మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/జ్వాల, పొగ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

64. జ్వాల, పొగ

రోజంతా వేడిగా ఉంది. బయటికి వెళ్లాలంటే బ్రహ్మ ప్రయత్నంగా ఉంది. అసలే, రోడ్డుమీదా, నీటిమీదా పడి కొట్టొచ్చేటట్లూ, గుచ్చు కుంటున్నట్లూ ఉన్నకాంతి తెల్లటి ఇళ్లమీదపడి మరింత తీవ్రంగా ఉంది. అంతకుముందు పచ్చగా ఉండే నేల ఇప్పుడు ఎండిపోయి, బంగారంలా మెరుస్తోంది. వానలు రావటానికి ఇంకా చాలా నెలలు పడుతుంది. అ చిన్న కాలవ ఎండిపోయి మెలికలు తిరిగిన ఇసుక సీలికలా ఉంది. కొన్ని పశువులు చెట్లనీడని ఉన్నాయి. వాటికి దూరంగా కూర్చుని ఓ కుర్రాడు వాటిని కాపలా కాస్తున్నాడు. గ్రామం కొన్నిమైళ్ల దూరంలో ఉంది. అతడు ఒక్కడూ ఉన్నాడు. బక్క పలచగా తిండి సరిగ్గా లేనట్లుగా ఉన్నాడు. కాని ఆనందంగా ఉన్నాడు. అతను పాడేపాట మరీ విషాదంగా లేదు.

కొండదాటితే ఇల్లు వస్తుంది. సూర్యాస్తమయం అయే సమయానికి ఇంటికి చేరుకున్నాం. డాబా మీంచి చూస్తే, కొబ్బరి చెట్ల పైభాగం ఆకు పచ్చగా ఉండి, క్రింద పసుపుపచ్చని ఇసుక దాకా వంగుతున్నాయి. కొబ్బరి చెట్ల నీడలు పసుపుపచ్చగా పడుతున్నాయి. వాటి ఆకులు బంగారం రంగులో ఉన్నాయి. ఆ పసుపు పచ్చని ఇసుక దిబ్బలకవతలగా ఆకుపచ్చ బూడిదరంగులో సముద్రం. తెల్లటికెరటాలు ఒడ్డుమీదికి పోగవుతున్నాయి. కాని, లోతుగా ఉన్న నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. సూర్యుడు దూరాన అస్తమిస్తున్నా, సముద్రంపైన మేఘాలు రంగుపులుముకుంటున్నాయి. సాయంకాలపు నక్షత్రం అప్పుడే కనిపిస్తోంది. చల్లని గాలి వీచింది కాని, డాబా ఇంకా వేడిగా ఉంది. ఒక చిన్న గుంపు చేరిందక్కడ. వాళ్లక్కడ చాలా సేపటి నుంచీ ఉండి ఉంటారు.

"నాకు వివాహం అయింది. పిల్లల తల్లిని. కాని, నాకు ఎప్పుడూ ప్రేమ కలగలేదు. అసలు ప్రేమ అనేది ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నాను. మనకు అనుభూతులూ, ఆవేశాలూ, ఉద్రేకాలూ, సంతృప్తినిచ్చే సుఖాలూ తెలుసును. ప్రేమ అనేది తెలుసునా అనిపిస్తుంది నాకు. మేము ప్రేమిస్తున్నాం అంటూంటాం తరుచు. కాని, ఏదో వెనక్కి తీసేట్లు చేస్తుంది. శారీరకంగా వెనక్కి తియ్యక పోవచ్చు. మొదట్లో సర్వమూ అర్పించుకోవచ్చు. అప్పుడు కూడా వెనక తీయటం ఉంటుంది. ఇవ్వటం అనేది అనుభూతుల ప్రతిఫలం. కాని, నిజంగా ఇవ్వగలిగినది ఎక్కడో దూరంగా మేలుకోకుండా ఉంటుంది. మేము కలుసుకుంటాం. కానీ, పొగలో కూరుకుపోతాం. కాని, అది జ్వాల కాదు. మాలో ఆ జ్వాల ఎందుకుండదు? పొగ లేకుండా జ్వాల ఎందుకు మండటం లేదు? మేము మరీ తెలివి మీరి పోయామా అనిపిస్తోంది. మరీ తెలిసినందువల్లనేమో ఆ సౌరభం లభించటం లేదు. నేను మరీ ఎక్కువ చదువుకున్నందువల్ల మరీ అధునాతనంగా, పైపై తెలివితో, మూర్ఖంగా ఉన్నాననుకుంటాను. తెలివిగా మాట్లాడినా నిజంగా నాది మంద బుద్ధి అనుకుంటాను."

