Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ప్రత్యేకత

వికీసోర్స్ నుండి

32. ప్రత్యేకత

ఆయన పొట్టిగా ఉన్నాడు. ఉద్రేకపడే మనిషి. ఏదో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు. ఆయన ఎంతగా చదివాడంటే, ఆయన భావాలెక్కడ మొదలయాయో, ఇతరుల భావాలెక్కడ అంతమయాయో ఆయనకే తెలియటం కష్టం. తను తీవ్రమైన జాతీయవాదిననీ, దానికోసం ఒక విధంగా ఎంతో బాధ అనుభవించాననీ చెప్పాడాయన. మత ధర్మాన్ని ఆచరిస్తూండేవాడుట. ఇప్పుడా చెత్తంతా దులిపేసుకున్నాడుట. భగవంతుడి దయవల్ల మూఢవిశ్వాసాల నుంచి విముక్తి పొందాడుట. ఈ మానసికమైన విషయాల గురించి ప్రసంగాలూ, చర్చలూ జనాన్ని తప్పుత్రోవని పట్టిస్తాయని గట్టిగా నొక్కి చెప్పాడు. ముఖ్యంగా మనకి కావలసినది మానవుల ఆర్థిక పునర్వ్యవస్థ - మనిషి బ్రతకటానికి తిండి ముఖ్యం కనుక, తిండి తరువాతే తక్కినవన్నీ. రక్తవిప్లవం రావాలిట. వర్గరహితమైన సమాజం స్థాపింపబడాలిట. లక్ష్యం సాధించగలిగితే ఎటువంటి మార్గమయినా ఫరవాలేదుట. అవసరమైతే గందరగోళం పుట్టించి, అధికారాన్ని హస్తగతం చేసుకుని అప్పుడు సక్రమమైన వ్యవస్థని నెలకొల్పాలిట. సామూహికత అవసరమట. వ్యక్తిని దోపీడీ చెయ్యటాన్ని పూర్తిగా అణగద్రొక్కాలిట. భవిష్యత్తు గురించి సుస్పష్టంగా చెప్పాడాయన. మనిషి పరిస్థితుల ప్రభావంతో తయారైనవాడు. అవి భావిలో మరోలా రూపొందిస్తాయి. భావికోసం, రాబోయే ప్రపంచకోసం అన్నిటినీ త్యాగం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మనిషిని రూపుమాపటం అంత ముఖ్యం కాదు వారికి, భవిష్యత్తు వారికి తెలుసును.

మనం చరిత్ర చదువుకుని చారిత్రాత్మక వాస్తవాలను మన దురభిప్రాయాల కనుగుణంగా అనువదించుకుంటాం. కాని, భవిష్యత్తు గురించి నిశ్చయంగా ఉండటం భ్రమకి లోనవటమే. మనిషి ఒక్క ప్రభావ ఫలితం కాడు. అతడు ఎంతో క్లిష్టమైనవాడు. ఒక ప్రభావానికి ప్రాముఖ్యం ఇచ్చి తక్కిన వాటిని అల్పం చేస్తే అస్థిరత పెంపొందుతుంది. అది మరింత కల్లోలానికీ, దుఃఖానికీ దారి తీస్తుంది. యావత్ప్రక్రియకీ రూపం మనిషి. ఒక్క భాగాన్ని మాత్రమే కాకుండా సమస్తమూ అర్థం చేసుకోవాలి - ఆ భాగం తాత్కాలికంగా ఎంత ముఖ్యమనిపించినప్పటికీ, భవిష్యత్తుకోసం ప్రస్తుతాన్ని త్యాగం చేసే పిచ్చి విపరీతమైన అధికార వాంఛ ఉన్నవాళ్లకే ఉంటుంది. అధికారం హానికరమైనది. ఇటువంటి వాళ్లు మానవులను ఒక దిక్కుకి మళ్లించే హక్కు తమకే ఉన్నదనుకుంటారు. వీళ్లు కొత్త రకం మత పోషకులు. కాని, మార్గమూ, లక్ష్యమూ వేరు కావు. అవి రెండూ సమ్మిళితమైన విశేషమది. మార్గమే లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. హింస ద్వారా శాంతి ఎన్నటికీ లభించదు. రక్షక భటులతో కూడిన ప్రభుత్వం శాంతియుతమైన ప్రజలని రూపొందించలేదు. నిర్బంధం ద్వారా స్వేచ్ఛను సాధించలేరు. ఒక రాజకీయ పక్షానికి అధికారమంతా ఉన్నప్పుడు వర్గరహితమైన సమాజం స్థాపించబడటం సాధ్యం కాదు. నిరంకుశాధికారంవల్ల అది ఏనాటికీ సిద్ధించదు. ఇదంతా సుస్పష్టం.

