Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/మనస్సుకి వ్యాపకం

వికీసోర్స్ నుండి

65. మనస్సుకి వ్యాపకం

ఆ వీధి ఇరుకుగా ఉంటుంది జనంతో కిక్కిరిసినట్లుగా. కాని, బళ్ల రాకపోకలు తక్కువే. ఏ బస్సైనా, కారైనా వెడుతున్నప్పుడు బాగా పక్కకి తప్పుకోవాలి - దాదాపు కుళ్లు కాలవలో దాకా. కొన్ని చిన్నచిన్న దుకాణాలేవో ఉన్నాయి. ద్వారాల్లేని గుడి ఒకటుంది. గుడి అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. ఆ ఊరి వాళ్లే అక్కడ ఉన్నారు, చాలామంది కాకపోయినా, ఒక దుకాణం పక్కని ఒక కుర్రవాడు కూర్చుని పూలమాలలూ, పూలగుత్తులూ కడుతున్నాడు. వయస్సు పన్నెండో, పధ్నాలుగో ఉంటుంది. పక్కనే ఉన్న చిన్న నీళ్ల జాడీలో దారం ఉంది. అతని కెదురుగా తడిగుడ్డ మీద పువ్వులు చిన్నకుప్పలుగా పోసి ఉన్నాయి - మల్లెలు, కొంచెం గులాబీలు, బంతి పువ్వులు, ఇంకా రకాలు. దారం ఒక చేత్తో పట్టుకుని, రెండో చేత్తో రకరకాల పువ్వులు ఏరుతాడు. ఒక చేతిలో దారం చురుకుగా మెలిక తిరుగుతూ, రెండో చేతిలో పువ్వుల్ని చకచకా కట్టేస్తుంది. పూలగుత్తులు తయారవుతాయి. తన చేతులకేసి అతడు ధ్యానం చూపించటమే లేదు. కళ్లు ఇటూ అటూ తిరుగుతూ వచ్చేపోయే వాళ్లని చూస్తూ ఉంటాయి. మధ్యమధ్య ఎవరినైనా గుర్తుపడితే చిరునవ్వు నవ్వుతాయి. మళ్లీ చేతుల వైపు తిరుగుతాయి, మళ్లీ ఇటూ అటూ తిరుగుతాయి. ఇంతలోనే ఇంకో కుర్రవాడు వచ్చి చేరాడు అతనితో. వాళ్లు కలిసి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. కాని, వాళ్ల చేతులు వాటి పనిని మాత్రం మానలేదు. ఇప్పుడు కట్టిన పువ్వుల పోగు పెద్దదయింది. కాని, అవి అమ్మటానికింకా వేళ కాలేదు. అ కుర్రవాడు ఆపేసి, లేచి ఎక్కడికో వెళ్లాడు. కాని తొందరగానే తిరిగి వచ్చాడు, తన కన్న చిన్న కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని. తమ్ముడు కావచ్చు. మళ్లీ తనకిష్టమైన పనిని మొదలుపెట్టాడు సునాయాసంగా, గబగబా. ఇప్పుడు జనం కొనటానికి వస్తున్నారు - ఒక్కొక్కరో, గుంపులుగానో. నిత్యంవచ్చి అతని దగ్గర కొనే వాళ్లయి ఉండాలి, ఎందుకంటే, చిరునవ్వుతో ఏవో మాటలాడు కున్నారు. ఆ తరవాత ఒక గంట సేపటివరకూ అతడు అక్కణ్ణించి కదల్లేదు. అన్నిరకాల పువ్వులలోంచీ పరిమళం వస్తోంది. మేము ఒకరిని చూచి ఒకరం చిరునవ్వు నవ్వుకున్నాం.

ఆ వీధిలోంచి వెడితే ఒక సందువస్తుంది. ఆ సందులోంచి వెడితే ఇల్లు.

గతానికి ఎలా బంధింపబడి ఉంటాం మనం! కాని, గతానికి మనం బంధింపబడిలేము.మనమే గతం. గతం ఎంత గందరగోళంగా ఉంటుంది, పొరమీద పొరగా, హరాయించుకోలేని జ్ఞాపకాలు - ఆప్యాయంగా అట్టిపెట్టుకున్నవీ, విచారకరమైనవీ - రెండు రకాలూ. అది రాత్రీ, పగలూ మన వెంటపడుతోంది. అప్పుడప్పుడు విరామం ఉంటుంది, స్పష్టమైన వెలుగు కనిపిస్తూ, గతం ఒక నీడలాంటిది. అన్నిటినీ మందకొడిగానూ, అలిసిపోయేటట్లూ చేస్తుంది. ఆ నీడలో ప్రస్తుతం స్పష్టతనీ, స్వచ్ఛతనీ పోగొట్టుకుంటుంది. రేపు అనేది గతం యొక్క నీడ. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు - మూడూ జ్ఞాపకం అనే పొడుగాటి తాడుతో కట్టి ఉంటాయి. ఆ మొత్తం కట్టిన మూటే జ్ఞాపకం. దానిలో సువాసన ఎక్కడా ఉండదు. ఆలోచన ప్రస్తుతంలోంచి భవిష్యత్తులోకి వెళ్లి మళ్లీ వెనక్కి వస్తుంది. గుంజకి కట్టేస్తే పిచ్చెత్తిన పశువులా, దానికున్న కైవారంలో - చిన్నదైనా, పెద్దదైనా, కదులుతూ ఉంటుంది. దాని నీడని అది ఎన్నటికీ తప్పించుకోలేదు. ఈ కదలికే గతం గురించీ, ప్రస్తుతం గురించీ, భవష్యత్తు గురించీ మనస్సు యొక్క వ్యాపకం. మనస్సే వ్యాపకం. మనస్సుకి వ్యాపకం లేనట్లయితే అది బ్రతకటం ఆగిపోతుంది. దాని వ్యాపకమే దాని బ్రతుకు. అవమానం, పొగడ్త, దేవుడు, తాగుడు, సద్గుణం, ఆవేశం, పని, వ్యక్తం చేయటం. పదిలపరచటం, ఇవ్వటం - వీటన్నిటితో ఉండే వ్యాపకం ఒక్కటే. అప్పటికీ అది వ్యాపకమే, వ్యాకులపడటమే, అశాంతిగా ఉండటమే. దేనితోనో ఒకదానితో సామానుతోనో, దేవుడితోనో వ్యాపకం పెట్టుకుని అల్పత్వం, వెలితి ఉండే స్థితిలో ఉంటుంది.