ఇది మందకొడితనానికి సంబంధించిన విషయమా? ప్రేమ అంత బ్రహ్మాండమైన ఆదర్శమా? అంత సాధించలేకపోయేదీ, దానికి అన్ని అవసరాలూ సమకూరితేనే సాధించగలిగేదీనా? అన్ని అవసరాలూ సమకూర్చటానికి తీరిక ఉంటుందా ఎవరికైనా? మనం అందం గురించి మాట్లాడతాం, దాన్ని గురించి రాస్తాం, దాన్ని చిత్రిస్తాం, నాట్యం చేస్తాం, బోధిస్తాం. కాని, మనం అందంగా ఉండం. అలాగే, మనకి ప్రేమ తెలియదు. మనకి తెలిసినవి మాటలు మాత్రమే.

బాహాటంగా, దెబ్బతగిలేటట్లు ఉండటమంటే సున్నితంగా ఉండటం. వెనుదీయటం అనేది ఉన్నప్పుడు సున్నితత్వం ఉండదు. సుకుమారంగా ఉండేవారు రక్షణ లేకుండా, రేపు - అనేదాన్నుంచి స్వేచ్ఛగా ఉంటారు. బాహాటంగా ఉన్నదే గర్భితమై ఉన్నది, తెలియనిది. బాహాటంగా సుకుమారంగా ఉండేది అందంగా ఉంటుంది. మూసిపెట్టి ఉన్నది మందకొడిగానూ, సున్నితత్వం లేకుండానూ ఉంటుంది. మందకొడితనం కూడా గడుసుతనంలాగే ఒక విధంగా ఆత్మరక్షణ కలిగించేదే. ఈ తలుపు తెరుస్తాం, కాని ఆ తలుపు మూసేసి ఉంచుతాం. స్వచ్ఛమైన గాలి ఒక ప్రత్యేకమైన ద్వారం గుండానే రావాలనుకుంటాం. మనం బయటికి వెళ్లం. అన్ని తలుపులూ, కిటికీలూ ఒక్కసారిగా తెరవనూ తెరవం. సున్నితత్వం కాలక్రమేణా పొందేది కాదు. మందకొడిది ఎన్నటికీ సున్నితంగా అవలేదు. మందకొడిది ఎప్పుడూ మందకొడిగానే ఉంటుంది. తెలిచి తక్కువతనం ఎన్నటికీ వివేకం కాలేదు. వివేకంగా అవాలని ప్రయత్నించటం తెలివితక్కువ తనం. మనకున్న ఇబ్బందుల్లో ఇదొకటి, కాదా? మనం ఎప్పుడూ ఏదో అవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మందకొడితనం అలాగే ఉండిపోతుంది.

"అయితే ఏం చెయ్యాలి?"

