మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అధికార శక్తి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

33. అధికార శక్తి

ఆయన చాలా బీదవాడు. కానీ, సమర్ధుడూ, తెలివైన వాడూ. ఆయన తనకున్న దానితో తృప్తి పడుతున్నట్లుగా ఉన్నాడు. అధమం, ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఆయనకు కుటుంబ భారం లేదు. ఆయన తరుచు ఇవీ అవీ మాట్లాడటానికి వస్తూ ఉంటాడు. ఆయనకి భవిష్యత్తు గురించి గొప్ప కలలున్నాయి. ఆయన ఆత్రుతగా, ఉత్సాహంగా ఉంటాడు. ఆయన సుఖాలు చాలా సామాన్యమైనవి. ఇతరులకేవైనా చిన్న చిన్న పనులు చేసిపెట్టటంలో సంతోషాన్ని పొందుతాడు. ఆయన తనకి ధనమన్నా, భౌతిక సుఖాలన్నా పెద్ద మోజు లేదన్నాడు. కాని, డబ్బుంటే ఏం చెయ్యదలుచుకున్నాడో వివరంగా చెప్పటం ఇష్టం ఆయనకి. దేనికో ఒకదానికి సహాయం చేస్తాననీ, సలక్షణమైన పాఠశాల ప్రారంభిస్తాననీ, ఇంకా ఎన్నో చెప్పాడు. ఆయన కలగంటున్నట్లుగానూ, తన ఉత్సాహంలోనూ, ఇతరుల ప్రభావంలోనూ పడికొట్టుకుపోతున్నట్లుగా ఉన్నాడు.

ఎన్నో ఏళ్లకి మళ్లీ వచ్చాడాయన. ఆయనలో ఒక చిత్రమైన పరివర్తన వచ్చింది. ఆ స్వాప్నిక దృష్టిపోయింది, వ్యవహార దృష్టితో, నిశ్చితంగా, కర్కశమైన అభిప్రాయాలతో, కఠినమైన నిర్ణయాలతో ఉన్నాడు. ఆయన దేశాలు తిరిగాడు. ఆయన ప్రవర్తన ఎంతో సంస్కృతి ఉట్టిపడేట్టుగానూ, సభ్యత అలవరచుకున్నట్లుగానూ ఉంది. తన సమ్మోహనా శక్తిని మధ్య మధ్య ప్రదర్శిస్తున్నాడు. ఆయనకి చాలా ఆస్తి సంక్రమించిందిట. దాన్ని ఎన్నో రెట్లు అధికం చేశాడుట. మనిషి పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన రావటం అరుదైపోయింది. ఎప్పుడైనా వచ్చి కలుసుకున్నప్పుడైనా, ఎంతో దూరాన ఉన్నట్లూ, తన చుట్టూ గోడ కట్టుకున్నట్లూ ఉంటాడు.

దారిద్ర్యం, సంపదా కూడా బంధనాలే. దారిద్ర్యాన్నీ, సంపదల్నీ మనస్సులో పెట్టుకున్న వారు పరిస్థితుల చేతుల్లో కీలు బొమ్మలవుతారు. అవి రెండూ మనిషిని చెడిపేవే. ఆ రెండూ చెడు చేసే దాన్నే అభిలషిస్తాయి. అధికారాన్ని కోరతాయి రెండూ. అధికారం ఆస్తిపాస్తుల కన్న గొప్పది. అధికారం సంపదకన్నా, భావాలకన్నా గొప్పది. ఇవన్నీ బలాన్నిస్తాయి. అయినా, వాటిని వదులుకోవటం సాధ్యమే. కాని, అధికార భావం ఉండి పోతుంది. అధికారాన్ని నిరాడంబర జీవితం ద్వారా గాని, సద్గుణం ద్వారా గాని, రాజకీయ పక్షం ద్వారా గాని, త్యజించడం ద్వారా గాని పొందవచ్చు. కాని ఆ మార్గాలన్నీ ప్రత్యామ్నాయం మాత్రమే. అవి ఎవరినీ మోసగించలేవు. హోదా, పలుకుబడి, అధికారం కావాలనే కోరిక ఎంతో సహజంగా పుట్టినట్లుంటుంది. బలప్రయోగం వల్ల గాని, నమ్రత వల్ల గాని, జ్ఞానం వల్ల గాని, పరులను దోచుకోవటం వల్ల గాని, ఆత్మత్యాగం వల్ల గాని, పొందిన అధికారం పైకి కనిపించకుండా పట్టుబడుతుంది. ఏ రకమైన విజయం సాధించినా, అది అధికారమే. ఓటమి కేవలం గెలుపు లేకపోవటమే. అధికారంతో ఉండటం, జయించడం అంటే బానిసగా ఉండటమే. అంటే సద్గుణం లేకపోవడమే. సద్గుణం స్వేచ్ఛనిస్తుంది. కాని, అది పొందగలిగినది కాదు. ఏది సాధించినా, వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని, అది అధికారానికి సాధనం అవుతుంది. ఈ ప్రపంచంలో విజయవంతం అవటాన్నీ, ఆత్మనిగ్రహం ద్వారా, ఆత్మత్యాగం ద్వారా పొందే అధికారాన్నీ తప్పించుకోవాలి - ఆ రెండూ అవగాహనని వికృతం చేస్తాయి కనుక. విజయవంతం కావాలనే కోరిక నమ్రత లేకుండా చేస్తుంది. నమ్రత లేకుండా అవగాహన ఎలా కలుగుతుంది? విజయవంతమైన మనిషి కఠినంగా స్వార్ధ పరాయణుడిగా అవుతాడు. అతని ప్రాముఖ్యంతో, బాధ్యతలతో సాధించిన వాటితో జ్ఞాపకాలతో అతనికి భారం పెరుగుతుంది. తనకు తాను తెచ్చిపెట్టుకున్న భాధ్యతలనుంచీ, సాధించిన దాని భారం నుంచీ స్వేచ్ఛ పొందాలి. భారంతో క్రుంగిపోయేవాడు చురుకుగా ఉండలేడు. అవగాహన చేసుకోవటానికి చురుకైన, మృదువైన మనస్సు ఉండటం అవసరం. విజయవంతులైన వారికి దయ ఉండదు. వారికి ప్రేమ అనే జీవిత సౌందర్యాన్ని తెలుసుకునే శక్తి ఉండదు.

విజయవంతం కావాలని కోరటం అంటే ఆధిపత్యాన్ని కోరటం. ఆధిపత్యం వహించటం అంటే సొంతం చేసుకోవటం. తన్నుతాను ప్రత్యేకించుకునే పద్ధతి. మనలో అనేకమంది కోరుకునేది ఈ స్వయం ప్రత్యేకత - పేరు ద్వారా, సంబంధం ద్వారా, పని ద్వారా, భావకల్పన ద్వారా గాని, ప్రత్యేకతలో అధికారం ఉంటుంది. అధికారం వల్ల వైరుధ్యం, బాధా పెంపొందుతాయి. ప్రత్యేకత భయం మూలాన్ని వచ్చినది. భయం సంపర్కాన్ని పూర్తిగా అంతం చేస్తుంది. సంపర్కమే సంబంధం. సంబంధం ఎంత సంతోషకరమైనా, బాధాకరమైనా, దానివల్ల తన్ను తాను మరిచిపోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేకత అనేది అహం అవలంబించే మార్గం. అహంతో కూడిన కార్యకలాపాలన్నీ సంఘర్షణకీ, దుఃఖానికీ కారణమవుతాయి.