వ్యక్తి యొక్క ప్రత్యేకత సమూహంతో గాని, సిద్ధాంతంతో గాని ఐక్యత చేసుకోవటం వల్ల నాశనం కాదు. దాని స్థానంలో మరొకటి ఉంచినందువల్లగాని, దాన్ని అణచి వేసినందువల్ల గాని ప్రత్యేకత అనే సమస్యని తప్పించుకోలేరు. దాని స్థానంలో మరొకటి ఉంచినందువల్ల గాని, దాన్ని అణచినందువల్ల గాని తాత్కాలికంగా లాభించవచ్చు. కాని, వేరు అనే భావం మరింత ఉధృతంగా పైకి ఉబుకుతుంది. భయం వల్ల తాత్కాలికంగా వెనక్కి నొక్కి పెట్టవచ్చు. కాని సమస్య అలాగే ఉంటుంది. ప్రత్యేకతని పోగొట్టటం కాదు సమస్య - మనలో ప్రతి ఒక్కరం దానికంత ప్రాముఖ్యం ఎందుకిస్తున్నామన్నదే. వర్గరహిత సమాజాన్ని సృష్టించాలని కోరుతున్న వాళ్లే తమ అధికార బల ప్రయోగంతో విభేదాన్ని పెంపొందిస్తున్నవారు. మీరు వేరు, నేను వేరు; నేను వేరు, ఇంకొకరు వేరు. ఇది వాస్తవం. అయితే, ఈ వేరు అనే భావానికి మనం ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తాం - దానికి దుష్ఫలితాలున్నాయని తెలిసి? మనందరిలోనూ చాలా వరకు పోలిక ఉన్నప్పటికీ, మనం ఒకరిని పోలి ఒకరం లేము. ఈ పోలిక లేకపోవటమనేదే మనం ఎవరికి వారు ప్రత్యక్షంగా ఉండటానికి ప్రాముఖ్యాన్ని కల్పిస్తుంది. పేరు, కుటుంబం, ఆస్తి - వీటితో వేరే వ్యక్తి నన్న భావం కలుగు తుంది. ఈ ప్రత్యేకత, ఈ వ్యక్తిత్వభావం ఎంతో హాని కలుగుజేస్తాయి. అందుకే సామూహిక కృషి నిర్వహణ, వ్యక్తిని మొత్తం సంఘంకోసం త్యాగం చెయ్యటం మొదలైనవి కోరటం జరుగుతుంది. మత వ్యవస్థలు వ్యక్తిగతమైన ఇచ్ఛను సమిష్టి ఇచ్ఛముందు మోకరిల్లేటట్లు ప్రయత్నించాయి. ఇప్పుడు రాజకీయ పక్షం ప్రభుత్వ బాధ్యతని చేపట్టి వ్యక్తిని ముంచి వెయ్యటానికి చేతనైనదంతా చేస్తోంది. భేద భావాన్ని పట్టుకుని ఎందుకంతగా ప్రాకులాడుతాం? మన అనుభూతులు వేరు. ఆ అనుభూతులతోనే బ్రతుకుతున్నాం. ఆ అనుభూతులే మనం. ఆ అనుభూతులను - సంతోషకరమైనవైనా బాధాకరమైనవైనా - లేకుండా చేస్తే ఇక మనం ఉండనే ఉండము. అనుభూతులు మనకి ముఖ్యం. వాటితోనే విభేదం. వ్యక్తిగత జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ విభిన్న అనుభూతులుంటాయి. విభిన్న స్థాయిల్లో అవి పరస్పరం పోరాడుకుంటూనే ఉంటాయి - వ్యక్తిగత జీవితంలో గాని, ప్రజా జీవితంలో గాని. అనుభూతిలో సంఘర్షణ సహజంగా ఉంటుంది. అధికారంతో గాని, నమ్రతతోగాని ఉండాలని కోరుతున్నంతకాలం, అనుభూతిలో సంఘర్షణ ఉండి తీరుతుంది. దానితో బాటే వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ దురవస్థ ప్రాప్తిస్తుంది.ఇంకా అవాలనో, ఇంత అవకూడదనో నిరంతరం కోరటం వలన వ్యక్తిత్వ భావం, భేదభావం ఉద్భవిస్తాయి. ఈ వాస్తవాన్ని మనం నిరసించకుండా, సమర్ధించకుండా, దానితో బాటే ఉండగలిగితే, మన జీవితమంతా అనుభూతులతో రూపొందినది కాదని తెలుసుకుంటాం. అప్పుడు మనస్సు, దాని స్మృతి, అనుభూతి ప్రశాంతంగా అయి, దాని సంఘర్షణలతో అది చీలిపోకుండా ఉంటుంది. అప్పుడే, మనస్సు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే, "నేను" "నా" అనేవి లేకుండా ప్రేమించటం సాధ్యమవుతుంది. ఇటువంటి ప్రేమ లేకుండా సామూహిక చర్య కేవలం బలత్కారం మాత్రమే అవుతుంది. అది వైరుధ్యాన్నీ, భయాన్నీ పెంపొందింపజేసి, వ్వ్యక్తిగత, సాంఘిక సంఘర్షణలకు దారి తీస్తుంది.