ఏమీ చెయ్యొద్దు. ఉన్నట్లుగానే ఉండండి - సున్నితత్వం లేకుండా ఏదైనా చెయ్యటం అంటే ఉన్నస్థితిని తప్పించుకోవటం. ఉన్నదాన్ని తప్పించుకోవటం ఉఠ్ఠి తెలివితక్కువతనం. అది ఏం చేసినా తెలివితక్కువ తనం ఇంకా తెలివి తక్కువ తనం లాగే ఉంటుంది. సున్నితత్వం లేనిది సున్నితమైనది కాలేదు. అది చేయగలిగినదల్లా ఉన్నస్థితిని తెలుసుకుంటూ ఉన్నస్థితిలో దాని కథని నడవనివ్వాలి. సున్నితత్వం లేకపోవటం అనే దాంట్లో కలుగజేసుకోవద్దు. అలా కలుగజేసుకునేది సున్నితత్వం లేనిది, తెలివి తక్కువది అయి ఉంటుంది. వినండి. దాని కథ అదే చెబుతుంది. దాన్ని అనువదించవద్దు, చర్య తీసుకోవద్దు. కాని అడ్డుపడకుండా, వ్యాఖ్యానం చెయ్యకుండా కథ చివరిదాకా వినండి. అప్పుడే చర్య జరుగుతుంది చెయ్యటం ముఖ్యం కాదు, వినటమే.

ఇవ్వటానికి తరిగిపోనిది ఉండాలి. వెనుదీస్తూ ఇవ్వటంలో అయిపోతుందన్న భయం ఉంటుంది. అయిపోవటంలోనే తరిగిపోనిది ఉంటుంది. ఇవ్వటం అంటే అయిపోవటంకాదు. ఎక్కువలోంచో, తక్కువలోంచో ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువ అయినా, తక్కువ అయినా పరిమితమైనదే. అది పొగ - ఇవ్వటం, పుచ్చుకోవటం, కోరికలా, అసూయలా, కోపంలా, నిరాశలా పొగ. కాలమంటే భయం ఉండటం పొగ. జ్ఞాపకం, అనుభవం కూడా పొగే, ఇవ్వటం ఉండదు, పొగని విస్తరింప జేయటమే. వెనుదీయటం తప్పనిసరి, ఎందువల్లనంటే, ఇచ్చేదేమీ లేదు కనుక. పంచుకోవటం ఇవ్వటం కాదు. పంచుకుంటున్నాం, ఇస్తున్నాం అని తెలిసి చేయటం సంపర్కం అంతం అయేటట్లు చేస్తుంది. పొగ జ్వాలకాదు. కాని, అదే జ్వాల అని అపోహ పడతాం. అది పొగ అని తెలుసుకుని ఉండండి. జ్వాలని చూడాలనుకుని, దాన్ని ఊదెయ్యకండి. "అ జ్వాల కలిగి ఉండటం సాధ్యమేనా, లేక, అది కొద్ది మంది కోసమేనా?"

అది కొద్దిమంది కోసమో, అనేక మంది కోసమో అనేది అసలు విషయం కాదు కదా? అ మార్గానపోతే, అది మన అజ్ఞానానికీ భ్రమకీ దారితీస్తుంది. మనం ఆలోచించవలసినది జ్వాల గురించి. మీలో ఆ జ్వాల, అ పొగలేని జ్వాల ఉండగలదా? తెలుసుకోండి. పొగని నిశ్శబ్దంగా, ఓపిగ్గా గమనించండి. ఆ పొగని పోగొట్టలేరు. మీరే ఆ పొగ కనుక. పొగ పోగానే జ్వాల వస్తుంది. ఈ జ్వాల తరిగి పోనిది. ప్రతిదానికీ ఒక ఆది, ఒక అంతం ఉంటుంది. అది త్వరలోనే అలిసిపోతుంది, పాతబడిపోతుంది. మనస్సుకి సంబంధించినవి లేకుండా హృదయం శూన్యంగా ఉన్నప్పుడు, మనస్సు ఆలోచన లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు, అప్పుడు ప్రేమ ఉంటుంది. శూన్యంగా ఉన్నది తరిగిపోదు.

ఉన్న పోరాటం జ్వాలకీ పొగకీ మధ్య కాదు. పొగలోనే వివిధ ప్రతిక్రియల మధ్య. జ్వాలకి, పొగకీ మధ్య సంఘర్షణ ఎన్నటికీ ఉండదు. సంఘర్షణ రావటానికి సంబంధం ఉండాలి. వాటి మధ్య సంబంధం ఎలా ఉండగలదు? ఒకటి ఉంటే రెండోది ఉండదు.