వ్యాపకం మనస్సుకి ఒక కార్యకలాపం ఉన్నట్లూ, జీవించి ఉన్నట్లూ భావన కలిగిస్తుంది. అందువల్లనే మనస్సు దాన్ని అంటి పెట్టుకుంటుంది. లేదా పరిత్యజిస్తుంది. వ్యాపకంతోనే తన్నుతాను పోషించుకుంటుంది. మనస్సు దేనితోనో ఒక దానితో హడావిడిగా ఉండాలి - దేనితో హడావిడిగా ఉందన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైన దేమిటంటే, దానికి వ్యాపకం ఉండాలి. మంచి వ్యాపకాలకు సాంఘిక ప్రాధాన్యం ఉంటుంది. దేనితోనైనా వ్యాపకం పెట్టుకోవటం మనస్సుకి సహజం. దాని కార్యకలాపం దీన్నుంచే బయలుదేరుతుంది - దేవుడితో, ప్రభుత్వంతో, జ్ఞానంతో వ్యాపకం పెట్టుకోవటం. అల్పమనస్సు యొక్క కార్యకలాపం. దేనితోనైనా వ్యాపకం పెట్టుకోవటంలో పరిమితత్వం ఉంటుంది. మనస్సుకి చెందిన దైవం అల్పదైవం - దాన్ని ఎంత ఉన్నత స్థానంలో ఉంచినా. వ్యాపకం లేకపోతే మనస్సే ఉండదు. ఉండనేమోనన్న భయం మనస్సుని విశ్రాంతి లేకుండా పనిలో మునిగి ఉండేటట్లు చేస్తుంది. ఈ విరామం లేని కార్యకలాపం జీవితంలా కనిపిస్తుంది. కాని, అది జీవితం కాదు. అది ఎప్పుడూ మరణానికి దారి తీస్తుంది - మరణం కూడా అదే రకమైన కార్యకలాపం - మరోరూపంలో.

కల మనస్సుకి మరో వ్యాపకం. దానికి విశ్రాంతి లేకపోవటానికి అదొక చిహ్నం. కలకనటం కూడా చైతన్యావస్థ కొనసాగటమే. మెలుకువగా ఉన్నప్పుడు పని చేయనివి కలలోకి రావటంతో చైతన్యావస్థ విస్తరిస్తుంది. మనస్సు పైపైన, లోలోపల జరిగే కార్యకలాపం వ్యాపకం కోసమే. అటువంటి మనస్సుకి తెలిసిన అంతం - మొదలైనది కొనసాగటమే. అంతం అనేది అది తెలుసుకోలేదెన్నటికీ. దానికి ఫలితం మాత్రమే తెలుసును. ఫలితం నిత్యం కొనసాగుతూ ఉండేదే. ఫలితం కోసం ప్రయత్నించటం కొనసాగటానికి ప్రయత్నించటమే. మనస్సుకీ, వ్యాపకానికీ అంతంలేదు. అంతమైన దానికే కొత్తది రాగలుగుతుంది. మరణించిన దానికే జీవం వస్తుంది. వ్యాపకం మరణించటంతో, నిశ్శబ్దం ఆరంభమవుతుంది. సంపూర్ణ నిశ్శబ్దం. ఆలోచించటానికి వీల్లేని ఈ నిశ్శబ్దానికీ మానసిక కార్యకలాపానికీ సంబంధం ఉండదు. సంబంధం ఉండటానికి కలయిక ఉండాలి. మనస్సు నిశ్శబ్దంతో సంపర్కం పెట్టుకోలేదు. అది స్వయంకల్పిత స్థితితో, అది నిశ్శబ్దం అనుకునే దానితో మాత్రమే సంపర్కం పెట్టుకోగలదు. అది మరొక రకం వ్యాపకం. వ్యాపకం నిశ్శబ్దం కాదు. నిశ్శబ్దంతో వ్యాపకం కలిగించుకునే మనస్సు మరణించినప్పుడే, నిశ్శబ్దం ఉంటుంది.

నిశ్శబ్దం కలకీ, మనస్సు లోలోపలి వ్యాపకానికీ అతీతమైనది లోలోపలి మనస్సు శేషం - గతశేషం - బాహటమైనది గాని, నిగూఢమైనది గాని. ఈ గత శేషం నిశ్శబ్దాన్ని అనుభవం పొందలేదు. దాని గురించి కలగన లేదు - తరుచు అది చేసేటట్లు. కాని కల నిజం కాదు. కలని తరుచు నిజం అనుకుంటారు. కాని, కలా, కలగనేదీ కూడా మనోవ్యాపకమే. మనస్సు సంపూర్ణ ప్రక్రియ - ఒక్క భాగం మాత్రమే కాదు - కార్యకలాపం యొక్క సంపూర్ణ ప్రక్రియ. మిగిలి ఉన్నదీ, సేకరించుకున్నదీ ఆ అనంత నిశ్శబ్దంతో సంపర్కం పెట్టుకోలేవు.