అది నమ్రత మటుకు కాదు. సద్గుణం స్వేచ్ఛ నిస్తుంది. కాని అలవరచుకున్న నమ్రత సద్గుణం కాదు. కేవలం అనుభూతి మాత్రమే. అందుచేత అది హానికరం, వినాశకరం. అది పదే పదే తెంచుకోవలసిన బంధనం. ఎవరు గురువో, సాధువో, నాయకుడో కనుక్కోవటం ముఖ్యం కాదు. ఎందుకు వారిని అనుసరిస్తున్నామనేది ముఖ్యం. లాభం పొందటానికీ, స్పష్టత కలగటానికీ, ఎవరినో అనుసరిస్తాం. స్పష్టత ఒకరు ఇవ్వగలిగేది కాదు. అస్పష్టత మనలోనే ఉంది. మనమే దాన్ని కొని తెచ్చుకున్నాం. మనమే దాన్ని స్పష్టపరచుకోవాలి. మనం ఏదో సంతృప్తికరమైన పదవినీ, అంతరంగిక రక్షణనీ, మత సంస్థ అధికార పరంపరలో ఒక స్థానాన్నీ సాధించి ఉండవచ్చు. కాని, ఇదంతా స్వార్ధపూరిత కార్యకలాపమే. అది సంఘర్షణకీ, దుఃఖానికీ దారి తీస్తుంది. మీరు సాధించిన దానితో తాత్కాలికంగా ఆనందించవచ్చు. మీ పదవి అనివార్యమైనదని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవచ్చు. మీరు ఏదో అవాలని అనుకున్నప్పుడు - అది ఏ స్థాయిలోనైనా సరే, దానివల్ల దుఃఖమూ, గందరగోళమూ తప్పవు. ఏమీ అవకుండా ఉండటం వ్యతిరేకత కాదు. ఇచ్ఛాపూర్వకమైన క్రియ అనుకూలమైనదైనా, వ్యతిరేకమైనదైనా, అది తీవ్రమైన, ప్రబలమైన వాంఛ. అది ఎప్పుడూ వైరుధ్యానికీ, సంఘర్షణకీ దారితీస్తుంది. అవగాహన కది మార్గం కాదు. అధికారాన్ని ప్రతిష్ఠించి, దాన్ని అనుకరించటం అవగాహన కాకుండా చేసుకోవటమే. అవగాహన ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది కొనగలిగినదీ, ఒకరు ఇచ్చేదీ కాదు. కొనుక్కున్నదాన్ని పోగొట్టుకోవచ్చు. ఇచ్చిన దాన్ని మళ్లీ పుచ్చేసుకోవచ్చు. అందువల్ల అధికారం, దానితో బాటే వచ్చే భయం, రెండూ పెంపొందించుకున్నవే. భయాన్ని ప్రార్థనతోనూ, దీపాలతోనూ పోగొట్టటానికి కుదరదు. ఏదో అవాలనే కోరిక అంతమైనప్పుడే అది అంతమవుతుంది.